• facebook
  • whatsapp
  • telegram

GATE: టాప్‌ ర్యాంకు కోసం ఇదిగో వ్యూహం!

గేట్‌-2022 సన్నద్ధత ప్రణాళిక

గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (గేట్‌) ప్రకటన వెలువడింది! ప్రసిద్ధ సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ చేయటానికీ, ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ సాధనకూ ఈ పరీక్ష స్కోరు ఉపకరిస్తుంది. సరికొత్త పేపర్ల చేరికతో విస్తృతి పెంచుకుంటున్న గేట్‌కు మెరుగైన రీతిలో సన్నద్ధమయ్యేదెలా? 

గేట్‌ స్కోరు ఆధారంగానే ఇంజినీరింగ్‌ విద్యార్థులు ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఐటీలతో పాటు ఐఐఎస్‌సీ బెంగుళూరు, వివిధ ఎన్‌ఐటీలు, ప్రముఖ ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఇంజినీరింగ్‌/ టెక్నాలజీ/ ఆర్కిటెక్చర్‌/ ఫార్మసీ విభాగాల్లో  ప్రవేశం లభిస్తుంది.  

కొన్ని ప్రభుత్వరంగ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు గేట్‌ స్కోరే ప్రామాణికం. 

అలాంటి కొన్ని సంస్థలు: బీహెచ్‌ఈఎల్, గెయిల్, హెచ్‌ఏఎల్, ఐఓసీఎల్‌), ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ. వీటిలో నియమితులైనవారికి మెరుగైన జీతభత్యాలతో పాటు ఉద్యోగ భద్రత ఉంటుంది. కేంద్రప్రభుత్వంలో గ్రూప్‌-ఏ స్థాయి పోస్టులైన సీనియర్‌ ఫీల్డ్‌ ఆఫీసర్‌ (టెలి), సీనియర్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌ (క్రిప్టో), ఎస్‌ఆర్‌ఓ (ఎస్‌ అండ్‌ టీ) నియామకాలకు కూడా గేట్‌ స్కోరు ఆధారం. 

ఖరగ్‌పూర్‌ ఐఐటీ ఆధ్వర్యంలో..

మానవ వనరుల అభివృద్ది మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యామంత్రిత్వ శాఖ, ఐఐఎస్‌సీ, 7 ఐఐటీల (బాంబే, ఢిల్లీ గౌహతి, కాన్పూర్, ఖరగ్‌పూర్, మద్రాస్, రూర్కీ)ల సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈ సంవత్సరం ఐఐటీ ఖరగ్‌పూర్‌ నిర్వహిస్తోంది.  

కొత్తగా 1. నావెల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌ 2. జియోమాటిక్స్‌ ఇంజినీరింగ్‌ పేపర్‌లను చేర్చి మొత్తం 29 పేపర్‌లలో గేట్‌-2022ను నిర్వహించనున్నారు. గేట్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రధాన పేపర్‌గా రాసేవారితో పోలిస్తే జియోమాటిక్స్‌ ఇంజనీరింగ్‌లో పోటీ తక్కువగా ఉండవచ్చు. గేట్‌-2021 నుంచి ఈ పరీక్షను రెండు పేపర్లలో రాసే అవకాశం కల్పించారు. విద్యార్థులు తప్పకుండా రెండు పేపర్లలో పరీక్ష రాయనవసరం లేదు. తమ ఇష్టప్రకారం ఒకటి లేదా రెండు పేపర్లు ఎంచుకోవచ్చు.  

కొవిడ్‌-19 కారణంగా గేట్‌-2022ను ఇతర దేశాల్లో నిర్వహించడంలేదు. ప్రవాస భారతీయులు/ విదేశీయులు ఈ పరీక్షను భారతదేశంలోని ఏ పరీక్షా కేంద్రంలోనైనా రాయవచ్చు.  

గేట్‌ స్కోరు పీజీ ప్రవేశానికి మూడు సంవత్సరాలు, ప్రభుత్వరంగ సంస్థలకు ఒకటి లేదా రెండు సంవత్సరాలు చెల్లుబాటులో ఉంటుంది.  

ఈ పరీక్ష స్కోరుతో మన దేశంలోని అన్ని ఉన్నత విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశంతోపాటు నెలకు రూ. 12,400/- ఉపకార వేతనమూ లభిస్తుంది.   

ఈ స్కోరు పీహెచ్‌డీ ప్రవేశాలకు కూడా ఉపయోగం. అంతేకాకుండా నెలకు రూ. 28,000/- ఉపకార వేతనమూ లభిస్తుంది.  

ఆన్‌లైన్‌ పరీక్ష

ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం పూర్తిగా ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటుంది. ఇందులో మూడు రకాలుగా (బహుళైచ్ఛిక, బహుళ ఎంపిక, న్యూమరికల్‌) ప్రశ్నలు అడుగుతారు. తప్పు జవాబు రాస్తే ఒక మార్కు ప్రశ్నలకు 1/3, రెండు మార్కుల వాటికి 2/3 చొప్పున మార్కులు తగ్గిస్తారు. న్యూమరికల్, బహుళ ఎంపిక ప్రశ్నలకు ఈ రుణాత్మక మార్కులుండవు. 

పరీక్ష విధానం

గేట్‌ ప్రశ్నపత్రంలో మొత్తం 100 మార్కులకుగాను 65 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్నపత్రంలో రెండు విభాగాలుంటాయి.  

విభాగం-1 (జనరల్‌ ఆప్టిట్యూడ్‌): ఇందులో పది ప్రశ్నలుంటాయి. ఐదు ఒక మార్కు ప్రశ్నలు, మరో ఐదు రెండు మార్కుల ప్రశ్నలు. ఈ విభాగంలోని నాలుగు నుంచి ఐదు ప్రశ్నలు ఇంగ్లిష్‌ సంబంధిత (వెర్బల్‌ ఎబిలిటీ), మిగతా ప్రశ్నలు క్వాంటిటేటివ్‌కు సంబంధించి ఇవ్వొచ్చు. నిత్యం వార్తాపత్రికలు చదవడం, క్యాట్‌ లాంటి ఇతర పోటీ పరీక్షల గత ప్రశ్నపత్రాలు సాధన చేస్తే ఈ విభాగంలో మంచి మార్కులు వస్తాయి.   

విభాగం-2 (సంబంధిత ఇంజినీరింగ్‌ సబ్జెక్టులు): 55 ప్రశ్నలుంటాయి. ఇందులో 25 ఒక మార్కు ప్రశ్నలు, 30 రెండు మార్కుల ప్రశ్నలు ఉంటాయి. 

గణితం: 10 నుంచి 15 మార్కులుండే ఈ విభాగంలోని ప్రశ్నలు శుద్ధ గణితంలా ఉండవు. ఇంజినీరింగ్‌ అప్లికేషన్‌తో ఉంటాయి. ముఖ్యమైన సూచనేమిటంటే- ప్రశ్నలు ఆయా రంగాల్లోని నూతన ఆవిష్కరణలను దృష్టిలో పెట్టుకుని ఉంటాయి. ప్రతి పేపర్‌లో పదికి మించిన సబ్జెక్టులుంటాయి. కానీ మొత్తం ప్రశ్నలు 65. ఏ సబ్జెక్టుకు ఎన్ని ప్రశ్నలు అనేది ఐఐటీలకు ఒక సవాలుగా  మారింది. అందుకే రెండు, మూడు సబ్జెక్టుల విషయాలను కలిపి ప్రశ్నలు సంధిస్తున్నారు. ప్రతి పేపర్‌లో వివిధ సబ్జెక్టులను మిళితం చేస్తూ ప్రశ్నలు ఇస్తున్నారు.

రిఫరెన్స్‌ పుస్తకాలు

న్యూమరికల్‌ ఎబిలిటీ: ఆర్‌.ఎస్‌.అగర్వాల్‌ 

మ్యాథమేటిక్స్‌: గేవాల్, హెచ్‌.కె.దాస్‌ 

ఇంగ్లిష్‌: రెన్‌ అండ్‌ మార్టిన్‌ 

మేటి ర్యాంకుకు అదనంగా ఏం చేయాలి?  

త్వరితంగా ప్రిపరేషన్‌ పూర్తిచేసి వీలైనన్ని ఎక్కువ సార్లు పునశ్చరణ చేయాలి.  

పరీక్ష నాటికి ఒకవేళ ఏదైనా సబ్జెక్టు అంశాన్ని పూర్తి చేయకపోతే నిరాశ పడకూడదు. అప్పటికే చదివిన అంశాలను పునశ్చరణ చేసుకోవాలి. తగిన ఆత్మవిశ్వాసంతో ఉండాలి. 

సన్నద్ధత మొదలుపెట్టినప్పటి నుంచి పరీక్ష సమయం వరకూ ఏ పరిస్థితుల్లోనూ ప్రేరణను కోల్పోకూడదు. 

మైండ్‌ మేనేజ్‌మెంట్, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ అనేవి విజయ సాధన రహస్యాలు.   

నెగెటివ్‌ మార్కులు ఉన్నందువల్ల జవాబు తెలియని ప్రశ్నల జోలికి వెళ్లకూడదు. 

చదివేటప్పుడు ఎదురయ్యే సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలి.  

సమాధానం రాబట్టడానికి ఎక్కువ సమయం పట్టే, క్లిష్టమైన ప్రశ్నల వద్ద సమయాన్ని వృథా చేయకూడదు. సులువైన ప్రశ్నలను మొదటగానే పూర్తిచేయాలి. పాఠ్యపుస్తకంలో ఉండే సాల్డ్వ్, అన్‌సాల్డ్వ్‌ ప్రశ్నలను సాధన చేయాలి. వీలైనంత వరకు ఎక్కువ ఆన్‌లైన్‌ టెస్ట్‌లూ, వర్చువల్‌ క్యాలిక్యులేటర్‌ల గురించి తెలుసుకుని ప్రాక్టీస్‌ చేయాలి.

50%- 50%

గేట్‌-2022 పరీక్ష ఫిబ్రవరి నెలలో జరుగుతుంది. అంటే దాదాపుగా 6 నెలల సమయం ఉంది. అభ్యర్థులు సిలబస్‌ను క్షుణ్ణంగా పరిశీలించి అందులోని అంశాలను అర్థం చేసుకోవాలి. ఏ అంశాల్లో బలంగా ఉన్నామో, ఏ అంశాలపై అవగాహన లేదో గ్రహించి దానికి అనుగుణంగా ప్రణాళికను రూపొందించుకోవాలి. తక్కువ సమయం అందుబాటులో ఉన్న కారణంగా రోజుకు కనీసం 10- 12 గంటల సమయాన్ని ప్రిపరేషన్‌కు కేటాయించాలి. 50% సమయం ప్రాథమిక అంశాలపై, 50% సమయం ప్రశ్నల సరళికి అనుగుణంగా ఉండే న్యూమరికల్‌ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. మంచి ప్రామాణిక పాఠ్య పుస్తకాలు / స్టడీ మెటీరియల్‌ ఎంచుకోవడం ప్రధానం. రకరకాల పుస్తకాలను చదవకపోవడం మంచిది.

ఇప్పటికే సన్నద్ధత ఆరంభిస్తే..  

ఈ అభ్యర్థులు ప్రాథమిక అంశాలపై కొంతవరకు పట్టు సాధించి ఉంటారు కాబట్టి ఈ అంశాలతో పాటు కఠినమైన అంశాలపై తయారవ్వాలి. క్లిష్టమైన, సాధారణ, అతి సాధారణమైన అంశాలకు కూడా సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. గేట్‌ ఆన్‌లైన్‌లో జరగడం వల్ల వివిధ సెట్‌లుగా రూపకల్పన చేస్తున్నారు. దీనివల్ల అన్ని సబ్జెక్టులూ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కాబట్టి సన్నద్ధతలో అన్ని అంశాలకూ తగిన ప్రాధాన్యం ఇవ్వాలి.

ప్రిపరేషన్‌ ఎప్పుడు మొదలుపెట్టినా...

1. అభ్యర్థులు తమ స్థాయిని బట్టి సొంతంగా ప్రిపేర్‌ కావాలో కోచింగ్‌ తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఒకవేళ కోచింగ్‌ అవసరమైనట్లయితే అందుబాటులో ఉన్న ఆన్‌లైన్‌ తరగతులను ఎంచుకోవాలి.  

2. ఒక పాత ప్రశ్నపత్రాన్ని పరీక్షకు కేటాయించిన సమయంలో రాయడానికి ప్రయత్నిస్తే తాము ఏ స్థాయిలో ఉన్నామో అర్థం అవుతుంది. 

3. సమయపాలన చాలా కీలకం.

4. ప్రతి సబ్జెక్టు, ప్రతి చాప్టర్‌కు సంబంధించిన అంశాలనూ, చిన్న చిన్న పట్టికలనూ సంక్షిప్తంగా తయారు చేసుకోవాలి.  

5. ప్రతి చాప్టర్, సబ్జెక్టు చదివాక దానికి సంబంధించి ప్రముఖ విద్యాసంస్థల ఆన్‌లైన్‌ టెస్టులను రాయాలి. ప్రిపరేషన్‌ పూర్తయ్యాక మాక్‌ టెస్టులు రాయాలి. దీనివల్ల  సన్నద్ధత స్థాయి అర్థమవుతుంది. చాప్టర్‌వైజ్, సబ్జెక్ట్‌వైజ్‌ మాక్‌ టెస్టులు, పూర్తిస్థాయి మాక్‌ టెస్టుల్లో తప్పుగా రాసిన ప్రతి సమాధానాన్నీ సవరించుకుని వాటిని శ్రద్ధతో సాధన చేయాలి. పరీక్ష సమయంలో ఆ తప్పులు పునరావృతం కాకుండా ఉంటాయి.  

6. గత గేట్, ఈఎస్‌ఈ, ఇస్రో, పీఎస్‌యూల ప్రశ్నపత్రాలను రాయాలి. దీనివల్ల ఒక అంశాన్ని ఎన్ని విధాలుగా అడగడానికి అవకాశం ఉందో తెలుస్తుంది.  

7. ఎన్‌టీపీ‡ఎల్‌ పాఠాలు విద్యార్థులకు ప్రాథమిక అంశాల అవగాహనకు బాగా ఉపయోగపడతాయి. అలాగే విశ్లేషణాత్మక ప్రశ్నలకు సమాధానాలు రాయడానికీ ప్రయోజనకరం.   

8. సన్నద్ధతలో పునశ్చరణ (రివిజన్‌) అత్యంత ముఖ్యం. చదివిన ప్రతి అంశాన్నీ తప్పనిసరిగా పునశ్చరణ చేయాలి. ప్రిపరేషన్‌ సమయంలో తయారుచేసుకున్న చిన్నచిన్న పట్టికలను ఈ పునశ్చరణలో సద్వినియోగం చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు 

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 30 ఆగస్టు 2021

ఆన్‌లైన్‌ దరఖాస్తు సమర్పణ గడువు: 4 సెప్టెంబర్‌ 2021 

గేట్‌ 2020 తేదీలు: 5, 6, 12, 13 ఫిబ్రవరి 2022.

వెబ్‌సైట్‌: https://gate.iitkgp.ac.in./

Posted Date: 21-03-2022


 

ప్రవేశ పరీక్షలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌