• facebook
  • whatsapp
  • telegram

ప్రసిద్ధ సంస్థల్లో ప్రవేశానికి... యూగాట్  

ప్రతిష్ఠాత్మక కళాశాలల్లో గ్రాడ్యుయేషన్‌ స్థాయిలోనే బీబీఏ, బీబీఎం, ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ తదితర కోర్సులను చదవటానికి రాయాల్సిన పరీక్ష అండర్‌ గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (యూజీఏటీ). ఐమా (ఆలిండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌) ఏటా ఈ పరీక్షను నిర్వ‌హిస్తుంది.  బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఐటీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ తదితర కోర్సుల్లో కూడా యూగాట్‌ స్కోరు ద్వారా సీట్లు పొందవచ్చు.గత ఏడాది ‘యూగాట్‌' స్కోరు ఆధారంగానే న్యూదిల్లీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, నోయిడాలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, డెహ్రాడూన్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ మొదలైన ఉత్తమ విద్యాలయాల్లో సీట్లను భర్తీచేశారు. 

పరీక్షా విధానం
ఇంటిగ్రేటెడ్‌ ఎంబీఏ, బీబీఏ, బీసీఏ తదితర కోర్సులకు పోటీపడేవారి కోసం ఇంగ్లిష్‌, న్యూమరికల్‌ అండ్‌ డాటా అనాలిసిస్‌, రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌, జనరల్‌ నాలెడ్జ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంగ్లిష్‌ నుంచి మాత్రమే 40 ప్రశ్నలు వస్తాయి. మిగతా వాటిలో ఒక్కో విభాగం నుంచి 30 చొప్పున ప్రశ్నలు ఇస్తారు. అంటే మొత్తం 130 ప్రశ్నలుంటాయి. అన్ని ప్రశ్నలూ ఆబ్జెక్టివ్‌ తరహాలోనే ఉంటాయి.


ఎలా తయారవ్వాలి?
ఈ పరీక్ష రాయబోయేవారిలో రెండు రకాలవారుంటారు. 1) ఇంటర్మీడియట్‌ రెండో ఏడాది చదువుతున్నవారు 2) ఇంటర్‌ పూర్తిచేసి యూజీఏటీ పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు. ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నవారు తమ ప్రణాళిక పక్కాగా వేసుకోవాలి. అకడమిక్‌ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సమయపాలన విధిగా పాటించాల్సివుంటుంది.

ఇంగ్లిష్‌: దీనిలో సాధారణంగా ప్రశ్నలు ఒకాబులరీ, గ్రామర్‌ ఆధారంగా ఉంటాయి. ఇంటర్లో తీసుకున్న గ్రూపుతో నిమిత్తం లేకుండా అందరికీ ఇంగ్లిష్‌ ఉంటుంది. అయితే ఒకరకంగా పోటీపరీక్షలో వచ్చే ప్రశ్నలకూ, అకడమిక్‌ పరీక్షలకూ కచ్చితంగా తేడా ఉంటుంది. ఈ పరీక్షలో ఇంగ్లిష్‌ యూసేజ్‌పై, గ్రామర్‌పై ఎక్కువ దృష్టి కేంద్రీకరిస్తారు. యాక్టివ్‌- పాసివ్‌ వాయిస్‌, పార్ట్స్‌ ఆఫ్‌ స్పీచ్‌, డైరెక్ట్‌-ఇన్‌డైరెక్ట్‌ స్పీచ్‌, వాక్యనిర్మాణం అంశాల ద్వారా వ్యాకరణంపై ఉన్న పట్టునూ, కాంప్రహెన్షన్‌ ద్వారా భాష అర్థం చేసుకునే తీరునూ పరీక్షిస్తారు. పదసంపదపైనా ప్రశ్నలు వస్తాయి. ముందుగా అభ్యర్థులు గ్రామర్‌పై శ్రద్ధ పెట్టాలి. ఇంటర్‌ రెండో సంవత్సరం పరీక్షలు రాసేవారికి ఎలాగూ అకడమిక్‌ పరీక్ష రాసేటప్పుడు అవన్నీ చదవాల్సివుంటుంది. అంటే అదనంగా ఎలాంటి సమయమూ కేటాయించాల్సిన పని లేదు. ఇంటర్‌ పరీక్ష రాయని విద్యార్థులు మాత్రం కేవలం 7-10 రోజుల వ్యవధిలోనే ఈ అంశాలపై పట్టు సాధించాల్సివుంటుంది. తర్వాత, చిన్నపాటి పారాగ్రాఫ్‌లను చదువుతూ, వాటికింద ఉండే ప్రశ్నలకు సమాధానాలు కనుగొనాలి. ప్రారంభంలో సమయంపై దృష్టి కేంద్రీకరించాల్సిన పని లేదు. పారాగ్రాఫ్‌లో ప్రశ్నలు అడిగే కోణాలు, ప్రశ్నించే తీరును అవగాహన చేసుకుంటే తర్వాత సమయపాలనపై దృష్టి సారించవచ్చు. సాధ్యమైనన్ని ఎక్కువ పారాగ్రాఫులను సాధన చేయటం మేలు.

న్యూమరికల్‌ అండ్‌ డాటా అనాలిసిస్‌: ఇందులో ముందుగా న్యూమరికల్‌ అంశానికి సంబంధించి శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే మిగతా అంశంలో వచ్చే ప్రశ్నలన్నీ న్యూమరికల్‌ ఎబిలిటీతో సంబంధం ఉన్నవే. ఇందులో లీనియర్‌ ఈక్వేషన్స్‌, న్యూమరికల్‌ కాల్‌క్యులేషన్స్‌, మేట్రిసెస్‌, స్కేలార్స్‌, వెక్టార్స్‌, బేసిక్‌ ప్రాపర్టీస్‌ ఆఫ్‌ సెట్స్‌ అండ్‌ గ్రూప్స్‌, కోఆర్డినేట్‌ సిస్టమ్స్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ముందుగా ఆయా అధ్యాయాల భావనలను అధ్యయనం చేయాలి. సాధారణంగా ఎక్కువమంది విద్యార్థులు ఈ కాన్సెప్టులను విస్మరిస్తారు. ఇది సరికాదు. ప్రశ్న ఏ రీతిలో వచ్చినా జవాబు గుర్తించాలంటే ముందుగా అన్ని అంశాలపైనా పట్టు పెంచుకోవాలి. అవసరమైతే ఆరోతరగతి స్థాయి గణిత పుస్తకాలను కూడా చదవాల్సివుంటుంది. దీంతో కాన్సెప్టులపై పూర్తిస్థాయి అవగాహన ఏర్పడుతుంది. ఆ తర్వాత ఒక గణిత అంశానికి సంబంధించి ఎన్ని కోణాల్లో ప్రశ్నలు వేస్తారో ఆలోచించుకుంటూ సిద్ధం అయితే అంశాలపై పూర్తి అవగాహన వస్తుంది.

రీజనింగ్‌ అండ్‌ జనరల్‌ ఇంటలిజెన్స్‌: సిలబస్‌లో భాగంగా ఉండని అంశమిది. ఇందులో పజిల్స్‌తో పాటు ఆడ్‌మన్‌ అవుట్‌, నంబర్‌ సిరీస్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇంకా బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌ మొదలైనవి ఉంటాయి. ముందుగా ఈ అధ్యాయాల ప్రాథమిక అంశాలు చదవాలి. ఆపై నిత్యం సాధ్యమైనన్ని ప్రశ్నలను సాధన చేయాలి. రిడిల్స్‌ పైన కూడా రీజనింగ్‌లో ప్రశ్నలుంటాయి. పొడుపు కథల (రిడిల్స్‌)పై అవగాహనకు ఈ ప్రశ్న చూడండి- I have head and tail, but I don't have body, who am I? . దీనికి సమాధానం Coin (నాణెం). ఈ తరహా ప్రశ్నలు కూడా తరచూ అడుగుతూ ఉంటారు. రిడిల్స్‌పై ప్రత్యేకంగా పుస్తకాలూ, చాలా వెబ్‌సైట్లూ ఉన్నాయి. ప్రామాణిక పుస్తకాలను తీసుకుని సిద్ధం కావాలి.

జనరల్‌ నాలెడ్జ్‌: జనరల్‌ అవేర్‌నెస్‌, సోషల్‌ డెవలప్‌మెంట్‌, ఆర్థిక విదేశీ సంబంధాల అంశాలు, వ్యాపార విషయాల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. దీనిలో భాగంగా ఉన్నతస్థాయి హోదాల్లో ఉన్న వ్యక్తులు, ఆయా హోదాల్లో తొలిసారిగా నియమితులైనవాళ్ళు, ప్రపంచంలో ఎత్తయినవీ, లోతైనవీ మొదలైనవాటిపై శ్రద్ధపెట్టాలి. అవార్డులూ, అవి పొందిన వ్యక్తులకు సంబంధించిన సమాచారం కీలకమైనదే. ఇటీవలి కాలంలో ప్రారంభించిన పథకాలు, వివిధ సామాజిక అంశాలు (పేదరికం, నిరుద్యోగం) మొదలైనవి పరిశీలించాలి.
ఇంటర్మీడియట్‌ స్థాయిలో ఈ అంశాలకు సంబంధించి ఉన్న సమాచారం ఆధారంగా సిద్ధమైతే సరిపోతుంది. మంచి ప్రచురణసంస్థల ఇయర్‌బుక్‌ చదవటం ప్రయోజనకరం. అందులో జనరల్‌ నాలెడ్జ్‌తో పాటు సాంఘిక అంశాలు, పథకాలను కూడా చర్చిస్తారు కాబట్టి ప్రయోజనకరం. వర్తమాన అంశాల్లో... వార్తల్లో నిలిచిన వ్యక్తులు, ఆర్థిక వ్యాపార అంశాలపై దృష్టి సారించాలి.


 

వేగం, సమయపాలన ముఖ్యం 
 పరీక్ష సమయం కేవలం 2 గంటలు. అంటే 120 నిమిషాలు. ఇంత తక్కువ వ్యవధిలో పూర్తిచేయాల్సిన ప్రశ్నలు 130. వేగంగా సమాధానాలు గుర్తించటం తప్పనిసరి.
 తప్పు సమాధానానికి నెగిటివ్‌ మార్కులుంటాయి. వూహించి సమాధానాలు పెట్టడం ప్రమాదకరం.
 సమయపాలన కీలకం. క్లిష్టమైన అంశాలకు సన్నద్ధతలోనూ, పరీక్షలోనూ ఎక్కువ సమయం కేటాయించాలి.
 ఇంగ్లిష్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండటంతోపాటు (40 ప్రశ్నలు) చిన్న తరగతుల నుంచి చదివిన జ్ఞానం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత ఎక్కువగా ఈ అంశంలో సిద్ధం కావాలి.
 బీహెచ్‌ఎం పరీక్షకు సిద్ధమయ్యేవారికి నాలుగు విభాగాలతో పాటు సర్వీస్‌ ఆప్టిట్యూడ్‌, సైంటిఫిక్‌ ఆప్టిట్యూడ్‌ అనే మరో రెండు విభాగాలపై ప్రశ్నలుంటాయి. ఇందులో ఒక్కో విభాగం నుంచి 25 చొప్పున మొత్తం 50 ప్రశ్నలు వస్తాయి.
 పరీక్ష ఆన్‌లైన్లో, ఆఫ్‌లైన్లో కూడా ఉంటుంది. విద్యార్థి తన అనుకూలతను బట్టి ఏదో ఒక రీతిలో పరీక్ష రాయొచ్చు. దరఖాస్తులోనే ఆ అంశాన్ని పేర్కొనాల్సివుంటుంది.
ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నవారు తమ సన్నద్ధత ప్రణాళికను పకడ్బందీగా వేసుకోవాలి. వార్షిక పరీక్షలు ఉన్న నేపథ్యంలో వారు సమయపాలన విధిగా పాటించి, తయారవ్వాల్సి ఉంటుంది.

Posted Date: 21-10-2020


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌