• facebook
  • whatsapp
  • telegram

వైద్య సేవ‌ల్లో సాయంగా..!

త‌క్కువ వ్య‌వ‌ధి, వ్య‌యాల‌తో పారామెడిక‌ల్ కోర్సులు

ఈ కరోనా సమయంలో ముందుండి నిర్విరామంగా పోరాడుతున్నవారిలో డాక్టర్లది ప్రముఖ స్థానం. బయటకు కనిపించేది వీరే కానీ.. తెర వెనుక నుంచి వీరికి సాయం అందించేవారు చాలామందే ఉన్నారు! ఏడాది పొడవునా వ్యాధి నిర్ధారణ పరీక్షలు, కొన్ని రకాల చికిత్సలు అందించడంలో వీరు వైద్యులకు ఎంతో తోడ్పడతారు. వీరే పారా మెడికల్‌/ వైద్య అనుబంధ నిపుణులు. వైద్య రంగంపై ఆసక్తి ఉండి, సంబంధిత సేవల్లో కెరియర్‌ నిర్మించుకోవాలనుకునేవారికి ఇదొక మార్గం!  తక్కువ కాలవ్యవధి, బడ్జెట్‌తో పూర్తిచేయగల ఉపాధినిచ్చే కోర్సులివి!  

ఆరోగ్యం బాగోనపుడు వైద్యుల సూచన మేరకు కొన్ని వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సివస్తుంది. ఇంకొన్నిసార్లు విరిగిన ఎముకలు లాంటి వాటివి తెలుసుకోవడానికి ఎక్స్‌రేలు అవసరమవుతాయి. ఏవైనా ఆపరేషన్లు చేయించుకోవాల్సి వస్తే అనస్తీషియా తప్పనిసరి. కొన్నిసార్లు ప్రత్యేక సాంకేతిక పరికరాలూ అవసరమవుతాయి. వీటన్నింటి విషయంలో సాయమందించేవారే పారామెడిక్‌లు. ఎంబీబీఎస్‌ డిగ్రీ లేకుండా డాక్టర్లలానే వైద్యసేవలు అందించాలనుకునేవారికి పారామెడికల్‌ మంచి మార్గం. 

వీరు అత్యవసర వైద్యసేవలను అందిస్తారు. వైద్యుడి ప్రమేయానికి ముందు అవసరమైన ఎమర్జెన్సీ వైద్య సేవలను వీరందిస్తారు. అందుకే వీరిని ‘ప్రీ హాస్పిటల్‌ ఎమర్జెన్సీ సర్వీస్‌ ప్రొవైడర్స్‌’గా అభివర్ణిస్తారు. వైద్య చికిత్సకు ముందే కాదు- వెనకా వీరి ప్రమేయం ఉంటుంది. అందుకే పారామెడికల్‌ సైన్స్‌ని మెడికల్‌ సైన్స్‌కి వెన్నెముకగా చెబుతారు. ఈ కెరియర్‌లోకి  ప్రవేశించాలంటే సంబంధిత కోర్సులను పూర్తిచేయాల్సి ఉంటుంది. ఆసుపత్రికి బయట ఎమర్జెన్సీ మెడికల్‌ సాయాన్ని అందించడం వీరి ప్రాథమిక విధి. క్లిష్ట సమయాల్లో తగిన నిర్ణయాలూ తీసుకోవాల్సి ఉంటుంది.  

అందుకోవాలనుకుంటే..

పారామెడికల్‌ కోర్సులను ఉద్యోగాధారిత కోర్సులుగా వ్యవహరిస్తారు. వీరు మల్టీడిసిప్లినరీ విభాగాల్లో వైద్యులతో కలిసి పనిచేస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. డిప్లొమా కోర్సులు మాత్రం ఏపీ- http://117.192.46.176:8080/appmb/, తెలంగాణ- http://www.tspmb.telangana.gov.in/ పారామెడికల్‌ బోర్డు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సంస్థలన్నీ ఎక్కువశాతం మెరిట్‌ ఆధారంగానే ఎంచుకుంటున్నాయి. కొన్ని మాత్రం ప్రవేశపరీక్షలను నిర్వహిస్తున్నాయి. 

ఏపీ పారామెడికల్‌ బోర్డు అడ్మిషన్లకు దరఖాస్తు ప్రక్రియను కూడా ప్రారంభించింది. 

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: జూన్‌ 21, 2021  

పారామెడిక్‌లకు ఏ నైపుణ్యాలు అవసరం?

ఓపిక, జాగ్రత్తగా చూసుకునే వ్యక్తిత్వం

మంచి భావప్రకటన నైపుణ్యాలు

త్వరగా నిర్ణయం తీసుకునే నైపుణ్యం, శాంత స్వభావం

శారీరక, మానసిక దృఢత్వం

బృందంతో పనిచేయగల నైపుణ్యం

పరిస్థితులను అర్థం చేసుకోగల, అంచనా వేయగల నైపుణ్యం

సవాళ్లను స్వీకరించగల మనస్తత్వం

విధులేంటి?

రోగులను పరీక్షించడం, వ్యాధి నిర్ధారణ 

ప్రత్యేకమైన సమయాల్లో అత్యవసర చికిత్సను అందించడం 

వెంటిలేటర్లు, డెఫిబ్రిలేటర్లు లాంటి వైద్య పరికరాల నిర్వహణ, ఉపయోగించడం 

రోగులను ఆసుపత్రులకు తీసుకురావడం, ఆ క్రమంలో అవసరమైన చికిత్సను అందించడం 

రోగులకు సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని అందించడం 

ప్రాథమిక చికిత్స అంశాలను నేర్పించడం

1. బ్యాచిలర్‌ డిగ్రీ కోర్సులు

కాలవ్యవధి మూడు నుంచి నాలుగేళ్లు. బోధనలో థియరీతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ ప్రాధాన్యమిస్తారు. ఇంటర్‌ బైపీసీ కనీసం 50 శాతం మార్కులతో పూర్తిచేసినవారు అర్హులు. కొన్ని కోర్సులకు ఎంపీసీ వారినీ తీసుకుంటున్నారు. వీరికి అనాటమీ, ఫిజియాలజీ అంశాల్లో లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తారు. అందుకే వీరిని ప్రొఫెషనల్‌ పారామెడిక్‌లుగా పేర్కొంటారు. ఇంటర్న్‌షిప్‌ కూడా కోర్సులో భాగంగా ఉంటుంది. దీని ద్వారా సంబంధిత విభాగంలో అనుభవజ్ఞులైన నిపుణులతో కలిసి పనిచేసే వీలు కలుగుతుంది. వీటిలో స్పెషలైజ్‌డ్‌ కోర్సులుంటాయి. నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. కావాలనుకుంటే ఎంచుకున్న విభాగంలో ఉన్నతవిద్యనీ పూర్తిచేయవచ్చు. మాస్టర్స్, ఎంఎస్‌సీ, పీజీ డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

ఫిజియోథెరపీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ (ఓటీటీ), రెనల్‌ డయాలసిస్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, ఎక్స్‌రే టెక్నాలజీ, అనస్తీషియా టెక్నాలజీ, పర్‌ఫ్యూజన్‌ టెక్నాలజీ, ఆఫ్తల్మాలిక్‌ టెక్నిక్స్, హియరింగ్‌ లాంగ్వేజ్‌ అండ్‌ స్పీచ్‌ మొదలైనవి ప్రముఖమైనవి.

2. డిప్లొమా కోర్సులు

కొన్ని కోర్సులకు ఇంటర్‌ అర్హత కాగా, కొన్నింటిని పది పూర్తయినవారూ ఎంచుకోవచ్చు. కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండటం తప్పనిసరి. కోర్సును బట్టి కాలవ్యవధి మారుతుంది. సాధారణంగా ఏడాది నుంచి రెండేళ్ల వరకూ కోర్సులుంటాయి. ఇవీ స్పెషలైజ్‌డ్‌గా ఉంటాయి. దాదాపుగా బీఎస్‌సీలో ఉండే అన్ని విభాగాల్లో డిప్లొమా కోర్సులు అందుబాటులో ఉంటాయి.

గైనకాలజీ అండ్‌ అబ్‌స్టెట్రిక్స్, చైల్డ్‌ హెల్త్, ఆర్థోపెడిక్స్, ఆప్టోమెట్రీ, ఆపరేషన్‌ థియేటర్‌ టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ, ఆఫ్తల్మాలిక్‌ టెక్నాలజీ, ఈసీజీ టెక్నాలజీ, డయాలిసిస్‌ టెక్నాలజీ, నర్సింగ్‌ కేర్‌ అసిస్టెన్స్, మెడికల్‌రికార్డ్‌ టెక్నాలజీ మొదలైనవి ప్రధానమైనవి.

3. సర్టిఫికెట్‌ కోర్సులు

హెల్త్‌కేర్, దాని అనుబంధ రంగాల్లో ప్రవేశస్థాయి ఉద్యోగాలకు ప్రయత్నించేవారు వీటిని ఎంచుకోవచ్చు. కనీస విద్యార్హత పదో తరగతి. కోర్సునుబట్టి కాలవ్యవధుల్లో మార్పులున్నాయి. సాధారణంగా ఆరు నెలల నుంచి ఏడాది వరకూ ఉంటుంది. పూర్తిచేసినవారు టెక్నీషియన్‌ లేదా అసిస్టెంట్‌ స్థాయి ఉద్యోగాలను పొందొచ్చు.
ఎక్స్‌రే/ రేడియాలజీ అసిస్టెంట్, ఎంఆర్‌ఐ టెక్నీషియన్, మెడికల్‌ లేబొరేటరీ అసిస్టెంట్, డయాలసిస్‌ టెక్నీషియన్, ఆపరేషన్‌ థియేటర్‌ అసిస్టెంట్, సీటీ స్కాన్‌ టెక్నీషియన్, నర్సింగ్‌ కేర్‌ అసిస్టెంట్, డెంటల్‌ అసిస్టెంట్, ఈసీజీ అసిస్టెంట్‌ మొదలైనవి ముఖ్యమైనవి.

తెలుగు రాష్ట్రాల్లో ..

డాక్టర్‌ ఎన్‌టీఆర్‌ యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్, విజయవాడ

గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్, అనంతపురం

ఎస్‌వీ మెడికల్‌  కాలేజ్, తిరుపతి

గుంటూరు మెడికల్‌ కాలేజ్‌

ఆంధ్రా మెడికల్‌ కాలేజ్, విశాఖపట్నం

శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, తిరుపతి

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు

నిజామ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్, హైదరాబాద్‌

అపోలో ఫిజియోథెరపీ కాలేజ్, హైదరాబాద్‌

ఎంఎన్‌ఆర్‌ గ్రూప్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్, హైదరాబాద్‌

కాకతీయ మెడికల్‌ కాలేజ్, వరంగల్‌

ఉస్మానియా మెడికల్‌ కాలేజ్, హైదరాబాద్‌

కెరియర్‌ అవకాశాలు

దేశంలో నిరంతరం అభివృద్ధి చెందుతున్నవాటిలో ఆరోగ్య రంగం ఒకటి. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా వైద్యుల, అనుబంధ నిపుణుల అవసరం ఇంకా పెరుగుతోంది. విజయవంతంగా కోర్సులు పూర్తిచేసినవారికి ఆసుపత్రులు, హెల్త్‌ డిపార్ట్‌మెంట్లు, సంబంధిత విభాగపు క్లినిక్‌లు, వివిధ ప్రభుత్వ రక్షణ శాఖల్లో అవకాశాలుంటాయి. వీరికి ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలు రెండింట్లోనూ ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఎంపికైన సంస్థ, హోదాను బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. సాధారణంగా  ప్రారంభ వేతనం నెలకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ ఉంటుంది.

తేడా ఉంది!

అత్యవసర సమయాల్లో ‘ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్స్‌ (ఈఎంటీ)’ కూడా చికిత్సను అందిస్తారు. అందుకే చాలామంది ఈఎంటీలూ, పారామెడిక్‌లూ ఒకటే అని పొరబడుతుంటారు. వీరిద్దరి విధుల్లో చాలా మార్పులుంటాయి. విద్యాస్థాయి, చేసే పనుల్లోనూ భారీ తేడాలుంటాయి. ఈఎంటీలు చేసేవాటితోపాటు అదనపు సేవలను పారామెడిక్‌లు అందిస్తారు. ఉదాహరణకు- ఈఎంటీలు సీపీఆర్, గ్లూకోజ్, ఆక్సిజన్‌ మొదలైనవాటిని నిర్వహిస్తే.. పారామెడికల్స్‌ ఐవీలను ఇవ్వడం, మందులను సూచించడం, ఎక్విప్‌మెంట్‌లను అమర్చడం వంటివి చేస్తారు. 
 

Posted Date: 13-05-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌