• facebook
  • whatsapp
  • telegram

అగ్రిసెట్‌కు ఆదరణ 

సెప్టెంబర్‌ 13న ప్రవేశ పరీక్ష

వ్యవసాయ పాలిటెక్నిక్‌ డిప్లొమాలు పూర్తి చేసుకున్న విద్యార్థులకు నాలుగేళ్ల బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశం కల్పించే అగ్రిసెట్‌-2021 ప్రకటన  వెలువడింది. ఈఏపీసెట్‌ ర్యాంకులతో సంబంధం లేకుండా అగ్రిసెట్‌లో వచ్చే ర్యాంకు ఆధారంగా డిప్లొమా పూర్తిచేసినవారికి ప్రత్యేకంగా అవకాశం కల్పించంతో అగ్రిసెట్‌కు ఆదరణ పెరుగుతోంది. 

వైద్య విద్య తర్వాత అంతటి ఆదరణ కలిగిన కోర్సుల్లో ప్రధానంగా చెప్పుకోదగినది వ్యవసాయ విద్య. స్వల్ప వ్యత్యాసంతో మెడిసిన్‌లో సీటు పోగొట్టుకొనే నీట్‌ ర్యాంకర్లకు వ్యవసాయ విద్య ఓ ప్రత్యామ్నాయం. పరిమిత సంఖ్యలో మాత్రమే లభించే వ్యవసాయ విద్య సీట్లకు పోటీ ఎక్కువే. వ్యవసాయ విద్యకు ఉన్న గిరాకీ నేపథ్యంలో ఏజీ బీఎస్సీలో ప్రవేశం సాధించే ప్రత్యామ్నాయ మార్గం అగ్రిసెట్‌. రెండేళ్ల డిప్లొమా పూర్తి చేసుకొన్నవారు తక్కువ పోటీ ఉన్న అగ్రిసెట్‌ ద్వారా ర్యాంకు సాధించి నేరుగా నాలుగేళ్ళ వ్యవసాయ విద్యలో ప్రవేశం పొందవచ్చు. 

ఆంధ్రప్రదేశ్‌లో ప్రైవేటు వ్యవసాయ కళాశాలలను అనుమతించడంతో వ్యవసాయ విద్య సీట్ల సంఖ్య పెరిగింది. దీంతో వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలలు, అనుబంధంగా ఉన్న ప్రైవేటు కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు. ఈ కారణంగా అగ్రిసెట్‌ ద్వారా ప్రవేశాలు పొందేందుకు ఎక్కువ అవకాశం లభించింది. ఈ కారణాలన్నిటితో అగ్రిసెట్‌కు గత కొద్ది సంవత్సరాలుగా ఆదరణ పెరుగుతూవస్తోంది.. 

ఎవరు అర్హులు?

ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, తెలంగాణలోని ప్రొ. జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా, మూడేళ్ల విత్తన సాంకేతిక డిప్లొమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు అగ్రిసెట్‌ రాయవచ్చు. ఆఖరి సంవత్సరం రాస్తున్న విద్యార్థులూ అగ్రిసెట్‌కు అర్హులే. వారు ప్రవేశాలు కల్పించే సమయానికి డిప్లొమాలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 2021 డిసెంబరు 31 నాటికి 17 సంవత్సరాలు వయసు పూర్తి చేసుకున్నవారు, 22 ఏళ్ల లోపు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేయాల్సివుంటుంది. 25 సంవత్సరాల వరకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులను, 27 సంవత్సరాల వరకూ దివ్యాంగులను అనుమతిస్తారు. దీనిలో సాధించిన ర్యాంకును బట్టి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐదు వ్యవసాయ కళాశాలలు, వ్యవసాయ విశ్వవిద్యాలయం గుర్తింపు పొందిన ఆరు ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో బీఎస్సీ (ఆనర్స్‌) అగ్రికల్చర్‌ కోర్సులో ప్రవేశం పొందవచ్చు. 

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలలు, అనుబంధ ప్రైవేటు వ్యవసాయ కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో అగ్రిసెట్‌ అభ్యర్థుల కోసం ప్రత్యేకించి 185 బీఎస్సీ అగ్రికల్చర్‌ సీట్లు కేటాయించారు. అగ్రిసెట్‌లో వచ్చే ర్యాంకుల అధారంగా ఈ సీట్లను భర్తీ చేస్తారు. వ్యవసాయ డిప్లొమా చేసిన అభ్యర్థులకు 154, విత్తన సాంకేతిక డిప్లొమా చేసిన అభ్యర్థుల కోసం 24 సీట్లు కేటాయించిన, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా చేసిన అభ్యర్థుల కోసం 7 సీట్లు కేటాయించారు. వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలల్లో అన్ని సీట్లు కన్వీనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. అనుబంధ ప్రైవేటు కళాశాలల్లోని 72 సీట్లలో 65 శాతం సీట్లు కన్వీనర్‌ కోటాలో, మిగిలిన 35 శాతం సీట్లను యాజమాన్యపు కోటాలో భర్తీ చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం సూచించిన రిజర్వేషన్‌లను అనుసరించి సీట్లను విభాగాల వారీగా భర్తీ ప్రక్రియ నిర్వహిస్తారు. 

డిప్లొమా సిలబస్‌తోనే..

డిప్లొమా కోర్సులో బోధించిన అంశాలపైనే ఆగ్రిసెట్‌లో ప్రశ్నలు ఉంటాయి. 2021 సెప్టెంబరు 13న ఉదయం 10.30 గంటల నుంచి 12 గంటల వరకు అగ్రిసెట్‌ నిర్వహించనున్నట్లు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు ప్రకటించారు. గంటన్నర పాటు జరిగే పరీక్ష 120 మార్కులకు జరుగుతుంది. అన్ని బహుళైచ్ఛిక ప్రశ్నలే ఉంటాయి. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఏ డిప్లొమా పూర్తి చేసినవారు ఆదే విభాగంలో అగ్రిసెట్‌ రాయాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఎలా?

అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను https://angrau.ac.in/ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో నిర్ణీత రుసుము చెల్లించి సమర్పించాలి. 

దరఖాస్తు గడువు: ఆగస్టు 13.

అపరాధ రుసుముతో ఆగస్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఆన్‌లైన్‌లో పూరించిన దరఖాస్తు ప్రతులను ఆగస్టు 21లోపు అందేలా రిజిస్టర్‌/ స్పీడ్‌ పోస్టు ద్వారా ‘కన్వీనర్, ఆగ్రిసెట్‌-2021, అసోసియేట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ రిసెర్చ్‌ కార్యాలయం, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, లాం, గుంటూరు జిల్లా- 522034’కు పంపాలి.

- పసుపులేటి వేణుగోపాల్

న్యూస్‌టుడే, తిరుపతి (పశువైద్య విశ్వవిద్యాలయం) 
 

Posted Date: 02-08-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌