• facebook
  • whatsapp
  • telegram

న‌లంద‌లో చేరదామా?

వివిధ కోర్సుల్లో ప్ర‌వేశానికి ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

కేంద్రప్రభుత్వ ఆధ్వర్యంలో జాతీయ ప్రాధాన్య సంస్థగా నలంద విశ్వవిద్యాలయం బిహార్‌లోని రాజ్‌గిరీలో ఏర్పాటైంది. ఈ సంస్థ పీజీ, పీహెచ్‌డీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో వివిధ కోర్సులు అందిస్తోంది. వీటిలో చేరడానికి భారత్‌తోపాటు 18 భాగస్వామ్య దేశాలకు చెందిన విద్యార్థులకు అవకాశం ఉంది. వచ్చే విద్యా సంవత్సరంలో ప్రవేశానికి ప్రకటన వెలువడింది. ఏదైనా డిగ్రీ విద్యార్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.  

విశ్వవిఖ్యాతి చెందిన ప్రాచీన నలంద విశ్వవిద్యాలయ వారసత్వానికి కొనసాగింపుగా 2010లో ఈ ఆధునిక యూనివర్సిటీ ఆరంభమైంది. దీనిలో చదువుతోన్నవారిలో 60 శాతం మంది విదేశీయులే. కోర్సులన్నీ అంతర్జాతీయ దృక్పథంతో, ఆసియా ఖండాన్ని దృష్టిలో పెట్టుకుని అందిస్తున్నారు

ఇవీ కోర్సులు

ఎంబీఏ సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌

మాస్టర్స్‌ ఇన్‌ ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్‌

మాస్టర్స్‌ ఇన్‌ బుద్ధిస్ట్‌ స్టడీస్‌ ఫిలాసఫీ అండ్‌ కంపారిటివ్‌ రెలిజియన్‌

మాస్టర్స్‌ ఇన్‌ హిస్టారికల్‌ స్టడీస్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఏదైనా యూజీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఒక్కో విద్యార్థి గరిష్ఠంగా రెండు కోర్సులకే పోటీపడవచ్చు. ఎంబీఏకు క్యాట్‌/ఎక్స్‌ఏటీ/మ్యాట్‌ ఎందులోనైనా 70 పర్సంటైల్‌ తప్పనిసరి.

తరగతులు: కోర్సులకు ఎంపికైనవారికి ఆగస్టు మొదటి వారం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. రెసిడెన్షియల్‌ విధానంలో వీటిని అందిస్తున్నారు. 

హిందూ స్టడీస్, లిటరరీ స్టడీస్‌ ఇన్‌ ఇంగ్లిష్, పబ్లిక్‌ హెల్త్‌ పీజీ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తున్నారు. ఈ సంస్థ హిస్టారికల్‌ స్టడీస్, ఎకాలజీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ స్టడీస్, బుద్ధిస్ట్‌ స్టడీస్, ఫిలాసఫీ అండ్‌ కంపారిటివ్‌ రెలిజియన్‌ కోర్సులను పీహెచ్‌డీ స్థాయిలోనూ అందిస్తోంది. వీటి వ్యవధి నాలుగేళ్లు. ఎంపికైనవారికి నెలకు రూ.35,000   స్టైపెండ్‌ చెల్లిస్తారు. ఇక్కడ డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో సంస్కృతం, ఇంగ్లిష్, పాళీ, టిబెటన్, కొరియన్‌ కోర్సులను స్వల్పకాల వ్యవధులతో అందిస్తున్నారు.

ఎంపిక విధానం

స్టేట్‌మెంట్‌ ఆఫ్‌పర్పస్‌ రాయాల్సివుంటుంది. ఇందులో నలందలో ఎందుకు చదవాలనుకుంటున్నారో వంద పదాల నిడివితో వివరించాలి. అలాగే సంబంధిత కోర్సును ఎంచుకోవడానికి కారణాలను 300-500 పదాల్లో వివరించాలి. డిగ్రీని ఆంగ్ల మాధ్యమంలో చదవనివారైతే టోఫెల్‌/ఐఈఎల్‌టీఎస్‌ స్కోరు తప్పనిసరి. ఇవన్నీ దరఖాస్తుతో పంపాలి. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్‌ చేసి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.

వెబ్‌సైట్‌: https://nalandauniv.edu.in/
 

Posted Date: 24-03-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌