• facebook
  • whatsapp
  • telegram

ఇంటర్‌తో ఐఐఎంలో ఇంటిగ్రేటెడ్ మేనేజ్‌మెంట్ కోర్సు

ఐఐఎం-ఇండోర్

మేనేజ్‌మెంట్ కోర్సులకు అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏ (ఏఎంబీఏ) గుర్తింపు ప్రామాణికం. ప్రపంచంలోని అత్యుత్తమ, నాణ్యమైన మేనేజ్‌మెంట్ విద్యను అందించే విశ్వవిద్యాలయాల్లోని కోర్సులకే ఇది లభిస్తుంది. వాటిలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-ఇండోర్ ఒకటి. ఈ విశ్వవిద్యాలయం అందించే అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాం ఇన్ మేనేజ్‌మెంట్(ఐపీఎం)కు ఏఎంబీఏ గుర్తింపు ఉంది. ఐఐఎం-ఇండోర్ ప్రతిభావంతులైన విద్యార్థులను ఐపీఎం కోర్సులో చేర్చుకుని అంతర్జాతీయ స్థాయి బోధన అందిస్తోంది. వారు ఉన్నతంగా ఎదిగే విధంగా తీర్చిదిద్దుతోంది. 

కోర్సు స్వరూపం

అయిదేళ్ల ఐపీఎం కోర్సును రెండు భాగాలుగా విభజించారు. మొదటి భాగంలో మూడేళ్లు ఫౌండేషన్ కోర్సులపై దృష్టి పెడతారు. ఇందులో భాషా నైపుణ్యాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, మేనేజ్‌మెంట్ విద్యకు సంబంధించిన ఫౌండేషనల్ సబ్జెక్టులు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. రెండో భాగంలో చివరి రెండేళ్లు మేనేజ్‌మెంట్ విద్యలో మెలకువలు నేర్పిస్తారు. అంటే ఐపీఎం విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ (పీజీపీ) విద్యార్థులతో కలిసి చదువుకోవాలి. పీజీపీ కోర్సుకు చెందిన పాఠ్యాంశాలు బోధిస్తారు. మొత్తంగా ఏడాదికి మూడు చొప్పున మొత్తం 15 టర్మ్‌లు ఉంటాయి. ఒక్కో టర్మ్ వ్యవధి 3 నెలలు. విజయవంతంగా కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ (ఫౌండేషన్స్ ఆఫ్ మేనేజ్‌మెంట్స్‌), మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) పట్టా అందజేస్తారు. కోర్సు ఫీజు మొదటి మూడు సంవత్సరాలు ఏడాదికి రూ.4 లక్షల చొప్పున చెల్లించాలి. చివరి రెండేళ్లకు పీజీపీ కోర్సుకు అనుగుణంగా ఫీజు ఉంటుంది. 

అర్హతలు ఏమిటి?

దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు కనీసం 60 శాతం మార్కులతో  ఇంటర్మీడియట్‌/ హెచ్ఎస్‌సీ/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. 

దరఖాస్తు ఇలా..

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఇతరులు రూ.4130, ఎస్సీ/ ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.2065 చెల్లించాలి. 

ఎంపిక విధానం

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల అకడమిక్ అర్హతను బట్టి ఆప్టిట్యూడ్‌ టెస్టుకు పిలుస్తారు. అందులో చూపిన ప్రతిభ ఆధారంగా పర్సనల్ అసెస్‌మెంట్ (పీఏ)కు ఎంపిక చేస్తారు. అనంతరం పర్సనల్ ఇంటర్వ్యూకి అర్హత సాధిస్తారు. వీటి ఆధారంగానే తుది ఎంపికలు ఉంటాయి. ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో 65శాతం, పర్సనల్ అసెస్‌మెంట్‌లో 35శాతం వెయిటేజీ ఉంటుంది. 

ఆప్టిట్యూడ్ టెస్ట్

ఈ పరీక్షలో క్వాంటిటేటివ్ ఎబిలిటీ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు), వెర్బల్ ఎబిలిటీ (మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు) అంటూ మూడు సెక్షన్లు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులిస్తారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ సెక్షన్ (ఎస్‌ఏ) మినహా మిగతా వాటిలో తప్పుగా గుర్తించిన‌ ప్రతి సమాధానానికి ఒక రుణాత్మక మార్కు ఉంటుంది. పరీక్షలోని మూడు సెక్షన్లకు 40 నిమిషాల చొప్పున సమయం కేటాయించారు. క్వాంటిటేటివ్ ఎబిలిటీ (ఎస్ఏ, ఎంసీక్యూ) రెండు సెక్షన్లకు 25 చొప్పున, వెర్బల్ ఎబిలిటీకి 50 శాతం వెయిటేజీ ఉంటుంది.

ప్రిపరేషన్ ఎలా? 

క్వాంటిటేటివ్ ఎబిలిటీ: ఈ సెక్షన్‌లో రెండు విభాగాలు ఉన్నాయి. ఒకదానిలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 40, ఇంకో విభాగంలో షార్ట్ ఆన్సర్ ప్రశ్నలు 20 ఇస్తారు. మొత్తం 240 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇందులో నంబర్ సిస్టమ్, అవేరేజెస్ & పర్సంటేజేస్, రూట్స్, ఇండైసెస్, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ & లాస్, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వెషన్స్, రేషియో & ప్రపోర్షన్, పాట్న‌ర్‌షిప్, మిక్చర్ & అలిగేషన్, టైమ్, స్పీడ్ & డిస్టెన్స్, వర్క్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, పైప్స్ & సిస్టర్న్స్, జామెట్రీ, సర్కిల్స్, మెన్సురేషన్, కాంబినేషన్స్, వెక్టర్స్ తదితర అంశాలకు చెందిన ప్రశ్నలు వస్తాయి. 

వర్బల్ ఎబిలిటీ: ఈ విభాగంలో 40 ప్రశ్నలకు 160 మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. ఎటిమాలజీ & రూట్స్, ఇడియమ్స్ & ప్రేజెస్, అనాలజీ, యాంటినిమ్స్, సిననిమ్స్, ఫారిన్ వర్డ్స్, నౌన్ & ప్రనౌన్ ఎర్రర్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, ప్రిపొజిషన్స్ అండ్ కంజెక్షన్స్, టెన్సెస్ మోడిఫైర్స్ & పారాలెలిజం, రీడింగ్ కాంప్రహెన్షన్, ఇన్ఫరెన్స్ బేస్డ్ ప్యాసేజ్, సిలోజియం, లాటికల్ కన్సిస్టెన్సీ, డిడెక్టివ్ రీజనింగ్ అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

బడా సంస్థలు.. భారీ ఆఫర్లు

ఐఐఎం-ఇండోర్‌లో ఎంబీఏ పూర్తి చేసిన విద్యార్థులను కన్సల్టింగ్, ఫైనాన్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఐటీ & అనలిటిక్స్ తదితర విభాగాల్లో రిక్రూట్ చేసుకోడానికి బడా సంస్థలు ఆసక్తి చూపుతాయి. ఎవలాన్, కాగ్నిజెంట్, డెలాయిట్, ఇన్ఫోసిస్ లాంటి కన్సల్టింగ్ కంపెనీలు, యాక్సిస్, హెచ్‌బీసీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఐఐఎఫ్ఎల్, కోటక్ తదితర బ్యాంకులు, అమెజాన్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్, క్లౌడ్ టైల్, మేక్ మై ట్రిప్, ఫిట్జీ, ఎల్ అండ్ టీ, ఆదిత్యా బిర్లా, టెక్ మహీంద్రా, ఐటీసీ, సిప్లా, జీఎస్‌కే, టీవీఎస్, టాటా, గూగుల్, హెచ్‌క్యూఎల్, ఐబీఎం లాంటి దిగ్గజ సంస్థలు ఇక్కడి విద్యార్థులకు ఏడాదికి సగటు వేతనం రూ. 23 లక్షలు ఆఫర్ చేస్తున్నాయి. అత్యధికంగా ఏడాదికి రూ.50 లక్షల ప్యాకేజీ తీసుకున్న విద్యార్థులూ ఉన్నారు.

వెబ్‌సైట్‌: https://www.iimidr.ac.in/

Posted Date: 27-11-2021


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌