• facebook
  • whatsapp
  • telegram

అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిసిటీ రంగంలో అవకాశాలు

'స్వచ్ఛత అంటే ఏంటమ్మా' అని పరుగెత్తుకొచ్చి అడుగుతాడు పిల్లవాడు. 'స్వచ్ఛత అంటే హమామ్‌రా నాన్నా' అని ఆప్యాయంగా చెబుతుందా తల్లి. నిజంగానే స్వచ్ఛత అంటే హమామ్ అన్నంతగా జనంలోకి వెళ్లింది ఆ ఉత్పత్తి. 'వాషింగ్ పౌడర్ నిర్మా','ఓన్లీ విమల్' నుంచి ఇప్పటి 'మరక మంచిదే..., 'ఏయ్ బంటీ నీ సబ్బు స్లోనా ఏంటీ...' వరకు అన్నీ ఆకర్షించే ప్రకటనలే.ఇవి ఎంతగా ప్రభావితం చేస్తాయంటే కొన్నిసార్లు ఉత్పత్తి పేరు మరిచిపోయి దానికి సంబంధించిన అడ్వర్త్టెజ్‌మెంటే గుర్తుంటుంది.

మాటలకు ఉన్న శక్తి అది.  "Don't drink and Drive, Avoid helmet to meet your hell mates" లాంటి ప్రకటనలతో ట్రాఫిక్ విభాగమూ మంచి అవగాహన కల్పిస్తోంది. కొన్ని సార్లు మాటలు లేకుండా బొమ్మలతోనే చెప్పాల్సిన విషయాన్ని స్పష్టంగా చెబుతారు. వొడాఫోన్ జూజూలే దీనికి చక్కని ఉదాహరణ. "A good salesman is one, who sells tooth brush to a tooth less person" అని ఇంగ్లిషులో ఒక సామెత. గ్లోబలీకరణ వల్ల ప్రచారాన్ని కోరుకునే విభాగాలు అధికమవ్వడంతో ఇలాంటివారికి ప్రాధాన్యం పెరుగుతోంది. ఇంత ప్రాధాన్యమున్న అడ్వర్త్టెజింగ్ రంగంలో రాణించాలనుకునే వారికి ఉండాల్సిన లక్షణాలు, అవకాశాల గురించి తెలుసుకుందాం...

గ్లామర్... క్రియేటివిటీ... లాజికల్ థికింగ్ కలిపితే అడ్వర్త్టెజింగ్. ఉత్పత్తి చేసిన వస్తువులు, సేవలకు సంబంధించిన సమాచారాన్ని వినియోగదారులకు ప్రభావవంతంగా చేరవేసే విధానాన్ని 'అడ్వర్త్టెజింగ్ అంటారు. సాధారణంగా ఈ రంగంలో టీవీ, రేడియో, వెబ్‌సైట్లు, పత్రికలు, మ్యాగజైన్స్, బిల్ బోర్డులు, హోర్డింగులను ప్రచార సాధనాలుగా వినియోగిస్తారు. ఆర్థిక సరళీకరణ, సమాజంలో వేగంగా వస్తున్న మార్పుల వల్ల గత దశాబ్దకాలంగా ఈ రంగం బాగా అభివృద్ధి చెందుతోంది.ప్రస్తుతం అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిసిటీ రంగంలో ఆకర్షణీయమైన వేతనాలతో కూడిన ఉద్యోగావకాశాలున్నాయి. ఇది మాస్ కమ్యూనికేషన్స్‌లో ఒక భాగం. ఈ రంగంలో గ్లామర్‌తోపాటు సవాళ్లూ ఉంటాయి. రకరకాల బ్రాండ్లు, కంపెనీలు, ఆర్గనైజేషన్లు, వ్యక్తులు ఇలా అందరూ వారి టార్గెట్ ఆడియన్స్‌ను చేరుకోవడానికి అడ్వర్త్టెజింగ్ లేదా పబ్లిసిటీ రంగాలను విస్తృతంగా వినియోగించుకుంటున్నారు.

 ఉండాల్సిన నైపుణ్యాలు:
 

* సృజనాత్మకత

సునిశిత పరిశీలన, పరిశోధన

విమర్శనాత్మక దృష్టి

పని ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం

* ప్రజల భావోద్వేగాల పట్ల సమతౌల్యం

ఈ రంగంలో రాణించడానికి ప్రధానంగా ఉండాల్సిన లక్షణం సృజనాత్మకత. దీంతో పాటు ప్రజల అవసరాలకు సబంధించిన అన్ని విషయాలపై సునిశిత పరిశీలన శక్తి ఉండాలి. ప్రజల భావోద్వేగాల పట్ల సమతౌల్యం, విమర్శనాత్మక దృష్టితో చూడగలిగే సామర్థ్యం ఉండాలి. మార్కెట్, మీడియా పరిశోధకులకు విశ్లేషణాత్మకంగా ఆలోచించడం చాలా ముఖ్యం.

ఆర్టిస్ట్స్‌లకు ఉద్యోగావకాశాలు 30% పెరిగాయి.

ప్రపంచీకరణ నేపథ్యంలో ఈ సంఖ్య త్వరలోనే అధికమయ్యే అవకాశం ఉంది. సంబంధిత రంగంలోని వివిధ మార్కెటింగ్ ఏజెన్సీలు కలిసి ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులను ఆకట్టుకుంటూ అభివృద్ధి దిశలో అడుగులు వేస్తున్నాయి. కాస్త సృజనాత్మకత ఉండి, పని ఒత్తిడిని అధిగమించగలిగితే తక్కువ సమయంలోనే మంచి స్థాయికి చేరుకోవచ్చు. ఆకర్షణీయమైన జీతాలను అందుకోవచ్చు. ముఖ్యంగా ఈ రంగంలో అభివృద్ధి చెందడానికి సృజనాత్మకతతోపాటు ఆలోచనలను విజువల్ ఫార్మాట్‌లోకి మార్చగలిగే నైపుణ్యం చాలా అవసరం.

విద్యార్హతలు

* అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిసిటీ రంగంలో ప్రవేశించాలంటే మేనేజ్‌మెంట్, అడ్వర్త్టెజింగ్ లేదా మాస్ కమ్యూనికేషన్స్‌లో డిగ్రీ ఉండాలి. మార్కెట్ రిసెర్చ్, క్త్లెంట్ సర్వీస్, మీడియా ప్లానింగ్ విభాగాల్లో ఎక్కువగా ఎంబీఏ విద్యార్థులకు ప్రాధాన్యమిస్తున్నారు. డిగ్రీ తోపాటు ఫొటోషాప్, కోరల్‌డ్రా, ఫైన్ ఆర్ట్స్‌లో ప్రవేశం ఉంటే సృజనాత్మకత గల ఈ రంగంలో నిలదొక్కుకోవడం చాలా సులభం.

ఏదైన డిగ్రీ తర్వాత అడ్వర్త్టెజింగ్/ మాస్ కమ్యూనికేషన్స్‌లో ప్రవేశించాలంటే ప్రత్యేకంగా డిప్లొమా, పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కోర్సులు ఉన్నాయి. కొన్ని సంస్థలు 10+2 విద్యార్హతతోనూ అడ్వర్త్టెజింగ్‌లో సర్టిఫికేట్ కోర్సులు అందిస్తున్నాయి.

అడ్వర్టయిజింగ్ రంగంలో కోర్సులను అందిస్తున్న యూనివర్సిటీలు, మీడియా సంస్థలు:

1. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్, న్యూఢిల్లీ - పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్టయిజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. www.iimc.nic.in

2. మఖన్‌లాల్ చతుర్వేది నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జర్నలిజం, భోపాల్. - ఎంఏ ఇన్ అడ్వర్త్టెజింగ్ అండ్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్. www.mcu.ac.in

3. అన్నామలై యూనివర్సిటీ, తమిళనాడు - పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. www.annamalaiuniversity.ac.in

4. మధురై కామరాజ్ యూనివర్సిటీ, తమిళనాడు - మాస్టర్ ఆఫ్ అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. www.mkuniversity.org

5. పంజాబ్ యూనివర్సిటీ, పాటియాలా - పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. www.punjabuniversity.ac.in

6. ముద్రా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కమ్యూనికేషన్స్, అహమ్మదాబాద్ - పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్త్టెజింగ్ అండ్ సర్టిఫికేట్ కోర్సెస్ ఇన్ అడ్వర్త్టెజింగ్. www.mica.ac.in

7. శ్రీ వేంకటేశ్వర యూనివర్సటీ, తిరుపతి - మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ అడ్వర్త్టెజింగ్. www.svuniversity.ac.in

8. గురు జంబేశ్వర్ యూనివర్సిటీ, హిస్సార్ - ఎమ్మే ఇన్ అడ్వర్త్టెజింగ్. www.gjust.ac.in

9. భారతీయ విద్యా భవన్, న్యూఢిల్లీ- పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్త్టెజింగ్. www.bvbdelhi.org

10. లక్నో యూనివర్సిటీ, లక్నో- పీజీ డిప్లొమా ఇన్ అడ్వర్త్టెజింగ్ అండ్ పబ్లిక్ రిలేషన్స్. www.lkouniv.ac.in

ఉపాధి అవకాశాలు

ప్రభుత్వ, ప్రైవేటు రంగ కంపెనీల్లో, పత్రికలు, జర్నల్స్, మ్యాగజైన్స్, టీవీ, రేడియోలతోపాటు అనేక సంస్థల్లో అడ్వర్త్టెజింగ్ విభాగంలో ఉపాధి పొందవచ్చు.

అడ్వర్త్టెజింగ్ రంగం లాభదాయకమైందే కాకుండా ఎంతో ఆసక్తికరమైన వృత్తి. ఈ రంగంలో ఉద్యోగాలు రెండు రకాలు: ఎగ్జిక్యూటివ్ అండ్ క్రియేటివ్. క్త్లెంట్ సర్వీసింగ్, మార్కెట్ రిసెర్చ్, మీడియా రిసెర్చ్ సంబంధిత ఉద్యోగాలు ఎగ్జిక్యూటివ్ కిందకు వస్తాయి. కాపీ రైటర్స్, స్క్రిప్ట్ రైటర్స్, విజువలైజర్స్, ఫొటోగ్రాఫర్స్, టైపోగ్రాఫర్స్ మొదలైన ఉద్యోగాలు క్రియేటివ్ ఫీల్డ్ కిందకి వస్తాయి.

ఎగ్జిక్యూటివ్ రంగం అంటే మార్కెట్ పరిస్థితులను అంచనా వేయడం. ఇందులో వినియోగదారుడి అవసరాలను గుర్తించడం, కొత్త వ్యాపార ఆలోచనలు, వ్యాపారాభివృద్ధి, ప్రకటనలు ఎప్పుడు ఎక్కడ ఎలా ఇవ్వాలి, ఆర్థిక పరమైన అంశాలు తదితర మార్కెట్ సంబంధిత పరిశోధనలు ఎక్కువగా ఉంటాయి.

క్రియేటివ్ డిపార్ట్‌మెంట్ పూర్తిగా అడ్వర్త్టెజ్‌మెంట్ కాపీని తయారు చేస్తుంది. దానికి సంబంధించిన కాన్సెప్టులు, స్క్రిప్టు రాయడం ఉంటాయి. అడ్వర్త్టెజ్‌మెంట్, దాని ప్రచారానికి సంబంధించిన విజువల్స్ ఇక్కడ తయారుచేస్తారు. కాపీ రైటర్స్‌కి మంచి రచన, ఎడిటింగ్ సామర్థ్యం ఉండాలి. ప్రచారానికి కావాల్సిన స్లోగన్స్, టెక్ట్స్ ఫార్మాట్ అంతా వీళ్లే చేస్తారు. విజువలైజర్స్ అడ్వర్త్టెజ్‌మెంట్‌కి గ్రాఫిక్స్, స్కెచ్చింగ్ (sketching) చేస్తారు. విజువలైజర్ అప్త్లెడ్ ఆర్ట్స్ లేదా ఫైన్ ఆర్ట్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా చేసి ఉండాలి. దీంతో పాటు ఫొటోషాపు, ఫ్రీ హాండ్, కోరల్ డ్రా మొదలైనవాటిలో పరిజ్ఞానం ఉండాలి. ఫొటోగ్రాఫర్స్‌కి మంచి టెక్నికల్ స్కిల్స్ తోపాటు రకరకాల ఫొటో యాంగిల్స్ బాగా తెలిసుండాలి.

వేతనాలు

ఉద్యోగ స్థాయి, కంపెనీని బట్టి జీతాలలో తేడాలుంటాయి. ప్రభుత్వ అక్రిడేషన్ ఉన్న ఏజెన్సీల్లో మంచి జీతాలుంటాయి. ప్రారంభంలో రూ.15,000 నుంచి రూ.30,000 వరకు సంపాదించవచ్చు. అనుభవం, సామర్థ్యం ఆధారంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

Posted Date: 25-11-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌