• facebook
  • whatsapp
  • telegram

హలో.. హలో.. కొలువు కావాలా?

కెరియర్‌ గైడెన్స్‌ టెలి కమ్యూనికేషన్స్‌

ఇంటర్‌నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) మన దేశంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకురాబోతోంది. దీంతో డిజిటల్‌, టెలికమ్యూనికేషన్ల ప్రాధాన్యాన్ని గుర్తించకుండా ఏ దేశం తప్పించుకోలేదని ఇటీవల కేంద్ర  కమ్యూనికేషన్ల శాఖ మంత్రి  పేర్కొన్నారు.  ఈ రంగాల్లో పెద్దఎత్తున ఉద్యోగాలు వస్తాయన్నారు. డిజిటల్‌ విప్లవంలో  ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అన్నిరకాల పని స్వభావాలను మార్చేస్తోంది. ఏఆర్‌ (ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ), వీఆర్‌ (వర్చువల్‌ రియాలిటీ)లు మనుషులు, యంత్రాల మధ్య కొత్తరకం ఇంటర్‌ఫేస్‌గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ప్రభావితమయ్యేది టెలికమ్యూనికేషన్ల రంగమే. మనదేశంలో వచ్చే రెండేళ్లలో  దీనిలో పెట్టుబడులు రూ. 3 లక్షల కోట్లకు చేరతాయని అంచనా. రాబోయే ఐదేళ్ల కాలంలో  కోటి ఉద్యోగాలు ఏర్పడతాయని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి.  వీటిని అందిపుచ్చుకోవాలంటే తగిన అర్హతలు సంపాదించుకొని యువత సిద్ధంగా ఉండాలి.

బ్రాండ్‌ ఇండియా- ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం పెద్దఎత్తున ప్రచారం చేస్తున్న నినాదం.  ప్రపంచవ్యాప్తంగా మనదేశాన్ని బ్రాండింగ్‌ చేయాలని మేక్‌ ఇన్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా వంటి ఎన్నో రకాల ప్రోగ్రామ్‌లను ప్రభుత్వం చేపడుతోంది. దీని కోసం పలు ఎక్స్‌పోలను నిర్వహించి ఆధునిక టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని ప్రోత్సహిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఐఓటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, బిగ్‌డేటా వంటి టెక్నాలజీలను ఉపయోగిస్తూ డిజిటల్‌ ఇండియాను రూపొందిస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర పోషించనున్న రంగం టెలికమ్యూనికేషన్స్‌. ఈ రంగంలో స్థిరపడాలనుకునే అభ్యర్థులకు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమేటిక్స్‌లో పట్టు, ఆసక్తి ఉండాలి. ఇంటర్‌ తర్వాత ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌లో ఇంజినీరింగ్‌ డిగ్రీ చేయవచ్చు. లేదంటే పదోతరగతి ఉత్తీర్ణులయ్యాక పాలిటెక్నిక్‌లో మూడేళ్ల డిప్లొమాను ఎంచుకోవచ్చు.టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌ తర్వాత టెలికామ్‌ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ చదివిన వారికి కూడా ఉపాధి అవకాశాలున్నాయి.

‣ సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహించే సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఎన్‌ఏపీ) ఆధారంగా ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి వీలు కల్పిస్తోంది. నోయిడాలోని అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికామ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ క్యాట్‌, మ్యాట్‌, జీమ్యాట్‌ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తోంది. 

‣ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ (ఐఈటీఈ) సంస్థ మనదేశంలో ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్స్‌ అండ్‌ ఐటీకి సంబంధించిన సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అభివృద్ధి కోసం కృషి చేస్తోంది. ఈ సంస్థ అసోసియేట్‌ మెంబర్‌షిప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈటీఈ), డిప్లొమా ఆఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్స్‌ (డీఐపీఐఈటీఈ) అనే రెండు గ్రాడ్యుయేట్‌షిప్‌ ఎగ్జామినేషన్లు నిర్వహిస్తోంది. ఏఎంఐఈటీఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు పొందే అర్హత ఉంటుంది. అలాగే డీఐపీఐఈటీఈ పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ గుర్తింపు ఉంది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్‌, కాకినాడ, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్‌ల్లో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీర్స్‌ కేంద్రాలు ఉన్నాయి.

ఇవీ ఉద్యోగ విధులు 

టెలికామ్‌ రంగానికి సంబంధించిన హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌ రూపకల్పనలో, నెట్‌వర్క్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌ అభివృద్ధిలో టెలికమ్యూనికేషన్స్‌ నిపుణులు కీలక పాత్ర పోషిస్తారు.

‣ ఇన్ఫర్మేషన్‌, ట్రాన్స్‌మిషన్‌ నెట్‌వర్క్‌లకు సంబంధించిన అన్ని అంశాల్లోనూ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌లో కీలక విభాగమైన టెలికమ్యూనికేషన్స్‌ ప్రధాన భూమిక పోషిస్తుంది. కేబుల్స్‌, రేడియో, శాటిలైట్‌ కమ్యూనికేషన్స్‌, టీవీ, రాడార్‌, నేవిగేషనల్‌ కమ్యూనికేషన్‌ ఎక్విప్‌మెంట్‌ మొదలైనవాటిలో కమ్యూనికేషన్‌కు సంబంధం ఉంటుంది. మైక్రో ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సిగ్నల్‌ ప్రాసెసింగ్‌, డేటా నెట్‌వర్కింగ్‌, కోడింగ్‌, కంప్రెషన్‌, ఎన్‌క్రిప్షన్‌, ట్రాన్స్‌మిషన్‌లో ఆసక్తి ఉన్నవారు ఈ రంగంలో స్థిరపడేందుకు ప్రయత్నించవచ్చు.

‣ సాధారణంగా టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్లు లైన్‌, వైర్‌లెస్‌/ రేడియో కమ్యూనికేషన్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షించాల్సి ఉంటుంది. వినియోగదారుల అవసరాన్ని బట్టి టెలికమ్యూనికేషన్‌ పరికరాలను రూపొందించడం, వాటిని ఇన్‌స్టాల్‌ చేయడం లాంటివి వీరి ఉద్యోగంలో ముఖ్యమైనవి.  టెలికమ్యూనికేషన్‌ ఇంజినీర్లకు ఫైబర్‌ ఆప్టిక్స్‌, సెల్యులర్‌ టెక్నాలజీ, లేజర్‌ టెక్నాలజీ లాంటి అంశాల్లో తగిన పరిజ్ఞానం అవసరం. టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో పరిశోధన, అభివృద్ధి, తయారీ, సర్వీసింగ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌లో స్పెషలైజేషన్‌ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లకు డిజైన్‌ డెవలప్‌మెంట్‌ ఇంజినీర్‌, ప్రొడక్షన్‌ ఇంజినీర్‌, క్వాలిటీ అస్యూరెన్స్‌ ఇంజినీర్‌, సేల్స్‌ ఇంజినీర్‌, సర్వీసింగ్‌ ఇంజినీర్‌, సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ లాంటి హోదాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

ఎలాంటి నైపుణ్యాలు అవసరం? 

ఈ రంగంలో టెక్నికల్‌, మేనేజ్‌మెంట్‌ రెండింటిలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. రాణించడానికి మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌, సత్వర నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను పరిష్కరించగల సామర్థ్యం తప్పనిసరి. అనలిటికల్‌, టీమ్‌ వర్క్‌ స్కిల్స్‌తోపాటు సృజనాత్మకంగా ఆలోచించగలిగివుండాలి. కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌, సాఫ్ట్‌వేర్‌కి సంబంధించి చక్కటి పరిజ్ఞానం ఉన్నవారికి ఈ రంగంలో మంచి అవకాశం లభిస్తుంది. ఇంకా సైన్స్‌, మ్యాథమేటిక్స్‌లో పట్టు అవసరం. సీ లాంగ్వేజ్‌ తెలిసి ఉండాలి.

‣ కంప్యూటర్లు, రోబోటిక్స్‌, డిజిటల్‌ టెలివిజన్‌, శాటిలైట్స్‌, ఏరోస్పేస్‌, మెడికల్‌ స్కానర్లు, సెక్యూరిటీ సిస్టమ్స్‌ టెలికమ్యూనికేషన్స్‌ ఆధారంగా పనిచేసేవి కావడంతో ఇందులో ఇంజినీరింగ్‌ పూర్తి చేసినవారికి అవకాశాలు ఆహ్వానం పలుకుతున్నాయి.

‣ టెలికమ్యూనికేషన్స్‌ ఎంచుకున్న విద్యార్థులు తమ అభిరుచి మేరకు సర్క్యూట్‌ డిజైనర్లు, స్ట్రాటజిక్‌ మాస్‌ డెవలపర్లుగా స్థిరపడవచ్చు.  ప్రభుత్వ రంగంతోపాటు ప్రైవేటు సంస్థల్లో కూడా టెలికమ్యూనికేషన్స్‌ ఇంజినీర్లకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక దశలో వీరికి నెలకు కనీసం రూ.20 వేల నుంచి రూ.30 వేల వేతనం లభిస్తుంది.

ఏయే ఉద్యోగాలు? 

నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ ఫంక్షనల్‌ ఏరియా:  బేస్‌ స్టేషన్‌ సర్వీస్‌ ఇంజినీర్‌, కోర్‌ నెట్‌వర్క్‌ ఇంజినీర్‌, ఫీల్డ్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీర్‌, ట్రాన్స్‌మిషన్‌ ఇంజినీర్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ టెక్నీషియన్‌, బ్రాడ్‌బ్యాండ్‌ ఇన్‌స్టలేషన్‌ ఇంజినీర్‌, నెట్‌వర్క్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీర్‌, ఐసీటీ టెక్నీషియన్‌, నెట్‌వర్క్‌ సెక్యూరిటీ టెక్నీషియన్‌.

సేల్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ఫంక్షనల్‌ ఏరియా:  ఫీల్డ్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ ఎగ్జిక్యూటివ్‌, ఇన్‌-స్టోర్‌ ప్రమోటర్‌, టెరిటరీ సేల్స్‌ మేనేజర్‌ (బ్రాడ్‌బ్యాండ్‌), టెరిటరీ సేల్స్‌ మేనేజర్‌ (మొబైల్‌), మొబైల్‌ రిపేర్‌ టెక్నీషియన్‌, రిపేర్‌ సెంటర్‌ కస్టమర్‌ కేర్‌ ఎగ్జిక్యూటివ్‌, డిస్ట్రిబ్యూటర్‌ సేల్స్‌ రిప్రజెంటేటివ్‌.

అప్లికేషన్స్‌ డెవలప్‌మెంట్‌ ఫంక్షనల్‌ ఏరియా: మొబైల్‌ అప్లికేషన్స్‌ డెవలపర్‌, గేమ్స్‌ డెవలపర్‌, హ్యాండ్‌సెట్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌, ఎంబెడెడ్‌ హార్డ్‌వేర్‌ డెవలపర్‌, నెట్‌వర్క్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్‌.

పాసివ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రిలేటెడ్‌ ఫంక్షనల్‌ ఏరియా: టవర్‌ టెక్నీషియన్‌, క్లస్టర్‌ ఇన్‌-ఛార్జ్‌, క్లస్టర్‌ మేనేజర్‌, బ్రాడ్‌బ్యాండ్‌ టెక్నీషియన్‌, రేడియో ఫ్రీక్వెన్సీ ఇంజినీర్‌, టవర్‌ బే ఇన్‌స్టలేషన్‌ సూపర్‌వైజర్‌.

ఇంజినీరింగ్‌, డిప్లొమాల వారికి అవకాశాలు

టెలి కమ్యూనికేషన్‌కి సంబంధించి ప్రైవేటు, ప్రభుత్వ రంగాల్లో విస్తృతమైన ఉద్యోగావకాశాలు ఏర్పడుతున్నాయి. మొబైల్‌, యాప్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, నెట్‌వర్కింగ్‌, డేటా ప్రాసెసింగ్‌, మెడికల్‌ స్కానింగ్‌ సర్వీసెస్‌ మొదలైన ఎన్నో విభాగాల్లో ఉపాధికి ఆస్కారం ఉంది. టెలికామ్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్‌ (టీఎస్‌ఎస్‌సీ) సర్వే ప్రకారం- వచ్చే ఐదు సంవత్సరాల్లో కోటి ఉద్యోగాలను ఈ రంగం సృష్టించబోతోంది. ఈ రంగంలో ఇప్పుడు 40 లక్షలమంది ఉద్యోగులున్నారు. ఐదేళ్లలో టెలికామ్‌, టెలికామ్‌ మాన్యుఫాక్చరింగ్‌లలో 1.43 కోట్లమంది ఉద్యోగులు ఉపాధి పొందుతారని అంచనా. ఎమర్జింగ్‌ టెక్నాలజీ అయిన మెషిన్‌ టు మెషిన్‌ కమ్యూనికేషన్స్‌లో, టెలికామ్‌ మాన్యుఫాక్చరింగ్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, సర్వీసెస్‌ కంపెనీల్లో ప్రధాన డిమాండ్‌ ఉండబోతోంది. ముఖ్యంగా పాలిటెక్నిక్‌ ఎల్‌ఈసీఈ డిప్లొమా, ఇంజినీరింగ్‌ డిగ్రీలో ఈసీఈ, సీఎస్‌ఈ, ఐటీ బ్రాంచీల విద్యార్థులకిది శుభవార్తే! జేఈ, జేటీవో లాంటి పోస్టులతో పాటు మరెన్నో ఉద్యోగాలకు వీరు పోటీపడవచ్చు. అయితే సబ్జెక్టులో గట్టి పరిజ్ఞానం, కమ్యూనికేషన్‌్ స్కిల్స్‌ పెంచుకోవటం చాలా అవసరం.

- రాజహంస, ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌, హెచ్‌ఆర్‌- బీఎస్‌ఎన్‌ఎల్‌

ప్రభుత్వ రంగంలో..

భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బీఈఎల్‌), ఇండియన్‌ స్పేస్‌ రిసెర్చ్‌ ఆర్గనైజేషన్‌ (ఇస్రో), డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ), ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా టెలికామ్‌ నిపుణుల సేవలను వినియోగించుకుంటున్నాయి.

ప్రైవేట్‌ రంగంలో..

‣ శామ్‌సంగ్‌, నోకియా, లెనోవో, డెల్‌, రిలయన్స్‌, కార్బన్‌, లావా, మైక్రోమాక్స్‌ లాంటి సంస్థల్లో ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్స్‌కు సంబంధించిన హార్డ్‌వేర్‌ నిపుణుల అవసరం ఉంటుంది. 

‣ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌, జియో, ఎయిర్‌సెల్‌ లాంటి నెట్‌వర్క్‌ ప్రొవైడర్‌ కంపెనీలు, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశోధనాశాలల్లో టెలికమ్యూనికేషన్స్‌లో నిష్ణాతులైనవారి అవసరం ఉంది. 

‣ యాక్సెంచర్‌, ఐబీఎం, విప్రో లాంటి సంస్థలు టెలికామ్‌ ఆపరేషన్లలో ప్రాక్టికల్‌ పరిజ్ఞానం ఉన్నవారికి పెద్దపీట వేస్తాయి. ఆయా సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌ లభించినా కెరియర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి తోడ్పడుతుంది. 

‣ పాలిటెక్నిక్‌, ఇంజినీరింగ్‌, మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో అధ్యాపకులుగా చేరవచ్చు. 

‣ దిగ్గజ సంస్థలైన యాపిల్‌, ఫేస్‌బుక్‌, లింక్‌డిన్‌ మొదలైనవాటిలోనూ టెలికామ్‌ నిపుణులకు అవకాశాలు ఎక్కువే. చైనా మొబైల్‌ లిమిటెడ్‌, చైనా టెలికామ్‌, అమెరికా మోవిల్‌, వెరిజాన్‌ కమ్యూనికేషన్స్‌ ఐఎన్‌సీ, ఏటీ అండ్‌ టీ ఐఎన్‌సీ (అమెరికా), నిప్పాన్‌ టెలిగ్రాఫ్‌ అండ్‌ టెలిఫోన్‌ కార్పొరేషన్‌ (జపాన్‌), డెస్టచ్‌ టెలీకామ్‌ ఏజీ (జర్మనీ), టెలిఫోనికా ఎస్‌ఏ (స్పెయిన్‌), వొడాఫోన్‌ (యునైటెడ్‌ కింగ్‌డమ్‌) సంస్థలు ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్‌ రంగంలో తమ సేవలను అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ భారతీయ ఉద్యోగులు పని చేస్తున్నారు. 

‣ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ సంస్థల్లో కూడా టెలి కమ్యూనికేషన్‌ నిపుణులకు అవకాశాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఐటీ, టెలికామ్‌ రంగాల కలయిక తప్పనిసరి కావడంతో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌, టాటా ఈఎల్‌ఎక్స్‌ఎస్‌ఐ, ఇన్ఫోసిస్‌ మొదలైనవి టెలికామ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధిలో పాలుపంచుకుంటున్నాయి. 

‣ టెలికమ్యూనికేషన్స్‌లో కస్టమైజ్డ్‌ సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి స్టార్టప్‌లు ప్రారంభిస్తున్నవారూ ఉన్నారు. 

‣ శాటిలైట్‌ టెలివిజన్‌ రంగం కూడా టెలికమ్యూనికేషన్స్‌తో సంబంధం ఉన్నదే.

ఎలక్ట్రానిక్స్‌, టెలికమ్యూనికేషన్‌/ టెలికమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ కోర్సులు అందిస్తున్న సంస్థలు

‣ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, దిల్లీ (భారతి స్కూల్‌ ఆఫ్‌ టెలికమ్యూనికేషన్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌) (bhartischool.iitd.ac.in) 

‣ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, ఖరగ్‌పూర్‌ (www.iitkgp.ac.in) 

‣ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, వరంగల్‌ (www.nitw.ac.in) 

‣ ధీరూభాయ్‌ అంబానీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ, గాంధీనగర్‌ (new.daiict.ac.in) 

‣ మోతీలాల్‌ నెహ్రూ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, అలహాబాద్‌ (mnnit.ac.in) 

‣ దిల్లీ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ, దిల్లీ (www.dtu.ac.in) 

‣ మాలవీయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, జయపుర (www.mnit.ac.in) 

‣ ఎం.ఎస్‌. రామయ్య ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగళూరు (www.msrit.edu) 

‣ బి.ఎం.ఎస్‌. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, బెంగళూరు (www.bmsce.in) 

‣ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, తిరువనంతపురం (www.cet.ac.in) 

‣ మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, మణిపాల్‌ (manipal.edu) 

‣ పి.ఎస్‌.జి. కాలేజ్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కోయంబత్తూరు (www.psgtech.edu) 

‣  విశ్వేశ్వరాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, నాగ్‌పుర్‌ (academic.vnit.ac.in) 

‣ కొచ్చి యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, కొచ్చి (soe.cusat.ac.in)

టెలికామ్‌ మేనేజ్‌మెంట్‌లో పీజీ కోర్సులు అందిస్తున్న సంస్థలు

‣ ఎంఐటీ స్కూల్‌ ఆఫ్‌ టెక్నాలజీ మేనేజ్‌మెంట్‌, పుణె (www.mitsot.com) 

‣ అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికామ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, పుణె (www.amity.edu) 

‣ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, పుణె (www.isquareit.edu.in) 

‣  సింబయాసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికామ్‌ మేనేజ్‌మెంట్‌, పుణె (www.sitm.ac.in) 

‣ బాలాజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెలికామ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, పుణె (www.bitmpune.com)​​​​​​

Posted Date: 30-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌