• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ విద్యకు గ్జాట్!

ప్రకటన విడుదల చేసిన గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌

అర్హత.. ఏదైనా డిగ్రీ

ఎప్పటికీ తరగని ఆదరణ ఉన్న కోర్సు బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌. ఎలాంటి రంగంలోనైనా మేనేజ్‌మెంట్‌ విద్యార్థులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మంచి వేతనమూ అందుతుంది. డిగ్రీ తర్వాత ఎంబీఏలో చేరితే భవిష్యత్తుకు బంగారు బాటలు పరుచుకోవచ్చు. ఆ అవకాశాన్ని గ్జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌ నిర్వహించే గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (గ్జాట్‌) ద్వారా అందుకోవచ్చు. 2022 విద్యాసంవత్సరానికిగాను గ్జాట్‌ ప్రకటన విడుదలైంది. ఈ పరీక్షలో మంచి స్కోరు సాధిస్తే దేశంలోని ప్రసిద్ధ విద్యా సంస్థల్లో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు పొందడంతోపాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగానికి అర్హత సాధించే అవకాశం ఉంది. 

తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్నం, హైదరాబాద్‌లోని గీతం, విజ్ఞానజ్యోతి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌లోని ఐసీబీఎం స్కూల్ ఆఫ్ బిజినెస్ ఎక్సెలెన్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిస్క్ మేనేజ్‌మెంట్‌, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ, వోక్స్‌సెన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, చిత్తూరులోని ఐఎఫ్‌ఎంఆర్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌, క్రీయా యూనివర్సిటీల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉంది.

సంస్థలు అందిస్తున్న కోర్సులు

పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ప్రోగ్రాం ఇన్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌, ఎగ్జిక్యూటివ్‌ పీజీడీఎం, ఫెలో ప్రోగ్రాం ఇన్‌మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌-బ్లెండెడ్‌ మోడ్‌, మేనేజ్‌మెంట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రాం, ఎగ్జిక్యూటివ్‌ డిప్లొమా ఇన్‌ హెచ్ఆర్‌ఎం, ఈ-ఎండీపీ వంటి కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నారు.  

అర్హత ఏమిటి?

ఏదైనా డిగ్రీ/ బీఈ/ బీటెక్ ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం...

పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌ లిస్ట్‌ చేసి గ్రూప్‌ డిస్కషన్స్‌/ ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారికి తుది ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఎంచుకున్న సంస్థ, కోర్సులో ఖాళీల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. 

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ప‌రీక్ష ఫీజు రూ.1800 చెల్లించాలి. జీమ్యాట్‌/ జీఆర్‌ఈ అర్హత సాధించి ఎగ్జిక్యూటివ్‌ పీజీడీఎం కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పరీక్ష ఫీజు కింద రూ.2500 చెల్లించాలి. నవంబర్‌30, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష ఇలా...

గ్జాట్‌ ప‌రీక్ష ‌మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. స‌మ‌యం 3 గంట‌లు ఉంటుంది. ఇందులో నాలుగు విభాగాలు ఉంటాయి. అన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. డిసిషన్‌ మేకింగ్‌ (21 ప్రశ్నలు, 21 మార్కులు), వెర్బల్ అండ్‌ లోకల్‌ ఎబిలిటీ (26 ప్రశ్నలు, 26 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌ (28 ప్రశ్నలు, 28 మార్కులు) జనరల్‌ నాలెడ్జ్‌ నుంచి (25 మార్కులు, 25 ప్రశ్నలు) వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కు ఉంటుంది.

సిలబస్

వెర్బ‌ల్‌ ఎబిలిటీ అండ్‌ లోకల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో రీడింగ్‌ కాంప్రహెన్షన్, జంబుల్డ్‌ పేరాగ్రాఫ్, పేరా సమ్మరీ అంశాల నుంచి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. రీడింగ్‌ కాంప్రహెన్షన్, పేరా సమ్మరీలకు సంయుక్తంగా సిద్ధం కావాలి. జాతీయ, అంతర్జాతీయ దినపత్రికల్లో వచ్చే సంపాదకీయాలను, ప్రారంభంలో మెల్లగా చదువుతూ వాటిని అవగాహన చేసుకొనేందుకు యత్నించాలి. ఆయా సంపాదకీయాల్లో, అంతర్లీనంగా ఉన్న అర్థాలను (ఇన్ఫరెన్స్‌), అర్థం తెలియని పదాలను పరిశీలించాలి. సందర్భానుసారం వాటిని అర్థం చేసుకోగలగాలి. పరీక్ష అయ్యేంతవరకు కూడా నిత్యం ఈ కసరత్తును కొనసాగించాలి.

డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌, డిసిషన్‌ మేకింగ్‌: డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌లో భాగంగా బార్‌గ్రాఫ్‌లు, కాలమ్‌గ్రాఫ్‌లు, టేబుల్స్‌, వెన్‌డయాగ్రామ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. కాంబినేషన్‌లోనూ కొన్ని అధ్యాయాల నుంచి ప్రశ్నలు రావొచ్చు. ఉదాహరణకు లైన్‌చార్ట్‌లు, పై చార్ట్‌లు కలుపుతూ ప్రశ్నలు ఇస్తున్నారు. డిసిషన్‌ మేకింగ్‌లో భాగంగా బ్లడ్‌ రిలేషన్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్, లాజికల్‌ సీక్వెన్సెస్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. 

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌: అరిథ్‌మెటిక్, ట్రిగనామెట్రీ, ఆల్‌జీబ్రా తదితర అంశాల నుంచి ఈ సెక్షన్‌లో ప్రశ్నలు అడుగుతారు. అరిథ్‌మెటిక్‌లో నంబర్‌సిస్టమ్, శాతాలు, నిష్పత్తులు, సరాసరి, టైం అండ్‌ డిస్టెన్స్, టైం అండ్‌ స్పీడ్, సింపుల్, కాంపౌండ్‌ ఇంట్రస్ట్‌ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

జనరల్‌ స్టడీస్‌: అభ్యర్థుల ప్రాపంచిక వ్యవహారాల పరిజ్ఞానాన్ని ఈ విభాగంలో పరీక్షిస్తారు. భారతీయ, అంతర్జాతీయ ప్రముఖ వ్యక్తులు, చారిత్రక విశేషాలు, భౌగోళికాంశాలు, విజ్ఞాన శాస్త్ర అంశాలు, ఆటలు, అబ్రివేషన్స్‌, వాణిజ్య అంశాలు, జాతీయ, అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలపై దృష్టి సారించాలి. 

స్కాలర్‌షిప్‌ అందిస్తున్న సంస్థలు
పరీక్షలో ప్రతిభ కనబరిచి ప్రవేశాలు పొందిన విద్యార్థులకు ట్యూషన్‌ ఫీజు, ఇతర ఖర్చులకు కొన్ని సంస్థలు చేయూత అందిస్తున్నాయి. అందులో ప్రధానంగా ఆదిత్య బిర్లా, క్యాపిట్‌ఫస్ట్‌, మీరేఅసెట్‌ ఫౌండేషన్‌, టీథామస్‌, గీతా సక్సెనా మెమోరియల్‌ వంటి సంస్థలు ఉన్నాయి. 
 

సన్నద్ధతకు ఇవి ముఖ్యం

పరీక్ష విధానంపై అవగాహన 

సమయ నిర్వహణ

మాక్ టెస్టులు

నాణ్యమైన స్టడీ మెటీరియల్

నిత్య సాధన, ఆత్మవిశ్వాసం

పరీక్ష తేది: జనవరి 02, 2022.

వెబ్‌సైట్‌: https://xatonline.in/

Posted Date: 21-08-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌