• facebook
  • whatsapp
  • telegram

ముచ్చటగా మూడోసారి!  

అత్యుత్తం.. ఐఐటీ మద్రాసే 

 

 

కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏటా దేశవ్యాప్తంగా విద్యాసంస్థలను మదింపు చేసి వాటికి ర్యాంకులు కేటాయిస్తున్నారు. ఆయా కేటగిరీల వారీ ప్రముఖ సంస్థల జాబితాను నేషనల్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ర్యాంకింగ్‌ ఫ్రేమ్‌వర్క్‌ (ఎన్‌ఐఆర్‌ఎఫ్‌) వెలువరిస్తుంది. తాజాగా వెలువడిన 2021 ర్యాంకుల ప్రకారం ఓవరాల్‌ కేటగిరీలో ఐఐటీ మద్రాస్‌ ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ సంస్థ నంబర్‌ వన్‌గా నిలవడం వరుసగా ఇది మూడోసారి. ఈ నేపథ్యంలో ఐఐటీ-ఎం కోర్సుల, ప్రవేశమార్గాల వివరాలు..

 

ఇంజినీరింగ్‌ విభాగంలో ఏదైనా ఐఐటీ ప్రథమ స్థానం సాధిస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అలా కాకుండా మొత్తం (ఓవరాల్‌)గా మేటి సంస్థల జాబితాలో ఐఐటీకి చోటు దక్కడం గొప్ప విషయంగానే చెప్పుకోవచ్చు. అది కూడా వరుసగా 2019, 2020, 2021 సంవత్సరాల్లో ఒకే సంస్థ శిఖర స్థానంలో నిలవడం దాని ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.  

 

ఇవీ కోర్సులు... 

బీటెక్, డ్యూయల్‌ డిగ్రీ, ఎంటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంబీఏ పీహెచ్‌డీ కోర్సులు ఇక్కడ చదువుకోవచ్చు. ఈ సంస్థలో మొత్తం 16 డిపార్ట్‌మెంట్లు ఉన్నాయి. ఇవి వివిధ  విభాగాల్లో కోర్సులు అందిస్తున్నాయి. బీటెక్‌ కోర్సులు ఐఐటీ-జేఈఈతో, ఎంటెక్‌ కోర్సులు గేట్‌ ద్వారా ఐఐటీ మద్రాస్‌లో చదువుకోవచ్చు. బీటెక్‌లో రెగ్యులర్‌ కోర్సులతోపాటు నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్, ఆటోమోటివ్‌ ఇంజినీరింగ్, బయోమెడికల్‌ డిజైన్‌లో డ్యూయల్‌ డిగ్రీలను ఈ సంస్థ అందిస్తోంది. 

 

ఈ సంస్థకు చెందిన హ్యుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ డిపార్ట్‌మెంట్‌ ద్వారా ఇంటర్‌ విద్యార్హతతో అయిదేళ్ల ఎంఏ డెవలప్‌మెంట్‌ స్టడీస్, ఇంగ్లిష్‌ స్టడీస్‌ అందిస్తున్నారు. హయ్యర్‌ సెకండరీ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (హెచ్‌ఎస్‌ఈఈ) పేరుతో నిర్వహించే పరీక్షతో ఈ కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థ యూజీ సైన్స్‌ విద్యార్థుల కోసం ఎమ్మెస్సీ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కోర్సులనూ అందిస్తోంది. వీటిలో ప్రవేశం ఐఐటీలు సంయుక్తంగా నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టు ఎమ్మెస్సీ (జామ్‌) పరీక్ష ద్వారా లభిస్తాయి. ఈ సబ్జెక్టుల్లో పీహెచ్‌డీలూ ఉన్నాయి. జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)లో చూపిన ప్రతిభతో వాటిలో చేరవచ్చు. ఇక్కడ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో భాగంగా ఎంబీఏ కోర్సు అందిస్తున్నారు. ఐఐఎంలు నిర్వహించే క్యాట్‌లో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది.

 

ఈ సంస్థలో సుమారు 8000 మంది విద్యార్థులు వివిధ కోర్సులు చదువుతున్నారు. వీరికి విద్యాబుద్ధులు నేర్పడానికి 550 మంది ఫ్యాకల్టీ సభ్యులు అందుబాటులో ఉన్నారు. మొత్తం వంద ల్యాబొరేటరీలు ఉన్నాయి.

 

ఐఐటీ మద్రాస్‌ 2019 విద్యా సంవత్సరం నుంచి టెక్‌ ఎంబీఏ కోర్సును ఇక్కడ చదువుతోన్న బీటెక్‌ విద్యార్థుల కోసం అందిస్తోంది. దీనిని అయిదేళ్ల ఇంటర్‌ డిసిప్లినరీ డ్యూయల్‌ డిగ్రీ పేరుతో నడుపుతున్నారు. ఇందులో చేరినవారికి బీటెక్‌తోపాటు ఎంబీఏ పట్టా కూడా అందిస్తారు. ఇక్కడ చదువుతోన్న ఇంజినీరింగ్‌ అన్ని బ్రాంచీల విద్యార్థులకూ అవకాశం ఉంది.  ఈ సంస్థ 2020-2021 విద్యా సంవత్సరం నుంచి ఆన్‌లైన్‌ బీఎస్సీ ప్రొగ్రామింగ్‌ అండ్‌ డేటా సైన్స్‌ కోర్సులు అందిస్తోంది. ఈ కోర్సులో చేరడానికి ముందుగా క్వాలిఫయర్‌ పరీక్షలో విజయవంతం కావడం తప్పనిసరి. అనంతరం ఫౌండేషన్, ఆ తర్వాత డిప్లొమా చివరగా డిగ్రీ ఇలా అన్ని దశలూ పూర్తిచేసుకున్నవారికి బీఎస్సీ పట్టా చేతికందుతుంది. 

 

జర్మనీ సాంకేతిక, ఆర్థిక సహకారంతో 1959లో ప్రారంభమైన ఐఐటీ మద్రాస్‌ అంచెలంచెలుగా ఎదిగి, ఇతర విద్యాసంస్థలు అందుకోలేని స్థానానికి చేరుకుంది.

 

ఓవరాల్‌లో టాప్‌ టెన్‌ సంస్థలు

1. ఐఐటీ మద్రాస్‌ 

2. ఐఐఎస్సీ-బెంగళూరు 

3. ఐఐటీ- బాంబే 

4. ఐఐటీ- దిల్లీ 

5. ఐఐటీ- కాన్పూర్‌ 

6. ఐఐటీ- ఖరగ్‌పూర్‌ 

7. ఐఐటీ- రూర్కీ 

8. ఐఐటీ- గువాహటి 

9. జేఎన్‌యూ- న్యూదిల్లీ  

10. బీహెచ్‌యూ-వారణాశి

తెలుగు రాష్ట్రాల్లో ర్యాంకింగ్స్‌: ఐఐటీ-హైదరాబాద్‌ 16, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం 17, ఆంధ్రా యూనివర్సిటీ 48, ఎన్‌ఐటీ వరంగల్‌ 59, ఉస్మానియా యూనివర్సిటీ 62, కేఎల్‌ యూనివర్సిటీ 69,  శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం 92.

 

ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ మదింపు ఇలా..

1. బోధన, అభ్యాసం, వనరులు: మొత్తం విద్యార్థులు, వారిలో డాక్టొరల్‌ కోర్సులు చదువుతున్నవారు; ఆచార్యులు, విద్యార్థుల నిష్పత్తి; శిక్షకుల్లో పీహెచ్‌డీ పూర్తిచేసుకున్నవారు, ఆర్థిక వనరులు, వాటిని ఉపయోగించిన విధానం

2. పరిశోధన, వృత్తి అభ్యాసం: మొత్తం ఎన్ని పుస్తకాలు/ పరిశోధన పత్రాలు ప్రచురించారు. వాటి నాణ్యత ఎలా ఉంది. మేధా సంపత్తి హక్కులు (ఐపీఆర్‌), పేటెంట్లు ఎన్నింటికి దక్కాయి, చేపడుతోన్న ప్రాజెక్టులు చూపుతోన్న ముద్ర 

3. పట్టాలు పుచ్చుకున్నవారు: మొత్తం ఎంత మంది విద్యార్థులు చేరారు, వారిలో పట్టాలతో విజయవంతంగా కోర్సు పూర్తిచేసినవారు ఎందరు, ఎంతమందికి పీహెచ్‌డీ దక్కింది..

4. వైవిధ్యం: ఇతర రాష్ట్రాలు, దేశాల విద్యార్థులు ఎంతమంది చేరుతున్నారు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడినవారు, దివ్యాంగులు ఎంతమంది చొప్పున ఉన్నారు, వారికి కల్పిస్తోన్న సౌకర్యాలు

5. లోకనాడి: ఉద్యోగులు, ప్రతిష్ఠాత్మక సంస్థల్లో పని చేస్తున్న నిపుణులు ఏ విద్యా సంస్థకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు..

పైన తెలిపిన విషయాలకు కొన్నేసి పాయింట్లు కేటాయిస్తారు. ఈ ప్రామాణికాల ప్రకారం అన్ని వివరాలూ మదించి, ఫలిత విలువను లెక్కిస్తారు. 
 

Posted Date: 14-09-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌