• facebook
  • whatsapp
  • telegram

చరిత్రలో చెరగని చిహ్నాలపై పరిశోధన

విభిన్న కెరియర్‌ ఆర్కియాలజీ 

వర్తమానానికీ, భవిష్యత్తుకూ గతమే పునాది. ప్రతి సంస్కృతికీ, నాగరికతకూ చరిత్ర ఉంటుంది. చెరిగిపోని చిహ్నాలుంటాయి. వీటిని గ్రహించడం ద్వారా చాలాసార్లు ఎన్నో అంశాల్లో సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ అంశాలపై పరిశోధన చేసేవారే పురాతత్వ శాస్త్రవేత్తలు (ఆర్కియాలజిస్టులు). చారిత్రక అంశాలపై అభిరుచీ, ఆసక్తీ ఉన్న విద్యార్థులు దృష్టిపెట్టగల ఆసక్తికరమైన కెరియర్లలో ఇదీ ఒకటి.

ఎక్కడో తవ్వకాల్లో.. అనుకోకుండా దొరికిన కొన్ని వస్తువులు ఏ కాలం నాటివో అంచనా వేయడం.. వాటిని ఉపయోగించినవారు, వారి సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానాలను పరిశోధించడం.. ఇవన్నీ పురాతత్వశాస్త్ర విభాగం చేసే పని! గత తరాల సంస్కృతి, జీవన విధానాలను శాస్త్రీయ, క్రమపద్ధతిలో అధ్యయనం చేయడం ఈ విభాగపు పని. ఇందులో భాగంగా కొన్ని వందల, వేల ఏళ్ల నుంచి నేలలో దాగిన ముద్రలు, శాసనాలు, స్మారకాలు, కట్టడాలు, ప్రాసాదాలు, ఇతర సంబంధిత వస్తువులపై అధ్యయనం జరుపుతారు.

చాలామంది ఆర్కియాలజీ, పాలియెంటాలజీ ఒకటే అని భావిస్తుంటారు. పాలియెంటాలజీ శిలాజాల గురించిన అధ్యయనం. ఆర్కియాలజీ వ్యక్తుల జీవనవిధానాలు, సంస్కృతులపై దృష్టిపెడుతుంది. లభ్యమైన ఆధారాల ఆధారంగా గత సంస్కృతులను అర్థం చేసుకుంటూ, కాలానుగుణంగా మానవ జీవన విధానాల్లో వచ్చిన మార్పులను అధ్యయనం చేయడం వంటివి ఇందులో భాగం.

ఆర్కియాలజీ పరిధి చాలా విస్తృతమైనది. ప్రాచీన గ్రంథాలు/ పత్రాలు, మ్యూజియాలజీ, ముద్రల/ నాణేల శాస్త్రం, శాసనాలు, ప్రాచీన లిపి వంటి ఇతర విభాగాల అధ్యయనమూ దీనిలో భాగమే. దీన్ని ఆంత్రపాలజీ (మానవ విజ్ఞాన శాస్త్రం)లో ఒక విభాగంగానూ పరిగణిస్తారు. సంబంధిత నిపుణులను ఆర్కియాలజిస్టులు/ పురాతత్వ శాస్త్రవేత్తలు అని పిలుస్తారు. ఈ శాస్త్రాన్ని అధ్యయనం చేసే కోర్సులను చేయడం ద్వారా ఈ కెరియర్‌లోకి అడుగు పెట్టొచ్చు.

చాలా రకాలున్నాయ్‌

ఆర్కియాలజిస్టుల్లోనూ ప్రత్యేకంగా కొన్ని అంశాలపై దృష్టిపెట్టే విభాగాలున్నాయి. వాటిలో ప్రధానమైనవి.

క్లాసికల్‌ ఆర్కియాలజీ: ప్రాచీన గ్రీకు, రోమన్, ఇతర సమకాలీన నాగరికతల గురించిన పరిశోధన, అధ్యయనం చేస్తారు. 

హిస్టారికల్‌ ఆర్కియాలజీ: పురాతన కాలానికి చెందిన కళాఖండాలు, పత్రాలు మొదలైనవాటిపై అధ్యయనం చేస్తారు.

అండర్‌వాటర్‌ ఆర్కియాలజీ: సముద్ర అడుగు భాగంలోని మానవ భౌతిక అవశేషాలపై వీరు పనిచేస్తారు.

ఎత్నో ఆర్కియాలజీ: పురాతన కాలానికి చెందిన వేటగాళ్ల జీవన విధానాలపై దీనిలో దృష్టిసారిస్తారు. ఇందుకుగానూ వారు ఉపయోగించిన ఆయుధాలు, పరికరాలు, మానవ, జంతు శిలాజాలు మొదలైనవాటిని అధ్యయనం చేస్తారు. 

ఫోరెన్సిక్‌ ఆర్కియాలజీ: ఏదైనా నేరానికి సంబంధించి మట్టిలో పాతిపెట్టిన మానవ అవశేషాలు, వ్యక్తిగత వస్తువులు, ఆయుధాలు, ఇతర ఆధారాలపై పరిశోధన చేస్తారు. తద్వారా ఇతర అంశాలనూ పరిగణనలోకి తీసుకుని, ఏ పరిస్థితుల్లో నేరం జరిగిందన్న దాన్ని అంచనా వేస్తారు.

సైబర్‌ ఆర్కియాలజీ: ఇది ఇంజినీరింగ్, కంప్యూటర్స్, నేచురల్‌ సైన్సెస్‌ల మేళవింపు. వీరు సైన్స్, ఇంజినీరింగ్‌ అంశాలను ఉపయోగించి గత పరిస్థితులను అధ్యయనం చేస్తారు.

ఇంకా.. మోడర్న్‌ ఆర్కియాలజీ, ఆర్కియో జాగ్రఫీ, ప్రీహిస్టారిక్‌ ఆర్కియాలజీ, ప్రోహిస్టారిక్‌ ఆర్కియాలజీ,  బయో ఆర్కియాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ ఆర్కియాలజీ, అర్బన్‌ ఆర్కియాలజీ, లాండ్‌స్కేప్‌ ఆర్కియాలజీ, మెరైన్‌ ఆర్కియాలజీ, బ్యాటిల్‌ఫీల్డ్‌ ఆర్కియాలజీ మొదలైన విభాగాలున్నాయి.

విభిన్న కోర్సులు

దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఆర్కియాలజీలో కోర్సులను అందిస్తున్నాయి. డిప్లొమా, పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ, డాక్టొరల్‌ కోర్సులున్నాయి.

డిప్లొమా కోర్సుల కాలవ్యవధి ఏడాది. సాధారణంగా > డిప్లొమా ఇన్‌ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ > డిప్లొమా ఇన్‌ ఇండియన్‌ ఆర్కియాలజీ మొదలైన కోర్సులు ఉన్నాయి. ఇంటర్‌లో ఏదైనా గ్రూపును కనీసం 50% మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. 

పీజీ డిప్లొమా కోర్సులకు డిగ్రీ స్థాయిలో సంబంధిత కోర్సులు చదివివుండాలి. కాలవ్యవధి ఏడాది. > పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఆర్కియాలజీ > పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియాలజీ కన్సర్వేషన్‌ మొదలైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

డిగ్రీ స్థాయిలో బీఏ (హిస్టరీ అండ్‌ ఆర్కియాలజీ; ఆర్కియాలజీ అండ్‌ ఏన్షియెంట్‌ హిస్టరీ; ఆర్కియాలజీ అండ్‌ మ్యూజియాలజీ; ఏన్షియెంట్‌ ఇండియన్‌ అండ్‌ ఏషియన్‌ స్టడీస్‌; ఇండియన్‌ కల్చర్‌ అండ్‌ ఆర్కియాలజీ) కోర్సులు ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. సెమిస్టర్ల విధానం ఉంటుంది. ఏదైనా గ్రూపుతో ఇంటర్మీడియట్‌/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు. 

పీజీ స్థాయిలో ఎంఏ, మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ కోర్సులు ఉన్నాయి. కోర్సుల కాలవ్యవధి రెండేళ్లు. ఆర్కియాలజీ, ఇండియన్‌ హిస్టరీ కల్చర్, ఆంత్రపాలజీ మొదలైన అంశాల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారు ఈ కోర్సులకు అర్హులు. 
చాలావరకూ సంస్థలు గత కోర్సుల్లో సాధించిన మార్కుల ఆధారంగా ప్రవేశాలను కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు మాత్రం ప్రత్యేకంగా ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్, కర్ణాటక

అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

యూనివర్సిటీ ఆఫ్‌ మద్రాస్, తమిళనాడు

లఖ్‌నవూ యూనివర్సిటీ, ఉత్తర్‌ప్రదేశ్‌

యూనివర్సిటీ ఆఫ్‌ దిల్లీ

యూనివర్సిటీ ఆఫ్‌ కోల్‌కతా

ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌

సెంటర్‌ఫర్‌ హెరిటేజ్‌ స్టడీస్, కేరళ

జివాజీ యూనివర్సిటీ, మధ్యప్రదేశ్‌

సోలాపూర్‌ యూనివర్సిటీ, మహారాష్ట్ర

బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆర్కియాలజీ, ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, దిల్లీ మొదలైనవి.

ఉద్యోగావకాశాలు

దేశంలో మంచి ఉద్యోగాలను అందించగల కెరియర్లలో ఇదీ ఒకటి. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలుంటాయి. ఎంపికైన సంస్థను బట్టి విధుల్లో కొంత తేడాలుంటాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్‌గానూ చేరొచ్చు. సొంతంగా పరిశోధన చేసుకునేవారూ ఎక్కువే. 

ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌; ఆర్కియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా, ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ కల్చరల్‌ రిలేషన్స్‌ (ఐసీసీఆర్‌), ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రిసెర్చ్‌ (ఐసీహెచ్‌ఆర్‌), ఇండియన్‌ నేషనల్‌ ట్రస్ట్‌ ఫర్‌ ఆర్ట్‌ అండ్‌ కల్చరల్‌ హెరిటేజ్‌ (ఐఎన్‌టీఏసీహెచ్‌), నేషనల్‌ ఆర్కైవ్స్‌ ఆఫ్‌ ఇండియా మొదలైన సంస్థల్లో, మ్యూజియాల్లో వీరికి అవకాశాలుంటాయి. సాధారణంగా వీరిని ఆర్కియాలజిస్ట్, హెరిటేజ్‌ మేనేజర్, హిస్టోరియన్, డాక్యుమెంట్‌ స్పెషలిస్ట్, మ్యూజియమ్‌ ఎడ్యుకేషన్‌ ఆఫీసర్‌ మొదలైన హోదాలతో ఉద్యోగాలకు ఎంపిక చేసుకుంటారు.

ఎంపికైన సంస్థ, హోదానుబట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. లెక్చరర్‌ హోదాకు ఎంపికైనవారికి వేతనం రూ.20,000 నుంచి ప్రారంభమవుతుంది. అసిస్టెంట్‌ ఆర్కియాలజిస్ట్‌గా ఎంపికైనవారు ప్రారంభ వేతనం రూ.15,000 వరకూ పొందుతారు. డాక్టరేట్‌ డిగ్రీ పొందినవారికి రూ.30,000 పైగా లభించే వీలుంది. అనుభవం ఆధారంగా మెరుగైన జీతభత్యాలను పొందొచ్చు.  

విధులేంటి?

పురావస్తు తవ్వకాల నిమిత్తం సరైన ప్రదేశాలను ఎంపిక చేయడం, జియో ఫిజికల్‌ సర్వేలు, ఏరియల్‌ ఫొటోగ్రఫీలను నిర్వహించడం.

వివిధ పత్రాల పరిశీలన, కళాఖండాలను భద్రపరచడంతోపాటు క్యాడ్, జీఐఎస్‌ వంటి కంప్యూటర్‌ అప్లికేషన్లను ఉపయోగించి వాటిని నమోదు చేయడం. ప్రదేశాలు, కనుగొన్న అంశాల వివరణలను జోడించడం, పూర్వ వైభవాలను రాత, ఫొటోగ్రఫిక్, డ్రాయింగ్‌ విధానాల్లో ఎలక్ట్రానిక్‌ డేటాబేస్‌ల్లో భద్రపరచడం.

సమాచార సేకరణ, విశ్లేషణల పరంగా రిపోర్టులు, పత్రికలు, మేగజీన్లలో ప్రచురణకు వ్యాసాలు రాయడంలో బృందానికి మార్గనిర్దేశం చేయడం, పర్యవేక్షించడం.

కనుగొన్న అంశాలను గణిత, గణాంక, కంప్యూటేషనల్‌ మోడలింగ్‌ విధానాల్లో నమోదు చేయడం.

Posted Date: 24-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌