• facebook
  • whatsapp
  • telegram

స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్

ఆర్థిక పరిస్థితి బాగాలేక ఉన్నత చదువులు చదవలేని వారికి ఉపాధి దిశగా అవకాశాలు కల్పిస్తూ ఆదుకుంటున్నది సాంకేతిక రంగమే అని చెప్పవచ్చు. ఇందులోనూ అతి తక్కువ ఖర్చుతో, తక్కువ కాలంలోనే ఒక పనిలో నైపుణ్యం సాధించడానికి స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులు బాటలు వేస్తున్నాయి. అయిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుకున్నవారికి ఇంటర్మీడియట్ విద్యాశాఖ స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులను అందిస్తోంది. ఈ సర్టిఫికెట్లతో బయటకు వెళ్లేవారి ఉపాధికీ హామీనిస్తోంది. ఈ కోర్సులకు సంబంధించిన వివరాలివే..

   ఆధునిక జనజీవనంలో సమాచార రంగం వేగంగా విస్తరించింది. ఐటీ, ఐటీ ఆధారిత రంగాల్లో ఉపాధి పెరిగింది. వివిధ రంగాల్లో మారుతున్న ధోరణులకు అనుగుణంగా ఎన్నో అవసరాలూ పెరుగుతున్నాయి. దీంతో ఆయా రంగాల్లో ప్రాథమిక పరిజ్ఞానమున్న నిపుణుల అవసరం కూడా పెరిగింది. ఇంజినీరింగ్, ఐటీ, కామర్స్/ రిటైల్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు విస్తృతమయ్యాయి. ఆధునిక పోకడలు వేగం పుంజుకుంటూ అన్ని రంగాల్లోనూ మహిళలు ప్రవేశిస్తున్న ఈ తరుణంలో ఫ్యాషన్ డిజైనింగ్, బ్యూటీషియన్ తదితర కోర్సులకూ గిరాకీ పెరుగుతోంది. పెరుగుతున్న జనాభాకు పాలు, పాల ఉత్పత్తుల అవసరమూ పెరిగింది. దీంతో డెయిరీ ఉత్పత్తులు ఊపందుకున్నాయి. బ్యాంకులు, కార్యాలయాల్లో సెక్యూరిటీ సిబ్బంది పాత్ర ఎంతో కీలకం. ఈ రంగాలన్నిట్లో ఉపాధి కల్పించేందుకు ఇంటర్మీడియట్ విద్యాశాఖ విద్యార్థులకు స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో విద్యార్థుల కోసం ఇంటర్మీడియట్ విద్యా డైరెక్టరేట్‌లో విభాగమైన రాష్ట్ర వృత్తి విద్యాసంస్థ (స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ - ఎస్.ఐ.వి.ఇ.) స్వల్పకాలిక వృత్తివిద్యాకోర్సులను అందిస్తోంది. అయిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివిన (పాస్/ ఫెయిల్) వారికి మూడు నెలల కోర్సు ద్వారా నెలవారీ వేతనం కల్పించడమే ఈ కోర్సుల ఉద్దేశం. కాలానుగుణంగా ఏ కోర్సులకు డిమాండ్ ఉందో వాటిలో స్వల్పకాలిక శిక్షణనిచ్చేందుకు ప్రాధాన్యమిస్తారు.
 

వెంటనే ఉపాధి కావాలంటే.. 

   నైపుణ్యం ఉన్న మానవవనరులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటీవల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అత్యంత ఆదరణ ఉన్న వృత్తులను గుర్తించింది. ఇందులో సుమారు 20 కోర్సులను ఎంపిక చేసి శిక్షణ ప్రారంభించింది. 'మాడ్యులర్ ఎంప్లాయిబుల్ స్కిల్స్ (ఎం.ఇ.ఎస్.) కింద కేంద్ర ప్రభుత్వ మానవ వనరుల మంత్రిత్వశాఖ సహకారంతో సవరించిన ఈ కోర్సులను 2012-13 నుంచే ప్రారంభించారు. వెంటనే ఉపాధి కావాలనుకుంటే ఇంటర్మీడియట్ విద్యాశాఖ అందిస్తున్న స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను చేయవచ్చు. ఇందుకు కనీసం అయిదోతరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదివి ఉండాలి. కోర్సు వ్యవధి 3 నెలలు.
 

ఏయే కళాశాలల్లో? 

   రాష్ట్రంలో 37 ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులను అందిస్తున్నాయి. పూర్తిగా వృత్తి విద్యా కోర్సులనే అందించే 12 ఎక్స్‌క్లూజివ్ ప్రభుత్వ కళాశాలలూ ఇందులో ఉన్నాయి. అవి.. విశాఖపట్నం, కాకినాడ, గుంటూరు, చిత్తూరు, కుప్పం, మడకశిర, అనంతపురం, నల్గొండ, హన్మకొండ, మహబూబ్‌నగర్, కర్నూలు, హైదరాబాద్ ఒకేషనల్ జూనియర్ కళాశాలలు. ప్రతి కళాశాలలో కనీసం మూడు నాలుగు కోర్సులను అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఒక్కో సెక్షన్‌లో 30 మంది ఉంటారని తెలిపారు. ఇవి కాకుండా స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సులను అందించడానికి ఏవైనా సంస్థలుకానీ ఎన్‌జీఓలు కానీ ముందుకు వస్తే నిర్దేశించిన నిబంధనలకు లోబడి వాటికి అనుమతినిచ్చేందుకూ ఇంటర్మీడియట్ విద్యాశాఖ సిద్ధంగా ఉంది. స్థానిక పరిశ్రమ అవసరాలను బట్టి డిమాండ్ ఉన్న కోర్సులన్నిట్లోనూ శిక్షణనిస్తామని అధికారులు చెబుతున్నారు.  భారత ప్రణాళికా సంఘం 2022 నాటికి దేశవ్యాప్తంగా 500 మిలియన్ల వృత్తివిద్యా నిపుణులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం 'స్కిల్డ్ డెవలప్‌మెంట్ ఇనీషియేటివ్ స్కీమ్ కింద రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం ఆర్థిక సహాయం చేస్తోంది. కేంద్రం నుంచి కావలసిన నిధులు అందితే రాబోయే రెండు మూడేళ్లలో స్వల్పకాలిక వృత్తి విద్యా కోర్సులను అందిస్తున్న కళాశాలల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
 

ఫీజులు తక్కువ 

   మూడు నెలల వృత్తి విద్యాకోర్సుకు ఫీజును ఇంటర్మీడియట్ విద్యాశాఖ వసూలు చేస్తోంది. ప్రైవేటు సంస్థల్లో ఇది ఇంకా కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన అనంత‌రం ఉండే ఉపాధి అవ‌కాశాలు

ఇంజినీరింగ్‌

టూ వీల‌ర్‌, త్రీ వీల‌ర్, ఫోర్ వీల‌ర్ మెకానిక్స్‌

ఎల‌క్ట్రానిక్ మెకానిక్‌

క్యాడ్‌(సీఏడీ)ఆప‌రేట‌ర్‌

రిఫ్రిజిరేట‌ర్‌,ఎయిర్‌కండిష‌నింగ్ మెకానిక్‌

ఐటీ

కంప్యూటర్ ఆప‌రేట‌ర్‌

సాఫ్ట్‌వేర్‌,హార్డ్‌వేర్ కంపెనీల్లో అవ‌కాశాలు

కామ‌ర్స్‌

రిటైల్ సేల్స్‌మెన్‌

అకౌంటింగ్‌, హాస్పిటాలిటీ అసిస్టెంట్లు

హోంసైన్స్‌

ఫ్యాష‌న్ డిజైన‌ర్లు, హౌస్‌కీపింగ్‌, బ్యూటీషియ‌న్‌

యానిమ‌ల్ హ‌జ్బెండ్రీ

సెక్యూరిటీ గార్డులు, గార్డెన‌ర్లు, డెయిరీ వ‌ర్కర్లు

స‌ర్టిఫికెట్‌తో పాటూ ఉపాధి కల్పించ‌డమే ల‌క్ష్యం

   విద్యార్థికి స‌ర్టిఫికెట్‌తో పాటు ఉపాధి క‌ల్పించడ‌మే ఈ స్వల్పకాలిక వృత్తి విద్యాకోర్సుల ల‌క్ష్యం.ఇందుకోసం ఈ కోర్సుల స్వరూపాన్ని మార్చివేశాం.ప్రత్యేకంగా సిల‌బ‌స్ త‌యారు చేయించాం. కోర్సు మొత్తం కాల‌ప‌రిమితి 120 గంట‌లు.ఇందులో థియ‌రీ పార్టును బాగా కుదించాం.ఇది 48 గంట‌లు మాత్రమే.ఆన్ ది జాబ్ ట్రైయినింగ్ 72 గంట‌లు ఉంటుంది. విద్యార్థికి చ‌దివేట‌ప్పుడే ఆన్ ది జాబ్ ట్రైయినింగ్ (ప్రాక్టికల్ శిక్షణ‌), చ‌దివిన త‌ర్వాత ఉపాధి క‌ల్పించ‌డ‌మ‌నే ధ్యేయంతో ముందుకు వెళ్తున్నాం. ఈ కోర్సులు పూర్తిచేసిన త‌ర్వాత ఏ విద్యార్థీ ఖాళీగా ఉండే అవ‌కాశ‌మే లేదు. ఎందుకంటే కోర్సుకు త‌గిన ఉపాధిని ఇచ్చేందుకు అవ‌స‌ర‌మైన ఒప్పందాలు ప‌రిశ్రమ‌లతో చేసుకున్నారు. ఈ కోర్సులు అందించేందుకు ముందుకు వ‌స్తున్న ప్రైవేటు విద్యాసంస్థల నుంచి కూడా ఈ దిశ‌గా హామీ తీసుకున్నారు. ఈ వాతావ‌ర‌ణంలోనే విద్యార్థుల‌కు ఈ కోర్సుల‌ను అందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప‌రిశ్రమ‌లు కూడా ఉపాధిక‌ల్పన‌కు ముందుకు వ‌చ్చాయి.

Posted Date: 17-06-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌