• facebook
  • whatsapp
  • telegram

చిక్కులకు సైకాలజీ చెక్‌!

విభిన్న స్పెషలైజేషన్లు 

వివిధ రంగాల్లో కొలువులు 

సమస్యలూ, సందేహాలూ జీవితంలో భాగం. ఏ కోర్సులైతే భవిష్యత్తు బాగుంటుందోనని విద్యార్థులు, సిబ్బందిని  పనిమంతులుగా తీర్చిదిద్దడం ఎలా అని యాజమాన్యాలు, పిల్లల ప్రవర్తనను సరిచేయడమెలా అని తల్లిదండ్రులు... ఇలా ఎవరి అవసరాలు వాళ్లకుంటాయి. చిక్కులు ఎలాంటివైనా పరిష్కారాలు చూపుతుంది మనోవిజ్ఞానశాస్త్రం (సైకాలజీ). ప్రస్తుత పరిస్థితుల్లో సమర్థులైన సైకాలజిస్టులకు గిరాకీ పెరుగుతోంది. వాటిని అందిపుచ్చుకోవాలంటే ఏ కోర్సులున్నాయి? చదివితే ఉద్యోగాలు ఎక్కడ ఉంటాయి? తెలుసుకుందామా...!

‘మీతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి సుమా... మా మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేస్తారు..’- ఇలాంటి మాటలు సైకాలజిస్టులు, సైకాలజీ కోర్సు చదువుతున్నవారి చెవిలో పడుతూనే ఉంటాయి. అయితే వాస్తవానికి వీరు వ్యక్తుల గురించి కాకుండా వారి ప్రవర్తనను అధ్యయనం చేస్తారు. సమస్యలకు పరిష్కారాలు సూచించడం, సందేహాలను నివృత్తి చేయడం, తమ గురించి తామే తెలుసుకునేలా దిశానిర్దేశం చేయడం, కర్తవ్యం దిశగా సంకల్పించడం, సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం, భయాన్ని పోగొట్టడం... మొదలైనవి వ్యక్తిగత స్థాయిలో సైకాలజిస్టులు చేస్తారు. అదే సంస్థల వద్దకు వచ్చేసరికి ఉత్పత్తి పెంచడానికి ఉన్న అవకాశాలు, మానవ వనరుల సద్వినియోగం, నియామకాల్లో నాణ్యమైనవారిని గుర్తించగలిగేలా చేయడం, బృందాలను కార్యోన్ముఖులను చేయడం.. ఇలాంటివన్నీ ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్టుల సేవల్లో భాగమే. ఇలా తాము ఎంచుకున్న స్పెషలైజేషన్ల ప్రకారం వివిధ వర్గాలవారికి సైకాలజిస్టులు సేవలు అందిస్తారు.  

ఇంటర్‌ నుంచే...

అతి కొద్ది కళాశాలలు ఇంటర్‌ స్థాయిలో సైకాలజీ కోర్సు అందిస్తున్నాయి. ఇంటర్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ డిగ్రీలో సైకాలజీని ఒక సబ్జెక్టుగా చదువుకోవచ్చు. నగరాల్లో ఉన్న కళాశాలలే ఎక్కువగా డిగ్రీ స్థాయిలో సైకాలజీని అందిస్తున్నాయి. కొన్ని విశ్వవిద్యాలయాలు ఇంటర్‌ విద్యార్హతతో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ సైకాలజీ పీజీ కోర్సునూ ప్రారంభించాయి. దేశంలో సైకాలజీ చదువులు ఎక్కువగా పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్నాయి. వీటిని పలు సంస్థలు అందిస్తున్నాయి. ప్రవేశార్హతలు ఆయా సంస్థలను బట్టి మారుతాయి. కొన్ని విశ్వవిద్యాలయాలకు డిగ్రీలో సైకాలజీ తప్పనిసరి. మరికొన్నయితే అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం కల్పిస్తున్నాయి. యూనివర్సిటీలు నిర్వహించే పీజీ సెట్‌లతో కోర్సుల్లో చేరవచ్చు. కొన్ని సంస్థలు ఎంఏ, మరికొన్ని ఎమ్మెస్సీ పేరుతో సైకాలజీ కోర్సు నడుపుతున్నాయి.

ఎన్నో స్పెషలైజేషన్లు

ఈ సబ్జెక్టు పరిధి చాలా ఎక్కువ. అందువల్ల ఇందులో ఎన్నో స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆసక్తిని బట్టి అభ్యర్థులు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. యూనివర్సిటీలవారీ ఒక్కో రకమైన స్పెషలైజేషన్‌ లభిస్తుంది. అవి...ఎక్స్‌పరిమెంటల్, రిసెర్చ్, కౌన్సెలింగ్, ఇండస్ట్రియ‌ల్ / ఆర్గనైజేషనల్, ఎడ్యుకేషన్, డెవలప్‌మెంటల్, స్పోర్ట్స్, చైల్డ్, న్యూరో, సోషల్,  క్రిమినల్‌ / లీగల్, అప్లయిడ్, కాగ్నిటివ్‌ సైకాలజీ... ఇలా వివిధ రకాల స్పెషలైజేషన్లు! ఎక్కువ సంస్థలు పీజీ స్థాయిలో జనరల్‌ సైకాలజీ, అప్లయిడ్‌ సైకాలజీ, కౌన్సెలింగ్‌ సైకాలజీ, హెల్త్‌ సైకాలజీ కోర్సులు అందిస్తున్నాయి. చేరిన స్పెషలైజేషన్‌ ప్రకారం సిలబస్‌లో మార్పులుంటాయి. మొదటి ఏడాది ఉమ్మడి అంశాలు, రెండో సంవత్సరం స్పెషలైజేషన్‌కు ప్రాధాన్యం ఉంటుంది. పీజీ పూర్తిచేసినవారు పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. బోధనలో రాణించడానికీ, పరిశోధన సంస్థలు, కార్పొరేట్‌ కార్యాలయాల్లో సేవలు అందించడానికీ పీహెచ్‌డీ ఉపయోగపడుతుంది. కొన్ని సంస్థలు పీజీ డిప్లొమాలో భాగంగా కౌన్సెలింగ్, చైల్డ్, క్లినికల్‌ సైకాలజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో సైకాలజీని ఒక సబ్జెక్టుగా చదివివుండాలి. లేదా అనుబంధ విభాగాల్లో విద్యా నేపథ్యం అవసరం.

ఎడ్యుకేషనల్‌ సైకాలజిస్టులు: విద్యార్థి చదువు నేర్చుకునే విధానాన్ని అధ్యయనం చేస్తారు. బోధనలో మెలకువలు, బోధనా విధానాన్ని సూచిస్తారు. విద్యా సంస్థల్లో పనిచేస్తారు. కరిక్యులమ్‌ రూపకల్పనలోనూ తోడ్పడతారు.

డెవలప్‌మెంటల్‌ సైకాలజిస్టులు: మనుషుల ప్రవర్తనను అందులోనూ ముఖ్యంగా చిన్నారుల, విద్యార్థుల మానసిక పరిణతి, ఆలోచనలను అధ్యయనం చేస్తారు. పాఠశాలలు, కౌన్సెలింగ్‌ కేంద్రాల్లో వీరికి ఉద్యోగాలుంటాయి.

క్రిమినల్‌ సైకాలజిస్టులు: నేరగాళ్ల స్వభావాన్ని వీళ్లు అధ్యయనం చేస్తారు. అలా మారడానికి దారితీసిన పరిస్థితులను తెలుసుకుంటారు. దర్యాప్తు సంస్థలు, పోలీస్, జైలు శాఖల్లో ఉద్యోగాలుంటాయి.

సోషల్‌ సైకాలజిస్టులు: వ్యక్తి లేదా సమూహం ప్రవర్తనను సోషల్‌ సైకాలజిస్టులు అధ్యయనం చేస్తారు. సామాజిక సంస్థల్లో వీరికి ఉద్యోగాలుంటాయి. సరైన అభ్యర్థిని గుర్తించడానికి ఇంటర్వ్యూల్లోనూ వీరు పాల్గొంటారు. 

ఎక్స్‌పరిమెంటల్‌ సైకాలజీ: సబ్జెక్టులోని ప్రాథమికాంశాల ఆధారంగా పరిశోధన చేస్తారు. పరిశోధనా సంస్థలు, అకడమిక్‌ కేంద్రాల్లో వీరికి ఉపాధి లభిస్తుంది.

 సోష‌ల్ వ‌ర్క‌ర్‌: జీవితంలో మానసికంగా  క‌ష్టాలు ఎదుర్కొనే వారికి సాంత్వ‌న క‌లిగించ‌డం వీరి విధి. అలాంటి వారికి మాన‌సిక ధైర్యం అందించాలి. వారి భ‌యాల‌ను తొల‌గించాలి. పాఠ‌శాల‌లు, ఆసుప‌త్రులు, ఇత‌ర చోట్లా మానసికంగా బాధ‌ప‌డే వారికి అండ‌గా నిల‌వాలి. 

కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు: ఇప్పుడు వ్యక్తిగత, మానసిక సమస్యలతో సతమతమయ్యేవారి సంఖ్య పెరుగుతోంది. భావోద్వేగాలు, ప్రవర్తనను అదుపులో పెట్టుకోలేక ఇబ్బందులు పడేవారు  సమాజంలో ఉన్నారు. కెరియర్, పెళ్లి, వ్యాపారం ఇలాంటి విషయాల్లో ఎటూ తేల్చుకోలేని సందిగ్ధంలో ఉంటున్నారు. వీళ్లందరికీ పరిష్కారం, ప్రత్యామ్నాయం చూపడంలో సహాయపడేవారే కౌన్సెలింగ్‌ సైకాలజిస్టులు. సమస్యలూ, సందేహాలతో ఇబ్బందిపడేవారితో మాట్లాడి, సమస్య నుంచి బయటపడేలా ప్రయత్నిస్తారు.  

చైల్డ్‌ సైకాలజిస్టులు: ఇంచుమించు డెవలప్‌మెంటల్‌ సైకాలజీ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో దేనినైనా నేర్చుకోవడంలో విద్యార్థి పడుతున్న ఇబ్బందులు, శిశు వికాసం, చిన్న పిల్లల ప్రవర్తన, వాళ్లలో నెలకొన్ని భయాలు (ఫోబియా) ...వీటిని అధ్యయనం చేస్తారు. ఈ స్పెషలైజేషన్‌ చదివినవాళ్లకు పాఠశాలల్లో, ముఖ్యంగా ప్రత్యేక అవసరాలున్న చిన్నారులు చదివే పాఠశాలలు, పునరావాస కేంద్రాల్లో కొలువులుంటాయి. 

స్పోర్ట్స్‌ సైకాలజిస్టులు: ఆటగాళ్లకు సంబంధిత విభాగంలో సామర్థ్యం ఎంత ముఖ్యమో, మానసిక బలం అంతకంటే ఎక్కువగా అవసరం. ఏవిధమైన ఒత్తిడికీ లోనుకానప్పుడే వాళ్ల సామర్థ్యం మేరకు ఆటల్లో రాణించగలరు. వీరిలో ఒత్తిడి, ఆందోళన, అనవసర భయాలను పారదోలేవారే స్పోర్ట్స్‌ సైకాలజిస్టులు. క్రీడాకారులు సామర్థ్యం మేరకు రాణించేలా చూడడంలో వీరి పాత్రే ముఖ్యం. స్పోర్ట్స్‌ అకాడెమీలు, స్పోర్ట్స్‌ క్లబ్బులు, క్రీడా సంస్థలు, ప్రముఖ క్రీడాకారుల వద్ద వీరికి ఉద్యోగ అవకాశాలుంటాయి. 

క్లినికల్‌ సైకాలజిస్టులు: ఆధునిక జీవనశైలి కారణంగా ఒత్తిడి పెరుగుతూ చాలామంది మానసిక రుగ్మతల పాలవుతున్నారు. చెప్పుకోలేని కారణాలతో దిగులుకు లోనవుతున్నారు. వీరి సమస్యలను అధ్యయనం చేసి, క్లినికల్‌ సైకాలజిస్టులు పరిష్కారాలు సూచిస్తారు. కొన్ని సందర్భాల్లో వీరు వైద్యులతో కలిసి సేవలు అందిస్తారు. మానసిక రుగ్మతల విషయంలో సైకియాట్రిస్టులతో కలిసి పనిచేస్తారు. సైకియాట్రిక్‌ ఆసుపత్రులు, ఆరోగ్య కేంద్రాలు, విద్యాసంస్థల్లో కొలువులుంటాయి. సొంతంగానూ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. మందులతో కాకుండా మాటలు, సూచనలతో  ఒత్తిడి, భయం, ఆందోళనలను తగ్గిస్తారు. 

సైకోథెర‌పిస్ట్: సైకాల‌జీ చ‌దివిన‌ విద్యార్థులు ఎంచుకునే రంగాల్లో ఇది అత్యంత‌ ప్రాచుర్యం క‌ల‌ది. మాన‌సికంగా ఇబ్బందులు ప‌డే వ్య‌క్తుల‌కు సైకోథెర‌పిస్టుల అవ‌స‌రం ఎంతో ఉంటుంది. శ‌రీరానికి వైద్యం చేయ‌డం కంటే మ‌న‌సుకి వైద్యం చేయ‌డం అత్యంత క‌ష్టం. వారి భావాల‌ను అర్థం చేసుకుని చాలా సంద‌ర్భాల్లో  త‌మ మాటల‌తోనే చికిత్స చేయాల్సి ఉంటుంది. ఈ కెరియ‌ర్‌లోనూ ఎన్నో ర‌కాల విభాగాలు ఉంటాయి. సంబంధిత డిగ్రీ చ‌దివేట‌ప్పుడే వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది.  

ఇండస్ట్రియ‌ల్ / ఆర్గనైజేషనల్‌ సైకాలజిస్టులు: ఉద్యోగుల ప్రవర్తన, పని స్వభావాన్ని అంచనా వేస్తారు. ఉద్యోగులకు మార్గదర్శనం, కౌన్సెలింగ్‌ అందిస్తారు. కంపెనీల ఉత్పత్తి పెరిగేలా చూస్తారు. ఉద్యోగులు కార్యోన్ముఖులుగా మారడానికి వాళ్లలో ప్రేరణ కలిగిస్తారు. సంస్థలకు సరైన దిశానిర్దేశం చేస్తారు. ఉద్యోగుల విషయంలో ఎలా వ్యవహరించాలో, ఉత్పత్తి ఎలా పెంచుకోవాలో యాజమాన్యాలకు సూచనలిస్తారు. సంస్థలు, కార్యాలయాలు, వస్తూత్పత్తి కర్మాగార కేంద్రాల్లో వీళ్లు పనిచేస్తారు. సొంతంగా శిక్షణ ఇవ్వడం, కన్సల్టెంట్‌గా వ్యవహరించడం లాంటి సేవలు అందించుకోవచ్చు. 

ఏ సంస్థ‌లు‌.. ఏ కోర్సులు? 

హరియాణ, కర్ణాటక, పంజాబ్, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు: జనరల్‌ సైకాలజీ 

తమిళనాడు సెంట్రల్‌ యూనివర్సిటీ: అప్లయిడ్‌ సైకాలజీ

రాజస్థాన్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: స్పోర్ట్స్‌ సైకాలజీ  పై సంస్థల్లోని కోర్సుల్లో ప్రవేశం సీయూసెట్త్‌ో లభిస్తుంది. 

నేషనల్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, ఇంఫాల్‌: ఎంఏ స్పోర్ట్స్‌ సైకాలజీ 

టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్, ముంబయి, చెన్నై క్యాంపస్‌లు: ఎంఏ అప్లయిడ్‌ సైకాలజీ (క్లినికల్‌ అండ్‌ కౌన్సెలింగ్‌ ప్రాక్టీస్‌)   

హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ: అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ, రెండేళ్ల ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ

కోల్‌కతా, అలహాబాద్‌ యూనివర్సిటీలు: ఎంఏ/ ఎమ్మెస్సీ సైకాలజీ

ఆంధ్రప్రదేశ్‌లో...

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం: ఎంఏ / ఎమ్మెస్సీ సైకాలజీ

ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, రాజమండ్రి: ఎంఏ సైకాలజీ

శ్రీవెంకటేశ్వర వర్సిటీ, తిరుపతి: ఎమ్మెస్సీ సైకాలజీ, ఎమ్మెస్సీ కౌన్సెలింగ్‌ సైకాలజీ

యోగి వేమన యూనివర్సిటీ, కడప: ఎమ్మెస్సీ సైకాలజీ

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, గుంటూరు: ఎమ్మెస్సీ సైకాలజీ

తెలంగాణలో...

ఉస్మానియా వర్సిటీ: ఎంఏ సైకాలజీ

కాకతీయ వర్సిటీ: ఎమ్మెస్సీ సైకాలజీ

దూరవిద్యలోనూ...

డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ (ఎమ్మెస్సీ సైకాలజీ), ఇందిరాగాంధీ ఓపెన్‌ యూనివర్సిటీ (ఎంఏ సైకాలజీ) కోర్సులు దూరవిద్యలో అందిస్తున్నాయి. డిగ్రీ అన్ని గ్రూపులవారికీ అవకాశం ఉంది. ఇవే కాకుండా చాలా విశ్వవిద్యాలయాలు దూరవిద్యలో సైకాలజీ పీజీ కోర్సులు అందిస్తున్నాయి. 

రాణించాలంటే ఏంకావాలి?

వ్యక్తుల ఆలోచనా సరళి, ప్రవర్తన, సామాజిక పరిస్థితులపై అవగాహన

భావవ్యక్తీకరణ 

విశ్లేషణ సామర్థ్యం 

భిన్నంగా ఆలోచించడం

శ్రద్ధగా వినడం

పరిష్కార ప్రతిభ  

సహనం

సాయపడే తత్వం

Posted Date: 23-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌