• facebook
  • whatsapp
  • telegram

కెరియర్‌ మెరిసే‘లా’!

న్యాయవిద్యలో పలురకాల కోర్సులు

ఇంటర్‌ విద్యార్థుల ముందు ఉన్న ముఖ్యమైన కెరియర్‌ ఆప్షన్లలో న్యాయవిద్య ఒకటి. ఇంజినీరింగ్, మెడిసిన్‌ మాదిరిగానే ఇందులోనూ జాతీయ స్థాయి సంస్థలు వెలిశాయి. పరీక్షలు సైతం ఉమ్మడిగా నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ అన్ని గ్రూపులవారూ న్యాయవిద్య కోర్సులు చదువుకోవచ్చు. మేటి సంస్థల్లో వీటిని పూర్తిచేసుకున్నవారు ప్రాంగణ నియామకాల్లో ఆకర్షణీయ వేతనాలు పొందుతున్నారు.

ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్న విద్యార్థులు డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ కలిపి ఒకేసారి చదువుకోవచ్చు. దీంతో అయిదేళ్లకే కోర్సు పూర్తవుతుంది. అదే డిగ్రీ తర్వాత న్యాయవిద్యలో చేరితే మొత్తం ఆరేళ్లు (విడిగా సాధారణ డిగ్రీకి మూడేళ్లు, ఎల్‌ఎల్‌బీకి మరో మూడేళ్లు) అవసరం. ఇంటర్‌ అనంతరం లా చదువులతో ఏడాది సమయం ఆదాతో పాటు సబ్జెక్టుపై గట్టి పట్టు సాధించడానికి అవకాశం దక్కుతుంది. దేశవ్యాప్తంగా ఎన్నో సంస్థలు డిగ్రీతో కలిపి ఎల్‌ఎల్‌బీ కోర్సులు అందిస్తున్నాయి. ఈ తరహా చదువులకు ఎక్కువ ప్రాధాన్యం ఉంది. 

జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశానికి కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌) నిర్వహిస్తున్నారు. ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. తెలుగు రాష్ట్రాల నుంచి నల్సార్, హైదరాబాద్‌; దామోదరం సంజీవయ్య జాతీయ లా కళాశాల, విశాఖపట్నం ఇందులో ఉన్నాయి. పేరొందిన ప్రైవేటు సంస్థలు కూడా క్లాట్‌ స్కోర్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు ఎల్‌శాట్‌తో అవకాశం కల్పిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ లాసెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ స్కోరుతో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరవచ్చు. లా ప్రవేశ పరీక్షల్లో ఆప్టిట్యూడ్, జనరల్‌ అవేర్‌నెస్, లీగల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలో గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు.

ఉద్యోగాలు...

ఇంజినీరింగ్‌ విద్యార్థులకు ఉన్నట్లుగానే న్యాయవిద్య అభ్యసించినవారికి సైతం ప్రాంగణ నియామకాలను విద్యాసంస్థలు నిర్వహిస్తున్నాయి. జాతీయ స్థాయి సంస్థల్లో కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్‌ సంస్థలూ, అకౌంటింగ్‌ కంపెనీల్లో న్యాయ నిపుణుల సేవలు తప్పనిసరి. పేరున్న సంస్థల్లో చదువుకున్నవారిని జ్యుడీషియల్‌ క్లర్కులగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌ (ఎల్‌పీవో)లోనూ అవకాశాలుంటాయి. ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ..ఇవన్నీ కొలువుల వేదికలే. తగిన నైపుణ్యాలు ఉన్నవారికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు పెద్ద మొత్తంలో వేతనాలు అందిస్తున్నాయి. 

సైబర్‌ క్రైమ్, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు పెరుగుతున్నాయి. అందువల్ల సబ్జెక్టుపై పట్టున్నవారు నిలదొక్కుకోవచ్చు. సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌), లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. ఆర్మీలో జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. బార్‌ పరీక్షలో ఉత్తీర్ణులు కోర్టుల్లో సొంతంగా ప్రైవేటు ప్రాక్టీస్‌ మొదలుపెట్టుకోవచ్చు. లీగల్‌ రిపోర్టర్, లీగల్‌ ఎనలిస్ట్‌ గానూ రాణించవచ్చు. అంతర్జాతీయ స్థాయిలోనూ సత్తా చాటడానికి వేదికలు ఉన్నాయి. 

ఏ నైపుణ్యాలు అవసరం?

విస్తృత సమాచారాన్ని తక్కువ వ్యవధిలో చదివి అర్థం చేసుకునే నైపుణ్యం లా గ్రాడ్యుయేట్లకు ఉండాలి. 

తర్కం, విశ్లేషణ, రాత నైపుణ్యాలు బాగుండాలి. 

భావవ్యక్తీకరణలో స్పష్టత ఉండాలి. మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు తప్పనిసరి.   

కోరుకున్న కోర్సుతో...

విద్యార్థులు తమ ఆసక్తి, పూర్వ విద్య నేపథ్యం అనుసరించి...బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యు...వీటిలో కోరుకున్న కాంబినేషన్‌తో ఎల్‌ఎల్‌బీ చదువుకోవచ్చు. ఎక్కువ సంస్థలు బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తున్నాయి. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ లా సిలబస్‌ ఒకేలా ఉంటుంది. బీబీఏలో మేనేజ్‌మెంట్, బీఏలో సోషల్‌ సైన్సెస్, బీఎస్సీలో సైన్స్, బీఎస్‌డబ్ల్యూలో సోషల్‌ వర్కుకు ప్రాధాన్యం కల్పిస్తారు. అయిదేళ్లలో పది సెమిస్టర్లతో డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య (ఎల్‌ఎల్‌ఎం) దిశగా అడుగులేయవచ్చు.

ఉన్నత విద్య...

ఎల్‌ఎల్‌బీ తర్వాత ఎల్‌ఎల్‌ఎం చదువుకోవచ్చు. జాతీయ, ప్రముఖ సంస్థల్లో ఏడాది వ్యవధిలోనే దీన్ని పూర్తిచేసుకోవచ్చు. రాష్ట్రస్థాయి సంస్థల్లో ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. ఎల్‌ఎల్‌ఎంలో స్పెషలైజేషన్‌ దిశగా అడుగులేసే అవకాశం దక్కుతుంది. బిజినెస్‌ లా, హ్యూమన్‌ రైట్స్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా, కాన్‌స్టిట్యూషనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ లా, క్రిమినల్‌ లా, కార్పొరేట్‌ లా, ఎన్విరాన్‌మెంటల్‌ లా, ఫ్యామిలీ లా, పాలసీ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్, ...మొదలైనవి వీటిలో ముఖ్యమైనవి. ఎల్‌ఎల్‌ఎం అనంతరం ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీ దిశగా అడుగులేయవచ్చు. బోధన రంగంలో రాణించడానికి డాక్టరేట్‌ పట్టా ఉపయోగపడుతుంది.

ముఖ్య విద్యాసంస్థలు

దేశంలో న్యాయవిద్యకు నేషనల్‌ లా యూనివర్సిటీలతోపాటు దిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్‌ లా; బెనారస్‌ యూనివర్సిటీ, వారణాసి; గవర్నమెంట్‌ లా కాలేజ్, ముంబై; ఐఎల్‌ఎస్‌ లా కాలేజ్, పుణె; సింబయాసిస్, పుణె...తదితర సంస్థలు ముఖ్యమైనవి.  

ఐఐఎం రోహ్‌తక్‌: ఈ సంస్థ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ప్రోగ్రాం ఇన్‌ లా (ఐపీఎల్‌) కోర్సును అందిస్తోంది. దీన్ని పూర్తిచేసుకున్నవారికి బీబీఏ ఎల్‌ఎల్‌బీ డిగ్రీని ప్రదానం చేస్తారు. ఈ కోర్సులో ఒక్కోటీ 3 నెలల వ్యవధితో 15 టర్మ్‌లు ఉంటాయి. విద్యార్థులకు బిజినెస్‌ మేనేజ్‌మెంట్, లీగల్‌ ఎడ్యుకేషన్‌ అంశాలు బోధిస్తారు. ప్రవేశానికి క్లాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ, పది, ఇంటర్‌ మార్కులకు వెయిటేజీ ఉంటుంది. 

యూపీఈఎస్‌: ఆరేళ్ల వ్యవధితో బీటెక్‌తోపాటు ఎల్‌ఎల్‌బీ చదువుకునే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌) బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తోంది. సైబర్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా- ఈ రెండింటిలో ఏదో ఒకటి స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకే అవకాశం ఉంది.  

స్పెషలైజేషన్లు...

సివిల్‌ లా: సాధారణ గొడవలు, ఆస్తి తగాదాలు, కుటుంబ వివాదాలు, హక్కుల ఉల్లంఘన మొదలైన కేసులను సివిల్‌ లా నిపుణులు చూసుకుంటారు.

క్రిమినల్‌ లా: హత్య వెనుక పరిణామాలు, అందుకు దోహదం చేసిన పరిస్థితులను వీరు గమనిస్తారు. క్లయింట్లు, పోలీసులు, సాక్షులు అందించిన సమాచారంతో కోర్టులో వాదనలు వినిపిస్తారు. 

ట్యాక్స్‌ లా: దేశంలో ఉన్న వివిధ రకాల పన్నులపై వీరు అధ్యయనం చేస్తారు. ఇన్‌కం ట్యాక్స్, ఎస్టేట్‌ ట్యాక్స్, సర్వీస్‌ ట్యాక్స్‌...ఇలా అన్ని ట్యాక్స్‌లపైనా వీరికి పట్టు ఉంటుంది. తమ క్లయింట్లు, వారి సంస్థలకు చెందిన ట్యాక్స్‌ కేసులను కోర్టులో వాదిస్తారు. 

ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా: వీరు మేధా హక్కులకు కాపలాదారుగా ఉంటారు. కొత్త ఆవిష్కరణలు, సృజనాత్మక పనులు, కళాత్మక ఆకృతులు, లోగో, సంస్థ పేరు, ప్రత్యేక చిత్రాలు...ఇవన్నీ ఎవరివి వారికి ప్రత్యేకం. ఒక సంస్థ లేదా వ్యక్తికి చెందినవి మరొకరు దొంగిలించడం, దాన్నే అనుసరించడం, స్వల్ప మార్పులతో వినియోగించడం...లాంటివి చేస్తే వీరు తమ క్లయింట్ల తరఫున సంబంధిత కేసుల్లో వాదనలు వినిపిస్తారు. 

కార్పొరేట్‌ లా: సంస్థలకు వర్తించే యాక్ట్‌లు, నియమాలపై వీరు అధ్యయనం చేస్తారు. కంపెనీలకు న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తారు. సంబంధిత సంస్థలకు ఉన్న హక్కులను కాపాడతారు. ఉద్యోగాలు, ఒప్పందాలకు సంబంధించిన వివాదాలను పరిష్కరిస్తారు. 

ఎన్విరాన్‌మెంటల్‌ లా: వీరు పర్యావరణ సంబంధిత అంశాలపై అధ్యయనం చేస్తారు. గాలి, నీరు, నేల కలుషితం చేయడం, అడవుల నరికివేత, అనుమతి లేనిచోట్ల పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు నెలకొల్పడం ...మొదలైన సమస్యలపై వీరు దృష్టి సారిస్తారు. సంస్థల తరఫున, అలాగే పర్యావరణ హక్కులపై పోరాటం చేస్తున్నవారి తరఫున తమ వాదనలు వినిపిస్తారు.

Posted Date: 08-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌