• facebook
  • whatsapp
  • telegram

స‌రికొత్త కాంబినేష‌న్ల‌తో డిగ్రీ కోర్సులు

దోస్త్ - 2022 నోటిఫికేష‌న్ విడుద‌ల‌

రాష్ట్రంలో ఈసారి ఇంటర్‌ పాసైన 4.93 లక్షల మంది విద్యార్థుల్లో డిగ్రీలో చేరేవారు సుమారు 2.50 లక్షల మంది. వీరికోసం డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ (దోస్త్‌) నోటిఫికేషన్‌ తాజాగా విడుదలైంది. ఏటేటా కొత్త కోర్సులు...సరికొత్త కాంబినేషన్లతో దోస్త్‌ మరోసారి  విద్యార్థుల ముందుకొచ్చింది. బీఎస్‌సీ ఏఐ అండ్‌ ఎంఎల్‌ లాంటి ఎన్నో కోర్సులు ఈసారి అందుబాటులోకి వచ్చాయి. తొలిసారిగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (ఈడబ్ల్యూఎస్‌) 10 శాతం సీట్లు కేటాయించనున్నారు. మూడు విడతల్లో ప్రవేశాలు జరగనున్నాయి!  

చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) సెమిస్టర్‌ విధానం అమలుతో డిగ్రీ రూపులేఖలే మారిపోయాయి. రెండేళ్ల క్రితం నాలుగు పట్టికల్లో నుంచి మూడు సబ్జెక్టులను ఎంచుకునే బకెట్‌ విధానం, పలు కొత్త కోర్సులను ప్రవేశపెట్టారు. తమ కళాశాలలో విద్యార్థికి ఆసక్తి ఉన్న సబ్జెక్టు లేకుంటే మూక్స్‌ విధానంలో ఆన్‌లైన్‌ కోర్సును చదువుకునే అవకాశమూ కల్పించారు. గత దోస్త్‌కు హైదరాబాద్‌ నగరంలోని నాలుగు విశ్వవిద్యాలయాలూ, ప్రభుత్వ కళాశాలల్లో  ఆర్థిక శాస్త్రం, పొలిటికల్‌ సైన్స్‌ సబ్జెక్టుల్లో బీఏ ఆనర్స్‌ కోర్సును ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టారు. ఈసారి చరిత్ర సబ్జెక్టుకు దాన్ని విస్తరించారు. అంటే బీఏ ఆనర్స్‌ చరిత్ర అనే కోర్సు రాబోతోంది. కాకతీయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బీఏ ఆనర్స్‌ సోషియాలజీని ప్రవేశపెడుతున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో బీటెక్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ మెషిన్‌ లెర్నింగ్‌ (ఏఐ అండ్‌ ఎంఎల్‌) కోర్సు ఉండగా...ఈసారి కొత్తగా రాష్ట్రంలో బీఎస్‌సీ ఏఐ అండ్‌ ఎంఎల్‌ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. కళాశాల విద్యాశాఖ పరిధిలో మొత్తం 129 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా అందులో 11 కళాశాలలకు యూజీసీ నుంచి స్వయంప్రతిపత్తి హోదా ఉంది. వాటిల్లో ఈ కొత్త కోర్సును ప్రవేశపెడతారు. 

ప్రభుత్వ కళాశాలల్లో బీబీఏ లాజిస్టిక్, బీబీఏ, రిటైలింగ్, బీఎస్‌సీ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి.  

తొలిసారిగా రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు (ఈడబ్ల్యూఎస్‌)కు 10 శాతం కోటా అమలు చేయనున్నారు. దాని వల్ల ప్రముఖ కళాశాలల్లో సీట్లు పెరిగి నాణ్యమైన విద్య అందుతుంది. 

విద్యార్థుల సౌలభ్యం కోసం ఈసారి కళాశాలల చిరునామాలను జీపీఎస్‌ లొకేషన్‌తో అనుసంధానం చేస్తారు. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకునే ముందు ఆయా కళాశాలల వెబ్‌సైట్‌లోకి వెళితే ఆ కళాశాల ఎక్కడ ఉంది; ఇంటి నుంచి ఎంత దూరంలో ఉంటుందో కచ్చితంగా తెలుసుకొని కళాశాలను ఎంచుకోవచ్చు. 

ఒక సెక్షన్‌లో 15 మందిలోపే చేరితే ఒకటి, రెండు విడతల్లో విద్యార్థులకు సీట్‌ అలాట్‌మెంట్‌ ఉత్తర్వులోనే వేరే చోట చేరతారా? అని అడుగుతారు. మూడో విడతలో మాత్రం ఆ సెక్షన్‌ను రద్దు చేస్తారు. విద్యార్థులను మరో కళాశాలల్లో చేరుస్తారు. 

క్లస్టర్‌ విధానాన్ని అమలు చేయాలని గత ఏడాదే నిర్ణయించగా...అది ఈసారి కార్యరూపం దాల్చనుంది. 

సీబీఎస్‌ఈ, ఎస్‌బీటెట్, తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ (టాస్‌) బోర్డు విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తనిఖీ చేసేందుకు ఈసారి ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేదు. 

వెటర్నరీ డిప్లొమా విద్యార్థులు కూడా ఈసారి దోస్త్‌ ద్వారా డిగ్రీలో చేరొచ్చు. 

విభిన్న కాంబినేషన్లు  

బకెట్‌ సిస్టమ్‌ ద్వారా సబ్జెక్టులను ఎంచుకోవడంలో చాయిస్‌ పెరిగింది. ఉదాహరణకు హైదరాబాద్‌ నగరంలోని సిటీ కళాశాలలో బీఎస్‌సీ భౌతికశాస్త్రం విభాగంలో గతంలో ఏడు కాంబినేషన్లు ఉండగా ఇప్పుడు 23 కాంబినేషన్లకు పెరిగింది. గణితం+స్టాటిస్టిక్స్‌+డేటా సైన్స్‌(ఎంఎస్‌డీఎస్‌); గణితం, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌(ఎంఎస్‌సీఎస్‌); గణితం, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌(ఎంఈసీఎస్‌); గణితం, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌(ఎంపీసీఎస్‌) లాంటి కాంబినేషన్లు వచ్చాయి. బీఎస్‌సీ లైఫ్‌ సైన్స్‌ విభాగంలో మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, జెనెటిక్స్, అప్లెడ్‌ న్యూట్రిషన్‌ లాంటి పదుల సబ్జెక్టులున్నాయి. ఆసక్తిని బట్టి వాటిని ఎంచుకోవచ్చు. ఇక బీకాంలో జనరల్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, ఆనర్స్‌ కాకుండా బిజినెస్‌ అనలిటిక్స్, టాక్సేషన్‌ లాంటి కోర్సులు వచ్చాయి. ఆసక్తిని బట్టి ఆయా కాంబినేషన్లను ఎంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.  

పాటించ‌క‌పోతే న‌ష్టం

ప్రవేశ ప్రక్రియ ముగిసే వరకు విద్యార్థులు తమ దోస్త్‌ ఐడీ, పిన్, పాస్‌వర్డ్‌లను జాగ్రత్తగా, గోప్యంగా ఉంచాలి. వాటిని ఎవరితోనూ పంచుకోరాదు. 

దరఖాస్తు ఫారంలో అన్నీ సరైన వివరాలు నింపాలి. వివరాలు నింపాక సరిచూసుకోవాలి. ఒకసారి వివరాలు సమర్పించిన తర్వాత వాటిని మార్చలేం. 

ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ ద్వారా తమ సీటును (ఏ దశలోనైనా) ధ్రువీకరించే విద్యార్థులు సెప్టెంబరు 16 నుంచి 22వ తేదీ వరకు వ్యక్తిగతంగా కేటాయించిన కళాశాలను సందర్శించి ధ్రువపత్రాలను ప్రిన్సిపల్‌కు సమర్పించాలి. కళాశాల రుసుమును చెల్లించాలి. అప్పుడే మీ సీటు ధ్రువీకరించినట్లవుతుంది. కేవలం సెల్ఫ్‌ రిపోర్టింగ్‌తో సీటు 100 శాతం మీకు ఖరారైనట్లు కాదు. 

రిజర్వేషన్‌ కింద సీటు కేటాయించాలంటే మీ సేవా కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన కుల ధ్రువీకరణ పత్రం సమర్పించడం తప్పనిసరి.  అంతేకాదు 2021 ఏప్రిల్‌ 1వ తేదీ, ఆ తర్వాత తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.

ఇదీ రిజిస్ట్రేషన్‌ విధానం  

విద్యార్థులు ఎవరి ప్రమేయం లేకుండా సులువుగా తమ డిగ్రీ అడ్మిషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. https://dost.cgg.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించి తమ ఇంటర్‌ హాల్‌ టికెట్‌ నంబరు ద్వారా లాగిన్‌ అయి పేరు నమోదు చేసుకోవచ్చు. ఆధార్‌ సంఖ్యతో అనుసంధానం చేసిన మొబైల్‌ ఉంటే చాలు. రూ.200 చెల్లించడం ద్వారా రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. ఆ తర్వాత దోస్త్‌ ఐడీ పిన్‌/పాస్‌వర్డ్‌ వస్తుంది. దరఖాస్తు ఫారం తెరవడానికి వాటిని ఉపయోగించాలి. సీట్ల కేటాయింపునకు ముందు నాలుగు దశలుంటాయి. 1. విద్యార్థి రిజిస్ట్రేషన్‌ 2. ఆన్‌లైన్‌ ఫీజు చెల్లింపు 3. దరఖాస్తు ఫారమ్‌ నింపడం 4. వెబ్‌ ఆప్షన్లు. అయిదో దశలో సీట్లు కేటాయిస్తారు. ఒకవేళ ఆధార్‌ నంబరుతో అనుసంధానం చేసిన మొబైల్‌ లేకుంటే అన్ని జిల్లాల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన సహాయ కేంద్రాలకు వెళ్లి అక్కడి సిబ్బంది సహకారం తీసుకోవచ్చు. 

3 విడతల్లో దోస్త్‌... 

మొదటి విడత రిజిస్ట్రేషన్‌: 

జులై 1 నుంచి 30 వరకు (రూ.200 రుసుం) 

వెబ్‌ ఆప్షన్లు: జులై 6 - 30 వ తేదీ వరకు  

‣ సీట్ల కేటాయింపు: ఆగస్టు 6వ తేదీ 

‣ సీట్లు పొందినవారు ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: ఆగస్టు 7 నుంచి 18 వరకు 

రెండో విడత రిజిస్ట్రేషన్‌: 

ఆగస్టు 7-21వ తేదీ వరకు 

వెబ్‌ ఆప్షన్లు: ఆగస్టు 7-22వ తేదీ వరకు 

సీట్ల కేటాయింపు: ఆగస్టు 27వ తేదీ 

మూడో విడత రిజిస్ట్రేషన్లు, వెబ్‌ ఆప్షన్లు: 

ఆగస్టు 29 నుంచి సెప్టెంబరు 12 

సీట్ల కేటాయింపు: సెప్టెంబరు 16న  

అన్ని విడతల్లో సీట్లు పొందిన ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌: సెప్టెంబరు 16- 22వ తేదీ వరకు 

‣ ఓరియంటేషన్‌:  సెప్టెంబరు 23-30 వరకు 

తరగతుల ప్రారంభం:  అక్టోబరు 1 నుంచి 

కళాశాలలు...సీట్లు

దోస్త్‌ ద్వారా ప్రవేశాలు: 7 వర్సిటీల పరిధిలో. ఓయూ, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, మహాత్మాగాంధీ, పాలమూరు, తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం. 

కళాశాలలు: ప్రభుత్వ, వర్సిటీలు, ప్రైవేట్‌ కళాశాలలు 1080  

మొత్తం సీట్లు: 4.68 లక్షలు. ఇంకా కొన్ని పెరిగే అవకాశం ఉంది. 

కోర్సులు: బీఏ, బీకాం, బీఎస్‌సీ, బీఎస్‌సీ డేటా సైన్స్, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌. అంతేకాకుండా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి(ఎస్‌బీటెట్‌) ఆధ్వర్యంలో నడిచే పాలిటెక్నిక్‌ కళాశాలల్లోని డీ ఫార్మసీ, డిప్లొమా ఇన్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కేటరింగ్‌ టెక్నాలజీ(డీహెచ్‌ఎంసీటీ) కోర్సుల్లో సీట్లను కూడా దోస్త్‌ ద్వారానే భర్తీ చేస్తున్నారు. 

- పెమ్మసాని బాపనయ్య, ఈనాడు, హైదరాబాద్‌  

ఆసక్తిని బట్టి ఆప్షన్లు  ఇచ్చుకోండి  

- ఆచార్య ఆర్‌.లింబాద్రి, కన్వీనర్, దోస్త్‌

రాష్ట్రంలో డిగ్రీలో ఎన్నో కొత్త కోర్సులూ, సబ్జెక్టులూ వచ్చాయి. గతంలో మాదిరిగా మూడు సబ్జెక్టుల కాంబినేషన్లకే డిగ్రీ పరిమితం కాలేదు. బకెట్‌ విధానంతో ఒక్క కోర్సుకు పదుల సబ్జెక్టులు అందుబాటులో ఉన్నాయి. వెబ్‌ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఆసక్తులను బట్టి కోర్సులూ, సబ్జెక్టులూ ఎంచుకోండి. మొదటి విడతలోనే పోటీపడితే ఉత్తమ కళాశాలల్లో సీట్లు వస్తాయి. చివరి విడతలో వస్తే ఇంటర్‌లో మంచి మార్కులు సాధించినవారికైనా ప్రముఖ కళాశాలల్లో సీటు లభించడం కష్టం. 

మరోవైపు యాజమాన్యాల ప్రలోభాలకు లొంగి నాసిరకం కళాశాలల్లో చేరవద్దు. దోస్త్‌ వల్ల ఏటూరునాగారం విద్యార్థి కూడా హైదరాబాద్‌ నిజాం కళాశాలలో సీటు కోసం ప్రయత్నించవచ్చు. డిగ్రీ విద్యార్థులకు కూడా ప్రాంగణ నియామకాలు పెరుగుతున్నందున డిగ్రీలో చేరే విద్యార్థులు కూడా ఏటా పెరుగుతున్నారు. 

Posted Date: 11-07-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌