• facebook
  • whatsapp
  • telegram

విదేశీ భాషలు ఉపాధి బాటలు

విదేశీ భాషలు ఉపాధి బాటలు

ఆధునిక టెక్నాలజీల టేకాఫ్‌తో ప్రపంచం పెద్ద గ్రామంగా మారిపోయింది. దూరాల భారాలు తరిగిపోయాయి. భాషాంతరాల గోడలు బద్దలైపోతున్నాయి. అందరికీ అన్ని భాషలు అందుబాటులోకి వస్తున్నాయి. ఎవరు ఏ భాషైనా నేర్చుకోవచ్చు. వ్యాఖ్యాతలు, అనువాదకులు, టీచర్లు, కస్టమర్‌ సర్వీస్‌ ఆఫీసర్లు ... ఇలా ఎన్నో రకాల ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. విదేశీ భాషలు ఇప్పుడు ఉపాధి అవకాశాలకు గొప్ప వేదికలుగా మారాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో భారతదేశ కంపెనీలు అన్ని దేశాల్లోనూ విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలో సమాచార మార్పిడికి ప్రధానమైన భాషల నిపుణులకు అవకాశాలు పెరుగుతున్నాయి. విదేశీ వాణిజ్యంలో వృద్ధి కారణంగా ప్రముఖ కంపెనీలు మన దేశంలోనూ శాఖలు తెరుస్తున్నాయి. దీంతో సాఫ్ట్‌వేర్‌, బీపీవో, కేపీవో, ఎల్పీవో, మెడికల్‌ ట్రాన్స్‌క్రిప్షన్‌...ఇలా ప్రతి విభాగంలోనూ విదేశీ భాషలతో అవసరం ఏర్పడింది. అందువల్ల వీటిపై ఆసక్తి ఉన్నవారు జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, ఇటాలియన్‌, పర్షియన్‌, చైనీస్‌.. వంటి భాషల్లో ఏదో ఒక దానిలో నైపుణ్యం పెంచుకుంటే మంచి ఆదాయం ఉన్న ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌ వేదికగా ఇంటి నుంచే సంపాదన పెంచుకోవచ్చు. దేశవ్యాప్తంగా పలు యూనివర్సిటీలతోపాటు ప్రైవేటు సంస్థలు విదేశీ భాషల కోర్సులను అందిస్తున్నాయి. బేసిక్‌ లేదా ఫౌండేషన్‌తో మొదలైన ఈ కోర్సులు సర్టిఫికెట్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ వరకు విస్తరించాయి. .

వేతనాలూ ఎక్కువే!

ఇంటర్‌ప్రిటర్లుగా వ్యవహరించేవాళ్లు గంటకు రూ.వెయ్యి చొప్పున సంపాదిస్తున్నారు. అలాగే ట్రాన్స్‌లేషన్‌ చేసేవాళ్లు భాషను బట్టి పదానికి రూపాయి నుంచి పది రూపాయల వరకు తీసుకుంటారు. నాలెడ్జ్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (కేపీవో)లో చేసేవాళ్లు నెలకు లక్షల్లో జీతాలు అందుకుంటున్నారు. పర్యాటక రంగం కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో సర్టిఫైడ్‌ టూరిస్ట్‌ గైడ్లు సీజన్‌లో రోజుకి రూ. మూడు వేలు తేలిగ్గా తీసుకుంటున్నారు.పెరుగుతున్న అవసరాలకు తగినంతమంది విదేశీ భాషలు వచ్చినవాళ్లు లేరని ఈ రంగంలో స్థిరపడిన నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఏదైనా భాషలో ప్రావీణ్యం పొందితే తక్కువ వ్యవధిలోనే ఉద్యోగాన్ని సంపాదించుకోవచ్చు.

ఏం నేర్పుతారు!

చాలావరకు యూనివర్సిటీలు ప్రవేశపరీక్ష నిర్వహించి విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. ఈ పరీక్షలో జీకే, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ గ్రామర్‌, కాంప్రహెన్షన్‌ విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా అభ్యర్థులను చేర్చుకుంటారు. కొన్ని సంస్థల్లో ప్రవేశానికి ఇంటర్వ్యూ తప్పనిసరి. ముందుగా ఆయా భాషల్లో వినడం, చదవడం, మాట్లాడడం, రాయడం నేర్పుతారు. తర్వాత ఆ భాషల నుంచి ఆంగ్లం లేదా మన మాతృభాషలోకి తర్జుమా (ట్రాన్స్‌లేషన్‌) చేయడంపై శిక్షణ ఉంటుంది. ఆ భాషా సంబంధిత దేశ సంస్కృతి, ఆచారవ్యవహారాలపైనా అవగాహన కల్పిస్తారు. జేఎన్‌యూ, దిల్లీ వంటి యూనివర్సిటీల్లో విదేశీ భాషలు చదువుకుంటున్న విద్యార్థులను స్టూడెంట్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రోగ్రామ్‌ కింద కొన్నాళ్లపాటు విదేశాలకు పంపుతారు. ఈ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు కూడా లభిస్తున్నాయి.

ఇవీ సంస్థలు

విదేశీ భాషలు నేర్పడానికి దేశంలోని ప్రసిద్ధ సంస్థల్లో ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ), హైదరాబాద్‌ ఒకటి. ఇది కేవలం విదేశీ భాషల కోసమే ఆవిర్భవించింది. లఖ్‌నవూ, షిల్లాంగ్‌ల్లోనూ దీనికి క్యాంపస్‌లు ఉన్నాయి. దీంతోపాటు దిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీలు ఇతర ప్రముఖ సంస్థలు. అలాగే హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ, రామకృష్ణ మఠం కూడా తక్కువ ఫీజులతో విదేశీ భాషలు నేర్పడంలో ఖ్యాతి గడించాయి. పదో తరగతి విద్యార్హతతోనే 17 ఏళ్లు పైబడిన వాళ్లు వీటిలో చేరవచ్చు. పలు ప్రైవేటు సంస్థల్లోనూ వీటిని నేర్పుతున్నారు. సంస్థను బట్టి సర్టిఫికెట్‌, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా, పీజీ డిప్లొమా, పీజీ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ వంటి కోర్సులను అందిస్తున్నారు.

డిప్లొమా లేదా సర్టిఫికెట్‌ కోర్సులు అందిస్తున్న ఇతర సంస్థలు:

* చైనీస్‌: చైనీస్‌ లాంగ్వేజ్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ, గుడ్‌గావ్‌

ఫ్రెంచ్‌: అలియన్స్‌ ఫ్రాంచైజ్‌, న్యూదిల్లీ

జర్మన్‌: గోయితె ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ, హైదరాబాద్‌.

ఇటాలియన్‌: ఇటాలియన్‌ కల్చరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, న్యూదిల్లీ

జపనీస్‌: మన్బుషో స్కాలర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా, న్యూదిల్లీ

స్పానిష్‌: ఇన్‌స్టిట్యూటో హిస్పానియా, ముంబయి, దిల్లీ, చెన్నై

* వైఎంసీఏ, భారతీయ విద్యా భవన్లు వివిధ భాషల్లో సర్టిఫికెట్‌, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి.

సంస్థలవారీ అందుబాటులో ఉన్న కోర్సులు

* ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఇఫ్లూ), హైదరాబాద్‌

బీఏ (ఆనర్స్‌): అరబిక్‌, ఫ్రెంచ్‌, జర్మన్‌, జపనీస్‌, రష్యన్‌, స్పానిష్‌ ఒక్కో కోర్సులో హైదరాబాద్‌ క్యాంపస్‌లో 20 చొప్పున సీట్లు ఉన్నాయి.

ఎంఏ: అరబిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, ఫ్రెంచ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, జర్మన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, హిస్పానిక్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌, రష్యన్‌ లాంగ్వేజ్‌ అండ్‌ లిటరేచర్‌ ఒక్కో సబ్జెక్టులో 20 చొప్పున హైదరాబాద్‌ క్యాంపస్‌లో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

పీహెచ్‌డీ: రష్యన్‌, జర్మన్‌, స్పానిష్‌, ఫ్రెంచ్‌, అరబిక్‌ భాషల్లో పీహెచ్‌డీ కోర్సులను ఇఫ్లూ అందిస్తోంది. రాతపరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా యూజీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి.

* ఉస్మానియా యూనివర్సిటీ

ఎంఏ: అరబిక్‌, ఇస్లామిక్‌ స్టడీస్‌, పర్షియన్‌ భాషల్లో ఎంఏ అందిస్తోంది. జర్మన్‌, ఫ్రెంచ్‌, అరబిక్‌, పర్షియన్‌ భాషల్లో జూనియర్‌, సీనియర్‌, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమాలనూ అందిస్తోంది. వీటిని ఎవరైనా నేర్చుకోవచ్చు. తరగతులు ఉదయం జరుగుతాయి. సాధారణంగా జులైలో ప్రకటన వస్తుంది.

* ఆంధ్రా యూనివర్సిటీ: ఫ్రెంచ్‌లో జూనియర్‌ డిప్లొమా, సీనియర్‌ డిప్లొమా కోర్సులు నిర్వహిస్తోంది.

* జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూదిల్లీ: వివిధ స్థాయుల్లో అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, జపనీస్‌, కొరియన్‌, మంగోలియన్‌, రష్యన్‌, చైనీస్‌, పర్షియన్‌ భాషలను బోధిస్తోంది.

* దిల్లీ యూనివర్సిటీ: అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, ఇటాలియన్‌, పోర్చుగీసు, రొమానియన్‌, జపనీస్‌, చైనీస్‌, కొరియన్‌ భాషల్లో వివిధ స్థాయుల్లో కోర్సులు ఉన్నాయి.

* జామియా మిల్లియా ఇస్లామియా: అరబిక్‌, ఫ్రెంచ్‌, స్పానిష్‌, ఇటాలియన్‌, పోర్చుగీస్‌, టర్కిష్‌, పర్షియన్‌ తదితర భాషల్లో కోర్సులను వివిధ స్థాయుల్లో అందిస్తోంది.

ఉద్యోగావకాశాలు

ప్రపంచంలో ఎన్నో వేల భాషలు ఉన్నాయి. ప్రతి దేశానికీ ఇంకో దేశంతో వర్తక, వాణిజ్య అవసరాలు పెరుగుతున్నాయి. దీంతో రెండు దేశాల భాషలు తెలిసినవాళ్లకు డిమాండ్‌ ఉంటోంది. కంపెనీల మధ్య సంధానకర్తలుగా వీరికి ఉద్యోగాలు లభిస్తున్నాయి.

వర్తక వాణిజ్యాల వెంటే పర్యాటక రంగం విస్తరిస్తోంది. ఉదాహరణకు జర్మనీ నుంచి వచ్చిన అతిథికి మన తాజ్‌మహల్‌ గొప్పదనాన్ని వివరించాలంటే జర్మన్‌ భాష తెలిసినవాళ్లతోనే సాధ్యమవుతుంది. ఇలా పలు దేశాల నుంచి వచ్చిన అతిథులకు గైడ్‌లుగా వ్యవహరించడానికి నిపుణుల అవసరం పెరుగుతోంది.

ప్రముఖ సంస్థలన్నింటికీ విదేశాల్లో కార్యాలయాలున్నాయి. అలాగే దాదాపు అన్ని పెద్ద సంస్థలకూ విదేశాల్లో ఖాతాదారులు, వినియోగదారులు (క్లయింట్స్‌) ఉంటారు. వీరందరూ మాట్లాడే భాష ఒకటి కాదు. ఒక్కొక్కరూ ఒక్కో భాషలో మాట్లాడతారు. ఇలాంటప్పుడు ఆ భాష తెలిసినవారుంటే సమస్య ఉండదు. సాఫ్ట్‌వేర్‌ లేదా ఇతర బహుళజాతి సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు కొన్నిసార్లు క్లయింట్‌ వద్ద పనిచేయాల్సి ఉంటుంది. ఇలాంటప్పుడు క్లయింట్‌ భాష తెలిసినవాళ్లకే విదేశాలకు (ఆన్‌సైట్‌) వెళ్లే అవకాశాలు అదనపు ఆదాయం, సౌకర్యాలతో లభిస్తాయి.

ప్రభుత్వాలకు చెందిన విదేశీ, రాయబార కార్యాలయాలు, విదేశీ మంత్రిత్వ శాఖ, ఐక్యరాజ్యసమితి విభాగాలు, వివిధ సంస్థల కేంద్రాలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. వీటిల్లో పనిచేయడానికి అక్కడి స్థానిక భాష తెలిసిన వారిని తీసుకుంటారు.

ప్రముఖ పుస్తకాలు, కీలక సమాచారం, అంతర్జాతీయ స్థాయి నిర్ణయాలు.. మొదలైనవి ప్రపంచవ్యాప్తంగా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలంటే ఆయా స్థానిక భాషల ద్వారానే సాధ్యం. అందుకే ఒక భాష నుంచి ఇంకో భాషలోకి తర్జుమా చేసేవాళ్లకు కూడా మంచి ఉద్యోగాలు లభిస్తున్నాయి. సెల్‌ఫోన్లు, టీవీలు మొదలైన ఉపకరణాలకు సంబంధించి యూజర్‌ మాన్యువల్‌ను వినియోగదారుడి స్థానిక భాషలో రూపొందించాలి. దీంతో ప్రతి ఉత్పత్తి కంపెనీలోనూ భాషా నిపుణులకు అవకాశాలు ఉంటున్నాయి. చాలా వరకు ప్రైవేటు పాఠశాలల్లో సిలబస్‌తో సంబంధం లేకుండా ఏదో ఒక విదేశీ భాషను విద్యార్థులకు నేర్పుతున్నారు. అలాగే ఫారిన్‌ లాంగ్వేజ్‌లు నేర్పే కోచింగ్‌ సెంటర్లు పెరుగుతున్నాయి. ప్రముఖ విశ్వవిద్యాలయాలన్నింట్లోనూ ఏదో ఒక విదేశీ భాష అందుబాటులో ఉంటోంది. పలు కళాశాలలు డిగ్రీ స్థాయిలోనే విదేశీ భాషలను అందిస్తున్నాయి. వీటన్నింటిలోనూ బోధకులుగా ఉపాధి దొరుకుతోంది.

కేంద్రీయ విద్యాలయాలు, ఆర్మ్‌డ్‌, పారా మిలటరీ ఫోర్సెస్‌, రిసెర్చ్‌ అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌, ఎంబసీ/ హైకమిషన్స్‌, కాల్‌ సెంటర్లు, ఎమ్మెన్సీలు, టూరిజం, ఇండియన్‌ ఫారిన్‌ మినిస్ట్రీ, ఐక్యరాజ్యసమితి తదితర సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ప్రచారం, వినోదం, మీడియా, ఆతిథ్యం, విమానయానం...ఇలా పలు విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవారికి ఎప్పటికీ డిమాండ్‌ ఉంటుంది.

డిమాండ్‌ ఉన్న భాషలు

ఫ్రెంచ్‌, స్పానిష్‌, జర్మన్‌, ఇటాలియన్‌, కొరియన్‌, చైనీస్‌, పర్షియన్‌, అరబిక్‌, జపనీస్‌, రష్యన్‌ భాషల్లో ప్రస్తుతం అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనదేశం ఏయే దేశాలతో ఎక్కువగా వాణిజ్యాన్ని కొనసాగిస్తోంది, ఏ దేశాల శాఖలు భారత్‌లో ఎక్కువగా ఉన్నాయి, మన దేశానికి ఏ దేశాల నుంచి పర్యాటకులు ఎక్కువగా వస్తున్నారు...తదితర అంశాలపైన ఆధారపడి ఉద్యోగాలు ఉంటాయి.

Posted Date: 03-10-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌