• facebook
  • whatsapp
  • telegram

సంప్రదాయ కళల్లో శిక్షణ

జులై 17 వరకు దరఖాస్తుల స్వీకరణ 

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఒక సర్టిఫికెట్‌ కోర్సు, ఆరు డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పదో తరగతి అర్హతతో వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. 

సనాతన శిల్ప, వాస్తు కళలను భావితరాల వారికి అందించాలనే సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) తిరుపతిలో 1960లో ‘శ్రీవేంకటేశ్వర శిల్పకళా శిక్షణ కేంద్రం’ పేరుతో సర్టిఫికెట్‌ కోర్సు స్థాయి విద్యాలయాన్ని ప్రారంభించింది. ఎక్కువ మంది విద్యార్థులు చేరడంతో కొన్ని మార్పులు, చేర్పులు చేసి 1985లో డిప్లొమా కోర్సును కూడా ప్రవేశపెట్టింది. శ్రీవేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థగా అభివృద్ధి చేసింది. 

ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనే సంప్రదాయ శిల్ప విద్యను బోధించే ఏకైక సంస్థ. దక్షిణ భారతదేశంలోనే తమిళనాడు మహాబలిపురం తొలి కళాశాలగా ఏర్పాటయింది. తితిదే కళాశాల రెండోది. 

డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సులు 

శిల్ప కళాశాలలో ఆరు డిప్లొమా కోర్సులు, ఒక సర్టిఫికెట్‌ కోర్సులకు విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. కోర్సులకు ఎలాంటి ఫీజూ ఉండదు. అడ్మిషన్‌ సమయంలో డిప్లొమా విద్యార్థులు బోర్డ్‌ రికగ్నిషన్‌ ఫీజు రూ.250, వార్షిక పరీక్ష ఫీజు రూ. 450  (ఏడాదికి) చెల్లించాల్సివుంటుంది. 

డిప్లొమా కోర్సులకు పదో తరగతి విద్యార్హతతో నాలుగు సంవత్సరాల పాటు శిక్షణ ఉంటుంది. శిలా శిల్ప విభాగం, సుధా (సిమెంట్‌) శిల్ప విభాగం, ఆలయ నిర్మాణం, దారు(కొయ్య) శిల్ప విభాగం, లోహశిల్ప విభాగం, సంప్రదాయ చిత్రలేఖనంలలో డిప్లొమా కోర్సులున్నాయి. 
రెండు సంవత్సరాల వ్యవధి శిక్షణతో సంప్రదాయ కలంకారీ కళ సర్టిఫికెట్‌ కోర్సునూ అందిస్తున్నారు. 

శిక్షణ సమయంలో సంస్కృతం, రూపధాన్యం, ప్రతిమా లక్షణం, ఆలయ నిర్మాణం, సివిల్‌ ఇంజినీరింగ్, కంప్యూటర్‌ బేసిక్స్, ఆటోక్యాడ్‌తో పాటు ఆయా విభాగాలకు సంబంధించి ప్రాక్టికల్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. ప్రతి విభాగానికి కేవలం 10 సీట్లు ఉంటాయి. 

దరఖాస్తు చేసినవారికి జులైలో డ్రాయింగ్, గణితం, తెలుగుల్లో రాత పరీక్ష, వైవా నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా అర్హులకు సీట్లను కేటాయిస్తారు. ప్రభుత్వ రిజర్వేషన్‌ విధానాలను అనుసరించి ప్రవేశం కల్పిస్తున్నారు. ఇందులో శిక్షణకు చేరిన విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత భోజనం, విడివిడిగా హాస్టల్‌ వసతి కల్పిస్తున్నారు.

ఉన్నతవిద్యకు అవకాశం

డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణులైనవారికి తెలుగు విశ్వవిద్యాలయం, జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు అవకాశం ఉంది. శిక్షణ పూర్తి చేసుకున్నవారు తితిదేలో స్థపతిగాÅ, ప్రభుత్వ దేవాదాయ శాఖతో పాటు పలు ప్రైవేటు సంస్థల్లో ఉపాధి పొందవచ్చు. శిక్షణలో చేరిన రోజున విద్యార్థి పేరు మీద తితిదే రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్‌ చేస్తుంది. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి ఆ మొత్తాన్ని అందిస్తోంది. 

ఇందులో ప్రవేశాలకు అర్హులైన విద్యార్థుల నుంచి 2022-23 విద్యాసంవత్సరానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. జులై 10 వరకు దరఖాస్తులు అందిస్తారు. జులై 17లోపు దరఖాస్తులను అలిపిరి సమీపంలోని కళాశాలలో అందించాల్సి ఉంది. 

మరిన్ని వివరాలకు https://www.tirumala.org/SVISTA.aspx వెబ్‌సైట్‌ చూడవచ్చు. కళాశాల కార్యాలయ ఫోన్‌ నంబరు 0877-2264637లోనూ సంప్రదించవచ్చు. 

- న్యూస్‌టుడే, తిరుపతి(తితిదే)
 

Posted Date: 21-06-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌