• facebook
  • whatsapp
  • telegram

గురుకుల విధానం

విద్యార్థులకు ప్రామాణికమైన విద్యను అత్యంత ప్రశాంత వాతావరణంలో అందించాలనే ఆలోచనతో గురుకుల విద్యాలయాలు 1972లో ఏర్పాటయ్యాయి. పట్టణాలు, నగరాలకు దూరంగా, విద్యకు ఎటువంటి ప్రతిబంధకాలూ లేని ప్రాంతాల్లో ప్రత్యేక సదుపాయాలను కల్పించి, విద్యార్థుల ఏకాగ్రతను పెంచే దిశగా ఇవి పనిచేస్తున్నాయి. సత్ఫలితాలను సాధిస్తున్నాయి. దీంతో గురుకుల విద్యాలయాల పట్ల ఆదరణ పెరిగింది.

రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలల్లో ఎంపిక ప్రవేశపరీక్ష ద్వారా ఉంటుంది. ఈ కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులకు సొసైటీ ఉచిత విద్య, హాస్టల్ సౌకర్యాలను కల్పిస్తోంది. ఎక్కడా రాజీపడకుండా నాణ్యమైన విద్యను అందిస్తోంది. పేద విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీస్తున్నాయి.

గురుకుల విద్యాలయాల్లో విద్యార్థుల దినచర్య ఉదయాన్నే 5 గంటలకు ప్రారంభమవుతుంది. అనుభవజ్ఞులైన ఫిజికల్ డైరెక్టర్ పర్యవేక్షణలో యోగా, మాస్ డ్రిల్, తదితర వ్యాయామ కార్యక్రమాలు నిర్వహిస్తారు. తద్వారా విద్యార్థుల్లో శారీరక ధారుఢ్యం, ఏకాగ్రత, మానసిక సామర్థ్యం పెంపొందించడానికి కృషిచేస్తారు. తర్వాత ప్రతిభ, నైపుణ్యం, అనుభవం, అంకితభావం గల అధ్యాపకుల ద్వారా తరగతుల్లో బోధన ఉంటుంది. ప్రతి అధ్యాపకుడు 20 మంది విద్యార్థులకు 'లోకో పేరెంట్‌గా వ్యవహరిస్తూ, ఇటు అధ్యాపకుని పాత్ర అటు తల్లిదండ్రుల పాత్రను పోషిస్తారు. ఎలాంటి శారీరక, మానసిక రుగ్మతలు రాకుండా ఆరోగ్యానికి, విద్యావ్యాసంగానికి అవసరమైన సలహాలు, సూచనలు ఇస్తుంటారు.

పరీక్షా విధానం: కోర్సుల్లో ఏటా నాలుగు యూనిట్ పరీక్షలు, త్రైమాసిక, అర్ధసంవత్సర పరీక్షలు నిర్వహిస్తారు. డిసెంబరు నుంచి ఫిబ్రవరి వరకు సంస్థలోని అన్ని జూనియర్ కళాశాలలకు ఒకే విధంగా Intensive Testing Programme (ITP) ఉంటుంది. అందులో భాగంగా రెండు పార్ట్ టెస్టులు, రెండు గ్రాండ్ టెస్ట్‌లను పబ్లిక్ పరీక్షల పద్ధతిలో నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో వచ్చిన మార్కులను ఎప్పటికప్పుడు ప్రోగ్రెస్ రిపోర్టు ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు లోకో పేరెంట్స్ తెలియజేస్తారు. సెంట్రల్ మార్క్ రిజిస్టర్ ఆధారంగా ప్రధానాచార్యులు, సహాయ ప్రధానాచార్యులు, సంబంధిత అధ్యాపకులు విద్యార్థుల స్థాయిని తెలుసుకుంటూ, అవసరమనుకున్న వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తారు.

ఎంసెట్ శిక్షణ: అన్ని జూనియర్ కళాశాలల్లోని MPC, BiPC విద్యార్థులకు EAMCET కు సంబంధించిన ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఉచితంగా ఎంసెట్ స్టడీ మెటీరియల్ అందించడంతోపాటు మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు. పేద విద్యార్థులు EAMCET లో మంచి ర్యాంకులు సాధించి ప్రయోజనం పొందడానికి ఈ శిక్షణ ఉపయోగపడుతుంది. ఇదే పద్ధతిలో MEC, CEC విద్యార్థులకు CPT మోడల్ పరీక్షలు నిర్వహిస్తారు.

గ్రంథాలయాలు: ప్రతి జూనియర్ కళాశాలలో మంచి గ్రంథాలయాలు ఉన్నాయి. పాఠ్యపుస్తకాలతోపాటు జనరల్ స్టడీస్, రిఫరెన్స్ పుస్తకాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు వీటిలో ఉంటాయి. తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో వెలువడే ముఖ్యమైన దిన, వార, పక్ష, మాస పత్రికలు కూడా అందుబాటులో ఉంటాయి.

వ్యాయామ విద్య: రోజువారీ వ్యాయామ విద్యతోపాటు విద్యార్థుల ఆసక్తిననుసరించి ఆయా క్రీడల్లో ప్రత్యేక శిక్షణనిచ్చి జిల్లా, రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనడానికి ప్రోత్సహిస్తారు. ఈ పోటీల్లో రాణించిన విద్యార్థులకు లభించే సర్టిఫికెట్లు భవిష్యత్తు ఉన్నత చదువులు, ఉద్యోగాల్లో ఉపయోగపడతాయి.
కొన్ని కళాశాలల్లో ఇద్దరు అధ్యాపకుల ఆధ్వర్యంలో NCC, NSS విభాగాలు పనిచేస్తున్నాయి. NCC-B సర్టిఫికెట్, NSSలో ఇచ్చే స్పెషల్ క్యాంపు సర్టిఫికెట్‌లు విద్యార్థులకు క్రమశిక్షణను అలవర్చడంతోపాటు మంచి కెరియర్‌కు తోడ్పడతాయి.
చదువుతోపాటు విద్యార్థుల క్రమశిక్షణకు గురుకుల కళాశాలల్లో ప్రాధాన్యం ఇస్తారు. గాంధేయ విధానాన్ని అనుసరించి విద్యార్థులు వారి పనులను వారే చేసుకుంటారు. శుభ్రత, భోజనం, మెస్‌ల నిర్వహణలో విద్యార్థులు పాల్గొని బాధ్యత, విధులు, కార్యనిర్వహణ పట్ల అవగాహన పెంపొందించుకునే వీలుంటుంది.
కళాశాలలన్నీ గ్రామీణ వాతావరణంలో ఉంటాయి. అందువల్ల విద్యార్థులతో మొక్కలు నాటించడం, వాటి రక్షణ బాధ్యతను వారికే అప్పగించడం ద్వారా కళాశాలల్లో ఆహ్లాదకర వాతావరణంలో నేర్చుకోవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు.
ఏటా ఒకసారి విజ్ఞాన, విహార యాత్రకు విద్యార్థులను అధ్యాపకులు తీసుకెళ్తారు. తద్వారా విద్యార్థుల్లో విజ్ఞానం, మనోవికాసం పెంపొందడానికి అవకాశం ఉంటుంది.

Posted Date: 20-10-2020


 

టెన్త్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌