• facebook
  • whatsapp
  • telegram

మేటి భవితకు..ముఖద్వారాలు!

ప్రపంచంలో ప్రతి పని లక్ష్యం ఏదో ఒక లాభమే అవుతుంది. అది వ్యక్తిగతం లేదా వ్యాపారం కావచ్చు. ఆ లాభాన్ని పొందాలంటే కొన్ని నైపుణ్యాలు కావాలి.  అదే మేనేజ్‌మెంట్‌. అలాగే ఒక వ్యక్తి, సమాజం, దేశం, ప్రపంచం అభివృద్ధి చెందాలంటే సరైన నిర్వహణ ఉండాల్సిందే. ఆర్థిక వ్యవస్థల ప్రగతి అంతా మేనేజర్ల చేతుల్లోనే ఉంటుంది. మేలైన ఉత్పత్తులు, మెరుగైన సేవలు ఇలా అన్నిరకాల వ్యాపార, వాణిజ్య కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషించే మేనేజ్‌మెంట్‌ విభాగంలోకి వెళ్లాలంటే ఎంబీఏ లేదా తత్సమాన పట్టా కావాలి. దాన్ని ప్రసిద్ధ సంస్థల నుంచి పొంది ఉంటే ప్రయోజనాలు మరింత ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రఖ్యాత ఇన్‌స్టిట్యూట్‌ల్లో మేనేజ్‌మెంట్‌ కోర్సుల ప్రవేశపరీక్షలకు ప్రకటనలు వెలువడ్డాయి. మరికొన్ని రాబోయే నెలల్లో రానున్నాయి. అభ్యర్థులు వాటిపై తగిన అవగాహన పెంచుకుంటే ఎప్పటికీ తరగని డిమాండ్‌ ఉన్న మేనేజ్‌మెంట్‌ రంగంలోకి ఎంటర్‌ కావచ్చు.
 

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యువత ప్రాధాన్యం ఇస్తోన్న కోర్సుల్లో మేనేజ్‌మెంట్‌ ముందు వరుసలో నిలుస్తోంది. కెరియర్‌లో ఉన్నత స్థాయికి ఎదగడానికి, సొంతంగా వ్యాపారం నిర్వహించుకోవడానికి ఈ విద్య అనువుగా ఉండటమే అందుకు కారణం.  ప్రస్తుతం బహుళ జాతి కంపెనీల్లోని ఉన్నత ఉద్యోగుల్లో సింహభాగం బీ-స్కూల్‌ పట్టభద్రులదే. మెరికల్లాంటి బిజినెస్‌ గ్రాడ్యుయేట్లను ఎమ్మెన్సీలు కోట్లు వెచ్చించి ఎంపిక చేసుకుంటున్నాయి. ఎర్ర తివాచీలతో ఆహ్వానం పలుకుతున్నాయి. ఇలాంటి ఉన్నత ఉద్యోగ జీవితాన్ని ఆశించే యువత ప్రసిద్ధ సంస్థల్లో కోర్సు చేయాల్సి ఉంటుంది. అందుకోసం ముందుగా కొన్ని ప్రవేశపరీక్షల్లో మంచి ర్యాంకులు సాధించాలి. ప్రపంచవ్యాప్తంగా స్టాన్‌ఫోర్డ్‌, హార్వర్డ్‌, ఆక్స్‌ఫర్డ్‌ వంటి సంస్థల్లో మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్లకు జీమ్యాట్‌, దేశీయంగా ఐఐఎంల్లో ప్రవేశానికి క్యాట్‌, రాష్ట్రస్థాయి కాలేజీల్లో చేరడానికి ఐసెట్‌ (ఈ విద్యా సంవత్సరానికి పరీక్ష ముగిసింది) ప్రధాన పరీక్షలు.  ఇవేకాకుండా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి చెందిన ప్రైవేటు బీ-స్కూల్స్‌ అడ్మిషన్లకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి. జేవియర్‌ సంస్థల్లో ప్రవేశానికి ఎక్స్‌ఏటీ, సింబయాసిస్‌లో చేరడానికి శ్నాప్‌, నర్సీమోంజీ కోసం ఎన్‌ మ్యాట్‌, ఇంకా మ్యాట్‌, సీమ్యాట్‌ వంటి పరీక్షలు ఉన్నాయి. అభ్యర్థులు తమ లక్ష్యాలకు అనుగుణంగా తగిన పరీక్షను ఎంచుకొని సిద్ధం కావచ్చు. ఆ పరీక్షల వివరాలు కింద చూడవచ్చు. వాటితోపాటు...
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌, ముంబయి తమ క్యాంపస్‌ల్లో ప్రవేశానికి టిస్‌ నెట్‌ను నిర్వహిస్తుంది. సాధారణంగా జనవరిలో పరీక్ష జరుగుతుంది.
వెబ్‌సైట్‌:
www.tiss.edu
ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ మేనేజ్‌మెంట్‌-ఆనంద్‌, రూరల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులో ప్రవేశానికి ప్రత్యేక పరీక్ష నిర్వహిస్తోంది. పరీక్షలో సాధారణంగా 40 ప్రశ్నలు ఉంటాయి. వీటికి 80 మార్కులు.
వెబ్‌సైట్‌: www.irma.ac.in
ముద్రా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేషన్‌, అహ్మదాబాద్‌.. అడ్వర్టైజింగ్‌ కోర్సులో ప్రవేశానికి సొంతంగా పరీక్ష నిర్వహిస్తోంది. దరఖాస్తుకు చివరి తేది: జులై 6
వెబ్‌సైట్‌: ‌w
ww.mica.ac.in


స్కోర్‌ ఒక్కటే సరిపోదు


జాతీయ స్థాయిలో నిర్వహించే ఎంబీఏ పరీక్షల్లో కేవలం రాతపరీక్షలో ప్రావీణ్యం సాధిస్తే సరిపోదు. అది రెండో దశకు చేరడానికే ఉపయోగపడుతుంది. అనంతరం నిర్వహించే గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూల్లో ప్రతిభ చూపితేనే పేరున్న సంస్థల్లో ఎంబీఏ సీటు లభిస్తుంది. అలాగే క్యాట్‌లో ఎక్కువ స్కోర్‌ సాధించినంత మాత్రాన మంచి బీ-స్కూల్లో సీటు వస్తుందని భావించకూడదు. ఎందుకంటే ఆ స్కోర్‌కు ఒక్కో ఐఐఎం ఒక్కో విధమైన వెయిటేజీ ఇస్తున్నాయి. ఐఐఎం అహ్మదాబాద్‌  క్యాట్‌ స్కోర్‌కు 60 నుంచి 80 శాతం  వెయిటేజీ ఇస్తోంది. అదే ఐఐఎం బెంగళూరు 50 శాతం వరకే వెయిటేజీ ఇస్తోంది. మిగిలిన 50 శాతం అకడమిక్‌ ప్రతిభ, పని అనుభవం, ఎక్స్‌ట్రా  కరిక్యులర్‌ యాక్టివిటీస్‌ తదితర విభాగాల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని గుర్తించి తుది ఎంపిక చేపడుతోంది.
 

ఇతర ప్రయోజనాలెన్నో!
ఎంబీఏలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల సన్నద్ధతతో పలు రకాల పోటీ పరీక్షలను ఎదుర్కోవడం సులువవుతుంది. బ్యాంక్‌ పీవో, ఎస్‌ఎస్సీ-సీజీఎల్‌, రైల్వే నాన్‌-టెక్నికల్‌ ఉద్యోగాలు, ఎల్‌ఐసీ, ఎన్‌ఐసీ తదితర బీమా కంపెనీల్లో అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌; నాబార్డ్‌, ఆర్‌బీఐల్లో అడ్మినిస్ట్రేషన్‌ ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షలకు హాజరుకావచ్చు. సిలబస్‌ దాదాపు ఒకేలా ఉండడమే దీనికి కారణం. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవాళ్లు అదనంగా జనరల్‌ అవేర్‌నెస్‌ చదువుకుంటే సరిపోతుంది. క్యాంపస్‌ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లోనూ ఎక్కువ ప్రశ్నలు ఈ అంశాలపైనే వస్తున్నాయి. అందువల్ల మేనేజ్‌మెంట్‌ ప్రవేశ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పోటీ పరీక్షల్లోనూ విజయం సాధించడానికి అవకాశం ఉంది.
 

విదేశాల్లో ఎంబీఏకి జీమ్యాట్‌
గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్టుకు సంక్షిప్త రూపమే జీమ్యాట్‌.  ప్రపంచ ప్రఖ్యాత బీ-స్కూల్స్‌లో ప్రవేశానికి అన్ని దేశాలవారూ కామన్‌గా రాసే పరీక్ష జీమ్యాట్‌.  ఈ పరీక్ష స్థాయి క్యాట్‌ కంటే కొంచెం అధికంగా ఉంటుంది. జీమ్యాట్‌ స్కోర్‌ ద్వారా ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా సంస్థలు మేనేజ్‌మెంట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. 150కి పైగా దేశాల్లో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. భారత్‌లోనూ 120కి పైగా బీ-స్కూల్స్‌ ఈ స్కోర్‌తో సీట్లు కేటాయిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రసిద్ధ ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ), ఐఐఎంలు, ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ తదితర సంస్థలు ఈ స్కోర్‌తో ప్రవేశాలు కల్పిస్తున్నాయి. జీమ్యాట్‌లో మొత్తం 800కి 720 పైగా స్కోర్‌ సాధించినవాళ్లు ప్రపంచంలోని టాప్‌-10 మేనేజ్‌మెంట్‌ సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. 700+ స్కోర్‌ సాధించినవారికి టాప్‌ -25 సంస్థల్లో అవకాశం ఉంటుంది. 680+ స్కోర్‌ సాధించినవారికి విశ్వవ్యాప్తంగా ఉన్న టాప్‌-100 సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పరీక్ష ఫీజు 250 డాలర్లు. మన కరెన్సీలో రూ.17 వేలకు పైగా ఉంటుంది. స్కోరు అయిదేళ్లపాటు చెల్లుబాటవుతుంది. ఆదివారాలు, జాతీయ సెలవు దినాల్లో తప్ప పరీక్ష ఏడాది మొత్తం ఉంటుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు రాసుకోవచ్చు. అయితే ఏడాదిలో ఒక అభ్యర్థి అయిదుసార్లు  మాత్రమే రాయడానికి అనుమతి ఉంటుంది.  రెండు పరీక్షల మధ్య వ్యవధి కనీసం 16 రోజులు ఉండాలి. సరైన సమాధానాలు గుర్తించే కొద్దీ తర్వాత వచ్చే ప్రశ్నల క్లిష్టత  పెరగడం ఈ పరీక్ష ప్రత్యేకత. జవాబులు తప్పుగా పెడితే తర్వాతి ప్రశ్నల స్థాయి తగ్గుతుంటుంది. ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గుర్తించారనే దానితోపాటు ఎన్ని క్లిష్టమైన ప్రశ్నలకు జవాబులు ఇచ్చారనే అంశంపైనా  స్కోరు ఆధారపడి ఉంటుంది. అన్ని ప్రశ్నలకూ జవాబులు గుర్తించాలి. వదిలేసిన ప్రశ్నలకు పెనాల్టీ మార్కులు విధిస్తారు. పరీక్ష పూర్తయిన వెంటనే స్కోర్‌ కనిపిస్తుంది. అభ్యర్థి తాను పరీక్ష రాసిన తీరుపై సంతృప్తిగా లేకపోతే స్కోర్‌ డిస్‌ప్లే కాకముందే ప్రయత్నాన్ని క్యాన్సిల్‌ చేసుకోవచ్చు. పరీక్షకు దరఖాస్తు చేసుకునే సమయానికే అభ్యర్థి పాస్‌పోర్టు కలిగి ఉండాలి.
పరీక్ష తీరు: అనలిటికల్‌ రైటింగ్‌, ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, వెర్బల్‌ అంశాల్లో ప్రశ్నలు ఉంటాయి. అనలిటికల్‌ రైటింగ్‌ వ్యవధి 30 నిమిషాలు. ఇంటిగ్రేటెడ్‌ రీజనింగ్‌ నుంచి 12 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి 30 నిమిషాలు. క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌లో 31 ప్రశ్నలను 62 నిమిషాల్లో పూర్తిచేయాలి. వెర్బల్‌ విభాగంలో 36 ప్రశ్నలను 65 నిమిషాల్లో పూర్తిచేయాలి. మొత్తం వ్యవధి 3 గంటల 7 నిమిషాలు.
వెబ్‌సైట్‌:
www.mba.com/india
 

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ - క్యాట్‌
జాతీయస్థాయి మేనేజ్‌మెంట్‌ పరీక్ష ఇది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 160 బీ-స్కూల్స్‌లో ప్రవేశం లభిస్తుంది. ఇరవై ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం)ల్లో విద్యాభ్యాసానికి క్యాట్‌ స్కోరే ప్రామాణికం. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. సాధారణంగా ఆగస్టులో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయి. నవంబరులో పరీక్షలు ఉంటాయి. జనరల్‌ ఆప్టిట్యూడ్‌లో భాగంగా ఇంగ్లిష్‌, మ్యాథ్స్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ఆన్‌లైన్‌ పరీక్షలో ప్రశ్నలు ఉంటాయి. సీట్ల భర్తీ కోసం ఒక్కో ఐఐఎం ఒక్కోరకమైన విధానాన్ని అనుసరిస్తున్నాయి.  క్యాట్‌ సన్నద్ధతతో దేశీయంగా నిర్వహించే మిగిలిన మేనేజ్‌మెంట్‌ పరీక్షలను సులువుగానే ఎదుర్కోవచ్చు.
క్యాట్‌-2017: క్యాట్‌ పరీక్ష విధానంలో తరచూ మార్పులు ఉంటాయి.  2017లో సెక్షన్‌-1లో వెర్బల్‌ ఎబిలిటీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ - 34 ప్రశ్నలు; సెక్షన్‌-2లో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌ - 32;  సెక్షన్‌ -3లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ -34 ప్రశ్నలు వచ్చాయి. పరీక్ష వ్యవధి 3 గంటలు. ఒక్కో సెక్షన్‌కు గంట సమయం కేటాయించారు. ప్రతి సెక్షన్‌లోనూ మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలతోపాటు నేరుగా జవాబు పూరించే ప్రశ్నలు కూడా వచ్చాయి. మొత్తం వంద ప్రశ్నలు ఇచ్చారు.
వెబ్‌సైట్‌:
https://iimcat.ac.in
 

జేవియర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎక్స్‌ఏటీ)
క్యాట్‌ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో రాసే మేనేజ్‌మెంట్‌ పరీక్ష ఎక్స్‌ఏటీ. దీన్ని జేవియర్‌ లేబర్‌ రిలేషన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) నిర్వహిస్తుంది.
దేశంలో టాప్‌ -5 బీ స్కూళ్లలో ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ - జంషెడ్‌పూర్‌ ఒకటి. ఈ స్కోర్‌ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న వంద సంస్థల్లో ప్రవేశం లభిస్తుంది. పరీక్షలు సాధారణంగా జనవరి మొదటివారంలో నిర్వహిస్తారు.
ఎక్స్‌ఏటీ-2018: ఇందులో రెండు భాగాలు ఉన్నాయి. పార్ట్‌ -1లో మూడు సెక్షన్లు ఉంటాయి. అందులోని సెక్షన్‌-ఎలో వెర్బల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ 26 ప్రశ్నలు, సెక్షన్‌-బి డెసిషన్‌ మేకింగ్‌ ఎబిలిటీ 21, సెక్షన్‌-సి క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 27 ప్రశ్నలు ఇచ్చారు. పార్ట్‌-2 జనరల్‌ నాలెడ్జ్‌ 25 ప్రశ్నలు అడిగారు. ఇదే విభాగంలో ఒక ఎస్సే రాయాలి.  ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు. తప్పు సమాధానానికి పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి మూడున్నర గంటలు. పార్ట్‌ -1 కు 170, పార్ట్‌-2 కు 40 నిమిషాలు కేటాయించారు. జనరల్‌ నాలెడ్జ్‌, ఎస్సే మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.
వెబ్‌సైట్‌:
www.xatonline.net.in
 

సింబయాసిస్‌ నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (శ్నాప్‌)
దేశవ్యాప్తంగా ఉన్న సింబయాసిస్‌ సంస్థల్లో ప్రవేశానికి శ్నాప్‌ టెస్ట్‌ రాయాలి. ఈ సంస్థ ఆధ్వర్యంలో 15 బీ-స్కూళ్లు ఉన్నాయి. ఈ సంస్థల్లో ఎక్కువ భాగం పుణే, ముంబయి, బెంగళూరుల్లోనే ఉన్నాయి.
శ్నాప్‌-2017: జనరల్‌ ఇంగ్లిష్‌ 40, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా సఫిషియన్సీ 40, కరెంట్‌ అఫైర్స్‌ 30, అనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు ఇచ్చారు. మొత్తం 150 మార్కులకు 150 ప్రశ్నలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున కేటాయించారు.
వెబ్‌సైట్‌: ‌
www.snaptest.org
 

ఐఐఎఫ్‌టీ ఎంట్రన్స్‌ టెస్ట్‌
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారిన్‌ ట్రేడ్‌ (ఐఐఎఫ్‌టీ)- న్యూదిల్లీ, కోల్‌కతా, కాకినాడ క్యాంపసుల్లో ప్రవేశానికి ఈ పరీక్ష రాయాలి. పరీక్ష విధానంలో ప్రతి సంవత్సరం స్వల్ప మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
ఐఐఎఫ్‌టీ -2017: ఇందులో 6 సెక్షన్లు ఉన్నాయి. జనరల్‌ అవేర్‌నెస్‌ నుంచి 18, వెర్బల్‌ ఎబిలిటీ 20, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ -16, లాజికల్‌ రీజనింగ్‌ 20,  క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ 20, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌ 20 ప్రశ్నలు వచ్చాయి.
మొత్తం 114 ప్రశ్నలు. వీటికి 100 మార్కులు. జనరల్‌ అవేర్‌నెస్‌లో ఒక్కో ప్రశ్నకు అర మార్కు, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌లో ఒక్కో ప్రశ్నకు ముప్పావు మార్కు చొప్పున కేటాయించారు. మిగిలిన అన్ని విభాగాలకూ ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు.
వెబ్‌సైట్‌: ‌
www.iift.edu/
 

ఎన్‌-మ్యాట్‌
నర్సీమోంజీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎన్‌-మ్యాట్‌ పరీక్ష నిర్వహిస్తోంది. ఈ సంస్థకు ముంబయి, బెంగళూరు, హైదరాబాదుల్లో క్యాంపస్‌లు ఉన్నాయి.
ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఈ స్కోర్‌తో నర్సీమోంజీ సంస్థలతోపాటు విట్‌, ఎస్‌ఆర్‌ఎం, అలియెన్స్‌, బీఎంఎల్‌ ముంజాల్‌ యూనివర్సిటీలు ప్రవేశం కల్పిస్తున్నాయి.దరఖాస్తు ప్రారంభం: జులై 3.
ఎన్‌ మ్యాట్‌-2017: లాంగ్వేజ్‌ స్కిల్స్‌ 32, క్వాంటిటేటివ్‌ స్కిల్స్‌ 48, లాజికల్‌ రీజనింగ్‌ 40 ప్రశ్నలు అడిగారు. వ్యవధి రెండు గంటలు. నెగెటివ్‌ మార్కులు లేవు. సెక్షన్ల వారీ కటాఫ్‌లు ఉన్నాయి.
వెబ్‌సైట్‌:
‌www.nmims.edu, http://www.nmat.org.in/
 

మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (మ్యాట్‌)
ఈ పరీక్షను ఆల్‌ ఇండియా మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ నిర్వహిస్తుంది. ఈ స్కోర్‌తో దేశవ్యాప్తంగా 600కు పైగా బీ-స్కూళ్లు ప్రవేశం కల్పిస్తున్నాయి. పరీక్ష ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రెండు విధాల్లోనూ నిర్వహిస్తారు. 
ఆసక్తి ఉన్నవారు రెండింటినీ రాసుకోవచ్చు మ్యాట్‌-2018: లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, మ్యాథమేటికల్‌ స్కిల్స్‌, డేటా అనాలిసిస్‌ అండ్‌ సఫీషియన్సీ, ఇంటెలిజెన్స్‌ అండ్‌ క్రిటికల్‌ రీజనింగ్‌, ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్వైరాన్మెంట్‌లకు సంబంధించి ఒక్కో విభాగం నుంచి 40 ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇండియన్‌ అండ్‌ గ్లోబల్‌ ఎన్వైరాన్‌మెంట్‌ విభాగంలో సాధించిన మార్కులను బీ స్కూళ్లు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు ఉంటుంది. సెప్టెంబరులో నిర్వహించే పరీక్షకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 24
వెబ్‌సైట్‌:
www.aima.in
 

కామన్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (సీమ్యాట్‌)
సీమ్యాట్‌ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఏఐసీటీఈ గుర్తింపు పొందిన ఎంబీఏ కళాశాలల్లో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండుసార్లు సెప్టెంబరు, ఫిబ్రవరిల్లో నిర్వహిస్తారు.
సీమ్యాట్‌ -2018: క్వాంటిటేటివ్‌ టెక్నిక్స్‌ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, లాంగ్వేజ్‌ కాంప్రహెన్షన్‌, జనరల్‌ అవేర్‌నెస్‌లకు సంబంధించి ఒక్కో విభాగంలో 25 చొప్పున మొత్తం 100 ప్రశ్నలు ఉన్నాయి. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. తప్పుగా గుర్తించిన సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 3 గంటలు.
వెబ్‌సైట్‌:
‌www.aicte-cmat.in
 

ఐబీశాట్‌
ఇక్ఫాయ్‌ ఫౌండేషన్‌ ఈ పరీక్షను నిర్వహిస్తోంది. పరీక్ష ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 
ఈ పరీక్ష ద్వారా ఇక్ఫాయ్‌ బిజినెస్‌ స్కూల్‌ (ఐబీఎస్‌) హైదరాబాద్‌తోపాటు డెహ్రాడూన్‌, జయపుర, బెంగళూరు, కోల్‌కతా తదితర కేంద్రాల్లో ప్రవేశం లభిస్తుంది. 
దరఖాస్తు: జులై 1 నుంచి డిసెంబరు 12
ఐబీశాట్‌-2017: మొత్తం 140 ప్రశ్నలు ఉన్నాయి. రుణాత్మక మార్కులు లేవు. వెర్బల్‌ ఎబిలిటీ 50, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌ 30, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30, డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, డేటా అడిక్వసీ నుంచి 30 ప్రశ్నలు అడిగారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఐబీశాట్‌-2018 ప్రకటన వెలువడింది. 
వెబ్‌సైట్‌: ‌
www.ibsindia.org

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌