• facebook
  • whatsapp
  • telegram

కల్యాణ వైభోగంలో కమనీయ కొలువులు

పెళ్లంటే ప్రతి ఇంట్లో పెద్ద పండగ. తోరణాల నుంచి తలంబ్రాల వరకు అన్నీ దగ్గరుండి చూసుకొని చేసుకుంటే రెండు జీవితాలకు సరిపడేంత ఆనందం పోగవుతుంది. ఇంతకు ముందు నెలలపాటు జరిగే ఈ సంబరాలు సంప్రదాయాలకు నిలువెత్తు రూపాలుగా నిలిచేవి. కానీ క్షణం తీరికలేని ఫైవ్‌-జీ యువతరానికి అంత సంతోషం దూరమైనట్లేనా అంటే... కాదు మేమున్నాం అంటున్నారు వెడ్డింగ్‌ ప్లానర్లు. మండపాల నుంచి మధుపర్కాల వరకు వీళ్లే సిద్ధం చేసేస్తారు. కల్యాణం అనే ఈ కుటుంబ సందడి ఇప్పుడు కార్పొరేట్‌ కళను సంతరించుకుంటోంది. బడ్జెట్‌ చెప్పేసి బంధుమిత్రులతో వస్తే చాలు.. ప్రశాంతంగా పెళ్లి చేసుకొని వెళ్లిపోవచ్చు. వివాహ నిర్వహణ ఇప్పుడో పూర్తిస్థాయి కెరియర్‌గా మారుతోంది. క్వాలిఫైడ్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా మార్కెట్‌లోకి వెళ్లడానికి కొత్త కొత్త కోర్సులు వచ్చేస్తున్నాయి.

అన్ని ఉద్యోగాల్లో అంతో ఇంతో ఇబ్బందులు ఉండవచ్చేమో కానీ వెడ్డింగ్‌ ప్లానర్‌గా వెళితే మాత్రం అంతా ఆనందమే. ప్రతి పెళ్లికీ పెద్దలుగా, అందరికీ బంధువులుగా.. సంతోషాలను, సంతృప్తినీ పంచుతూ చక్కగా సంపాదించుకోవచ్చు. వివాహ నిర్వహణ ఇప్పుడు కార్పొరేట్‌ నైపుణ్యంగా గుర్తింపుపొంది సరికొత్త కెరియర్‌గా ఎదుగుతోంది.

ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి చాలా ప్రత్యేకం. సంప్రదాయాలను బట్టి ఎన్నో రీతి రివాజులుంటాయి. కొనుగోళ్లు, పురోహితుడు, భాజాభజంత్రీలు, మండపం తయారీ.. ఇలా ఒక్కోపనీ పూర్తికావాలంటే కనీసం నెలరోజులైనా పడుతుంది. బంధువులంతా తలా ఓ చేయి వేస్తే కానీ పూర్తవదు. అంత సమయం కేటాయించే వీలు ఎవరికీ ఉండటం లేదు. ప్రత్యామ్నాయంగా అనుకున్న బడ్జెట్‌లో చేసే వెడ్డింగ్‌ ప్లానర్లకు పెళ్లిళ్ల సీజన్లో గిరాకీ అంతా ఇంతా కాదు. డెకరేషన్‌, దుస్తుల ఎంపిక, ఫొటోగ్రఫీ, విందు, పూలు.. మొత్తం వారే చూసుకుంటున్నారు. జీవితంలోని ముఖ్యమైన మలుపును మరపురానిదానిగా తీర్చిదిద్దుతున్నారు.

కొంతకాలంగా దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వెడ్డింగ్‌ ప్లానింగ్‌ పరిశ్రమకు గిరాకీ ఏర్పడింది. ముఖ్యంగా అనుభవమున్నవారికి ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. అందుకే చాలామంది ఈ రంగంలో కెరియర్‌ నిర్మించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. వాటికి తగ్గట్టుగానే ప్రముఖ సంస్థలు కోర్సులను నిర్వహిస్తున్నాయి.

ఈ కోర్సులు చదివినవారు వివాహ నిర్వహణలో నైపుణ్యాన్ని సాధిస్తారు. దాని ఆధారంగా వీరు డెకరేటర్లు, కేటరర్లు, ఇతరులకు తగిన సూచనలిస్తుంటారు. పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటుంటారు. వీరి పని పెళ్లికి ముందు నుంచి ప్రారంభమై, పూర్తయిన తరువాతా కొనసాగుతుంది.

కాబోయే వధూవరులను కలిసి వారు ఎలా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో కనుక్కుని, అందుకు తగ్గ డిజైన్లను తయారు చేస్తారు. బడ్జెట్‌, అతిథులు, వెడ్డింగ్‌ థీమ్‌తోపాటు వారికంటూ ప్రత్యేకంగా ఉన్న సంప్రదాయాల వివరాలను తెలుసుకుని ఆ ప్రకారంగా ప్రణాళిక సిద్ధం చేస్తారు. పెళ్లి ముందు జరిగే తంతు నుంచి అప్పగింతల వరకూ వీరి పాత్ర ప్రధానం.

నిజానికి వెడ్డింగ్‌ ప్లానర్‌ కావడానికి ప్రత్యేక అర్హతలంటూ ఏంలేవు. కానీ, పేరున్న సంస్థల్లో కెరియర్‌ను నిర్మించుకోడానికి, ప్రత్యేకంగా పెద్ద బిజినెస్‌ నిర్వహించాలనుకునేవారికి తగిన నైపుణ్యాలు అవసరమవుతాయి. వాటిని శాస్త్రీయంగా పెంపొందించేలా రూపొందించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇంటర్‌/ తత్సమాన విద్యనభ్యసించినవారు అర్హులు.

ఏ నైపుణ్యాలుండాలి?

* మంచి నిర్వహణ నైపుణ్యాలు. ఒకే సమయంలో ఒకటికి మించి పనులు చేయగలిగే ప్రతిభ.
* మంచి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌.
* కస్టమర్‌ కేర్‌, సమస్యా పరిష్కార నైపుణ్యాలు. ‌
* సృజనాత్మక నైపుణ్యాలు. ‌
* అనుకోకుండా ఎదురయ్యే సమస్యలకు తక్షణమే స్పందించగలగటం. ఎప్పటికపుడు జరుగుతున్న పనులపై పట్టు. ‌
* ఒత్తిడిలో సమర్థంగా పనిచేయగలగటం. గడువులోగా పని పూర్తిచేయగల స్వభావం.
* నెగోషియేషన్‌ స్కిల్స్‌తోపాటు బడ్జెట్‌ను నిర్వహించగల మెలకువలు. 
* బృందంతో కలిసి పని చేయగలగటం. చొరవ చూపే మనస్తత్వం. 
* మంచి ఫ్యాషన్‌ పరిజ్ఞానం. రంగులూ, సంగీతం, వివిధ రకాల పూలు, మతాలూ, సంస్కృతులకు సంబంధించిన విషయాలపై అవగాహన. 
* తాజా వెడ్డింగ్‌ ట్రెండ్స్‌, డెకరేషన్‌, సంప్రదాయాలపై పట్టు.

విభిన్న కోర్సులు

ఆసక్తి ఉన్నవారు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరటంతోపాటు ఎప్పటికప్పుడు ఈ రంగంలో వస్తున్న మార్పులను గమనిస్తూ ఉండాలి. చాలా సంస్థలు సర్టిఫికేషన్‌, డిగ్రీ, డిప్లొమా కోర్సులను అందిస్తున్నాయి. వీటిని అభ్యసించి క్వాలిఫైడ్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా మార్కెట్‌లోకి అడుగుపెట్టొచ్చు. వీటిని చదివినవారికి బ్యాచిలర్‌ లేదా అసోసియేట్‌ డిగ్రీ లభిస్తుంది.

* సర్టిఫికెట్‌ ఇన్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌
* డిప్లొమా ఇన్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఈవెంట్‌ ఫొటోగ్రఫీ‌ 
* డిప్లొమా ఇన్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌ ‌
* బీఏ (ఆనర్స్‌) (ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌) ‌
* బ్యాచిలర్‌ డిగ్రీ ఇన్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌ ‌
* డిప్లొమా ఇన్‌ వెడ్డింగ్‌, ప్లానింగ్‌, స్టైలింగ్‌ అండ్‌ డిజైన్‌

సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులకు సంస్థనుబట్టి కాలవ్యవధి- ఆరు నుంచి ఏడాది వరకు ఉంటుంది. పది లేదా ఇంటర్‌/తత్సమాన విద్య పూర్తి చేసినవారు ఇవి చదవడానికి అర్హులు. డిగ్రీ కోర్సులకు కాలవ్యవధి- మూడేళ్లు. ఇంటర్‌/తత్సమాన విద్య పూర్తిచేసినవారు అర్హులు.

మాస్టర్‌ డిగ్రీ కోర్సులు: ఇంకా మెరుగైన నైపుణ్యాలను నేర్చుకోవాలి లేదా పెద్ద వ్యాపారాలను ప్రారంభించాలనుకునేవారు మాస్టర్‌ డిగ్రీ కోర్సులను ఎంచుకోవచ్చు. పీజీ కోర్సులైతే డిగ్రీ స్థాయిలో ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌/ వెడ్డింగ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను పూర్తిచేసుండాలి. పీజీ డిప్లొమా కోర్సులైతే ఏదైనా డిగ్రీ చదివినవారు ఎంచుకోవచ్చు. వీటిల్లో వెడ్డింగ్‌ ప్లానింగ్‌కు సంబంధించిన మేనేజ్‌మెంట్‌ నైపుణ్యాలను నేర్పిస్తారు.

* ఎంబీఏ (ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వెడ్డింగ్‌ ప్లానింగ్‌) ‌‌
* మాస్టర్‌ డిగ్రీ ఇన్‌ వెడ్డింగ్‌ మేనేజ్‌మెంట్‌
* పీజీ డిప్లొమా ఇన్‌ వెడ్డింగ్‌ మేనేజ్‌మెంట్‌

డిప్లొమా కోర్సులకు కాలవ్యవధి ఏడాది కాగా, మాస్టర్స్‌ డిగ్రీలకు రెండేళ్లు.

కోర్సులను అందించే సంస్థలు‌

* నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌, అహ్మదాబాద్‌ ‌‌
* డ్రీమ్‌ వెడ్డింగ్స్‌ ఇండియా ప్రై. లిమిటెడ్‌, మధ్యప్రదేశ్‌ ‌‌
* ఇంపాక్ట్‌ ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌, గుజరాత్‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, గుజరాత్‌
* ద వెడ్డింగ్‌ అకాడమీ, ముంబయి
* రచనోత్సవ్‌ ఈవెంట్స్‌ అకాడమీ, హైదరాబాద్‌ ‌‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, దిల్లీ ‌‌
* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, కోల్‌కతా ‌
* ఐఐఈఎం, దిల్లీ

సంస్థలను బట్టి ఫీజు మొత్తంలో తేడాలున్నాయి. సాధారణంగా సర్టిఫికేషన్‌, డిప్లొమా కోర్సులకు రూ.10,000 నుంచి రూ.65,000 మధ్య ఉంటుంది. డిగ్రీ, మాస్టర్‌ కోర్సులకు ఏడాదికి రూ.30,000నుంచి రూ.1,20,000 వరకూ చెల్లించాల్సి ఉంటుంది.

ఆన్‌లైన్‌లోనూ..

వెడ్డింగ్‌ ప్లానింగ్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అనేక సంస్థలు ఆన్‌లైన్‌ కోర్సులను అందిస్తున్నాయి. నేరుగా వెళ్లి చదువుకునే సమయం లేనివారు వీటిలో చేరొచ్చు. మూడు వారాల నుంచి 9 నెలల వ్యవధి గల సర్టిఫికేషన్‌, డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే కొంత మొత్తం చెల్లించాల్సి ఉంటుంది.

కోర్స్‌ ఫర్‌ సక్సెస్‌, వెడ్డింగ్‌ ప్లానింగ్‌ అకాడమీ, ఆక్స్‌ఫర్డ్‌ హోమ్‌ స్టడీ, గెట్‌ కోర్స్‌.కామ్‌, ఐసీఐ ఎడ్యుకేషన్‌, రాయల్‌ ఇన్‌స్టిట్యూషన్‌.కామ్‌ వంటివి ఆన్‌లైన్‌లో కోర్సులను ప్రపంచవ్యాప్తంగా అందిస్తున్న ప్రముఖ సంస్థలు.

ఎఫ్‌ఎంఎఫ్‌ ఈవెంట్‌ అకాడమీ, కేరళ; ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ముంబయి; అశ్వర్థ్‌ కాలేజ్‌ మనదేశంలో ప్రముఖమైనవి.

ఏం నేర్పిస్తారు?

* వివాహ పరిశ్రమకు సంబంధించిన పరిచయం ‌
* పెళ్లిల్లోని వివిధ దశలు, వెడ్డింగ్‌ ప్లానర్‌ పాత్ర 
* వెడ్డింగ్‌ థీమ్‌ తయారు చేయడం, దాని డిజైనింగ్‌, ప్లానింగ్‌
* రూపొందించిన డిజైన్‌కు అనుగుణంగా సామగ్రిని సేకరించడం (వెండార్‌ మేనేజ్‌మెంట్‌) ‌
* బడ్జెట్‌ నిర్ణయించడం, డబ్బు నిర్వహణ ‌
* బహుళ విధులు చేయగల నేర్పు ‌
* పెళ్లి సన్నద్ధత, సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించడం
* వివిధ మతాల ఆచారవ్యవహారాలు ‌
* వివిధ రకాల పెళ్లిళ్లు 
* క్లయింట్లు, విక్రేలతో కలిసి పనిచేయడం ‌
* వినోదపరమైన అంశాలపై అవగాహన, రూపకల్పన, నిర్వహణపై అవగాహన
** భద్రతా పరమైన అంశాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు.

విజ్‌క్రాఫ్ట్‌లో వెడ్డింగ్‌ మేనేజ్‌మెంట్‌

విజ్‌క్రాఫ్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ (ఎంఐఎంఈ) దేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కమ్యూనికేషన్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగాల్లో ప్రముఖమైనది. ఈ సంస్థ తాజాగా ‘గ్లోబల్‌ వెడ్డింగ్‌ అకాడమీ' పేరుతో ముంబయిలో సంస్థను స్థాపించింది. దేశంలో పెరుగుతున్న వెడ్డింగ్‌ ప్లానర్ల ప్రాముఖ్యాన్ని గుర్తించి, వారిని మరింత నిపుణులుగా చేయాలనే ఉద్దేశంతో ఈ అకాడమీ ద్వారా ‘గ్లోబల్‌ వెడ్డింగ్‌ అకాడమీ ఎగ్జిక్యూటివ్‌ ప్రోగ్రామ్‌'ను అందించనున్నారు.

ఈ ఏడాది సెప్టెంబరు 1 నుంచే తరగతులు ప్రారంభమవుతున్నాయి. కోర్సు వ్యవధి- 18+ వారాలు. 18 మాడ్యూళ్లలో బోధన ఉంటుంది. సమగ్రంగా, వాస్తవికంగా, ప్రయోగాత్మకంగా శిక్షణ ఉండేలా ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులు వీరికి బోధనలు అందించనున్నారు. కోర్సులో భాగంగా వర్క్‌షాప్‌లు, మార్కెట్‌ విజిట్‌లతోపాటు ఆన్‌సైట్‌ లర్నింగ్‌ అవకాశాన్నీ కల్పిస్తారు. వెడ్డింగ్‌ ప్లానింగ్‌పై ఆసక్తి ఉన్న విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌ ఎవరైనా దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రామ్‌ను ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాలుగానూ అందిస్తున్నారు. కోర్సు పూర్తయ్యాక సర్టిఫికెట్‌ అందిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారికి పేరున్న సంస్థల్లో ఇంటర్న్‌షిప్‌, ఉద్యోగావకాశాలనూ కల్పిస్తారు.

దరఖాస్తు ఫారాలు ఆన్‌లైన్‌లో లభిస్తాయి. ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి ప్రాధాన్యం లభిస్తుంది. నేరుగా సంస్థకు వెళ్లి కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఫీజు వివరాలు: ఆగస్టు 25లోపు దరఖాస్తు చేసుకున్నవారు రూ.65,000 ఆపై చేసుకున్నవారికి రూ.75,000 చెల్లించాల్సి ఉంటుంది.

ఇతర వివరాలకు:www.globalweddingacademy.comను చూడొచ్చు.

కెరియర్‌ అవకాశాలు

ఈ రంగంలో నైపుణ్యం ఉన్నవారికి దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ అవకాశాలున్నాయి. వెడ్డింగ్‌ ప్లానర్‌ కోర్సు పూర్తి చేసినవారికి వెడ్డింగ్‌ కన్సల్టెంట్‌, వెడ్డింగ్‌ వెన్యూ కోఆర్డినేటర్‌, అసిస్టెంట్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌ మొదలైన ఉద్యోగాలుంటాయి. ఈవెంట్‌ ప్లానింగ్‌, సంబంధిత సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ హోదా ఉద్యోగం లభిస్తుంది. వెడ్డింగ్‌ ప్లానర్‌/ డిజైనర్‌ ఉద్యోగాలూ ఉంటాయి. సొంతంగానూ వ్యాపారం ప్రారంభించుకోవచ్చు. అయితే మొదట ఏదో ఒక సంస్థలో ఉద్యోగం చేయడం లాభిస్తుంది. వీరిని పెద్ద హోటళ్లు, ఫ్యాషన్‌, ఫిలిం, ట్రావెల్‌, హాస్పిటాలిటీ, అడ్వర్టైజింగ్‌ సంస్థలు తీసుకుంటున్నాయి.

జీతభత్యాలు: నిర్వహించిన పెళ్లి స్థాయిని బట్టి వారి జీతం ఆధారపడి ఉంటుంది. మామూలుగా ప్రొఫెÆషనల్స్‌కు పెళ్లికి చేసిన ఖర్చులో 10- 15% జీతంగా చెల్లిస్తారు. ఇది కూడా వారి తెలివితేటలు, నైపుణ్యాలపై ఆధారపడి ఉంటుంది. వివిధ సంస్థల్లో చేసేవారికి అయితే ప్రారంభజీతం నెలకు రూ.10,000- 15,000 వరకు ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ జీతంలోనూ భారీ పెరుగుదల కనిపిస్తుంది.

నిత్యవిద్యార్థిగా ఉండాలి

అయిదేళ్ల క్రితం బెంగళూరులో వెడ్డింగ్‌ ప్లానర్‌ డిప్లొమా చేశాను. ప్రస్తుతం సొంతంగా వ్యాపారాన్ని చేస్తున్నాను. కోర్సులో భాగంగా ఎలా ప్లాన్‌ చేయాలి, ఏయే అంశాలపై దృష్టిపెట్టాలో నేర్పిస్తారు. వాటితోపాటు బృందంతో ఎలా పనిచేయాలి, మనీ మేనేజ్‌మెంట్‌ వంటివన్నీ కోర్సులో భాగం. ఇవన్నీ మార్కెట్‌లోకి అడుగుపెట్టినపుడు పనికొస్తాయి. వెడ్డింగ్‌ ప్లానింగ్‌ అంటే నమ్మకంతో కూడుకున్నపని. విజయవంతంగా పనిచేయడం మొదలుపెడితే అవకాశాలు పెరుగుతాయి. ఈ కోర్సులో చేరినవారు బృందంతో పనిచేయడం, రంగుల ఎంపిక, మనీ మేనేజ్‌మెంట్‌, వివిధ రకాల వ్యక్తులతో మాట్లాడటంపై శ్రద్ధపెట్టాలి. వ్యాపార నియమాలు, పాటించాల్సిన విలువల గురించీ తెలుసుకోవాలి. ప్రారంభంలో కొంచెం కష్టపడాల్సి వస్తుంది. అలవాటయ్యాక ఉద్యోగంలో సంతృప్తి ఉంటుంది. ఎప్పటికప్పుడు నైపుణ్యాలను మెరుగుపరచుకుంటుండాలి. కొత్త పోకడలను తెలుసుకుంటూ నిత్యవిద్యార్థిగా ఉండగలగాలి.

- సుష్మ శెట్టి, వెడ్డింగ్‌ అండ్‌ ఈవెంట్‌ ప్లానర్‌, లక్కీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌