• facebook
  • whatsapp
  • telegram

ఉల్లాసంగా... ఉద్యోగంగా..!

జీవితం కలర్‌ఫుల్‌గా కనిపించాలంటే ఎక్కడికైనా విహారానికి వెళ్లి రావాల్సిందే. రోజువారీ ఒత్తిడిని చిత్తు చేసే శక్తి పర్యటనకి ఉంది. కాస్త వీలు దొరికితేచాలు బ్యాగు భుజాన వేసుకొని అలా.. అలా తిరిగి వద్దామని అందరూ అనుకుంటారు. అందుకే టూరిజం దేశాల ఆర్థిక వ్యవస్థలను ప్రభావితం చేసేంతగా ఎదిగింది. ప్రతి దేశం పర్యటక రంగాన్ని ప్రధాన ఆదాయవనరుగా గుర్తించి అభివృద్ధి చేస్తోంది. దీంతో ఎన్నో ఉద్యోగాలు, కోర్సులు పుట్టుకొచ్చాయి. వచ్చే దశాబ్దకాలంలో అంటే 2028 నాటికి మన దేశ పర్యటక, దాని అనుబంధ రంగాల్లో దాదాపు కోటి కొలువులు కొత్తగా జతచేరతాయని ద వరల్డ్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం కౌన్సిల్‌ (డబ్ల్యూటీటీసీ) అంచనా వేసింది. తగిన కోర్సులు చేసి సిద్ధంగా ఉంటే ఈ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.

ప్రతిరోజూ ఉత్సాహభరితంగా... ఉత్తేజకరంగా సాగాలని కోరుకునేవారికి పర్యటక రంగం సరైన ఎంపిక. మనదేశ పర్యటక, దాని అనుబంధ రంగాల్లో 4.29 కోట్ల ఉద్యోగాలు ఉన్నాయి. 2028 నాటికి అవి 5.23 కోట్లకు చేరతాయని డబ్ల్యూటీటీసీ ఇటీవల అంచనా వేసింది. గత నాలుగేళ్లలో మన పర్యటక రంగం ఒక్కటే కోటీ నలబై లక్షలకు పైగా ఉద్యోగాలను సృష్టించిందని కేంద్ర పర్యటకశాఖ మంత్రి కె.జె. ఆల్ఫోన్స్‌ ఈ మధ్య కాలంలో ప్రకటించడం కూడా టూరిజం వేగంగా విస్తరిస్తున్న తీరును తెలియజేస్తోంది. అంతర్జాతీయ సంస్థలు, ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ సర్వీసెస్‌, ట్రావెల్‌ ఏజెన్సీలు, ఎయిర్‌లైన్స్‌, హోటళ్లతోపాటు ఎయిర్‌లైన్‌ క్యాటరింగ్‌, గైడ్స్‌, సేల్స్‌ లాంటి సేవారంగాల సమ్మిళితం... పర్యటక రంగం. ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న ప్రయాణ, పర్యటక ఆర్థిక వ్యవస్థల్లో భారత్‌ ఏడో పెద్ద దేశం. జీడీపీలో కూడా అధిక వాటాను టూరిజం సమకూరుస్తోంది. ప్యాకేజీ యాత్రలు, తీర్థయాత్రలు, సాహస (అడ్వెంచర్‌) యాత్రలు లేదా వ్యాపార పర్యటనలు తదితరాలు ఏవైనా... ఈ రంగంలో పని చేసే ఉద్యోగులు అన్ని దశల్లో ప్రజలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటారు.

ఏయే సంస్థల్లో అవకాశాలు?

ఎయిర్‌లైన్స్‌: ఈ సంస్థల్లో ఉద్యోగాలు ఛాలెంజింగ్‌గా, ఆకర్షణీయంగా ఉంటాయి. కొత్తకొత్త ప్రాంతాలకు ప్రయాణించవచ్చు. ట్రాఫిక్‌ అసిస్టెన్స్‌, రిజర్వేషన్‌ అండ్‌ కౌంటర్‌ స్టాఫ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ స్టాఫ్‌, కస్టమర్‌ సర్వీసెస్‌ లాంటి విభాగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, జెట్‌ ఎయిర్‌వేస్‌, ఎయిర్‌ సహారా, బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌, ఎమిరేట్స్‌, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ మొదలైన సంస్థల్లో కొలువులతో ఆకర్షణీయమైన వేతనాలు, పెద్దసంఖ్యలో ఇతర సౌకర్యాలు అందుకోవచ్చు.
ట్రావెల్‌ ఏజెన్సీలు: వీటిలో పని చేసే ఉద్యోగులు పర్యటకులు, వ్యాపారవేత్తల అవసరాలను అంచనా వేసి, అందుబాటులో ఉన్న ప్రయాణ సౌకర్యాలతో సదుపాయంగా పర్యటించడానికి సాయం చేస్తారు. రిసార్ట్స్‌, ట్రావెల్‌ సంస్థలు తమ టూర్‌ ప్యాకేజీలను ప్రమోట్‌ చేసుకోవడానికి ట్రావెల్‌ ఏజెంట్లను ఉపయోగించుకుంటాయి. ఏ దారిలో ప్రయాణిస్తే త్వరగా గమ్యం చేరుకోవచ్చు? ఎలా వెళ్లాలి? ముఖ్యమైన పత్రాలు (వీసా, పాస్‌పోర్ట్‌, వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌), ఉండటానికి అనువైన ప్రాంతాలు, కరెంట్‌ ఎక్స్ఛేంజ్‌ రేట్లు, సందర్శించాల్సిన పర్యటక ఆకర్షక ప్రాంతాలు (టూరిస్ట్‌ ఎట్రాక్షన్స్‌), వాతావరణం లాంటివి దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తారు. పర్యటకుల బడ్జెట్‌, ప్రత్యేక అవసరాలను బట్టి సేవలు అందిస్తారు. ఈ ట్రావెల్‌ ఏజెన్సీల్లో రిజర్వేషన్‌/ కౌంటర్‌ స్టాఫ్‌, సేల్స్‌ అండ్‌ మార్కెటింగ్‌ స్టాఫ్‌, టూర్‌ ఎస్కార్ట్స్‌, టూర్‌ ఆపరేటర్లు, కార్గో/ కొరియర్‌ ఏజెన్సీ లాంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని ట్రావెల్‌ ఏజెన్సీలు ఫ్రెష్‌ గ్రాడ్యుయేట్లను ఉద్యోగంలోకి తీసుకుని, శిక్షణ ఇస్తున్నాయి.
హోటళ్లు: పర్యటకులకు వసతి, భోజన ఏర్పాట్లు కల్పించడంలో హోటళ్లు ప్రముఖ పాత్ర వహిస్తాయి. ఒక ప్రదేశ ప్రాచుర్యాన్ని బట్టి, అక్కడికి వచ్చే పర్యటకుల సంఖ్యను బట్టి హోటళ్లలో పని చేయడానికి పెద్దసంఖ్యలో, రకరకాల నైపుణ్యాలున్న ఉద్యోగులు అవసరం.
రవాణా: పర్యటక రంగంలో వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ బస్సులు, కార్లు, ఇతర వాహనాలను నడపటం, అద్దెకు వాటిని అందుబాటులో ఉంచడం ద్వారా సొంతంగా ఉపాధి పొందే వీలుంది.

టాప్‌ రిక్రూటర్లు:
* » ఐఆర్‌టీసీ
*» షెరటాన్‌ హోటల్స్‌ ‌
హాలిడే ఇన్‌
*» మారియట్‌ హోటల్స్‌ ‌
*» మేక్‌ మై ట్రిప్‌
*» కాక్స్‌ అండ్‌ కింగ్స్‌
*» థామస్‌ కుక్‌ ‌
*» యాత్రా.కామ్‌
*» జెట్‌ ఎయిర్‌వేస్‌
*» బామర్‌ లారీ ట్రావెల్‌ అండ్‌ వెకేషన్స్‌

ఏ హోదాకు ఎలాంటి విధులు?
ట్రావెల్‌, టూరిజం రంగంలో వైవిధ్యంతో కూడిన ఉద్యోగాలుంటాయి.
ట్రావెల్‌ ఏజెంట్‌: వీరు ఏయే ప్రాంతాలు పర్యటనకు అనుకూలమో ఎంపిక చేసి, వ్యక్తిగతంగా లేదా బృందాలుగా వెళ్లేవారి కోసం ఏర్పాటు చేస్తారు.
టూర్‌ ఆపరేటర్‌: టూర్‌, ట్రావెల్‌కి సంబంధించిన అన్ని విషయాలను సమన్వయపరుస్తూ, హాలిడే ప్యాకేజీలను రూపొందించడం వీరి బాధ్యత.
ఈవెంట్‌ అండ్‌ కాన్ఫరెన్స్‌ ఆర్గనైజర్‌: కార్యక్రమం అంతా సజావుగా సాగేలా చూడటం ఈవెంట్‌ మేనేజర్‌ విధి. మైకులు, సౌండ్‌ సిస్టం దగ్గరి నుంచి మీటింగ్‌కి అనువైన ప్రదేశాన్ని ఎంపిక చేయడం వరకు వీళ్లే చూసుకుంటారు.
టూర్‌ ప్లానర్స్‌ అండ్‌ గైడ్స్‌ (రీజనల్‌/ స్టేట్‌/ లోకల్‌): వీరు పర్యటక రంగంలో ప్రధానమైన పాత్ర పోషిస్తారు. సందర్శకులు/ పర్యటకుల బృందాలకు మార్గదర్శకత్వం వహిస్తారు. ఈ కెరియర్‌ ఎంచుకోవాలంటే సందర్శనీయ ప్రాంతాలకు

సంబంధించిన విశేషాలు తెలిసి ఉండాలి.
లీజర్‌ యాక్టివిటీ కోఆర్డినేటర్‌: వీళ్లు రిసార్టులు, హోటళ్లలో పని చేస్తారు. ముందుగా నిర్ణయించిన ప్రణాళిక ప్రకారం కార్యక్రమం అంతా చక్కగా జరిగేలా చూడటం వీరి బాధ్యత.
పీఆర్‌ మేనేజర్‌: ఒక బ్రాండ్‌కి సంబంధించిన గౌరవాన్ని కాపాడటం పీఆర్‌ మేనేజర్‌ ప్రధాన బాధ్యత. సంస్థ తరపున అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తారు.

మరికొన్ని ఉద్యోగాలు:
*» ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్స్‌
*» ఇంటర్‌ప్రిటేటర్స్‌
*» ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజర్‌
*» ట్రావెల్‌ కౌన్సెలర్స్‌
*» టూర్‌/ డెస్టినేషన్‌ మేనేజర్‌
*» ట్రావెల్‌ మీడియా స్పెషలిస్ట్‌
*» ట్రావెల్‌ ఎడ్యుకేషనిస్ట్‌
»
టికెటింగ్‌ ఆఫీసర్‌
*» అడ్వెంచర్‌ టూరిజం ఎక్స్‌పర్ట్‌/ ఆపరేటర్‌
ట్రాన్స్‌పోర్ట్‌ ఆఫీసర్‌
*» టూర్‌/ హాలిడే కన్సల్టెంట్‌
*» టూరిజం ట్రెయినర్‌
*» ట్రావెల్‌ ఎగ్జిక్యూటివ్‌
*» ఎగ్జిక్యూటివ్‌ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌
*» టూర్‌ మేనేజ్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌

ఏం చదవాలి?

పర్యటక రంగంలో స్థిరపడటానికి ఉపకరించే గ్రాడ్యుయేట్‌, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌తోపాటు దేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాలు మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తున్నాయి. మేనేజీరియల్‌, అడ్మినిస్ట్రేటివ్‌ స్థాయి ఉద్యోగాలు పొందడానికి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిగ్రీ తోడ్పడుతుంది.
ప్రపంచస్థాయి సంస్థ అయిన ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అసోసియేషన్‌ (ఐఏటీఏ) ప్రయాణ, పర్యటక, కార్గో పరిశ్రమలకు సంబంధించి సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తోంది. ఏదైనా విదేశీ భాషా పరిజ్ఞానం ఉంటే అదనపు అర్హతగా పరిగణిస్తారు. పబ్లిక్‌ రిలేషన్స్‌లో లేదా అడ్వర్టైజింగ్‌లో డిప్లొమా కలిగి ఉంటే కెరియర్‌లో ఎదగడానికి తోడ్పడుతుంది.
ప్రభుత్వరంగ సంస్థల్లో కార్యాచరణ ఉద్యోగాలకు (ఆపరేషనల్‌) ట్రావెల్‌, టూరిజంలో డిగ్రీ ఉత్తీర్ణులైనవారికి డిమాండ్‌ ఉంటుంది. స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షల్లో అర్హత సాధించినవారిని టూరిజం డిపార్ట్‌మెంట్‌లో ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఎంపిక చేస్తారు. భారతదేశ చరిత్ర, కళలు, నిర్మాణంపై అవగాహన, ఆంగ్ల భాషా పరిజ్ఞానం ఉంటే స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ నిర్వహించే పోటీ పరీక్షలకు హాజరుకావచ్చు.

గ్రాడ్యుయేషన్‌: ఇంటర్‌ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులైనవారు టూరిజంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరడానికి అర్హులు.
*» బ్యాచిలర్‌ ఇన్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (టూరిజం అండ్‌ ట్రావెల్‌)
*» బ్యాచిలర్‌ ఆఫ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌
*» బీఎస్సీ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌

సర్టిఫికెట్‌: 10+2 ఉత్తీర్ణులైనవారు టూరిజం సర్టిఫికెట్‌ కోర్సులు చదివేందుకు అర్హులు.

డిప్లొమా:
*» అడ్వాన్స్‌ డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌
*» డిప్లొమా ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం మేనేజ్‌మెంట్‌

పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌:
*» మాస్టర్‌ ఆఫ్‌ టూరిజం అడ్మినిస్ట్రేషన్‌ - ఈ రెగ్యులర్‌ కోర్సు వ్యవధి రెండేళ్లు. దీనికి కేంద్ర పర్యటకశాఖ అనుమతి ఉంది. ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులైనవారు ఆయా సంస్థలు నిర్వహించే ప్రవేశపరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూలో అర్హత సాధించడం ద్వారా ఈ కోర్సులో ప్రవేశం పొందొచ్చు.
*» ఎంబీఏ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ - ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)/ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (క్యాట్‌)/ కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)/ గ్జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (గ్జాట్‌)/ గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (జీమ్యాట్‌)/ ఆత్మా (ఎయిమ్స్‌ టెస్ట్‌ ఫర్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్స్‌)లలో అర్హత సాధించి ఉండాలి.
» పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ ఇన్‌ టూరిజం
» ఎంబీఏ (టూరిజం అండ్‌ ట్రావెల్‌)
*» ఎంబీఏ ఇన్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌
*» ఎంబీఏ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ
*» పీహెచ్‌డీ ఇన్‌ టూరిజం
*» పీహెచ్‌డీ ఇన్‌ ట్రావెల్‌ అండ్‌ టూరిజం

కోర్సులు అందిస్తున్న సంస్థలు
*» నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌, హైదరాబాద్‌
nithm.ac.in
*» మహాత్మాగాంధీ యూనివర్సిటీ, నల్గొండ
http://mguniversity.ac.in
*» ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు
www.nagarjunauniversity.ac.in
*» ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌, నెల్లూరు
iittmsouth.org
*» అమిటీ యూనివర్సిటీ
www.amity.edu
*» చండీగఢ్‌ యూనివర్సిటీ
www.cuchd.in


అడ్వెంచర్‌ టూరిజం
ప్రస్తుతం పర్యటక రంగంలో అడ్వెంచర్‌ టూరిజం కీలక పాత్ర పోషిస్తోంది. వైల్డ్‌లైఫ్‌ టూరిజం, ట్రెక్కింగ్‌, మౌంటెన్‌ క్లైంబింగ్‌, పారాగైడ్లింగ్‌, బైకింగ్‌, స్కూబా డైవింగ్‌, రాఫ్టింగ్‌, పారాసెయిలింగ్‌, బంగీ జంపింగ్‌ లాంటివి దీని కిందికి వస్తాయి.
విభిన్న భౌగోళిక ప్రాంతాల సమాహారమైన భారతదేశంలో ఉన్న వివిధ పర్వతాలు, కొండలు, అడవులు, సముద్ర తీరాలు, ఎడారులు, నదులు సాహస పర్యటకులను ఆహ్వానిస్తున్నాయి. పర్వతారోహణ, డైవింగ్‌, రాఫ్టింగ్‌, పారాగైడ్లింగ్‌లో ఆసక్తి ఉన్నవారు అడ్వెంచర్‌ టూరిజంలో టూర్‌ ఆపరేటర్లుగా కెరియర్‌ ఎంచుకోవచ్చు. సంబంధిత అంశంలో సర్టిఫికెట్‌/ డిగ్రీ/ డిప్లొమా ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి.
అడ్వెంచర్‌ టూరిజంలో స్థిరపడాలంటే సాహసం, ఆత్మవిశ్వాసం ఉండాలి. అనుకోనిరీతిలో ఏదైనా ప్రమాదం ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలో పర్యటకులకు వివరించగలగాలి. పర్యటకుల రక్షణ బాధ్యత వీరిపైనే ఉంటుంది. ఏటీవోలు శారీరకంగా దృఢంగా ఉండటం చాలా అవసరం. అలాగే సమన్వయంతో వ్యవహరించడం, క్లిష్టమైన పరిస్థితుల్లో సరిగా ఆలోచించడం తప్పనిసరి. మంచి కమ్యూనికేషన్‌, ప్లానింగ్‌ నైపుణ్యాలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో పాటించాల్సిన పద్ధతులపై అవగాహన చాలా ముఖ్యం. ఏదైనా ఒక విదేశీ భాష నేర్చుకుని ఉండటం వల్ల ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే పర్యటకులతో సంభాషించడానికి వీలుంటుంది.
వీరికి పర్యటక సంస్థలు, ఎక్స్‌కర్షన్‌ ఏజెన్సీలు, హాలిడే రిసార్ట్‌లు, లీజర్‌ క్యాంపులు, కమర్షియల్‌ రిక్రియేషన్‌ సెంటర్లు, స్పోర్ట్స్‌ సెంటర్లు, అథ్లెటిక్‌ క్లబ్‌లలో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఆసక్తి ఉన్నవారు సొంతంగా అడ్వెంచర్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే అడ్వెంచర్‌ టూరిజం కోసం కేంద్ర పర్యటక మంత్రిత్వ శాఖ రక్షణ, నాణ్యతా సూత్రాలను పాటించాలి. అడ్వెంచర్‌ టూర్‌ ఆపరేటర్‌ (ఏటీవో) ఈ శాఖ నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది.

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌