• facebook
  • whatsapp
  • telegram

నానోలో అవకాశాలు ఎన్నో!

దూసుకువెళ్తున్న సూక్ష్మ సాంకేతికత

అరచేతిలో మొబైల్లో ప్రపంచాన్నే చూడగలుగుతున్నామంటే కారణమేమిటో ఆలోచించారా? ఇంచుమించు ట్రంకు పెట్టె పరిమాణంలోని కంప్యూటర్లు అత్యంత సున్నితంగా తక్కువ స్థలంలో ఇమిడిపోయి ల్యాప్‌టాప్‌లుగా రూపాంతరం చెందడం వెనుక ఉన్న సాంకేతికత ఏమిటో తెలుసా? మనం ఉపయోగిస్తోన్న వివిధ పరికరాలన్నీ గతంతో పోలిస్తే సున్నితంగా, మన్నికగా ఎలా రూపొందాయి? ఈ  గణనీయ పరిణామాలకు కారణాలెన్నో ఉన్నా వాటిలో ‘నానో టెక్నాలజీ’ పాత్ర ముఖ్యమైంది. అంతరిక్షంలోకి వెళ్లే శాటిలైట్‌ నుంచి వ్యవసాయ క్షేత్రంలోని పరికరాల దాకా ఈ సూక్ష్మసాంకేతిక పరిజ్ఞానం ఎన్నో నూతన మార్పులు తీసుకొస్తోంది. అలాగే కొత్త ఉపాధి అవకాశాలనూ విస్తరిస్తోంది. మరి మీరూ ఇందులో భాగం కావాలనుకుంటున్నారా.. అయితే చదివేయండి! 

ఒకప్పుడు కంప్యూటర్లు, టీవీలు, టేపు రికార్డర్లు...ఇలా పలు రకాల వస్తువులు, సాంకేతిక పరికరాలు పెద్ద పరిమాణంలో ఉంటూ, ఎక్కువ స్థలం ఆక్రమించేవి. వాటి ధర ఎక్కువగానూ, మన్నిక, నాణ్యత కూడా తక్కువగా ఉండేది. ఇప్పుడు శక్తిమంతమైన ఉపకరణాలను తక్కువ పరిమాణంలో, ఎక్కువ నాణ్యతతో రూపొందించగలుగుతున్నాం. ఈ భారీ స్థాయి మార్పుల వెనుక ఉన్న ప్రధాన కారణం సాంకేతిక విప్లవం. ఇందులో నానో టెక్నాలజీ పాత్ర కీలకం. వ్యవసాయం, వైద్యంతోపాటు వివిధ రంగాల్లో ఉపయోగించే పరికరాలు, వస్తువులను సౌకర్యవంతంగా, సున్నితంగా రూపొందించడంలో నానో టెక్నాలజీ ప్రభావవంతంగా పనిచేస్త్తోంది. భవిష్యత్తులో అయిదు లక్షల ఉద్యోగాలు ఇందులో పుట్టుకొస్తాయని నిపుణుల అంచనా. అన్ని రంగాల్లో దీని ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణమంటున్నారు.

తొలిసారిగా... 

నానో టెక్నాలజీ అనే పదాన్ని తొలిసారిగా 1950ల్లో రిచర్డ్‌ ఫెన్‌మన్‌ ప్రతిపాదించారు. నానో అనేది గ్రీకు పదం. మరుగుజ్జు దీనికి అర్థం. అత్యంత సూక్ష్మమైనది అని కూడా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు- మీటర్‌ని వంద కోట్ల సమాన భాగాలు చేస్తే అందులో ఒకటి నానో మీటర్‌ అవుతుంది. ఉన్న ఆకారానికి అత్యంత సూక్ష్మ మరుగుజ్జు రూపం తీసుకువస్తే అది నానో అవుతుంది. వస్తు పరిమాణం గణనీయంగా తగ్గించి, నాణ్యత, పనితీరుని మెరుగుపర్చడమే నానో టెక్నాలజీ ముఖ్య లక్ష్యం. దీనిద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా నిర్వహణ ఎంతో సులువవుతుంది. ప్రస్తుతం శరవేగంగా విస్తరిస్తోన్న వైర్‌లెస్‌ విధానంలో నానో టెక్నాలజీ ఎంతగానో దోహదపడుతోంది. నానో పదార్థాలు అతి సూక్ష్మంగా, అత్యంత తేలికగా, ఎక్కువ సామర్థ్యంతో రూపొందడమే ఇందుకు కారణం. 

అన్ని రంగాల్లోనూ...

కెమిస్ట్రీ నుంచి కంప్యూటర్‌ సైన్స్‌ వరకు అన్నింటిలోనూ నానో టెక్నాలజీ  భాగం. సాంకేతికతలో ఒక విభాగంగా దీన్ని చెప్పుకోవచ్చు. అత్యంత సూక్ష్మ పదార్థాల అధ్యయనాన్ని నానో టెక్నాలజీగా పరిగణించవచ్చు. కెమిస్ట్రీ, బయాలజీ, ఫిజిక్స్, మెటీరియల్‌ సైన్స్, ఇంజినీరింగ్‌ ఇలా అన్నింటిలోనూ ఇది అనుసంధానమై ఉంటుంది. దీన్ని మల్టీ డిసిప్లినరీ నేచురల్‌ సైన్స్‌ కోర్సుగా భావించవచ్చు. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్, మాలిక్యులర్‌ బయాలజీ భాగమై ఉంటాయి. అందువల్ల రాబోయే రోజుల్లో ఈ విభాగంలో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయి. ఐటీ, మెడిసిన్, ఇంటర్నెట్‌ల్లో దీని ప్రాధాన్యం ఉండడమే ఇందుకు కారణం. 

భారత ప్రభుత్వం నానో సైన్స్, నానో టెక్నాలజీలకు సంబంధించి డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీల ఆధ్వర్యంలో ఫండింగ్‌ సంస్థలను నెలకొల్పి ప్రోత్సహిస్తోంది. వాటిద్వారా కోర్సులనూ అందిస్తోంది. దేశాన్ని నానో రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిని చేసే లక్ష్యంతో నానో ఎలక్ట్రానిక్‌ సెంటర్లను ఐఐటీ ముంబై, ఐఐఎస్‌సీ- బెంగళూరుల్లో ఏర్పాటు చేశారు.

ఎవరు అర్హులు?

వైజ్ఞానికపరమైన ఆసక్తితో పాటు పరిశోధన రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు నానో టెక్నాలజీ మంచి ఎంపిక. సైన్స్‌లోని ప్రాథమికాంశాలపై పట్టు ఉన్నవారు ఈ రంగంలో రాణించగలరు. బీఎస్సీ నానో టెక్నాలజీ, బీటెక్‌ నానో టెక్నాలజీ, ఎమ్మెస్సీ నానో సైన్సెస్‌ అండ్‌ టెక్నాలజీ, ఎంటెక్‌ నానో టెక్నాలజీ, పీహెచ్‌డీ నానో టెక్నాలజీ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ విధానంలోనూ యూజీ పీజీ కోర్సులు కలిపి అందిస్తున్నాయి. ఐఐటీలు, ప్రముఖ సంస్థలతోపాటు రాష్ట్రీయ సంస్థలు, ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లోనూ నానో కోర్సులు చదువుకోవచ్చు. అయితే ఎక్కవ సంస్థలు మాత్రం పీజీ స్థాయిలోనే చదువులు అందిస్తున్నాయి. డిగ్రీ స్థాయిలో నానో టెక్నాలజీ తక్కువ సంస్థల్లోనే అందుబాటులో ఉంది. 

యూజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీజీ నానో టెక్నాలజీలో చేరవచ్చు. ఈ సబ్జెక్టు సూపర్‌ స్పెషాలిటీ లాంటిది. పీజీ లేదా పీహెచ్‌డీ… స్థాయిలో చదివితేనే పట్టు దొరుకుతుంది. అవకాశాలూ బాగుంటాయి. బీటెక్‌ నానో టెక్నాలజీ కోర్సు అతికొద్ది సంస్థలే అందిస్తున్నాయి. వీటిలో చేరే అవకాశం లేనివారు బీటెక్‌ మెకానికల్‌ లేదా మెటలర్జీ ఇంజినీరింగ్‌లో చేరడం మంచిది. అనంతరం వీరు ఎంటెక్‌లో నానో టెక్నాలజీ చదువుకోవచ్చు. 

ఉపయోగాల జోరు

టీవీ, కంప్యూటర్‌ పరికరాలు, చిప్‌లు అతి చిన్న పరిమాణంలో ఎక్కువ సామర్థ్యం ఉండేలా రూపొందడంలో నానో టెక్నాలజీనే కీలకం. అంతరిక్ష రంగంలో నానో పదార్థాలతో తయారైన కృత్రిమ ఉపగ్రహాల జీవితకాలం, సేవల నాణ్యత పెరుగుతుంది. నానో మెటీరియల్స్‌ ద్వారా చర్మ సంబంధ క్యాన్సర్‌ అడ్డుకోవడం వీలవుతోంది. వైద్యరంగంలో అల్ట్రా సోనోగ్రఫీలో నానో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కొన్ని నానో మందులూ అందుబాటులోకి వస్తున్నాయి. నీటిని శుద్ధి చేయడంలోనూ ఈ సాంకేతికత అక్కరకొస్తోంది. నానో రోబోట్స్‌ ద్వారా వైద్య చికిత్స సులువవుతోంది. బుల్లెట్‌ ప్రూఫ్‌ పరికరాల తయారీలోనూ ఈ టెక్నాలజీ ఉపయోగిస్తున్నారు. అణు పరిమాణంలో పదార్థాల ద్రవ, ఘన, ఇతర లక్షణాలను నానో టెక్నాలజీలో అధ్యయనం చేస్తారు. 

ఉపాధి అవకాశాలు

నానో టెక్నాలజీ కోర్సులు చదివినవారికి ఏరోస్పేస్, ఫుడ్‌ అండ్‌ ఫుడ్‌ ప్యాకింగ్, కాస్మొటిక్స్, పర్సనల్‌ కేర్‌ ప్రొడక్ట్స్, టెక్స్‌టైల్స్, ఆయిల్‌ అండ్‌ గ్యాస్, ఎలక్ట్రానిక్, ఆటోమొబైల్స్‌.. తదితర రంగాల్లో అవకాశాలుంటాయి. ఎలక్ట్రికల్, సెమీ కండక్టర్‌ పరిశ్రమలు, తయారీ సంస్థలు, బయోటెక్నాలజీ సంస్థలు, వైద్య విభాగాలు, ఫార్మా కంపెనీలు, పర్యావరణ సంస్థలు, పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఉద్యోగాలుంటాయి. ప్రారంభంలో వీరు నెలకు రూ.30 వేల వరకు ఆశించవచ్చు. అనుభవం, అర్హతలు బట్టి తక్కువ వ్యవధిలో రూ.లక్ష జీతం పొందడం తేలికే. 

విద్యా సంస్థలు.. కోర్సులు

ఐఐఎస్‌సీ- బెంగళూరు: ఎంటెక్, పీహెచ్‌డీ

వివిధ ఐఐటీలు: ఎంటెక్, పీహెచ్‌డీ

నిట్‌ కాలికట్‌: ఎంటెక్‌

అమిటీ నోయిడా: ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్, బీఎస్సీ, ఎమ్మెస్సీ, ఎంటెక్‌ 

అన్నా యూనివర్సిటీ: ఎంటెక్‌ 

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నానో సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ- మొహాలీ: పీహెచ్‌డీ

శస్త్ర: ఎంటెక్‌  

శివాజీ యూనివర్సిటీ: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ

అలగప్ప యూనివర్సిటీ: ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ

తేజ్‌పూర్‌ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ

మద్రాస్‌ యూనివర్సిటీ: ఎమ్మెస్సీ, పీహెచ్‌డీ

పంజాబ్‌ యూనివర్సిటీ: ఎంటెక్‌

జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ: ఎంటెక్, పీహెచ్‌డీ

తెలుగు రాష్ట్రాల్లో...

మహీంద్ర యూనివర్సిటీ- హైదరాబాద్‌: బీటెక్‌ నానో టెక్నాలజీ  

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ: ఇంటిగ్రేటెడ్‌ విధానంలో అయిదేళ్ల ఎమ్మెస్సీ నానో టెక్నాలజీ  

జేఎన్‌టీయూ- హైదరాబాద్‌: ఎంటెక్‌ 

చైతన్య- వరంగల్‌: ఎమ్మెస్సీ 

విదేశాల్లో...

కాలిఫోర్నియా యూనివర్సిటీ బర్క్‌లీ

అరిజోనా స్టేట్‌ యూనివర్సిటీ

హార్వర్డ్‌ యూనివర్సిటీ

కొలంబియా యూనివర్సిటీ

నార్త్‌ వెస్టర్న్‌ యూనివర్సిటీ

వైజ్ఞానికపరమైన ఆసక్తితో పాటు పరిశోధన రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థులకు నానో టెక్నాలజీ మంచి ఎంపిక. సైన్స్‌లోని ప్రాథమికాంశాలపై పట్టు ఉన్నవారు ఈ రంగంలో రాణించగలరు. 

యూజీలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు పీజీ నానో టెక్నాలజీలో చేరవచ్చు. ఈ సబ్జెక్టు సూపర్‌ స్పెషాలిటీ లాంటిది. 

పీజీ లేదా పీహెచ్‌డీ… స్థాయిలో చదివితేనే పట్టు దొరుకుతుంది. అవకాశాలూ బాగుంటాయి! 

*************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోర్సులు.. కొలువులపై సలహాలే వృత్తిగా..!

‣ ఆసాంతం స్ఫూర్తితో అలాగే సాగాలంటే?

‣ 2022లో టాప్‌ ఉద్యోగాలు ఇవే!

‣ కార్పొరేట్‌ ఉద్యోగాలకు కొన్ని నైపుణ్యాలు

‣ మెరుగైన స్కోరుకు మేలైన వ్యూహం!

‣ నిరాశ పడొద్దు.. వెనకడుగు అసలేవద్దు!

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date: 26-01-2022


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌