• facebook
  • whatsapp
  • telegram

ఎనేబుల్డ్‌ కోర్సులు/ ఫైనాన్షియల్‌ సర్టిఫికేషన్లు

బీటెక్‌, ఎంఎస్‌సీ, ఎంసీఏ, బీ ఫార్మసీ లాంటి భిన్న నేపథ్యాలున్న అభ్యర్థుల్లో చాలామంది బ్యాంకింగ్‌ పరీక్షలు రాస్తుంటారు. వీరు మౌఖికపరీక్షలో ఆర్థికాంశాల పరిజ్ఞానం విషయంలో తడబడకుండా ప్రతిభ చూపాల్సివుంటుంది. ఇందుకు కొన్ని సర్టిఫికేషన్‌ కోర్సులు ఉపకరిస్తాయి.

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో పెట్టుబడి వ్యవస్థ (ఫైనాన్స్‌), బ్యాంకింగ్‌ రంగాలదే కీలక పాత్ర. వీటిలో ఉపాధి అవకాశాలూ పెరుగుతున్నాయి. తక్కువ సమయంలో ఈ ఆర్థిక రంగంలో ఉద్యోగాలు పొందాలనుకునేవారికి ఎనేబుల్డ్‌ కోర్సులు/ ఫైనాన్షియల్‌ సర్టిఫికేషన్లు మార్గాన్ని సుగమం చేస్తున్నాయి.
   ఈ కోర్సులను తక్కువ సమయంలో, పరిమిత ఖర్చుతో పూర్తి చేయొచ్చు. వీటికి ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకింగ్‌, ఇన్సూరెన్సు, అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీల్లో గిరాకీ ఉంది.

 
ప్రాథమిక స్థాయి సర్టిఫికేషన్లు:

1. NCFM (ఎన్‌ఎస్‌ఈ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌): దీన్ని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజి ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అందిస్తోంది.

ధ్యయనం చేసే అంశాలు: సెక్యూరిటీస్‌ మార్కెట్‌ మాడ్యూల్‌, కాపిటల్‌ మార్కెట్‌, ఎఫ్‌ఐఎమ్‌ఎమ్‌డీఏ-ఎన్‌ఎస్‌ఈ డెట్‌ మార్కెట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అనాలసిస్‌- పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌, ఫండమెంటల్‌ అనాలసిస్‌, సెక్యూరిటీస్‌ మార్కెట్‌, బ్యాంకింగ్‌ సెక్టార్‌, ఇన్సూరెన్స్‌, మైక్రో ఎకనామిక్స్‌ ఫర్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌, ఆప్షన్స్‌ ట్రేడింగ్‌ స్ట్రాటజీస్‌, కమోడిటీస్‌ మార్కెట్‌ మాడ్యూళ్ళు.

నమోదు: ఆన్‌లైన్‌లో-nseindia.com లో నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. తప్పు సమాధానానికి రుణాత్మక మార్కులుంటాయి.

వేటిలో అవకాశం?: సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌, అసెట్‌ మేనేజ్‌మెంట్‌, ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజరీ, వెల్త్‌మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, బీపీఓ, కేపీఓ.

జీతం: ప్రవేశస్థాయిలో సంవత్సరానికి రూ.లక్ష నుంచి 2 లక్షల వరకు.

2) NSIM- V-A మ్యూచువల్‌ ఫండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ సర్టిఫికెట్‌: మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీల్లో చేయాలనుకునేవారు దీన్ని ఎంచుకోవచ్చు. దీనిని ఎన్‌ఐఎస్‌ఎమ్‌ (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్స్‌) వారు అందిస్తున్నారు. దీని నిర్వహణ సెబీ ఆధ్వర్యంలో జరుగుతుంది.

అధ్యయనం చేసే అంశాలు: మ్యూచువల్‌ ఫండ్స్‌లోని ప్రధానాంశాలు, వాటి పనితీరు.

నమోదు: nism.ac.inలో నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. తప్పు సమాధానానికి 25 శాతం రుణాత్మక మార్కులుంటాయి.

ఏ సంస్థల్లో అవకాశం?: బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు, సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌ కంపెనీలు, కేపీఓ, బీపీఓ

జీతం: ప్రవేశస్థాయిలో సంవత్సరానికి రూ.లక్ష నుంచి 2 లక్షలు వరకు.

మాధ్యమిక స్థాయి:

1. డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌: బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ రంగాల్లో పనిచేయాలనుకునేవారు దీనిని ఎంచుకోవచ్చు. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ వారు అందిస్తున్నారు.

అధ్యయనం చేసే అంశాలు: బ్యాంకింగ్‌ సూత్రాలు, పద్ధతులు, బ్యాంకర్ల కోసం అకౌంటింగ్‌, ఫైనాన్స్‌, బ్యాంకింగ్‌లోని చట్టపరమైన, నియంత్రణ అంశాలు.

నమోదు: ఆన్‌లైన్‌లో- iibf.org.inలో నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రుణాత్మక మార్కులుండవు.

   ఏ సంస్థల్లో అవకాశం?: బ్యాంకులు, కేపీఓ, బీపీఓ. ఎంపిక సమయంలో బ్యాంకులు డిప్లొమా పట్టా పొందినవారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి.

జీతం: ప్రవేశస్థాయిలో సంవత్సరానికి రూ.1.8 లక్షల నుంచి 3.5 లక్షల వరకు.

2. CPFA (సర్టిఫైడ్‌ పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌: దీన్ని ఎన్‌ఐఎస్‌ఎమ్‌ వారు అందిస్తున్నారు. దీని నిర్వహణ సెబీ ఆధ్వర్యంలో ఉంటుంది.

అధ్యయనం చేసే అంశాలు: పర్సనల్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజరీకి సంబంధించిన ప్రాథమింకాంశాలు.

నమోదు: ఆన్‌లైన్‌లో- nism.ac.inలో నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రుణాత్మక మార్కులుండవు.

ఏ సంస్థల్లో అవకాశం?: బ్యాంకులు, మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీలు, ఇన్సూరెన్స్‌ కంపెనీలు, సెక్యూరిటీ బ్రోకరేజ్‌ కంపెనీలు, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కంపెనీలు, కేపీఓ, బీపీఓ. ఎంపిక సమయంలో బ్యాంకులు డిప్లొమా పట్టా పొందినవారికి ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి.

జీతం: ప్రవేశస్థాయిలో సంవత్సరానికి రూ. లక్ష నుంచి 2 లక్షల వరకు.

ఉన్నత స్థాయి:

CFP కోర్సు: ఇది అంతర్జాతీయ ప్రొఫెషనల్‌ సర్టిఫికేషన్‌. ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌, వెల్త్‌ మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ అడ్వైజరీ సర్వీసులను అందిస్తుంది. దీనిని ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్స్‌ బోర్డ్‌ ఇండియా అందిస్తోంది. ఇది ఎఫ్‌పీఎస్‌బీ, యూఎస్‌ఏకు అనుబంధ సంస్థ.

అధ్యయనం చేసే అంశాలు: ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ పరిచయం; రిస్క్‌ ఎనాలసిస్‌, ఇన్సూరెన్స్‌ ప్లానింగ్‌; రిటైర్‌మెంట్‌ ప్లానింగ్‌ - ఎంప్లాయీ బెనిఫిట్స్‌; ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లానింగ్‌; టాక్స్‌, ఎస్టేట్‌ ప్లానింగ్‌; అడ్వాన్స్‌డ్‌ ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌.

నమోదు: ఆన్‌లైన్‌లో- fpsbindia.orgలో నమోదు చేసుకోవాలి. పరీక్ష ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. రుణాత్మక మార్కులుండవు.

ఏ సంస్థల్లో అవకాశం?: బ్యాంకులు, మ్యూచువల్‌ఫండ్‌ కంపెనీలు, ఇన్సూరెన్స్‌, సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌, వెల్త్‌మేనేజ్‌మెంట్‌, ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కంపెనీల్లో. కేపీఓ, బీపీఓ/ సొంతంగా కంపెనీ పెట్టుకోవచ్చు.

జీతం: ప్రవేశస్థాయిలో సంవత్సరానికి రూ.2 లక్షల నుంచి 3 లక్షల వరకు.

పరీక్ష ఎప్పుడుంటుంది?

   డిప్లొమా ఇన్‌ బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌ సర్టిఫికేషన్‌ అఖిల భారతస్థాయిలో సంవత్సరానికి కేవలం రెండుసార్లు నిర్వహిస్తారు. ఎన్‌సీఎఫ్‌ఎమ్‌ రిజిష్టర్‌ చేసుకున్న 15 నుంచి 20 రోజులకు, సీపీఎఫ్‌ఏను 45 రోజులకు, సీపీఎఫ్‌ను 4- 6 నెలలకు లాట్లను కేటాయిస్తారు.

   అభ్యర్థి పరీక్ష రాయాలనుకున్నపుడు సంబంధిత వెబ్‌సైట్‌లోకి వెళ్లి రిజిష్టర్‌ చేసుకోవాలి. ఫీజును కూడా అక్కడే చెల్లించాలి. ప్రక్రియ పూర్తయిన తరువాత హాల్‌టికెట్‌ జారీ చేస్తారు. దాన్ని డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వాటి ప్రకారం నిర్ణీత రోజు, సమయానికి గుర్తింపు (పాన్‌) కార్డు, హాల్‌టికెట్‌తో హాజరు కావాల్సి ఉంటుంది.

ఎవరికి ఉపయోగకరం?

   ఆర్థిక రంగానికి సంబంధించిన కొన్ని మాడ్యూళ్లపై నిర్వహించే పరీక్షలే సర్టిఫికేషన్‌ కోర్సులు. ఇవి ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత అనే 3 స్థాయుల్లో ఉంటాయి. వీటిని విద్యార్థులు తమ ఆసక్తుల మేరకు ఎంచుకోవచ్చు. ఈ పరీక్షల నియంత్రణను సెబీ చూస్తుంది.

   ఈ రంగంపై ఆసక్తి ఉన్న ఇంటర్‌, డిగ్రీ, బీటెక్‌, ఎంబీఏ, ఎంసీఏ ఇలా ఏ గ్రూపు వారైనా ఈ సర్టిఫికేషన్‌ కోర్సులను చేయొచ్చు. ఇంటర్‌ తర్వాత త్వరగా ఉద్యోగం సాధించాలనుకునేవారికీ, ఉన్నత విద్యలు చదివి.. తమ చదువుకు అదనపు ప్రాధాన్యం జోడించాలనుకునేవారికీ ఇవి ఉపయోగం. బ్యాంకింగ్‌ రంగాల్లో ప్రోత్సాహకాలు, పదోన్నతి పొందాలనుకునేవారికి సెబీ ఈ సర్టిఫికేషన్లను తప్పనిసరి చేసింది.

   NISM (నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సెక్యూరిటీస్‌ మార్కెట్‌), NCFM(నేషనల్‌ స్టాక్‌ ఎక్స్‌ఛేంజెస్‌ సర్టిఫికేషన్‌ ఇన్‌ ఫైనాన్షియల్‌ మార్కెట్స్‌), SEBI (సెక్యూరిటీస్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా), FPCIL (ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ కార్పొరేషన్‌ ఇండియా లిమిటెడ్‌),    FPSB (ఫైనాన్షియల్‌ ప్లానింగ్‌ స్టాండర్డ్‌ బోర్డ్స్‌ ఆఫ్‌ ఇండియా), AMFI(అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇండియా), IIFB (ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ అండ్‌ బాంకింగ్‌)లు సంయుక్తంగా ఈ కోర్సులను రూపొందించాయి.


కోర్సుల కోసం తయారు కావడానికి 1 నుంచి 6 నెలల సమయం పడుతుంది. పరీక్ష ఫీజు స్థాయులను బట్టి రూ. 1500 నుంచి గరిష్ఠంగా రూ. 50000 వరకు ఉంటుంది.

Posted Date: 03-10-2020


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌