• facebook
  • whatsapp
  • telegram

స్వయం ఉపాధికి... సృజనాత్మక కోర్సులు

ఏడీసెట్-2021 ప్రకటన విడుదల

అర్హత; ఇంటర్ఉత్తీర్ణత

సృజనాత్మకత, లలితకళలపై ఆసక్తి ఉన్నవారి కోసం ప్రత్యేకంగా కొన్ని కోర్సులున్నాయి. బ్యాచిలర్‌ స్థాయిలో వివిధ సంస్థలు ఫైన్ఆర్ట్స్‌ పేరుతో వీటిని అందిస్తున్నాయి. వాటిలో తెలుగు రాష్ట్రాలకు అందుబాటులో ఉన్న కడపలోని డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ(వైఎస్సార్ఏఎఫ్‌యూ) ప్రతిష్ఠాత్మకమైంది. ఈ సంస్థ ఆర్ట్ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌-2021 ద్వారా బ్యాచిలర్ ఆఫ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ (బీఎఫ్ఏ), బ్యాచిలర్ ఆఫ్‌ డిజైన్‌ (బీడిజైన్) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువరించింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న రిజర్వేషన్ల ఆధారంగా సీట్ల కేటాయింపు జరుగుతుంది.

అద్భుతమైన సృజన, కళాకృతితో కనువిందుచేసే నైపుణ్యం ఉన్నవారికి ఫైన్ ఆర్ట్స్‌ కోర్సులు ఉపాధి కల్పిస్తున్నాయి. ఈ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ చదువుతోనే ఎన్నో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఫైన్ఆర్ట్స్, డిజైనింగ్‌ కోర్సుల్లో స్పెషలైజేషన్‌పై దృష్టి సారించడం ప్రధానం. బీఎఫ్ఏలో పెయింటింగ్, అప్లయిడ్ ఆర్ట్స్, స్కల్ప్‌చర్‌, ఫొటోగ్రఫీ, యానిమేషన్‌ కోర్సులు అందిస్తున్నారు. బీడిజైన్‌లో ఇంటేరియర్‌ డిజైన్‌ కోర్సు అందుబాటులో ఉంది. ఆయా కోర్సులు నాలుగేళ్లలో పూర్తి అవుతాయి.

అర్హత ప్రమాణాలు.. ఎంపిక విధానం

ఏదైనా గ్రూప్‌లో ఇంటర్మీడియట్(10+2 విధానం) లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత సాధించాలి. ఆర్ట్ అండ్‌ డిజైన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఏడీసెట్)లో చూపిన ప్రతిభ ఆధారంగా కోర్సుల్లోకి తీసుకుంటారు. 

పరీక్ష ఇలా..

బీఎఫ్ఏ, బీడిజైన్లకు కామన్‌ పేపర్ ఉంటుంది. పరీక్షలో మొత్తం 100  మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. వీటికి 100 మార్కులుంటాయి. పరీక్షా సమయం రెండు గంటలు. జనరల్ నాలెడ్జ్, ఆర్ట్ అండ్‌ కమ్యూనికేషన్ స్కిల్స్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌, యానిమేషన్, ఫొటోగ్రఫీ, ఆర్ట్‌హిస్టరీ, డిజైన్ నైపుణ్యాలకు సంబంధించిన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు విధానం...

సంస్థలో ప్రవేశాలు కోరే అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా సెప్టెంబర్ 6, 2021లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీ అభ్యర్థులు రూ.1000, బీసీలు రూ.750, ఎస్సీ/ ఎస్టీలు రూ.500 చెల్లించాలి. సెప్టెంబర్ 16, 2021లోపు రూ.1500 ఆలస్య రుసుంతో దరఖాస్తు పంపించే వీలుంది.

పరీక్ష కేంద్రాలు... 

రెండు తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. అనంతపురం, కడప, కర్నూలు, తిరుపతి, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, విజయవాడ, ఒంగోలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, ఏలూరు, హైదరాబాద్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. 

సిలబస్

సమకాలీన అంశాలు, కళలపై అవగాహన, కమ్యూనికేషన్‌ నైపుణ్యాలను పరీక్షించేందుకు జనరల్‌ నాలెడ్జ్‌, ఆర్ట్ అండ్‌ కమ్యూనికేషన్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందులో భాగంగా అభ్యర్థులు ఎంచుకున్న కోర్సులకు సంబంధించిన ఆర్ట్‌ హిస్టరీ, ఆర్కిటెక్చర్, ఇండియన్‌ స్కల్ప్‌చర్‌, హెరిటేజ్, ఫిల్మ్, లిటరేచర్, మ్యూజిక్, థియేటర్, అప్లయిడ్ ఆర్ట్, పెయింటింగ్, స్కల్ప్‌చర్‌, యానియేషన్, ఫొటోగ్రఫీ, జనరల్ ఆర్ట్, ఇలస్ట్రేటివ్, ఎనలిటికల్ అండ్‌ డిజైన్ ఎబిలిటీ, మెమరీ డ్రాయింగ్, కలర్‌ కోఆర్డినేషన్, డిజైన్‌ నైపుణ్యాలకు సంబంధించిన పరిజ్ఞానాన్ని పరీక్షిస్తారు. మాదిరి ప్రశ్నపత్రం వెబ్సైట్లో ఉంచారు. వాటి ద్వారా పరీక్ష, సన్నద్ధం కావాల్సిన అంశాలపై అవగాహనకు రావచ్చు. 

ఉద్యోగావకాశాలు ఇలా..

స్వయం ఉపాధికి, ఏదైనా సంస్థలో పని చేసుకోవడానికి ఈ చదువులు ఉపయోగపడతాయి. పూర్తిచేసుకున్న కోర్సు ప్రకారం వీరికి సాఫ్ట్‌వేర్‌, బహుళ జాతి సంస్థలు అవకాశాలు కల్పిస్తున్నాయి. ఆర్ట్‌ వీడియోలు, అడ్వర్టైజింగ్‌ కంపెనీలు, గ్రాఫిక్, ప్రింటింగ్, పబ్లిషింగ్, ఫ్యాషన్‌ సంస్థలు, ఎలక్ట్రానిక్, టెక్ట్స్‌టైల్‌ పరిశ్రమ, ఫిల్మ్ అండ్‌ థియేటర్‌, మల్టీ మీడియా, యానిమేషన్...తదితర సంస్థల్లో అవకాశాలు లభిస్తాయి. ఆర్ట్‌ గ్యాలరీలో వీరు తమ ప్రతిభను చూపవచ్చు. ఫొటోగ్రఫీ చేసినవారికి అన్ని చోట్లా అవకాశాలు ఉంటాయి. ఫ్రీలాన్సింగ్, స్వయం ఉపాధికి వీలుంటుంది. ఎండోమెంట్, ఆర్కియలాజికల్, ఇంటేరియర్‌ డిజైనింగ్‌ విభాగాల్లో వీరికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. 

పరీక్ష తేదీ: సెప్టెంబర్ 25, 2021.

వెబ్‌సైట్: https://sche.ap.gov.in/ADCET/

Posted Date: 17-08-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌