• facebook
  • whatsapp
  • telegram

కోర్సులు మేటి.. విద్యార్థుల పోటీ!

ఉన్నత విద్యకు ఉత్తమ వేదిక హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 

ప్రవేశాలకు ప్రకటన 

దేశంలో ప్రముఖ ఉన్నత విద్యా సంస్థల్లో హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వ విద్యాలయం ఒకటి. ర్యాంకింగ్‌ సంస్థల జాబితాలో ఏటా మేటి స్థానాన్ని ఈ సంస్థ దక్కించుకోవడమే అందుకు నిదర్శనం. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు, ల్యాబ్, లైబ్రరీ సౌకర్యాలు, అత్యున్నత బోధన, వసతులు... తదితర కారణాలతో ఈ సంస్థలో చదవడానికి ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. తాజాగా ఈ విశ్వవిద్యాలయం ఇంటిగ్రేటెడ్‌ పీజీ, పీజీ, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ, పీహెచ్‌డీ కోర్సుల్లో  ప్రవేశాలకు ప్రకటన విడుదలచేసింది!

దేశవ్యాప్తంగా ఎక్కువ మంది విద్యార్థులు హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో చదవడానికి పోటీ పడుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో ఔత్సాహికులు దరఖాస్తు చేసుకుంటున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. కొన్ని పీజీలు, పీహెచ్‌డీ కోర్సులకు ఇంటర్వ్యూ అదనంగా ఉంటుంది. ఈ ఏడాది కొత్తగా పబ్లిషింగ్‌లో 3 నెలల వ్యవధితో సర్టిఫికెట్‌ కోర్సు ప్రారంభించారు. దీనికి గ్రాడ్యుయేట్లు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 20 సీట్లు ఉన్నాయి. అలాగే ఎంటెక్‌ మోడలింగ్‌ అండ్‌ సిములేషన్‌ కోర్సూ ఈ విద్యా సంవత్సరం నుంచే మొదలవుతోంది. ఇందులో 46 సీట్లు ఉన్నాయి. ఎంపీఏ మ్యూజిక్‌ కోర్సూ కొత్తదే. ఇందులో 20 మందికి అవకాశం లభిస్తుంది.  

రెండేళ్ల పీజీ ఎంఏ కోర్సులు

ఇంగ్లిష్‌ 56, ఫిలాసఫీ 28, హిందీ 47, తెలుగు 56, ఉర్దూ 25, అప్లయిడ్‌ లింగ్విస్టిక్స్‌ 25, కంపారిటివ్‌ లిటరేచర్‌ 25, సాంస్క్రీట్‌ స్టడీస్‌ 15, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ స్టడీస్‌ 23, హిస్టరీ 65, పొలిటికల్‌ సైన్స్‌ 65, సోషియాలజీ 65, ఆంత్రోపాలజీ 30, ఎడ్యుకేషన్‌ 50, జండర్‌ స్టడీస్‌ 20, ఎకనామిక్స్‌ 75, ఫైనాన్షియల్‌ ఎకనామిక్స్‌ 37, కమ్యూనికేషన్‌ మీడియా స్టడీస్‌ 25, కమ్యూనికేషన్‌ మీడియా ప్రాక్టీస్‌ 25 సీట్లు ఉన్నాయి. 

మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్‌: భరతనాట్యం 10, కూచిపూడి 10, థియేటర్‌ ఆర్ట్స్‌ 17, మ్యూజిక్‌ 20 సీట్లు ఉన్నాయి. 

ఫైన్‌ ఆర్ట్స్‌: పెయింటింగ్‌ 17, ప్రింట్‌ మేకింగ్‌ 10, స్కల్ప్‌చర్‌ 10, ఆర్ట్‌ హిస్టరీ అండ్‌ విజువల్‌ స్టడీస్‌ 10 సీట్లు ఉన్నాయి. 

ఎంబీఏ: హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌లో 42 సీట్లు ఉన్నాయి. వీటిలో 5 స్పాన్సర్డ్, ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ లోనూ 42 సీట్లు ఉన్నాయి వీటిలో 5 స్పాన్సర్డ్, ఎగ్జిక్యూటివ్‌ ఎంబీఏలో 40 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

వీటితోపాటు పలు విభాగాల్లో పీహెచ్‌డీ, ఎంటెక్‌ కోర్సులను హైదరాబాద్‌ కేంద్రీయ విద్యాలయం అందిస్తోంది.

ప్రవేశమిలా...

రెండేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులకు పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశం లభిస్తుంది. మాస్టర్‌ ఆఫ్‌ పెర్ఫార్మింగ్‌ ఆర్ట్స్, మాస్టర్‌ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్, ఎంఏ కమ్యూనికేషన్‌ కోర్సులకు రాతపరీక్షతో పాటు ప్రాక్టికల్‌ టెస్ట్‌/ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ కోర్సులు విశ్వవిద్యాలయానికి చెందిన సరోజినీ నాయుడు స్కూల్‌ పరిధిలోకి వస్తాయి. ఎంబీఏ - హెల్త్‌ కేర్‌ అండ్‌ హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ కోర్సుల్లో పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ప్రవేశం కల్పిస్తారు. ఎంటెక్‌ కంప్యూటర్‌ సైన్స్, ఆర్టిఫీషియల్‌ ఇంటలిజెన్స్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఐసీ టెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, మోడలింగ్‌ అండ్‌ సిములేషన్‌ కోర్సులకు గేట్‌ స్కోర్‌ ఆధారంగా ప్రవేశం లభిస్తుంది. ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ (కంప్యూటర్‌ సైన్స్‌) కోర్సులో జేఈఈ స్కోర్‌తో ప్రవేశం కల్పిస్తారు. ఈ సంస్థ ఎంసీఏ కోర్సునూ అందిస్తోంది ప్రవేశం నిమ్‌సెట్‌తో లబిస్తుంది. ఎంబీఏ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో క్యాట్‌ స్కోర్‌తో, ఎమ్మెస్సీ బయోటెక్నాలజీలోకి గ్యాట్‌ బితో ప్రవేశాలు లబిస్తాయి. వీటి కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి. గతంలో నిర్వహించిన ప్రవేశపరీక్షలకు సంబంధించి సబ్జెక్టులవారీ ప్రశ్నపత్రాలు, వాటికి జవాబులు యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. 

ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఈడబ్ల్యుఎస్‌ రూ.550, ఓబీసీలకు రూ.400. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.275.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 20

పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా 39 చోట్ల నిర్వహిస్తారు. తెలంగాణలో.. హైదరాబాద్, వరంగల్, నల్గొండ, కరీంనగర్, మహబూబ్‌నగర్, నిజామాబాద్‌. ఏపీలో.. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, విజయనగరం, కడప, అనంతపురంలో పరీక్షలు రాసుకోవచ్చు.   

వెబ్‌సైట్‌: http://acad.uohyd.ac.in/

ఇంటిగ్రేటెడ్‌ పీజీ

ఇంటిగ్రేటెడ్‌ విధానంలో ఐదేళ్ల ఎంఏ, ఎమ్మెస్సీ కోర్సులను వివిధ విభాగాల్లో ఇక్కడ అందిస్తున్నారు. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి.

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ. వీటిలో అప్లయిడ్‌ జియాలజీలో 10, మిగిలినవాటిలో ఒక్కో విభాగంలో 20 చొప్పున సీట్లు ఉన్నాయి. సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు, ఆఖరు సంవత్సరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీలో 20 సీట్లకు 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా పోటీ పడవచ్చు. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (హ్యుమానిటీస్‌): తెలుగు 19, హిందీ 10, లాంగ్వేజ్‌ సైన్సెస్‌ 19, ఉర్దూ 5 సీట్లు ఉన్నాయి. వీటికి ఇంటర్‌ ఏ గ్రూప్‌లోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ఇంటర్‌లో తెలుగు / హిందీ / ఉర్దూ చదివివుండడం తప్పనిసరి. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ కోర్సులు (సోషల్‌ సైన్సెస్‌): ఎకనామిక్స్‌ 14, హిస్టరీ 13, పొలిటికల్‌ సైన్స్‌ 13, సోషియాలజీ 14, ఆంత్రోపాలజీ 13 సీట్లు ఉన్నాయి. ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఆరేళ్ల వ్యవధితో మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఎం ఆప్టోమ్‌) కోర్సు అందిస్తున్నారు. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్‌లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60శాతం మార్కులు తప్పనిసరి. 

ప్రవేశపరీక్ష ఇలా..

పైన తెలిపిన అన్ని ఇంటిగ్రేటెడ్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ) కోర్సులకూ ప్రవేశ పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఇంటర్‌ స్థాయిలోనే ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో వస్తాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. ప్రతి తప్పు సమాధానానికీ మూడో వంతు మార్కులు తగ్గిస్తారు. 

మ్యాథమేటికల్‌ సైన్సెస్, ఫిజిక్స్, కెమికల్‌ సైన్సెస్, సిస్టమ్స్‌ బయాలజీ, అప్లయిడ్‌ జియాలజీ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. నాలుగు సెక్షన్లలో ప్రశ్నలడుగుతారు. ఒక్కో సెక్షన్‌కు 25 మార్కులు కేటాయించారు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ నాలుగు సెక్షన్ల నుంచి ఇంటర్‌ స్థాయిలో ప్రశ్నలుంటాయి. విద్యార్థులు వారి ప్రాధాన్యం అనుసరించి కోర్సులను ఎంచుకోవాలి. రాత పరీక్షలో చూపిన ప్రతిభ, ప్రాధాన్యం ప్రకారం సీట్లు కేటాయిస్తారు. 

ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వంద మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. పరీక్షలో సైకాలజీ (ఇంటర్‌ స్థాయి), ఇంగ్లిష్‌లో అవగాహనపై ప్రశ్నలుంటాయి. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ హ్యుమానిటీస్‌ (తెలుగు, హిందీ, ఉర్దూ, లాంగ్వేజ్‌ సైన్స్‌) కోర్సులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కుల ప్రశ్నపత్రంలో ఎ,బి,సి అనే మూడు విభాగాలు ఉంటాయి. పార్ట్‌ ఎలో 40 ప్రశ్నలుంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. అభ్యర్థి ప్రవేశం కోరుకునే సబ్జెక్టు నుంచి ఈ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌ బి, పార్ట్‌ సి అందరికీ ఉమ్మడి అంశాలే. పార్ట్‌ బిలో 35 ప్రశ్నలు ఆంగ్ల భాషా ప్రావీణ్యంపై అడుగుతారు. పార్ట్‌ సిలో 25 ప్రశ్నలు వర్తమాన వ్యవహారాలు, జనరల్‌ నాలెడ్జ్‌ అంశాల నుంచి వస్తాయి. మెరిట్‌ ప్రకారం అభ్యర్థి ఎంచుకునే కోర్సులోనే ప్రవేశం లభిస్తుంది. 

ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ సోషల్‌ సైన్సెస్‌ (ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, సోషియాలజీ, ఆంత్రోపాలజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. వంద మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో 4 విభాగాలు ఉంటాయి. ఒక్కో విభాగానికీ 25 మార్కులు కేటాయించారు. పార్ట్‌ ఎలో సోషల్‌ స్టడీస్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలు, పార్ట్‌ బిలో లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్, పార్ట్‌ సిలో రీజనింగ్‌ ఎబిలిటీ, పార్ట్‌ డిలో క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు వస్తాయి.

పీజీ సైన్స్‌ కోర్సులు

కోర్సు: ఎమ్మెస్సీ మ్యాథ్స్‌/ అప్లయిడ్‌ మ్యాథ్స్‌ సీట్లు: 50, ఎమ్మెస్సీ స్టాటిస్టిక్స్‌ - ఆపరేషన్స్‌ రిసెర్చ్‌ (ఓఆర్‌) 

సీట్లు: 25

అర్హత: మ్యాథ్స్‌ లేదా స్టాటిస్టిక్స్‌ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. మ్యాథ్స్‌ /  స్టాటిస్టిక్స్‌ ఆనర్స్‌ విద్యార్థులైతే 55 శాతం మార్కులు 

కోర్సు: ఎమ్మెస్సీ ఫిజిక్స్‌ 

సీట్లు: 56

అర్హత:ఫిజిక్స్, మ్యాథ్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత  

కోర్సు:ఎమ్మెస్సీ కెమిస్ట్రీ 

సీట్లు: 56

అర్హత:కెమిస్ట్రీ సబ్జెక్టుతో ఫిజిక్స్‌ లేదా మ్యాథ్స్‌ కాంబినేషన్‌తో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత

కోర్సు: ఎమ్మెస్సీ బయోకెమిస్ట్రీ 

సీట్లు: 26

అర్హత:డిగ్రీలో బయెకెమిస్ట్రీ లేదా కెమిస్ట్రీ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత

కోర్సు: ఎమ్మెస్సీ ప్లాంట్‌ బయాలజీ అండ్‌ బయో టెక్నాలజీ 

సీట్లు: 23

అర్హత: కెమిస్ట్రీ, బోటనీ, మైక్రో బయాలజీ, జెనెటిక్స్, బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ వీటిలో ఏదైనా సబ్జెక్టుతో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

కోర్సు: ఎమ్మెస్సీ మాలిక్యులర్‌ మైక్రో బయాలజీ 

సీట్లు: 15

అర్హత: జువాలజీ, జెనెటిక్స్, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ, బోటనీ, మైక్రోబయాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ వీటిలో కనీసం ఏదో ఒక సబ్జెక్టుతో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

కోర్సు:ఎమ్మెస్సీ యానిమల్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ 

సీట్లు: 23

అర్హత:సైన్స్‌ సబ్జెక్టులతో బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. 

కోర్సు:మాస్టర్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ (ఎంపీహెచ్‌) 

సీట్లు: 38

అర్హత: మెడిసిన్, డెంటిస్ట్రీ, ఆయుర్వేదిక్‌ మెడిసిన్, హోమియోపతి, ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్‌ థెరపీ, నర్సింగ్, న్యూట్రిషన్, ఫార్మకాలజీ, వెటరనరీ సైన్సెస్, అగ్రికల్చరల్‌ సైన్సెస్, సోషల్‌ సైన్సెస్‌ లేదా ఏదైనా ఇతర సైన్స్‌ డిగ్రీ. ఆర్ట్స్, హ్యుమానిటీస్‌లో డిగ్రీ పూర్తిచేసి పబ్లిక్‌ హెల్త్‌పై ఆసక్తి ఉన్నవారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు. 

కోర్సు: ఓషన్‌ అండ్‌ అట్మాస్ఫెరిక్‌ సైన్సెస్‌ 

సీట్లు: 12 (వీటిలో 2 స్పాన్సర్డ్‌)

అర్హత: 55 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా బీఎస్సీ లేదా బీటెక్‌ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్‌ ఎందులోనైనా ఉత్తీర్ణత

కోర్సు: హెల్త్‌ సైకాలజీ 

సీట్లు: 15

అర్హత: సైకాలజీ ఒక సబ్జెక్టుగా 60 శాతం మార్కులతో మూడేళ్ల డిగ్రీ ఉత్తీర్ణత

కోర్సు: న్యూరల్‌ అండ్‌ కాగ్నిటివ్‌ సైన్స్‌ 

సీట్లు: 16

అర్హత:నేచురల్‌ సైన్సెస్, మ్యాథమెటిక్స్, ఇంజినీరింగ్, కంప్యూటర్‌ సైన్స్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్, ఎంబీబీఎస్‌ వీటిలో ఎందులోనైనా 55 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ పీహెచ్‌డీ: బయోకెమిస్ట్రీ అండ్‌ మాలిక్యులార్‌ బయాలజీలో 6, యానిమల్‌ బయాలజీ అండ్‌ బయోటెక్నాలజీ 6, బయోటెక్నాలజీ 6 చొప్పున సీట్లు ఉన్నాయి. వీటికి కోర్సును బట్టి సైన్స్‌ లేదా సంబంధిత సబ్జెక్టులను డిగ్రీలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

Posted Date: 25-06-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌