• facebook
  • whatsapp
  • telegram

అన్ని గ్రూపులకూ న్యాయం!

న్యాయమూర్తి.. న్యాయవాది.. విలువలతో కూడిన జీవితం. గౌరవప్రదమైన సామాజిక హోదా. ఎందరికో న్యాయాన్ని అందించే ఉత్తమ స్థానం. మంచి ఆదాయం.. సంతృప్తిని సంపూర్ణంగా ఇచ్చే వృత్తి. అవును.. ఎవరినైనా ఇంతటి ఉన్నతంగా ఉంచగలిగేది న్యాయవిద్యే. అందుకే ఆ కోర్సుకు అంతకంతకూ ఆదరణ పెరుగుతోంది. ఇతర ప్రొఫెషనల్‌ చదువులకు దీటుగా ఎదుగుతోంది. ఇంటర్మీడియట్‌ పూర్తయిన వారు ఇప్పటి నుంచే ఆ దిశగా కెరియర్‌ను సాగించడంపై దృష్టిసారించవచ్చు. 
 

దేశవ్యాప్తంగా దాదాపు 1200 న్యాయ కళాశాలల్లో లక్ష సీట్లు ఉన్నాయి. ప్రస్తుతం సంప్రదాయ న్యాయ కళాశాలలతోపాటు ప్రైవేటు, న్యాయ విశ్వవిద్యాలయాలు న్యాయవిద్యను అందిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో ఏపీ లా సెట్‌/ టీఎస్‌ లా సెట్‌ గానీ, జాతీయ స్థాయిలో క్లాట్‌ (కామన్‌ లా ఎంట్రన్స్‌ టెస్ట్‌) గానీ రాసి న్యాయవిద్యాకోర్సుల్లో చేరవచ్చు. ప్రధానంగా మూడేళ్లు, అయిదేళ్ల కోర్సులున్నాయి.
ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌తో పూర్తిచేసినా అయిదేళ్ల లా కోర్సులో చేరవచ్చు.
ఏదైనా డిగ్రీ పూర్తయినవారు మూడేళ్ల లా కోర్సులో చేరవచ్చు. ఈ రంగంలో రాణించాలనుకునేవారికి అయిదేళ్ల ఎల్‌ఎల్‌బీ (బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ లెజిస్లేటివ్‌ లా) కోర్సు అనువైనది.
డిగ్రీ అయ్యాక ‘లా’తో పోలిస్తే ఐదేళ్ల లా కోర్సులో ఏడాది మిగులుతుంది. ఈ వ్యవధిలో ఆ రంగంలో మరింత నైపుణ్యం సాధించడంతోపాటు ఉపాధినీ పొందవచ్చు. అయిదేళ్ల కోర్సులు పూర్తి చేసినవారు న్యాయవాద వృత్తిలో రాణించడానికి అవకాశాలున్నాయి. ప్రత్యేక రంగాల్లో నైపుణ్యం పొందవచ్చు. కోర్టుల్లో ప్రాక్టీస్‌ ప్రారంభించవచ్చు. ఇందులో కూడా ప్రత్యేకంగా సబ్జెక్టులను ఎంచుకోవచ్చు.

ఉపాధి అవకాశాలు
లా కోర్సులు చేస్తే లీగల్‌ అడ్వైజర్‌, అడ్వొకేట్‌, లీగల్‌ మేనేజర్‌, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ లాంటి హోదాల్లో ఉపాధి పొందవచ్చు.

సివిల్‌, క్రిమినల్‌, వినియోగదారుల చట్టాలు, మానవ హక్కులు, పన్నులు, కంపెనీ లా, మేధో సంపత్తి చట్టాలు, రాజ్యాంగం తదితర అంశాల్లో నైపుణ్యం సాధించి ఆయా రంగాల్లో నుంచి వచ్చే కేసుల ద్వారా లబ్ధి పొందవచ్చు. ఇక్కడ కేసులు, నైపుణ్యం ఆధారంగా ఫీజు పొందవచ్చు.
ప్రస్తుతం జ్యుడిషియల్‌ సర్వీసులోనూ ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వాలు కొత్త కోర్టులు ఏర్పాటు చేస్తున్నాయి. వాటితోపాటు ఆయా రంగాలకు సంబంధించి ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేస్తుండటంతో అక్కడా అవకాశాలున్నాయి. వీటిలో జ్యుడిషియల్‌ ఆఫీసరుగా చేరడానికి అవకాశం ఉంది. పోటీపరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తే జూనియర్‌ సివిల్‌ జడ్జి, మున్సిఫ్‌ మేజిస్ట్రేట్‌, చీఫ్‌ జ్యుడిషియల్‌ మేజిస్ట్రేట్‌ వంటి పోస్టులు పొందవచ్చు.
కింది కోర్టుల నుంచి సుప్రీం కోర్టు దాకా ప్రభుత్వం తరఫున కేసులను వాదించడానికి న్యాయవాదుల అవసరం ఉంది. ప్రభుత్వ న్యాయవాదులు, సహాయ న్యాయవాదులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌లు, అదనపు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సహాయ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు వంటి పోస్టులున్నాయి. వీటితోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్‌లలో ఉపాధి అవకాశాలున్నాయి.
లా ఛాంబర్స్‌లో ఉద్యోగులుగా చేరి తమ సేవలను అందించవచ్చు. ఇక్కడ అవసరమైన సమాచారాన్ని సేకరించి ఇవ్వడం, పిటిషన్‌లను రూపొందించడం, నోటీసులు సిద్ధం చేయడం తదితర పనులను చేయడం ద్వారా వేతనం పొందవచ్చు.
ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల మధ్య పరస్పర వాణిజ్య కార్యకలాపాలు పెరిగినందున అంతర్జాతీయ ఒప్పందాలు, పేటెంట్‌లు తదితరాలకు సంబంధించి నిపుణుల అవసరం ఉంది. రెండు దేశాల్లోని కంపెనీల మధ్య ఏర్పడే వివాదాలను పరిష్కరించడానికి ఆర్బిట్రేషన్‌లాంటివాటిలో అవకాశాలున్నాయి. విదేశీ కంపెనీలు కూడా భారతీయ న్యాయవాదులను నియమించుకుంటున్నాయి.
నల్సార్‌ వంటి జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా డిగ్రీ చేస్తుండగానే బహుళ జాతి కంపెనీలు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. వేతనాలు కూడా భారీ స్థాయిలో ఉండటంతో న్యాయవిద్యను అభ్యసించడానికి పోటీ ఉంటోంది. ఇక్కడ కోర్సులకు నిర్వహించే ప్రవేశపరీక్షల నిమిత్తం 10వ తరగతి నుంచే శిక్షణ ప్రారంభిస్తున్నారంటే ఈ కోర్సుల ప్రాధాన్యం ఏమిటో తెలుస్తుంది.

ఇంటర్‌ అర్హతతో లా కోర్సులు 
బీఏ ఎల్‌ఎల్‌బీ, బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌): బీఏ ఎల్‌ఎల్‌బీకి అదనంగా కొన్ని సబ్జెక్ట్టులు చేర్చి ఆనర్స్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో కోర్టు ప్రాక్టీసు, ప్రవర్తన, ఇతర అంశాలపై శిక్షణ ఉంటుంది.
బీకాం ఎల్‌ఎల్‌బీ: కామర్స్‌కు చెందినవి ఉంటాయి. బీఏ, బీకాం, ఆనర్స్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులు చాలా కాలేజీల్లో అందుబాటులో ఉన్నాయి.
బీబీఏ ఎల్‌ఎల్‌బీ: దీనిలో ఎల్‌ఎల్‌బీకి అదనంగా బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్ట్టులుంటాయి.
బీఎస్సీ ఎల్‌ఎల్‌బీ, బీటెక్‌ ఎల్‌ఎల్‌బీ: ఈ కోర్సులు పరిమితంగా ఉన్నాయి.

Posted Date: 19-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌