• facebook
  • whatsapp
  • telegram

భవితకే కాదు.. ఉపాధికీ భరోసా!

బీమా రంగంలో కోర్సులు, ఉద్యోగాలు

ఆధునిక జీవితంలో భద్రత ప్రశ్నార్థకమ వుతోంది. దీనికి ఎంతో కొంత పరిష్కారంగా బీమా రంగం నిలుస్తోంది. భవిష్యత్తుకు భరోసా కల్పించేవాటిలో ఇన్సూరెన్స్‌ ముందుంటోంది. కొవిడ్‌ నేపథ్యంలో ఈ రంగానికి ప్రాధాన్యం పెరిగింది. ఆన్‌లైన్‌ పాలసీలు, హెల్త్, టర్మ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. ఫలితంగా సమర్థ మానవ వనరులకు ఈ విభాగాల్లో అవకాశాలు విస్తరిస్తున్నాయి. 

మనుషులతోపాటు పెంపుడు జంతువులు, ప్రియమైన వస్తువులు...అన్నింటికీ బీమా వర్తిస్తుంది. విలువైన వస్తువులు పోగొట్టుకున్నా, వాహనం ప్రమాదానికి గురైనా, జబ్బుచేసి ఆసుపత్రి పాలైనా బీమా ఉంటే పరిహారం పొందవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే మన దగ్గర బీమా చేసుకునేవారి సంఖ్య తక్కువే అయినప్పటికీ ఇటీవలి కాలంలో పాలసీలు తీసుకునేవారి సంఖ్య పెరుగుతోంది. భద్రతకు ప్రాధాన్యం పెరగడం, అనిశ్చిత పరిస్థితులూ, పరిణామాలతో ఈ రంగంలో గణనీయమైన వృద్ధి నమోదవుతోంది. 

నేటికీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 శాతం మందే జీవిత బీమా చందాదారులుగా ఉన్నారు. అందువల్ల ఈ రంగంలో మరింత వృద్ధికి అవకాశాలున్నాయి. బీమాలో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయి. అవి లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌. ప్రస్తుతం మన దేశంలో 57 బీమా సంస్థలు సేవలు అందిస్తున్నాయి. వీటిలో 24 జీవిత బీమా, 33 నాన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ సంస్థలు. భారత్‌లో బీమా రంగాన్ని పర్యవేక్షించడానికి ఇన్సూరెన్స్‌ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఐఆర్‌డీఏ) ఏర్పాటైంది. కోర్సుల నిర్వహణకు నేషనల్‌ ఇన్సూరెన్స్‌ అకాడెమీ (ఎన్‌ఐఏ)ని నెలకొల్పారు.

ఏ నైపుణ్యాలుండాలి?

బీమా రంగంలో రాణించడానికి ఉండాల్సిన నైపుణ్యాలు- 

ఇతరులను ఒప్పించగలిగే నేర్పు

తర్కం, విశ్లేషణ నైపుణ్యం  

వివిధ సంస్థలు అందించే బీమా పథకాలపై పరిజ్ఞానం  

జనాలతో మమేకం అయ్యే స్వభావం 

బీమా ప్రాధాన్యం వివరించి, సందేహాలను తీర్చే సమర్థత, సహనం

సర్వేయర్లుగా కొనసాగడానికి- ఏ సమయంలోనైనా బయట పనిచేయడానికి సంసిద్ధత.

డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు, సేల్స్‌ మేనేజర్ల్లుగా సేవలు అందించడానికి- ఏజెంట్లను సమన్వయం చేసుకునే నేర్పు; బృంద నిర్వహణ నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలు

ఇవీ ఉద్యోగాలు

బీమా రంగంలో ప్రాథమిక స్థాయిలో ఎక్కువ సంఖ్యలో ఏజెంట్లు ఉంటారు. ప్రజలతో మాట్లాడి బీమా తీసుకునేలా చేయడంలో వీరి పాత్రే కీలకం. అందువల్ల వీరికి సంస్థలు పెద్ద మొత్తంలో కమిషన్‌ చెల్లిస్తున్నాయి. లక్ష్యాన్ని చేరుకున్నవారికి ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి. బీమా ఏజెంట్‌గా సేవలు అందించడానికి పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. వీరు ఐఆర్‌డీఏ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం తప్పనిసరి. వయసు 18 ఏళ్లు నిండాలి. సంభాషణ చాతుర్యం, కలుపుగోలుతనం, బీమాపై అవగాహన, ఎక్కువమందితో సత్సంబంధాలు ఉన్నవారు ఏజెంటుగా రాణించగలరు. ఎల్‌ఐసీలో అయితే చేయించిన పాలసీల సంఖ్య, విలువను బట్టి ఛైర్మన్‌ క్లబ్‌ మెంబర్‌ హోదా వరకు చేరుకోవచ్చు. 

‣ ఏజెంట్లను పర్యవేక్షించడానికి, సంస్థ లక్ష్యాలను అందుకోవడానికి  డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో) ఉంటారు. వీరికి వేతనంతోపాటు పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలు దక్కుతాయి. ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు పరీక్షల ద్వారా ఈ హోదాను పొందవచ్చు. నాయకత్వ లక్షణాలు ఉన్నవారు డీవోగా రాణించగలరు. 

బీమా చేసుకున్న వాహనాలకు ప్రమాదం జరిగినా, వస్తువులు దొంగతనానికి గురైనా ఆర్థికంగా ఎంత నష్టం జరిగిందో అంచనా వేసే బాధ్యత సర్వేయర్లది. వీరు కంపెనీలకు కన్సల్టెంట్లుగా వ్యవహరిస్తారు. కర్మాగారాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు ఆ తీవ్రతకు విలువ కట్టడానికి సాంకేతిక నైపుణ్యం ఉన్న సర్వేయర్లు రంగంలోకి దిగుతారు. ఈ తరహా ఉద్యోగాలకు ఫెలోషిప్‌ లేదా అసిస్టెంట్‌షిప్‌ చేసుండాలి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ సర్వేయర్స్‌ అండ్‌ లాస్‌ అసెసర్స్‌ (ఐఐఐఎస్‌ఎల్‌ఎ) తదితర సంస్థలు సర్వేయర్‌ కోర్సులు అందిస్తున్నాయి. శిక్షణ పొందినవారికి ఐఆర్‌డీఏ లైసెన్స్‌ మంజూరుచేస్తుంది. వీరిని లాస్‌ అడ్జస్టర్‌ లేదా అసెసర్‌గా వ్యవహరిస్తారు. 

పాలసీ నేపథ్యం బట్టి ప్రీమియం ఎంత ఉండాలో యాక్చురీ నిపుణులు నిర్ణయిస్తారు. ప్రజలకు అందుబాటు ధరలో ఉండేలా, కంపెనీకి దాని నుంచి నష్టం జరగకుండా వీరు అనేక మదింపులు చేసి ప్రీమియం నిర్ణయిస్తారు. 

ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు నష్టం భర్తీ చేయడానికి క్లెయిమ్స్‌ ఎగ్జిస్టర్‌ ఆ ప్రాంతాన్ని పరిశీలించి సంస్థ ఎంత పరిహారం చెల్లిస్తుందో బీమాదారులకు వివరిస్తారు. 

క్లెయిమ్‌ ఎగ్జిస్టర్, బీమాదారులు ఇచ్చిన వివరాలు పరిశీలించడానికి క్లెయిమ్స్‌ ఎగ్జామినర్లు ఉంటారు. 

ఒకవేళ అందులో ఏదైనా మోసం ఉన్నట్లు అనిపిస్తే ఇన్సూరెన్స్‌ ఇన్వెస్టిగేటర్‌ దాన్ని శోధిస్తారు. లొసుగులు ఉంటే పరిహారం చెల్లించకుండా చూసే బాధ్యత వీరిదే. 

పాలసీదారుడు గతంలో వాహన ప్రమాదాలు చేశారా, ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో నివసిస్తున్నారా తదితర వివరాలు ఇన్సూరెన్స్‌ అండర్‌ రైటర్లు చూసుకుంటారు.ఆ వివరాల ప్రకారం పాలసీ మంజూరు చేయాలా, వద్దా? ప్రీమియం ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తారు.

కోర్సులు.. సంస్థలు 

ఇన్సూరెన్స్‌లో డిప్లొమా/ సర్టిఫికెట్‌/ బీబీఏ/ బీకాం/ బీఏ / ఎంబీఏ కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. బ్యాంకింగ్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌/ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్‌/ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. 

ఇంటర్‌ ఉత్తీర్ణులు యూజీ కోర్సుల్లో, డిగ్రీ పూర్తిచేసినవారు పీజీ చదువుల్లో చేరవచ్చు. డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులకు డిగ్రీ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఎక్కువ కోర్సులు మాత్రం పీజీ డిప్లొమా రూపంలో లేదంటే ఎంబీఏలో ఒక స్పెషలైజేషన్‌గానో ఉన్నాయి. ఆ వివరాలు...

1. నేషనల్‌ ఇన్సూరెన్స్‌అకాడెమీ, పుణే  

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఇన్సూరెన్స్‌)

2. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ రిస్క్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ 

కోర్సులు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ మేనేజ్‌మెంట్‌ (ఇన్సూరెన్స్‌), పీజీ సర్టిఫికెట్‌ ఇన్‌- ఇన్వెస్టిమెంట్‌ ప్లానింగ్‌ అండ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ / జనరల్‌ ఇన్సూరెన్స్‌

3. ముంబై యూనివర్సిటీ, ముంబై 

కోర్సు: బీకాం (బ్యాంక్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌)

4. ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, ముంబై

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌/ ఇన్సూరెన్స్‌ మార్కెటింగ్‌. డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు

5. పాండిచ్చేరి యూనివర్సిటీ 

కోర్సు: ఎంబీఏ (ఇన్సూరెన్స్‌ మేనేజ్‌మెంట్‌)

6. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌ (ఐపీఈ), హైదరాబాద్‌

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్, ఇన్సూరెన్స్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌

7. అమిటీ యూనివర్సిటీ 

కోర్సు: బీఏ (ఇన్సూరెన్స్‌ అండ్‌ బ్యాంకింగ్‌)

8. చార్టర్డ్‌ ఇన్సూరెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఐఐ), యూకే. (ఇది ప్రపంచ స్థాయి సంస్థ) 

కోర్సులు: సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాలు.

అవకాశాలిక్కడ...

ప్రభుత్వ, ప్రైవేటు బీమా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ ఫర్మ్‌లు, ఆర్థిక సంస్థలు, కన్సల్టెన్సీలు, క్రెడిట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, ఎగ్జిక్యూటివ్‌ ట్రెయినీ, బిజినెస్‌ ఎనలిస్ట్, యాక్చూరియల్‌ ఎనలిస్ట్, ఇన్సూరెన్స్‌ ఎనలిస్ట్‌ తదితర హోదాలతో ఉద్యోగాలు ఉంటాయి. వీరికి ప్రారంభ వేతనాలు ఏడాదికి రూ.3 లక్షల నుంచి మొదలుకొని రూ.6 లక్షల వరకు ఉండవచ్చు. సంస్థ, ప్రాంతాన్ని బట్టి జీతాల్లో వ్యత్యాసాలుంటాయి. 

వివిధ ఐటీ కంపెనీలు ఇన్సూరెన్స్‌ కోర్సు చదివినవారిని డొమైన్‌ ఎక్స్‌పర్ట్, బిజినెస్‌ ఎనలిస్ట్‌ ఉద్యోగాల్లోకి తీసుకుని ఆకర్షణీయ వేతనాలు అందిస్తున్నాయి. దేశంలో అతిపెద్ద బీమా సంస్థ అయిన ఎల్‌ఐసీ, అలాగే నేషనల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ (ఎన్‌ఐసీ), న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ లిమిటెడ్‌ (ఎన్‌ఐఏసీఎల్‌), ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌లు రెండు లేదా మూడేళ్లకు ఒకసారి అసిస్టెంట్లు, డెవలప్‌మెంట్‌ ఆఫీసర్లు (డీవో), అసిస్టెంట్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏఏవో)/ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ (ఏవో), పోస్టులను భర్తీ చేస్తున్నాయి. ఏదైనా డిగ్రీ అర్హతతో వీటికి పోటీ పడవచ్చు. ఇవన్నీ ప్రభుత్వ అనుబంధ సంస్థలే.

శిక్షణతోపాటు ఉద్యోగం

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ మణిపాల్‌ గ్లోబల్‌ సంస్థతో కలిసి స్మార్ట్‌ అచీవర్స్‌ పేరుతో ఏడాది వ్యవధితో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ప్రోగ్రామ్‌ ఇన్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. ఫీజు రూ.1,82,200. స్టైపెండ్‌ చెల్లిస్తారు. కోర్సు, శిక్షణ పూర్తిచేసుకున్నవారిని రూ.3 లక్షల వార్షిక వేతనంతో హెచ్‌డీఎఫ్‌సీలో విధుల్లోకి తీసుకుంటారు.

‣ మణిపాల్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌తో కలిసి టాటా ఏఐఏ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఏడాది వ్యవధితో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అందిస్తోంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని అసిస్టెంట్‌ రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ హోదాతో తీసుకుంటారు. కోర్సు ఫీజు రూ.1.45 లక్షలు. స్టైపెండ్‌ చెల్లిస్తారు.

‣ ఎస్‌బీఐ ఐఎఫ్‌బీఐతో కలిసి జనరల్‌ ఇన్సూరెన్స్‌లో సర్టిఫికెట్‌ ప్రోగ్రాం అందిస్తోంది. కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారిని ఎస్‌బీఐ జనరల్‌ ఇన్సూరెన్స్‌ విభాగంలోకి తీసుకుంటారు.

Posted Date: 18-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌