• facebook
  • whatsapp
  • telegram

విమానాశ్రయాల్లో విలువైన కొలువులు

విమానం అనగానే చిన్నా పెద్దా అంతా ఆసక్తిగా తలెత్తి చూస్తారు. మరి ఆ విమానానికి సంబంధించిన ఉద్యోగం అంటే మరింత ఉత్సాహం కనిపిస్తుంది. దర్పానికి మారుపేరులా కనిపించే విమానాశ్రయంలో పైలట్ల వంటివే కాకుండా ఇంకా ఎన్నో రకాల పోస్టులు ఉన్నాయి. నిర్వహణ, ఆతిథ్యం, చెకింగ్‌, ఇతర విధులను నిర్వహించడానికి సుశిక్షితులైన సిబ్బంది కావాలి. ఆ అవకాశాలను అందుకోవాలంటే పలు రకాల కోర్సులు చేయాలి.

యువతలో ఎక్కువమందిని ఆకర్షిస్తూ మంచి జీతభత్యాలను అందించేదిగా వైమానిక రంగానికి పేరు. డొమెస్టిక్‌ ఏర్‌లైన్స్‌, ఆధునిక విమానాశ్రయాల్లో ఎఫ్‌డీఐలు, నూతన సాంకేతికతల కారణంగా దీనిలో నిరంతర అభివృద్ధి సాధ్యమవుతోంది. 2020 నాటికి విమానయాన రంగంలో ప్రపంచవ్యాప్తంగా మనదేశం మూడో స్థానానికి చేరుతుందని అంచనా. రానున్న ఐదేళ్లలో దేశంలోని ఏవియేషన్‌ పరిశ్రమలో రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు సాధించనున్నట్టు డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ అండ్‌ ప్రమోషన్‌ (డీఐపీపీ) తెలిపింది. దీనిలో పౌర వైమానిక రంగానిది ప్రత్యేకస్థానం. మిలిటరీ మినహా మిగిలిన ప్రైవేటు, వ్యాపార సంబంధ విమానాలన్నీ పౌర వైమానిక రంగం కిందకి వస్తాయి.

వైమానిక రంగం అనగానే మొదట గుర్తొచ్చేది పైలట్లు, ఆపై ఏర్‌హోస్టెస్‌లు. కానీ, ఒక విమాన ప్రయాణానికి ఇంకెంతమంది కృషో అవసరమవుతుంది. మరెంతమందో తెరవెనుక పనిచేస్తారు. ప్రతి ఏర్‌పోర్ట్‌లో వీరి అవసరం తప్పక ఉంటుంది. ఈ రంగంపై ఆసక్తి ఉండి, దానిలోనే కెరియర్‌ ప్రారంభించాలనుకునేవారు వీటిని ప్రయత్నించవచ్చు. ఫ్రెషర్ల నుంచి అనుభవమున్నవారి వరకు ఈ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. అందుకు తగ్గట్టుగానే వివిధ సంస్థలు కోర్సులను అందిస్తున్నాయి.

డిగ్రీ, డిప్లొమా కోర్సులకు ఇంటర్‌ లేదా తత్సమానవిద్య 50% మార్కులతో పూర్తిచేసుండాలి. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుకి ఏదేని డిగ్రీ పూర్తిచేసుండాలి. ఈ కోర్సుల్లోకి కొన్ని సంస్థలు ప్రత్యేక ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తాయి. కొన్నింటిల్లో గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల ఆధారంగా ప్రవేశాలు జరుగుతున్నాయి. కొన్నింటిలో అందిన దరఖాస్తుల్లో మెరిట్‌ ఆధారంగా ఎంపిక చేసి, వారికి ఇంటర్వ్యూ నిర్వహించి కోర్సుల్లోకి ప్రవేశం కల్పిస్తున్నారు.

ఏర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌

ఈ రంగంలోని వాణిజ్య ప్రణాళికలు, వ్యూహాల అమలు గురించి ఈ కోర్సులో నేర్చుకోవచ్చు. సమస్యా పరిష్కార, నాయకత్వ లక్షణాలు, త్వరగా నిర్ణయాలు తీసుకునే చాకచక్యం, భిన్న వ్యక్తులతో వ్యవహరించగల నేర్పు ఉంటే దీనిలో రాణిస్తారు.

దీనిలో డిగ్రీ స్థాయిలో బీబీఏ-ఏర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు, డిప్లొమా స్థాయిలో.. డిప్లొమా ఇన్‌ ఏర్‌లైన్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ ఏర్‌లైన్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఇంటర్నేషనల్‌ ఏర్‌లైన్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులున్నాయి. కాలవ్యవధి...డిగ్రీ కోర్సులకు మూడేళ్లు, డిప్లొమా కోర్సులకు ఏడాది.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* స్పైస్‌ కింగ్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, విజయవాడ

* యూనివర్సల్‌ ఏవియేషన్‌ అకాడమీ, చెన్నై

* అకాడమీ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌, కేరళ

* ఏర్‌వింగ్‌ అకాడమీ, త్రివేండ్రం

* పారడైజ్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, కోజికోడ్‌, కేరళ

* స్కూల్‌ ఆఫ్‌ ఏర్‌లైన్స్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, కొచ్చి

ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌

ఇదో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు. ఏర్‌పోర్ట్‌ ప్లానింగ్‌, సెక్యూరిటీ, ప్యాసెంజర్‌ ఫోర్‌కాస్టింగ్‌, ఏరోడ్రోమ్‌ వర్క్స్‌, ఫైర్‌ సేఫ్టీ, ప్రమాదకర వస్తువులు మొదలైన ఇతర సంబంధిత అంశాల గురించి ఈ కోర్సులో నేర్చుకుంటారు. మార్పులకు అనుగుణంగా తమను తాము మార్చుకోగల, సమస్యలను త్వరితగతిన గుర్తించి వాటికి పరిష్కారాలను సూచించగల, మేనేజీరియల్‌ బాధ్యతలపై అవగాహన ఉన్నవారు ఎంచుకోవచ్చు.

దీనిలో బీబీఏ-ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు, డిప్లొమా ఇన్‌ ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొఫెషనల్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కస్టమర్‌ కేర్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిగ్రీ కోర్సు వ్యవధి మూడేళ్లు. డిప్లొమా, ప్రొఫెషనల్‌ కోర్సుకు ఏడాది. సర్టిఫికేషన్‌ కోర్సు వ్యవధి- ఆరు నెలలు.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* స్కూల్‌ ఆఫ్‌ ఏర్‌లైన్స్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, కొచ్చి

* ఫ్లయింగ్‌ గూస్‌ ఏవియేషన్‌ అకాడమీ, కొచ్చి

* ఏర్‌వింగ్‌ అకాడమీ, త్రివేండ్రం

* అకాడమీ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌, కాలికట్‌

* ఇండియన్‌ ఏవియేషన్‌ అకాడమీ, ముంబయి

* ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌, బెంగళూరు

* ఆప్‌టెక్‌ ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ అకాడమీ, హైదరాబాద్‌

* పాట్రియాట్‌ ఏవియేషన్‌ కాలేజ్‌, త్రిశూర్‌.

ఏవియేషన్‌

ఇది కొద్దిగా ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులాగానే ఉంటుంది. దీనిలో ట్రావెలింగ్‌, టూరిజానికి సంబంధించిన అంశాలూ ఉంటాయి. ఏర్‌పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు మార్కెటింగ్‌, ప్లానింగ్‌, పాలసీల గురించి తెలుసుకుంటారు.

బీబీఏ-ఏవియేషన్‌, బీబీఏ-ఏవియేషన్‌ అండ్‌ ట్రావెల్‌ టూరిజం, బీఎస్‌సీ ఏవియేషన్‌ కోర్సులున్నాయి. అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌, డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌, డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌, డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ కోర్సులూ, పీజీ స్థాయిలో ఎంఎస్‌సీ- ఏవియేషన్‌, ఎంబీఏ-ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌, పీజీ డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులున్నాయి. డిప్లొమాల వ్యవధి 6 నెలల నుంచి ఏడాది.

అందిస్తున్న ప్రముఖ కళాశాలలు:

* ఉస్మానియా యూనివర్సిటీ, హైదరాబాద్‌ (ఫ్లయింగ్‌ ఏవియేషన్‌ అకాడమీ) ‌

* ఎంజీఆర్‌ (డీమ్డ్‌) యూనివర్సిటీ, తమిళనాడు

* యూనివర్సల్‌ ఏవియేషన్‌ అకాడమీ, చెన్నై ‌

* సన్‌ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌

* జీడీ గోయెంకా యూనివర్సిటీ, గుడ్‌గావ్‌

* గల్గోతియా యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌, నోయిడా

* ట్రావెన్‌కోర్‌ బిజినెస్‌ అకాడమీ, కొల్లం

* యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌, డెహ్రాడూన్‌ ‌

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లాజిస్టిక్స్‌ అండ్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌, అహ్మదాబాద్‌, ముంబయి ‌

* ఆంధ్రప్రదేశ్‌ ఏవియేషన్‌ అకాడమీ, హైదరాబాద్‌

గ్రౌండ్‌ స్టాఫ్

ఏర్‌పోర్ట్‌ల్లో నిర్వహించే విధులూ, సేవల గురించి నేర్పుతారు. బ్యాగేజ్‌ హ్యాండ్లింగ్‌, గ్రౌండ్‌ హాండ్లింగ్‌, ఎక్విప్‌మెంట్‌ మొదలైన వాటి గురించి తెలియజేస్తారు. టికెట్‌ చెకింగ్‌, ఏర్‌క్రాఫ్ట్‌కు పార్కింగ్‌ స్పేస్‌ను చూపించడం, ప్రయాణికులకు మార్గం చూపించడం వంటివీ నేర్పుతారు. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు, 2-3 భాషలపై పట్టు వంటి నైపుణ్యాలున్నవారు ఎంచుకోవచ్చు.

డిప్లొమాల వ్యవధి ఏడాది. సర్టిఫికెట్‌ కోర్సుల వ్యవధి మూడు నుంచి ఆరు నెలలు. డిప్లొమా ఇన్‌ ఏవియేషన్‌ గ్రౌండ్‌ హాండ్లింగ్‌, డిప్లొమా ఇన్‌ ప్రొఫెషనల్‌ గ్రౌండ్‌ స్టాఫ్‌ సర్వీసెస్‌, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ సర్వీసెస్‌ కోర్సులూ, సర్టిఫికెట్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ గ్రౌండ్‌ సర్వీసెస్‌, సర్టిఫికెట్‌ ఇన్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ అండ్‌ కంప్యూటర్‌ రిజర్వేషన్‌ సిస్టమ్‌ వంటివి ఉన్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* ఏర్‌వింగ్‌ అకాడమీ, త్రివేండ్రం

* ఇందిరాగాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోనాటిక్స్‌, ఘజియాబాద్‌, చండీగఢ్‌, జయపుర

* జేటీ ఏవియేషన్‌ అకాడమీ, కోల్‌కతా

* పారడైజ్‌ ఏవియేషన్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, కోజికోడ్‌

* పాటియాలా ఏవియేషన్‌ క్లబ్‌, పాటియాలా

* పాట్రియాట్‌ ఏవియేషన్‌ కాలేజ్‌, త్రిశూర్‌

* ఫ్రాంక్లిన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏర్‌హోస్టెస్‌ ట్రైనింగ్‌, ముంబయి, న్యూదిల్లీ

ఏవియేషన్‌ హాస్పిటాలిటీ

ఏవియేషన్‌ హాస్పిటాలిటీ, ఫారెన్‌ లాంగ్వేజెస్‌, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ ప్రొడక్షన్‌తోపాటు మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలనూ నేర్పిస్తారు. ఏర్‌లైన్‌ రూల్స్‌, రెగ్యులేషన్స్‌, గ్యాలే మేనేజ్‌మెంట్‌, అనౌన్స్‌మెంట్‌ డెలివరీ గురించీ తెలుసుకుంటారు.

డిప్లొమాలు: ఏర్‌ హాస్పిటాలిటీ, ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, ఏవియేషన్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, గ్లోబల్‌ ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌; సర్టిఫికెట్‌
కోర్సులు: ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌, ఏవియేషన్‌ హాస్పిటాలిటీ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, హాస్పిటాలిటీ ట్రావెల్‌ అండ్‌ కస్టమర్‌ సర్వీస్‌, కాబిన్‌ క్రూ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌..

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* మాన్యవర్‌ కాశీరాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌, లఖ్‌నవూ

* ఫ్లయింగ్‌ బర్డ్స్‌ ఏవియేషన్‌, అహ్మదాబాద్‌

* ఫ్రాంక్లిన్‌ ఏర్‌హోస్టెస్‌ అకాడమీ, ముంబయి

* యూనివర్సల్‌ ఏవియేషన్‌ అకాడమీ, చెన్నై

* పీటీసీ ఏవియేషన్‌ అకాడమీ, చెన్నై

* జెట్‌ ఇండియా ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌

* అకాడమీ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ ప్రొఫెషనల్‌ ఎక్సలెన్స్‌, కేరళ.

ఏర్‌ఫేర్‌ అండ్‌ టికెటింగ్‌

ఏర్‌లైన్‌ కోడ్స్‌, టికెటింగ్‌ టర్మినాలజీ, ఎలక్ట్రానిక్‌ టికెటింగ్‌, పాస్‌పోర్ట్‌ అండ్‌ వీసా, ఫారెన్‌ ఎక్స్చేంజి, ఏర్‌ఫేర్స్‌ అండ్‌ టికెటింగ్‌ సాఫ్ట్‌వేర్‌లకు సంబంధించిన అంశాలను నేర్చుకుంటారు. రెండు-మూడు భాషల్లో ప్రావీణ్యం, ఓపిక, వేగంగా పనిచేయగలిగేవారికి ఇది అనుకూలం. కంప్యూటర్‌ పరిజ్ఞానమూ ఉండాలి.

డిప్లొమాలు: ఏర్‌లైన్‌ టికెటింగ్‌, ఏర్‌లైన్‌ టికెటింగ్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, ఇంటర్నేషనల్‌ ఏర్‌లైన్స్‌ టికెటింగ్‌ అండ్‌ సీఆర్‌ఎస్‌; సర్టిఫికెట్‌ ఇన్‌ ఫేర్స్‌ అండ్‌ టికెటింగ్‌.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు:

* జెట్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏవియేషన్‌ అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, పుణె

* స్కూల్‌ ఆఫ్‌ ఏర్‌లైన్స్‌ అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, కొచ్చి

* ఏర్‌వింగ్స్‌ ఏవియేషన్‌ అకాడమీ, ఉదయ్‌పుర్‌

* ఏర్‌వింగ్స్‌ ఇంటర్నేషనల్‌ అకాడమీ, తిరుచ్చి

* అమిటీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ ట్రైనింగ్‌, నోయిడా

* ఇన్‌ఫ్లయిట్‌ ఏర్‌హోస్టెస్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, చత్తీస్‌గఢ్‌, దిల్లీ, హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌

* ఇంటర్నేషనల్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం ఇన్‌స్టిట్యూట్‌, అహ్మదాబాద్‌

* జేఎంఎం ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌, పుణె

ఇవేకాకుండా.. ఏర్‌లైన్‌ క్యాబిన్‌ క్రూ ట్రైనింగ్‌, ఏర్‌ కార్గో, కొరియర్‌ మేనేజ్‌మెంట్‌, ఏర్‌లైన్‌ రెవెన్యూ మేనేజ్‌మెంట్‌, ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌, ఏవియేషన్‌ సెక్యూరిటీ, ఏర్‌సైడ్‌ సేఫ్టీ, ఏర్‌పోర్ట్‌ ఫెమిలియరైజేషన్‌, ఫ్లైట్‌ ఇన్‌స్ట్రక్టర్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ రేటింగ్‌, లాజిస్టిక్స్‌ అండ్‌ షిప్పింగ్‌ మొదలైన అంశాల్లో డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఏ ఉద్యోగావకాశాలు?

ఈ కోర్సులు చేసినవారిని కార్గో మేనేజర్‌, ఏర్‌పోర్ట్‌ మేనేజర్‌, సేఫ్టీ అండ్‌ మెయింటెనెన్స్‌ మేనేజర్‌, ఏర్‌పోర్ట్‌ కస్టమర్‌ సర్వీస్‌ ఏజెంట్‌, ఫ్లయిట్‌ అటెండెంట్స్‌, ఫ్లయిట్‌ డిస్పాచర్‌, ఏర్‌లైన్‌ ఫ్లయిట్‌ ఇన్‌స్ట్రక్టర్‌, రాంప్‌ ప్లానర్‌, గ్రౌండ్‌ డ్యూటీ ఏజెంట్‌, ఏర్‌క్రాఫ్ట్‌ మెయింటెయినర్‌, ఏర్‌వర్తీనెస్‌ సర్వేయర్‌, ఏర్‌ ట్రాఫిక్‌ సర్వీసెస్‌ ఇన్‌స్పెక్టర్‌, కన్స్యూమర్‌ అఫైర్స్‌ ఆఫీసర్‌, ఫ్లయిట్‌ ఆపరేషన్స్‌ ఇన్‌స్పెక్టర్‌, రెగ్యులేటరీ పాలసీ అడ్వయిజర్‌ మొదలైన స్థానాలకు ఎంపిక చేసుకుంటారు.

మేనేజర్‌ స్థాయివారికి ప్రారంభవేతనం రూ.25,000, ఆపై ఉంటుంది. కొద్దిగా కిందిస్థాయి వారికి రూ.16,000 నుంచి రూ.25,000లోపు ఉంటుంది.

జీఎంఆర్‌లో మూడు కోర్సులు

హైదరాబాద్‌లోని జీఎంఆర్‌ ఏవియేషన్‌ అకాడమీ మూడు కోర్సులను అందిస్తోంది.

సర్టిఫికేషన్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ ఆపరేషన్స్‌ కోర్సుకు డిగ్రీ చేసిన 25 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి- ఆరునెలలు. మూడు నెలలు క్లాస్‌రూం ట్రైనింగ్‌, మూడు నెలలు జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటుంది.

10+2/ డిప్లొమా/ నాన్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్లు/ తత్సమాన విద్య పూర్తిచేసినవారు బేసిక్‌ ఫైర్‌ ఫైటర్స్‌ కోర్సును ఎంచుకోవచ్చు. వయసు 26 ఏళ్లలోపు ఉండాలి. కోర్సు వ్యవధి ఆరు నెలలు. క్లాస్‌రూం ట్రైనింగ్‌తోపాటు కేస్‌స్టడీ/ వీడియో క్లిప్స్‌, ప్రాక్టికల్‌ విధానంలో బోధన ఉంటుంది. ఆంగ్లభాషా పరిజ్ఞానముండాలి.

గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన 25 ఏళ్లలోపువారు సర్టిఫికేషన్‌ ఇన్‌ ఏర్‌పోర్ట్‌ అండ్‌ కార్గో ఆపరేషన్‌ కోర్సును ఎంచుకోవచ్చు. కోర్సు వ్యవధి నాలుగు నెలలు. మూడు నెలలు క్లాస్‌రూం ట్రైనింగ్‌, ఒక నెల జాబ్‌ ట్రైనింగ్‌ ఉంటాయి. కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి.

ఏం చూడాలి?

ఏవియేషన్‌ కోర్సుల్లో చేరేముందు ఆ సంస్థ ఐఏటీఏ (ఇంటర్నేషనల్‌ ఏర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌) ఆమోదం పొందిందో లేదో తెలుసుకోవాలి. ఈ అంతర్జాతీయ సంస్థ ఏర్‌లైన్స్‌కు కావాల్సిన అన్ని విషయాలపై జాగ్రత్తలు తీసుకుంటూ సాయమందిస్తుంది. ఎంజీఆర్‌ (డీమ్డ్‌) యూనివర్సిటీలో ఐఏటీఏ ఆమోదించిన ఆరు సర్టిఫికెట్లు, ఒక డిప్లొమా కోర్సులున్నాయి. బీఎస్‌సీ ఏవియేషన్‌లో ప్రవేశాలకు నవంబర్‌ 1, 2018 వరకు గడువుంది.

- రాజగోపాల్‌ గణేశన్‌, ఎంజీఆర్‌ (డీమ్డ్‌)యూనివర్సిటీ ప్రతినిధి

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌