• facebook
  • whatsapp
  • telegram

తరగని అవకాశాలను అందించే ఆహార రంగం కోర్సులు

ఫుడ్ టెక్నాలజీలో బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ కోర్సులు

ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసిన నిఫ్టెమ్

మానవాళి మనుగడకు ఆహారం ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఫుడ్ సెక్టార్ లో కోర్సులకు, ఉద్యోగాలకు తరగని డిమాండ్ ఉంటోంది. ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని దేశంలోని ఎన్నో సంస్థలు ఫుడ్ టెక్నాలజీలో వివిధ రకాల కోర్సులను అందిస్తున్నాయి. అందులో భాగంగానే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఆంత్రప్రిన్యూర్ షిప్ అండ్ మేనేజ్మెంట్ (ఎన్ఐఎఫ్ టీఈఎం) అడ్మిషన్ల కోసం ప్రకటన విడుదల చేసింది. 

భారత ప్రభుత్వానికి చెందిన మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో హరియాణాలోని సోనెపట్ లో ఎన్ఐఎఫ్ టీఈఎం ఏర్పాటైంది. ఇది డీమ్డ్ యూనివర్సిటీ. ఇక్కడ అందించే కోర్సులకు ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ఎడ్యుకేషన్(ఏఐసీటీఈ) గుర్తింపు ఉంది. అధునాతన సౌకర్యాలతో క్యాంపస్ను ఏర్పాటు చేశారు. విద్యార్థులకు ఇక్కడ అన్ని వసతులతోపాటు అనువైన వాతావరణం ఉంటుంది. మెరగైన బోధన అందుతుంది. ఆయా కోర్సులు చేసే వారికి ఉద్యోగవకాశాలు సైతం మెండుగానే ఉంటాయి.

కోర్సుల వివరాలు

బీటెక్; ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్లో బీటెక్ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మొత్తం 189 సీట్లు ఉంటాయి. ఇందులో చేరాలంటే పన్నెండో తరగతిలో ఉత్తీర్ణత సాధించాలి. దానితోపాటు జేఈఈ(మెయిన్)-2021లో అర్హత పొంది ఉండటం తప్పనిసరి. సెంట్రల్ సీట్ అలోకేషన్ బోర్డ్(సీఎస్ఏబీ) నిర్వహించే సీటు కేటాయింపు ద్వారా ప్రవేశం పొందవచ్చు. 

ఎంటెక్; ఫుడ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్రాసెస్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్మెంట్, ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్, ఫుడ్ సప్లయ్ చెయిన్ మేనేజ్మెంట్, ఫుడ్ ప్లాంట్ ఆపరేషన్స్ మేనేజ్మెంట్లో ఈ కోర్సు అందిస్తారు. దీని వ్యవధి రెండేళ్లు. సంబంధిత విభాగంలో కనీసం 60 శాతం మార్కులతో నాలుగేళ్ల బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ చేసి ఉండాలి. గేట్ స్కోర్ ఆధారంగా ఎంపికలు చేపడతారు. గేట్ స్కోర్ లేనివారు నిఫ్టెమ్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక్కో విభాగంలో 18 సీట్లు ఉంటాయి. 

ఎంబీఏ;  ఫుడ్ అండ్ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్, మార్కెటింగ్/ ఫైనాన్స్/ ఇంటర్నేషనల్ బిజినెస్ విభాగాల్లో ఎంబీఏ చేయొచ్చు. సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ/ తత్సమాన ఉత్తీర్ణత సాధించాలి. చివరి రెండు సంవత్సరాల క్యాట్/ మ్యాట్ స్కోర్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అవి లేనివారికి ఇంటర్నల్ టెస్ట్ పెడతారు. అందులో ప్రతిభ చూపితే బృంద చర్చలు/ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. మొత్తం సీట్ల సంఖ్య 32.

పీహెచ్డీ;  అగ్రికల్చర్ అండ్ ఎన్విరాన్మెంట్ సైన్సెస్, బేసిక్ అండ్ అప్లైడ్ సైన్సెస్, ఫుడ్ ఇంజినీరింగ్, ఫుడ్ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఆంత్రప్రిన్యూర్ షిప్ డెవలప్మెంట్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసేందుకు అవకాశం ఉంది. సంబంధిత విభాగంలో కనీసం 55శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ పట్టా ఉండాలి. నెట్ జేఆర్ఎఫ్ అర్హత సాధించాలి. లేదా నిఫ్టెమ్ నిర్వహించే రిసెర్చ్ ఎంట్రన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి. సీఎస్ఐఆర్ యూజీసీ జేఆర్ఎఫ్/ ఇతర జేఆర్ఎఫ్ అర్హత సాధించిన వారు ప్రవేశ పరీక్ష రాయనవసరం లేదు. ఇంటర్వ్యూకి మాత్రం హాజరు కావాలి. పీహెచ్డీలో 33 సీట్లు ఉన్నాయి. 

దరఖాస్తు విధానం

అభ్యర్థులు ఎన్ఐఎఫ్ టీఈఎం వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్ డీ దరఖాస్తులకు ఆగస్టు 8, 2021 ఆఖరు తేదీ. 

స్కాలర్ షిప్/ ఫెలోషిప్/ ఆర్థిక సాయం

బీటెక్, ఎంటెక్ లో  ప్రతిభావంతులైన విద్యార్థులకు నిఫ్టెమ్ మెరిట్ స్కాలర్ షిప్,  మెరిట్ కమ్ మీన్స్ స్కాలర్ షిప్ అందుతుంది. కార్పొరేట్ స్కాలర్షిప్ పేరిట నెల నెల స్టైపెండ్ పొందవచ్చు. 

గేట్ ర్యాంకుతో ఎంటెక్ లో చేరిన  విద్యార్థులకు ఏఐసీటీఈ స్కాలర్ షిప్ ఇస్తారు. 

ఫుల్ టైం పీహెచ డీలో చేరినవారిలో కొంతమందిని ఎంపిక చేసి నిఫ్టెమ్ ఫెలోషిప్ ఇస్తారు. 

ఉద్యోగావకాశాలు.. జీతభత్యాలు

దేశంలో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందుకు తగ్గట్లు నిపుణులు లేరు. వారి కోసం సంస్థలు ఎదురుచూస్తున్నాయి. దీంతో తాజా గ్రాడ్యుయేట్లతోపాటు అనుభవం ఉన్నవారికీ మంచి ఉద్యోగావకాశాలున్నాయి. ఫుడ్ సేఫ్టీ మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు, ఫుడ్ అండ్ బెవరేజ్ డిపార్ట్మెంట్లు, స్టోరేజ్ యూనిట్లు, ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ప్రొడక్షన్ సంస్థలు, లెబొరేటరీలు, క్వాలిటీ అస్యూరెన్స్ యూనిట్లు మొదలైన వాటిల్లో వీరికి అవకాశాలుంటాయి. వీరిని సాధారణంగా ఫుడ్ టెక్నాలజిస్ట్, క్వాలిటీ మేనేజర్, న్యూట్రిషనల్ థెరపిస్ట్, ప్రొడక్ట్/ ప్రాసెస్ డెవలప్మెంట్ సైంటిస్ట్, ఫుడ్ టెక్నాలజిస్ట్ హోదాల్లో నియమించుకుంటారు. నెస్లే, డాబర్ ఇండియా, ఐటీసీ లిమిటెడ్, అగ్రో టెక్ ఫుడ్స్, పార్లే, పెప్సీకో, బ్రిటానియా, హిందుస్థాన్ యూనీలివర్, గోద్రెజ్, క్యాడ్బరీ, మిల్క్ఫుడ్, ఎంటీఆర్, పర్ఫెట్టీ మొదలైనవి వీరికి ఉద్యోగాలిస్తున్న ప్రముఖ సంస్థల్లో కొన్ని. ప్రారంభ వేతనం ఏడాదికి రూ.2.5 లక్షల నుంచి రూ. మూడు లక్షల వరకూ ఉంటుంది. అనుభవం పెరుగుతున్న కొద్దీ జీతభత్యాల్లో మంచి పెరుగుదల ఉంటుంది.

వెబ్‌సైట్‌: http://www.niftem.ac.in/

Posted Date: 08-07-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌