• facebook
  • whatsapp
  • telegram

ఉద్యోగ నైపుణ్యాలు నేర్పే ... ఎంఎస్‌ఐటీ!

   నాలుగు విశ్వవిద్యాలయాలు కలిసి అందిస్తున్న పీజీ కోర్సు... అంతర్జాతీయ స్థాయి బోధన... నూరుశాతం ప్లేస్‌మెంట్లు... ఈ ప్రత్యేకతలతో స్వాగతిస్తోంది ఎం.ఎస్‌.ఐ.టి.! ఐటీ రంగంలో మంచి భవిష్యత్తు కోరుకునేవారికి ఇదో మంచి అవకాశం. ఈ కోర్సు తీరుతెన్నుల గురించి ప్రత్యేక కథనం!

   'ఆచరణ ద్వారా నేర్చుకోవడం' అనే మూలసూత్రాన్ని అనుసరిస్తూ.. ఐటీ పరిశ్రమలో పనిచేయడానికి అవసరమైన అన్ని సామర్థ్యాలనూ అభ్యర్థులకు అందించే పీజీ కోర్సు ఎంఎస్‌ఐటీ. అమెరికాలోని కార్నెగీ మెలన్‌ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో రూపొందించిన ఈ కోర్సును ఐఐఐటీ-హెచ్‌, జేఎన్‌టీయూ- హైదరాబాద్‌, కాకినాడ, అనంతపురం కలిసి కన్సార్టియం (CIHL)గా ఏర్పడి అందిస్తున్నారు. విదేశాల్లో ఎం.ఎస్‌. చదివినవారితో సమానంగా ఈ కోర్సు ద్వారా అభ్యర్థులను తీర్చిదిద్దుతున్నారు.

  ఇంజినీరింగ్‌, బీఎస్సీ (మాథమాటిక్స్‌, కంప్యూటర్స్‌, ఐటీ) పూర్తి చేసిన విద్యార్థులు దీనిలో ప్రవేశించవచ్చు. మొదట ఐఐఐటీ-హైదరాబాద్‌, జేఎన్‌టీయూ హైదరాబాద్‌లలో మొదలై, తరువాత కాకినాడ, ఈ ఏడాది అనంతపురాలకు విస్తరించింది. పట్టణ విద్యార్థులతో పాటు గ్రామీణ విద్యార్థులకూ కోర్సు అందుబాటులో ఉండేలా బ్యాంకుల నుంచి రుణ సదుపాయాన్ని సైతం కల్పిస్తున్నారు.
 

ఉద్దేశమిదీ..

   ఇంజినీరింగు, ఎంసీఏ పూర్తయిన తరువాత విద్యార్థులు కొలువుల్లో చేరడానికి మళ్ళీ ప్రత్యేక కోర్సులను ఆశ్రయిస్తున్నారు. కొందరు విదేశాల బాట పడుతున్నారు. అయినా సఫలమయ్యేవారు కొందరే. చాలామందికి కంపెనీల అవసరాల పట్ల అవగాహన లేకపోవడం, కంపెనీలు ఆశిస్తున్న నైపుణ్యాలు వారికి లేకపోవడం దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో అభ్యర్థులకు కావలసిన అంశాల్లో శిక్షణ ఇచ్చి తగిన ఉద్యోగాలు సంపాదించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఈ కోర్సును రూపొందించారు.
 

ఎవరు అర్హులు?

* 2 సంవత్సరాల ఎంఎస్‌ఐటీ: ఇంజినీరింగ్‌ (అన్ని బ్రాంచిలవారు), పీజీ (కంప్యూటర్స్‌/ మాథమాటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌, ఎంసీఏ

* 3 సంవత్సరాల ఎంఎస్‌ఐటీ: బీఎస్సీ (మాథమాటిక్స్‌/ కంప్యూటర్స్‌/ ఐటీ), బీసీఏ లేదా వీటికి సమానమైన డిగ్రీ.

* ఈ కోర్సులో చేరాలనుకున్న అభ్యర్థులకు (గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- GAT)లో వచ్చే స్కోరు ఆధారంగా ఈ కోర్సులో ప్రవేశాలుంటాయి.

ఎంపిక ప్రక్రియలో మూడు దశలుంటాయి.

1. గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (గ్యాట్‌)          2. లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌ అండ్‌ కౌన్సెలింగ్‌            

3. ప్రిపరేటరీ కోర్సు

గ్యాట్‌ ఇలా ఉంటుంది...

   గ్యాట్‌- కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండున్నర గంటలపాటు సాగే ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. వీటిని వెర్బల్‌ ఎబిలిటీ, క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ, ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ అనే మూడు విభాగాల నుంచి రూపొందిస్తారు. ఆయా విభాగాలకు కేటాయించే ప్రశ్నలు, సిలబస్‌ వివరాలు..
 

వెర్బల్‌ ఎబిలిటీ:

   ఇందులో 28 ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఆంగ్ల భాషా సామర్థ్యాన్ని ఇందులో పరీక్షిస్తారు. Sentence completion, Analogies, Reading comprehension, Antonyms నుంచి ప్రశ్నలు అడుగుతారు.
 

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ:

   ఈ విభాగంలో 48 ప్రశ్నలుంటాయి. ఇందులో బేసిక్‌ మాథమాటిక్స్‌, నంబర్స్‌ నుంచి ప్రశ్నలడుగుతారు.

* Discrete comparision ( స్టాటిస్టిక్స్‌, టైమ్‌ అండ్‌ వర్క్‌, రేషియో ప్రపోర్షన్‌ అండ్‌ వేరియేషన్స్‌, టైమ్‌, స్పీడ్‌ అండ్‌ డిస్టెన్స్‌

* Data analysis (డేటా ఇంటర్‌ప్రెటేషన్‌)

* Quantitative comparison (జామెట్రీ, ప్రాఫిట్‌, లాస్‌, డిస్కౌంట్‌, నంబర్‌ సిస్టమ్‌)

* Sets

* Relations (ప్రోగ్రెషన్స్‌, లినియర్‌ ఈక్వేషన్స్‌)

* Functions (మిసిలేనియస్‌, ప్రాబబిలిటీ, పర్సంటేజెస్‌)

ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ:

   మొత్తం 28 ప్రశ్నలుంటాయి. ఇందులో విశ్లేషణాత్మక, తార్కిక సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించాలి. లినియర్‌ సీక్వెన్స్‌ ఆర్‌ అరేంజ్‌మెంట్స్‌, సర్క్యులర్‌ అరేంజ్‌మెంట్స్‌, క్యాలెండర్స్‌, అసెండింగ్‌/ డిసెండింగ్‌ ఆర్డర్‌ అరేంజ్‌మెంట్స్‌, సిరీస్‌, క్యూబ్స్‌
 

ప్రవేశపరీక్ష తర్వాత...

   గ్యాట్‌లో ఉత్తీర్ణులైనవారు లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌ దశకు చేరతారు. ఇది 45 నిముషాలపాటు సాగుతుంది. ఇందులో నెగ్గినవారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రిపరేటరీ కోర్సులోకి అనుమతిస్తారు. ఈ కోర్సు 8 వారాలపాటు సాగుతుంది. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైన వారిని ఎమ్‌ఎస్‌ఐటీ కోర్సులోకి అనుమతిస్తారు.
 

దరఖాస్తు చేసుకోండిలా...

   అభ్యర్థులు ఆన్‌లైన్‌లో www.mistprogram.netదరఖాస్తు చేయాలి. తర్వాత డీడీని స్పీడ్‌ పోస్టు ద్వారా The Dean, Consortium of Institutions of Higher Learning, IIIT campus, Gachibowli, Hyderabad - 500032 కు పంపాలి. దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని దాన్ని పూర్తిచేసి డీడీని జతచేసి ఈ చిరునామాకు పంపించవచ్చు.
 

స్పెషలైజేషన్లివి
 

* కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌* ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌

* ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ

* సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌

* లాంగ్వేజ్‌ టెక్నాలజీస్‌

* ఎడ్యుకేషన్‌ టెక్నాలజీస్‌

* డేటా అనలటిక్స్‌ అండ్‌ డేటా విజువలైజేషన్‌
 

ఎంపికైనవారికి బ్యాంకు రుణాలు

   విద్యావిధానంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నేటి తరం విద్యార్థులకు పాత పద్ధతులు అంతగా పనికిరావు. మార్పులకు అనుగుణంగా ప్రతిభను సాన పెట్టుకుంటేనే మనుగడ. నేటి తరానికి మంచి భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అవసరం. సమస్యను గుర్తించే నైపుణ్యం, దానిని పరిష్కారానికి అవసరమైన సమాచార సేకరణ సామర్థ్యం ఉండాలి. సాంకేతిక నైపుణ్యంతోపాటు పదిమందితో కలసి పనిచేయగల బృందస్ఫూర్తి తప్పనిసరి. రోజుకో కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్న ఈరోజుల్లో మారుతున్న పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం తప్పనిసరి.

   'ఏదైనా విషయాన్ని వింటే మరచిపోతాం. చూస్తే గుర్తుపెట్టుకుంటాం. చేస్తే అర్థం చేసుకుంటాం' అని చైనా సామెత. ఒక సమస్యను గురించి తెలుసుకోవడం.. దాని పరిష్కారానికి ప్రయత్నించడం ద్వారా విద్యార్థుల్లో నైపుణ్యం పెరుగుతుంది. ఒకరి మార్గదర్శకత్వంలో పనిచేసేవారికంటే తమ ఆలోచనలకు పదును పెడుతూ పనిచేసేవారే అభివృద్ధి చెందుతారని విద్యావేత్తలు సైతం చెబుతున్నారు.

   విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యం, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు, సామాజిక దృక్పథాన్ని పెంచుకోవడం, సానుకూల దృక్పథం, ఎటువంటి పరిస్థితుల్లోనైనా పనిచేయగల సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది ఈ ఎం ఎస్‌ఐటీ కోర్సు.

   ఎంఎస్‌ఐటీలో 40 శాతం పట్టణ, 60 శాతం గ్రామీణ ప్రాంతానికి చెందిన విద్యార్థులున్నారు. ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు బ్యాంకు రుణాల విషయంలో కన్సార్టియం నుంచి సహాయాన్ని అందిస్తున్నాం. కోర్సు కాలంలో విద్యార్థులను సంస్థల అవసరాలకు అనుగుణంగా శిక్షణనివ్వడంతోపాటు 100 శాతం క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లను సాధిస్తున్నాం.

- ప్రొ. ఎం. నివాసరావు,
డీన్‌, సి.ఐ.హెచ్‌.ఎల్‌.

Posted Date: 09-03-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌