• facebook
  • whatsapp
  • telegram

సంగీత‌లోకంలోకి యువ‌త‌కు స్వాగ‌తం

   ప‌లుర‌కాల‌ డిగ్రీలు, డిప్లొమాలు, స‌ర్టిఫికెట్ కోర్సులు
 

వివాహాలు... కళాశాల వేడుకలు... కార్పొరేట్‌ ఈవెంట్లు... కార్యక్రమం ఏదైనప్పటికీ సంగీత సుస్వరాలు జాలువారాల్సిందే. విందు వినోదాలకు ఆటా, పాటా జతకట్టాల్సిందే. సందర్భం ఎలాంటిదైనప్పటికీ మ్యూజిక్‌ తప్పనిసరైంది. దీంతో గాయకులకు, మ్యుజీషియన్లకు డిమాండ్‌ పెరిగింది. బ్యాండు పార్టీలు, ఆర్కెస్ట్రాలు, డీజే, బుల్లితెర, వెండితెర అన్నిచోట్లా శ్రుతి లయలు తెలిసినవారికి అవకాశాలు జేజేలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో సంగీత కోర్సులు, కెరియర్‌ అవకాశాల వివరాలు చూద్దాం!
 

పిల్లాడి నుంచి పెద్దాయన వరకు, బాలల నుంచి బామ్మ దాకా.. వయసు, నేపథ్యం, ప్రాంతాల తారతమ్యం లేకుండా అందరూ సంగీతానికి సై అంటున్నారు. అందువల్ల ప్రతి కార్యక్రమంలోనూ మ్యూజిక్‌ రక్తి కడుతోంది. దీంతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం ఉన్నవారు చక్రం తిప్పుతున్నారు. సంగీతంలో వివిధ విభాగాల్లో రాణించడానికి అవకాశాలున్నాయి. గాయకులు, పాటల రచయితలు, మ్యుజీషియన్లు, కీబోర్డు ప్లేయర్లు, ఇన్‌స్ట్రుమెంటల్‌ ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్లు, సపోర్ట్‌ స్టాఫ్, మ్యూజిక్‌ క్రిటిక్‌... ఇలా సమ్మోహనమైన కెరియర్లు ఎన్నో ఉన్నాయి. నైపుణ్యం, సమర్థత, వ్యక్తిగత ఆసక్తులను అనుసరించి నచ్చిన విభాగాన్ని ఎంచుకోవచ్చు. 
 

రాణించాలంటే...
సంగీత ప్రపంచంలో రాణించడానికి ఒత్తిడిలో పనిచేయగలగాలి. విమర్శలను ఎదుర్కోవాలి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సాంకేతిక నైపుణ్యం, సృజనాత్మకత, శారీరక సామర్థ్యం, అర్థం చేసుకునే నైపుణ్యం, అన్ని విభాగాలపైనా అవగాహన...తప్పనిసరి. కెరియర్‌ మొదట్లో ఒడిదొడుకులు ఉంటాయి. చాలా తక్కువ ఆదాయమే లభించవచ్చు. కొన్నాళ్ల అనుభవంతో గుర్తింపు లభించిన తర్వాత అధికమొత్తంలో సంపాదనకు అవకాశం ఉంది. పోటీ ఎక్కువ, ప్రయాణాలూ తప్పనిసరి కావచ్చు. అలాగే భిన్న సమయాల్లో పనిచేయాల్సి రావచ్చు. నైపుణ్యం ఉన్నవారికి సినీ రంగంలోనే కాకుండా టెలివిజన్, ఎఫ్‌ఎం, రికార్డింగ్‌ సంస్థలు, శిక్షణ సంస్థలు, విద్యా సంస్థలు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో అవకాశాలు లభిస్తాయి.


 

కోర్సులు... సంస్థలు

ఈ విభాగంలో సత్తా చాటడానికి కోర్సులూ ఉన్నాయి. సంబంధిత విద్యాసంస్థల్లో చేరి నైపుణ్యాలను మెరుగుపరుచుకుని అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 
 

ఆంధ్రా యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బెనారస్‌ హిందూ యూనివర్సిటీ, దిల్లీ యూనివర్సిటీ, క్రైస్ట్‌ యూనివర్సిటీ, సెయింట్‌ జేవియర్స్‌ కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, త్యాగరాజ సంగీత కళాశాల, ఏఆర్‌ రెహమాన్‌ కేఆర్‌ మ్యూజిక్‌ కన్జర్వేటరీ, విశ్వభారతి విశ్వవిద్యాలయం, పంజాబ్‌ యూనివర్సిటీ, ముంబయి యూనివర్సిటీ... సర్టిఫికెట్, డిప్లొమా, గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్, డాక్టొరేట్‌ కోర్సులు అందిస్తున్నాయి. ఇంటర్‌ తర్వాత డిప్లొమా లేదా గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరవచ్చు. కలకత్తా స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, బెంగాల్‌ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, దిల్లీ స్కూల్‌ ఆఫ్‌ మ్యూజిక్, తమిళనాడు మ్యూజిక్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ.. తదితర సంస్థల్లోనూ చదువుకోవచ్చు.  
 

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీలో 6, తెలంగాణలో 6 కళాశాలలు సంగీతం, నృత్యం విభాగాల్లో సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. వీటిలో ప్రవేశానికి ప్రకటనలు వెలువడ్డాయి. 
 

ఏపీలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కర్నూలు, నెల్లూరు, విజయనగరంలో ఈ కాలేజీలు ఉన్నాయి. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ నవంబ‌రులో ముగిసింది.

తెలంగాణలో హైదరాబాద్, సికింద్రాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్‌ల్లో వీటిని నెలకొల్పారు. ఆసక్తి ఉన్నవారు డిసెంబరు 31లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. 
 

ఈ సంస్థల్లో సర్టిఫికెట్‌ కోర్సులు నాలుగేళ్లు, డిప్లొమా కోర్సులు రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. డిప్లొమా కోర్సులు చేసినవారు సర్టిఫికెట్‌ కోర్సుల్లో చేరవచ్చు. కర్ణాటిక్‌ వోకల్, కర్ణాటిక్‌ వయొలిన్, వీణ, మృదంగం, హిందుస్థానీ వోకల్, సితార్, తబలా, పేరిణీ నృత్యం, కూచిపూడి డ్యాన్స్, భరతనాట్యం, ఫ్లూటు, డోలు.. తదితర కోర్సులను అందిస్తున్నారు. ఆయా సంస్థలను బట్టి పదేళ్లు నిండినవారు, ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు వీటిని చదువుకోవచ్చు. ఫీజులు స్వల్ప మొత్తంలోనే ఉంటాయి.
 

సింగర్‌ / మ్యుజీషియన్‌
తప్పనిసరిగా ఏదో ఒక రోజు వెండితెరపై పాట పాడాలనే లక్ష్యంతో ఎక్కువ మంది పాటల ప్రపంచంలోకి అడుగెడుతున్నారు. పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో ఉన్న ఆసక్తిని గమనించి ఎన్నో సంస్థలు చిన్నప్పటి నుంచే  శిక్షణనందిస్తున్నాయి. టెలివిజన్‌ ఛానెళ్లు పోటీలు నిర్వహించి సృజనాత్మకతను వెలుగులోకి తెస్తున్నాయి. బుల్లితెరపై మెరిసినవారు వెండితెరపై అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. సినీ అవకాశాలు అందుకోలేనివారు ఆర్కెస్ట్రా, బ్యాండ్, డీజే, బుల్లితెర...మొదలైనచోట్ల రాణిస్తున్నారు. ఇలా సంగీత ప్రపంచంలో సత్తా చాటడానికి వివిధ మార్గాలు, వేదికలు సిద్ధమై ఉన్నాయి. శ్రావ్యమైన గొంతు, స్పష్టంగా ఉచ్చరించడం, హుషారు, కొద్దిగా నృత్యంలో నైపుణ్యం ఉన్నవారు సింగర్‌ అవతారమెత్తవచ్చు. నలుగురిలోనూ గుర్తింపు పొందడానికి గొంతులో కొత్తదనం, ప్రత్యేకత తప్పనిసరి. కెరియర్‌లో నిలదొక్కుకోవడానికి కొంచెం సహనం అవసరం. ఆ తర్వాత కూడా కష్టపడాలి. గొంతులో వైవిధ్యాన్ని ప్రదర్శించగలిగినవాళ్లు ఎక్కువ కాలం పోటీలో ఉండగలరు. 
 

ఇన్‌స్ట్రుమెంటలిస్టు
సంగీతానికి వివిధ వాద్యాలే ప్రాణం. పాటకూ, సందర్భానికీ తగ్గ మ్యూజిక్‌ ఉంటేనే కార్యక్రమం రక్తి కట్టగలదు. ఇందులో వివిధ సంగీత పరికరాలు ఉపయోగపడతాయి. సందర్భాన్ని బట్టి ఒకటి లేదా కొన్ని పరికరాలు అవసరమవుతాయి. అందువల్ల ప్రొఫెషనల్‌ ఇన్‌స్ట్రుమెంటలిస్టుగా రాణించడానికి ఏదైనా ఒక సంగీత పరికరంపై పూర్తి పట్టు తప్పనిసరి. అలాగే మిగిలినవాటిపైనా అవగాహన ఉండాలి. సంబంధిత పరికరాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగించగలిగే నేర్పరితనం ఉండాలి. దాన్ని ఉపయోగించి కొత్త ధ్వనులను సృష్టించగలగాలి. వేదికలపై వీలైనన్ని ప్రదర్శనలు ఇవ్వడం ద్వారా గుర్తింపు పొందడానికి అవకాశం లభిస్తుంది.
 

పాటల రచయిత
ఒక గొప్ప గాయకుడు ఆవిర్భవించడానికి ముందు గొప్ప పాటల రచయిత ఉండాలి. ఆ రచనతోనే పాటలు పాడేవారికీ, సంగీతాన్ని సమకూర్చేవారికీ గుర్తింపు లభిస్తుంది. ఆ పాటను జనరంజకంగా పాడడానికి, సంగీతానికి అనువుగా మలచగలగాలి. భాషపై పట్టు, అద్భుతమైన సృజన, విస్తృత పద సంపద, ఇతర భాషలపై అవగాహన, సామాజిక పరిస్థితులు, ప్రస్తుత అవసరాలు...అన్నీ తెలిస్తేనే పదాలు పల్లవిస్తాయి. వీరు మ్యూజిక్‌ పబ్లిషర్లు, రికార్డు కంపెనీలు, ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్, రికార్డింగ్‌ గ్రూప్‌లతో కలిసి పనిచేస్తారు. సినిమా, సీరియల్‌ నిర్మాణ సంస్థల్లో అవకాశాలు దక్కుతాయి.
 

రికార్డింగ్‌ టెక్నీషియన్‌
రాక్‌ బ్యాండ్లు, ఆర్కెస్ట్రాలు మొదలుకొని సినీ పరిశ్రమ వరకు మ్యూజిక్‌ రికార్డు చేయడం తప్పనిసరి. ఇందుకోసం రికార్డింగ్‌ నైపుణ్యం ఉండాలి. ఈ పని సవ్యంగా పూర్తికావడానికి హైటెక్‌ పరికరాలు, కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు ఉంటాయి. వాటిని సమన్వయంతో ఉపయోగించి శ్రోతలు మెచ్చేలా రికార్డు చేయాలి. స్వరాలతో సమ్మిళితం చేసి కమ్మని శబ్దాలను శ్రావ్యమైన స్థాయిలో అందించడంలో రికార్డర్ల సేవలు కీలకం. ఆ సంగీతాన్ని సీడీలు, పెన్‌ డ్రైవ్‌ల  రూపంలో బయటకు తెచ్చే బాధ్యత రికార్డింగ్‌ టెక్నీషియన్లదే.
 

మ్యూజిక్‌ ప్రొడ్యూసర్‌
వీరు పాటలను ఉత్పత్తి చేస్తారు. ఇందుకోసం గాయకులు, మ్యుజీషియన్లు, టెక్నీషియన్లు అందరినీ సమన్వయం చేస్తారు. చివరిగా పాటల ఆల్బమ్‌ లేదా సీడీ బయటకు వచ్చేలా చూస్తారు. ఏ పాట ఉండాలి, దానికి ఏ స్థాయిలో శబ్దం అవసరం, ఎవరైతే బాగా పాడగలరు...తదితరాలన్నీ వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. వీరికి సంగీతానికి చెందిన అన్ని విభాగాలపైనా అవగాహన ఉన్నప్పుడే రాణించడానికి వీలవుతుంది.
 

మ్యూజిక్‌ లాయర్లు 
వీరు మ్యూజిక్‌ ఆర్టిస్టులతో కలిసి పనిచేస్తారు. ముఖ్యంగా చట్టపరంగా కాపీ రైట్‌ సమస్యలు లేకుండా చూస్తారు.
 

కంపోజర్లు
వీరు గేయానికి తగిన సంగీతాన్ని అందిస్తారు. వీరికి విభిన్న రకాల సంగీత వాద్యాలపై అవగాన ఉండాలి. పాట నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సుస్వరాలను సృజించాలి. పాటకు న్యాయం జరగాలంటే కంపోజర్ల నైపుణ్యమే కీలకం. సంగీతం, శబ్దంలో కొత్తదనాన్ని సృష్టించాలి. అది వీనుల విందు కావాలి.
 

కండక్టర్లు
పాటల రచయిత, పాడినవారు, ఇన్‌స్ట్రుమెంటలిస్టులు, కంపోజర్లు... ఇలా అందరూ, అన్ని విభాగాలూ సమన్వయంతో ముందుకు సాగడంలో కండక్టర్ల (మేనేజర్ల) బాధ్యతే కీలకం. వీరికి అన్ని విభాగాలపైనా పట్టు ఉండాలి. ఆర్కెస్ట్రా, బ్యాండ్‌లో బలహీనతలు గుర్తించి అందుకు తగ్గ మార్పులు చేయగలిగే సమర్థత వీరికి ఉండాలి. 
 

సౌండ్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్లు
సంగీతానికి కావాల్సిన సౌండ్‌ ఎఫెక్ట్‌ని వీరు చూసుకుంటారు. ఇందుకోసం వివిధ పరికరాలు అవసరమవుతాయి. వాటన్నింటినీ సమన్వయం చేసి వినసొంపైన శబ్దాన్ని అందిస్తారు. సినిమాకైతే ముందుగానే ఈ క్రతువు పూర్తవుతుంది. అదే ఆర్కెస్ట్రా లైవ్‌ పెర్‌ఫామెన్స్‌ లాంటివాటికైతే వేదికపైనే వీరు కూడా పనిచేసి శబ్దాలను శ్రుతి లయలతో సమన్వయం చేస్తారు. 
 

విమర్శకులు
మ్యూజిక్‌ క్రిటిక్‌లు నేరుగా కార్యకలాపాల్లో పాల్గొననప్పటికీ సంగీతంపై వీరికి పట్టు ఉంటుంది. అందులోని లోపాలను గుర్తించగలిగే నైపుణ్యం ఉంటుంది. ప్రేక్షక శ్రోతలూ, సంగీత సిబ్బందిల మధ్య సంధానకర్తలు వీరు. ప్రింట్, బ్రాడ్‌ కాస్ట్, ఆన్‌లైన్‌ మీడియాల్లో వీరికి అవకాశాలు లభిస్తాయి. వీరు ఫ్రీలాన్సర్లుగానూ రాణించవచ్చు. మంచి విమర్శకులుగా పేరు సంపాదించినవారిని సంస్థలు సంప్రదిస్తున్నాయి. సంబంధిత మ్యూజిక్‌ విడుదల కాకముందే వీరికి చూపించి, అభిప్రాయాలను స్వీకరించి అవసరమైన మార్పులు చేసుకుంటున్నాయి. 
 

పబ్లిసిస్టులు
కమ్మని సంగీతాన్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లడం పబ్లిసిస్టుల బాధ్యత. వీరికి సంగీతంలో నైపుణ్యం లేనప్పటికీ పత్రికల్లో ఇంటర్వ్యూలు, టీవీలో సంబంధిత కార్యక్రమం వచ్చేలా చేయడం, ఆన్‌లైన్‌ (యూ ట్యూబ్‌) ప్రమోషన్‌...చూసుకుంటారు. 
 

మ్యూజిక్‌ థెరపిస్టులు
వీరినే సంగీత వైద్యులు అనవచ్చు. సంగీతాన్ని ఉపయోగించి మానసిక సాంత్వన చేకూర్చేవారే మ్యూజిక్‌ థెరపిస్టులు. ఉద్రేకాలను తగ్గించడం, ఆలోచనలను అదుపులోకి తీసుకురావడం, వివిధ బాధల నుంచి ఉపశమనం పొందేలా చేయడంలో మ్యూజిక్‌ థెరపీ ఉపయోగపడుతుంది. సంగీతంలో పూర్తి పట్టున్నవారు మ్యూజిక్‌ థెరపిస్టులుగా రాణించవచ్చు.

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌