• facebook
  • whatsapp
  • telegram

సైబ‌ర్ భ‌ద్ర‌త‌కు ఎథిక‌ల్ హ్యాకింగ్‌

ప్రపంచవ్యాప్తంగా తరచూ అనేక వెబ్‌సైట్లు హ్యాకింగ్ బారిన పడుతుంటాయి. భారత్‌లో ఈ సమస్య మరీ ఎక్కువ. సీబీఐ, ఆర్‌బీఐలతోపాటు కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, భారత రక్షణ, పరిశోధన రంగ వెబ్‌సైట్లూ దీనికి అతీతం కాదు. మన అధికారిక వెబ్‌సైట్ల హోమ్‌పేజీలో తీవ్రవాదులు వారి దేశాల జెండాలను పొందుపరిచిన సందర్భాలూ ఉన్నాయి. ఇమెయిల్స్, కంపెనీ వెబ్‌సైట్లను హ్యాక్ చేయడానికి పందాలు కూడా వేసుకుంటారంటే అతిశయోక్తికాదు.

ఇలా ప్రభుత్వ, ప్రభుత్వేతర కంపెనీలు, బ్యాంకులు అన్నీ హ్యాకింగ్‌కు గురవుతూనే ఉంటాయి. హ్యాకర్ల బారి నుంచి వెబ్‌సైట్లనూ, సమాచార వ్యవస్థనూ కాపాడుకోవడానికి కంపెనీలు ప్రత్యేకంగా నిపుణులను ఏర్పాటు చేసుకుంటాయి.వీరినే 'ఎథికల్ హ్యాకర్లు' అంటారు.

సైబర్ క్రైమ్ భిన్న తరహాల్లో విజృంభిస్తున్న నేటి ప్రపంచంలో ఎథికల్ హ్యాకర్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎథికల్ హ్యాకర్లుగా రాణించడానికి కావాల్సిన నైపుణ్యాలు, ఈ రంగంలో ఉన్న అవకాశాల గురించి తెలుసుకుందాం...

ఒక కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్‌లోని లోతుపాతుల్ని ఏ మూల నుంచో.. ఎవరో.. తెలుసుకుంటారు. వెబ్‌సైట్ వాళ్ల ఆధీనంలోకి వెళ్లిపోతుంది. ఆ వెబ్‌సైట్‌లోని కీలక సమాచారాన్ని తస్కరించడం, మార్చడం లాంటివి చేస్తారు. దీన్నే 'హ్యాకింగ్' అంటారు.

   ఒకప్పుడు ఇంటర్నెట్‌కు వైరస్ సమస్య ఉండేది. హ్యాకింగ్ దీని కంటే తీవ్రమైన సమస్యగా పరిణమించింది.  ముఖ్యంగా పేరుపొందిన సంస్థలకు ఇది తలనొప్పిగా మారింది. ముల్లును ముల్లుతోనే తీయాలని సామెత. ఎథికల్ హ్యాకర్లు కూడా హ్యాకర్లలానే పనిచేస్తారు. ఎథికల్ హ్యాకింగ్ అంటే హ్యాకింగ్ అనే అర్థమే వస్తుంది. కాకపోతే దీన్ని మంచి పనుల కోసం వాడతారు. సాధారణంగా హ్యాకర్లు వెబ్‌సైట్లలోని కీలక సమాచారాన్ని దొంగిలించడం, వైరస్‌ని వ్యాపింపజేయడం, అనవసర సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని తొలగించడం లాంటివి చేస్తారు. ఇలాంటివి జరగకుండా వెబ్‌సైట్‌కి రక్షణ కల్పించడం; వినియోగదారుల నెట్‌వర్క్, వెబ్‌సైట్లు, సర్వర్లూ హ్యాకర్ల బారిన పడకుండా సాంకేతికంగా రక్షణ కల్పించడం, అనుమతి లేకుండా ఇతరులు ఆయా సైట్లలోకి చొరబడే అవకాశం లేకుండా వాటికి భద్రత కల్పించడం ఎథికల్ హ్యాకర్ల విధులు. వీరు వెబ్‌సైట్లలో లూప్‌హోళ్లను (హాని పొందే అవకాశమున్న అంశాలు) ముందుగానే గుర్తించి, వాటి యజమానులను అప్రమత్తం చేస్తారు. ఆ సమస్యలకు సరైన పరిష్కార మార్గాలను కూడా సూచిస్తారు.

ఎలాంటి ఉద్యోగావకాశాలుంటాయి...?

హ్యాకింగ్ బారిన పడిన సంస్థల గురించి తెలుసుకున్న విషయాలు, సొంత అనుభవాల ద్వారా ప్రస్తుతం ప్రతి కంపెనీకి ఎథికల్ హ్యాకర్లను నియమించుకోవడం తప్పనిసరైంది. మన దేశంలో విప్రో, డెల్, రిలయన్స్, గూగుల్, ఆక్సెంచర్, ఐబీఎమ్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలు ఎక్కువగా ఇలాంటి నిపుణులను రిక్రూట్ చేసుకుంటున్నాయి. ఈ రంగంలో సాధారణంగా ఐటీ కంపెనీల్లోనే ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్హత, అనుభవం ఆధారంగా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.

అర్హతల ఆధారంగా నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్లు, నెట్‌వర్క్ డిఫెన్స్ ఎనలిస్టులు, వెబ్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్లు, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్లు, సెక్యూరిటీ ఎనలిస్టులు, ఫోరెన్సిక్ ఎనలిస్టులు, పెనెట్రేషన్ టెస్టర్లు, సెక్యూరిటీ ఆడిటర్లు, డేటాబేస్ డెవలపర్లు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, వెబ్ డిజైనర్లు లాంటి ఉద్యోగాల్లో చేరవచ్చు.

నెట్‌వర్క్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్, అప్లికేషన్ సెక్యూరిటీ టెస్టర్‌గా కెరీర్ ప్రారంభించేవారు భవిష్యత్తులో చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్, చీఫ్ అప్లికేషన్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా ఎదిగే అవకాశం ఉంటుంది.

ఉద్యోగావకాశాలు లభించే సంస్థలు

* రక్షణ, పరిశోధనా రంగ సంస్థలు

* ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు

* ఐటీ కంపెనీలు

* బ్యాంకులు

* డిటెక్టివ్ కంపెనీలు

* ఇన్వెస్టిగేటివ్ సంస్థలు

* లా ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు

* ఇతర ప్రైవేటు ఆర్గనైజేషన్లకు సంబంధించిన వెబ్‌సైట్లు

రక్షణ, పరిశోధన రంగ సంస్థలు, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలు, డిటెక్టివ్ కంపెనీలు, ఇన్వెస్టిగేటివ్ సర్వీసెస్ వెబ్‌సైట్లు ఎక్కువగా హ్యాకింగ్‌కు గురవుతూ ఉంటాయి. క్రిప్టోగ్రఫీ (సంకేతాలను విశ్లేషించి సాధారణ భాషలో రాయడం), ఫోరెన్సిక్ విభాగంలో (శాస్త్రీయ పద్ధతుల్లో సమాచారాన్ని విశ్లేషించడం) నైపుణ్యాలున్నవారికి ఇలాంటి సంస్థల్లో మంచి అవకాశాలుంటాయి. ఐటీ కంపెనీలే కాకుండా అనేక ఇతర వ్యాపార సంస్థలూ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నాయి. ఇవి వాటి కార్యకలాపాల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ఐటీ విభాగాలను ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఆయా సంస్థలు వాటి ఐటీ విభాగాల్లోకి ఎథికల్ హ్యాకర్లను రిక్రూట్ చేసుకుంటుండటంతో వీరికి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది.

కావాల్సిన నైపుణ్యాలు

* విశ్లేషణాత్మక ఆలోచన, ఆసక్తి, పరిశోధనా స్వభావం ఉన్నవారు ఈ రంగంలో ప్రవేశించవచ్చు.

* నెట్‌వర్కింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ప్రోగ్రామింగ్‌పై పూర్తి అవగాహన ఉండాలి.

* వీటితోపాటు ఈ రంగంలో రాణించడానికి నిజాయతీ, పరిపూర్ణత, నమ్మకం లాంటివి కూడా చాలా అవసరం.

* సమస్యలను సులభంగా పరిష్కరించగలిగే నైపుణ్యాలతోపాటు సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం కూడా ఉండాలి.

ఎలాంటి విద్యార్హతలు అవసరం?

ఎథికల్ హ్యాకింగ్‌కి సంబంధించిన కోర్సుల్లో ప్రవేశించడానికి కనీస అర్హత డిగ్రీ. కంప్యూటర్ ఒక సబ్జెక్టుగా ఇంజినీరింగ్, పీజీ అభ్యసించినవాళ్లు ఈ రంగంలో తేలిగ్గా రాణించగలుగుతారు. పేరుపొందిన ఇన్‌స్టిట్యూట్లలో శిక్షణ పొందినవారికి మల్టీనేషనల్ కంపెనీల్లో మంచి వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తున్నాయి. SAN, GIAC సంస్థలు సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ (EC Council), సర్టిఫైడ్ హ్యాకింగ్ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేటర్, జీఐఏసీ సర్టిఫైడ్ పెనెట్రేషన్ టెస్టర్ (GPEN) లాంటి సర్టిఫికేట్ కోర్సులను అందిస్తున్నాయి. వీటికి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది. ఈ విభాగాల్లో ఆన్‌లైన్, రెగ్యులర్ విధానాల్లో శిక్షణ పొందవచ్చు.

ఎథికల్ హ్యాకింగ్‌పై కోర్సులు అందిస్తున్న సంస్థలు

* డీఓఈఏసీసీ, కోల్‌కతా

ceditec.com

* ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ

www.iisecurity.in

* యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్

www.unom.ac.in     

* ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, హైదరాబాద్

www.iiit.ac.in 
* ఎస్ఆర్ఎం యూనివర్సిటీ

www.srmuniv.ac.in  

హైదరాబాద్‌లో...

* CMS Computer Institute 

* Zoom Technologies 

* Moon Technologies 

* E2 Labs

* Mist 

* Entersoftlabs 

* Spectramind 

* Hacker School 

* Tech Defence 

* Kiva Cyber Securities

వేతనాలు

కెరీర్ ప్రారంభంలో సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు జీతభత్యాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయి. ఉన్నత డిగ్రీలు, అనుభవం ఉన్న అభ్యర్థులకు పోస్టును బట్టి కొన్ని సంస్థలు రూ. 30 లక్షల వరకూ చెల్లిస్తున్నాయి. రానున్న అయిదారేళ్లలో ఈ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 2 లక్షల ఉద్యోగాలు వచ్చే అవకాశముంది. భారతదేశంలోనే 80 వేల వరకు ఎథికల్ హ్యాకింగ్ నిపుణుల అవసరముందని నిపుణుల అభిప్రాయం.

మారుతున్న టెక్నాలజీ అవసరాలను బట్టి ఈ రంగంలో మంచి భవిష్యత్తు ఉందని చెప్పవచ్చు. ల్యూసిడెస్ టెక్ అధినేత సాకేత్ మోడీని దీనికి చక్కని ఉదాహరణగా పేర్కొనవచ్చు. కార్పొరేట్ రంగంలో ఈయన పేరు తెలియనివారుండరు.

భారతీయ రిజర్వు బ్యాంక్, కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల శాఖ, ఐబీఎమ్, మైక్రోసాఫ్ట్ లాంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలెన్నో సాకేత్ ఖాతాలో ఉన్నాయి.  ఈయన ఐఐటీలతోపాటు అనేక ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు, కార్పొరేట్, ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎథికల్ హ్యాకింగ్ గురించి పాఠాలు చెబుతారు. దేశవ్యాప్తంగా వందలాది వర్కుషాపుల్ని నిర్వహించి, వేల మందికి సైబర్ భద్రత, ఎథికల్ హ్యాకింగ్, సిస్టం సెక్యూరిటీ, మొబైల్ ఫోన్ సెక్యూరిటీ లాంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుతం సాకేత్ వివిధ సంస్థలూ, బ్యాంకులూ, ఈ-కామర్స్ కంపెనీలకు సలహాదారుగా కూడా వ్యవహరిస్తున్నారు. సైబర్ భద్రత పెను సవాలుగా మారిన నేటి ప్రపంచంలో సాకేత్ లాంటి నిపుణుల అవసరం ఎంతో ఉంది.

కంప్యూటర్‌పై కనీస పరిజ్ఞానం ఉండి, సమస్యలు పరిష్కరించగలిగే నేర్పరితనం ఉంటే.. మరెందుకిక ఆలస్యం ఎథికల్ హ్యాకింగ్‌పై శిక్షణ పొంది, అధికారికంగా హ్యాకింగ్ చేయడానికి లైసెన్స్ పొందండి.

Posted Date: 17-11-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌