• facebook
  • whatsapp
  • telegram

పాతవైనా... ప్రామాణికాలే!

ఇంటర్‌ తర్వాత డిగ్రీలో చేరాలనుకోగానే ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. అసలు ఏయే గ్రూప్‌లు ఉన్నాయి? ఏం తీసుకుంటే ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? సంప్రదాయ కాంబినేషన్లు తీసుకోవాలా? స్పెషల్‌ కోర్సులకు వెళ్లాలా? ఏ నిర్ణయం తీసుకుంటే ఎక్కువ ఉపయోగం? మామూలు సబ్జెక్టులు చదివితే వెనుకబడి పోతారా? ప్రత్యేక విభాగాలను ఎంచుకుంటే ఎటూ కాకుండా అవుతారా? నిజమే..ఇన్ని రకాలుగా ఆలోచించాల్సిందే. కానీ అనవసరమైన ఆందోళన విడిచిపెట్టాలి. పనికిరాని కోర్సులంటూ ఏమీ ఉండవు. అన్నీ అవసరం కాబట్టే ప్రభుత్వం వాటిని నిర్వహిస్తోంది. దేని ప్రయోజనం దానికి ఉంటుంది. అందుకే ఆసక్తి, అభిరుచి, భవిష్యత్తు లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. అప్పుడే అన్ని ప్రశ్నలకూ సరైన సమాధానం దొరుకుతుంది.

దేశంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చదువుతున్న డిగ్రీ బీఏ. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఆర్ట్స్‌ కంటే సైన్స్‌ అభ్యర్థులే అధికం. మొత్తం మీద ప్రొఫెషనల్‌ కోర్సులతో పోలిస్తే సంప్రదాయ డిగ్రీలను అభ్యసిస్తున్నవారే ఎక్కువ. కొన్నేళ్ల నుంచి విశ్వవిద్యాలయాల ప్రాంగణాల్లోనూ ఈ డిగ్రీ కోర్సులను అందిస్తున్నారు. వీటి గ్రూప్‌ సబ్జెక్టుల్లోనూ వైవిధ్యం పెరిగింది. ప్రొఫెషనల్‌ కోర్సుల కంటే తక్కువ వ్యవధిలో, తక్కువ వ్యయంతో పూర్తికావడం, అందుబాటులో కళాశాలలుండటం వీటికి అనుకూలమైన అంశాలు. ఇప్పుడు పోటీ పరీక్షలకూ, ఉన్నత విద్యకూ ఉపయోగపడే కోర్సులను ఎంచుకోవడం వైపు విద్యార్థులు మొగ్గు చూపుతున్నారు.

ఇంటర్‌ ఏ గ్రూప్‌ వారైనా బీఏలో చేరవచ్చు. కామర్స్‌, మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదివిన వారికి బీకాంలోకి అవకాశం ఉంటుంది. బీఎస్సీకి సైన్స్‌, మ్యాథ్స్‌ విద్యార్థులు అర్హులు. దాదాపు డిగ్రీ కళాశాలలన్నీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులను అందిస్తున్నాయి. పాపులర్‌ కాంబినేషన్లు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కొత్తగా ఎన్నో సబ్జెక్టులను డిగ్రీలో చేర్చారు. కొన్ని కళాశాలల్లో డిగ్రీతోపాటు ఇతర సర్టిఫికేషన్లు, కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. కొన్ని చోట్ల సివిల్స్‌ కోచింగ్‌ లభిస్తోంది.

బీఏ - పోటీ పరీక్షలకు ప్రత్యేకం

హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌ కాంబినేషన్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. సివిల్స్‌, గ్రూప్‌-1, 2 తదితర పోటీ పరీక్షల లక్ష్యాలు ఉన్నవారికీ, భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించేవారికీ తిరుగులేని కాంబినేషన్‌ ఇది. టూరిజం, సైకాలజీ, సోషల్‌ వర్క్‌, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, ఆంత్రపాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, ఉమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌, పాపులేషన్‌ స్టడీస్‌, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్‌, హాస్పిటాలిటీ...ఇలా ఎంచుకోవడానికి ఎన్నో సబ్జెక్టులు బీఏలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోనే 64 గ్రూప్‌ కాంబినేషన్లు లభిస్తున్నాయి.

బీఎస్సీ - ఎన్నో అవకాశాలు

ఈ గ్రూప్‌లో పేరున్న కాంబినేషన్‌ మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదువుకున్న విద్యార్థులకు మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌ మరో ఉత్తమ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూడు సబ్జెక్టులపై పట్టు సాధించినవాళ్లు భవిష్యత్తులో ఎన్నో అవకాశాలను సొంతం చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్‌, ఎల‌్రక్టానిక్స్‌, ఇ[స్టియల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ..ఇలా ఎన్నో సబ్జెక్టులను మ్యాథ్స్‌ విద్యార్థులు ఎంచుకోవచ్చు. బైపీసీ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మొదటి నుంచీ ఆదరణ పొందుతున్నాయి. వీరు మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్‌, సీడ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితర సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఓయూలో బైపీసీ, ఎంపీసీ స్ట్రీములవారికి వివిధ సబ్జెక్టులతో 60 గ్రూప్‌ కాంబినేషన్లు లభిస్తున్నాయి.

బీకాం - ప్రొఫెషనల్‌ కోర్సుల్లోకి దారి

బీఏ, బీఎస్సీలతో పోలిస్తే ఇక్కడ కాంబినేషన్లు తక్కువే. కానీ అవకాశాలు మాత్రం ఎక్కువేనని చెప్పుకోవాలి. కామర్స్‌ సబ్జెక్టు ప్రధానాంశంగా ఈ కోర్సు రూపొందింది. బీకాంలో ఉన్న రకరకాల కాంబినేషన్లలో (రెగ్యులర్‌/ ఆనర్స్‌/ ట్యాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌/అడ్వర్ట్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌/ బ్యాంకింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బీకాం జనరల్‌, ఆనర్స్‌లతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ, బీకాం ఆనర్స్‌ + సీఐఎంఏ కాంబినేషన్లతో కోర్సులను అందిస్తున్నాయి. అసోసియేషన్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ)లో 13 పేపర్లు పూర్తిచేయాలి. బీకాం ఆనర్స్‌ విద్యార్థులకు వీటిలో 6 పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ కోర్సు కేఎల్‌యూ, గీతం యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. బీకాం ఆనర్స్‌తోపాటు చార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌ (సీఐఎంఏ) కోర్సు పూర్తిచేసుకోవచ్చు. బీకాం విద్యార్థులు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే సీఏ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరవచ్చు.

మూడు డిగ్రీల్లోనూ అందుబాటులో ఉన్న గ్రూప్‌ కాంబినేషన్లు 400 +

ఎలా ఎంచుకోవాలి?

డిగ్రీలో చేరాలనుకుంటే భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తికి అనుగుణంగా గ్రూప్‌తోపాటు సబ్జెక్టుల కాంబినేషన్లనూ విద్యార్థులు ఎంచుకోవాలి. వివిధ పీజీ కోర్సులు చేయాలంటే యూజీలో సంబంధిత సబ్జెక్టు చదివి ఉండాలి. అందుకు అనుగుణమైన సబ్జెక్టును యూజీలో ఎంచుకోవాలి. కోర్సు వ్యవధి మూడేళ్లు. కొన్ని సంస్థలు ఆనర్స్‌ విధానంలోనూ బ్యాచిలర్‌ డిగ్రీలను అందిస్తున్నాయి. ఈ తరహా డిగ్రీల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో అదనపు ప్రావీణ్యాన్ని పొందడానికి వీలవుతుంది. కనీసం ఒక పేపర్‌ ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. ఏదైనా సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు, ఆ సబ్జెక్టులో ఉన్నత విద్యను ఆశిస్తున్నవారు ఆనర్స్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఇంటర్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం లభిస్తాయి.

స్వరూపం...

బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల వ్యవధి మూడేళ్లు. పరీక్షలను సెమిస్టర్‌ విధానంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలన్నీ చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌)ను అనుసరిస్తున్నాయి. రాష్ట్రాల పరిధిలోని డిగ్రీ కళాశాలల సిలబస్‌, విధివిధానాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సెమిస్టర్‌ మధ్యలోనూ మిడ్‌ సెమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులవారీ క్రెడిట్‌లు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల్లో 1000 కళాశాలల్లో 200కు పైగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోకి డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌, తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ స్టూడెంట్‌ అకడమిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీ శామ్స్‌) ద్వారా డిగ్రీ కోర్సుల్లోకి చేరడానికి వీలవుతుంది. కళాశాలలు, కోర్సులు, సీట్లు, ఫీజుల వివరాలను ఆయా వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్‌, రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. డిగ్రీ కోర్సుల్లో చేరినవారు వ్యక్తిగత ఆసక్తులను బట్టి భవిష్యత్తులో భిన్న మార్గాలను ఎంచుకోవచ్చు. సంబంధిత కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యను కొనసాగించడం, మేనేజ్‌మెంట్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో (ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్‌, లా) చేరడం, కేంద్రం, రాష్ట్రాల స్థాయుల్లో నిర్వహించే పలు ఉద్యోగాలకు సన్నద్ధం కావడం..వీటిలో ముఖ్యమైనవి. ఎవరికివారు భవిష్యత్తు ఆశయాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. అందుబాటులో ఉన్న సమాచారంపై సరైన అవగాహనతో ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినవారు భవిష్యత్తులో కోరుకున్న స్థానానికి చేరుకోవచ్చు.

ప్రధాన కాంబినేషన్లు

ఎంపీసీతో..
మ్యాథ్స్‌, పిజిక్స్‌, కెమిస్ట్రీ
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఎల‌్రక్టానిక్స్‌
మ్యాథ్స్‌, ఎల‌్రక్టానిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌
మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, ఎకనామిక్స్‌
మ్యాథ్స్‌, స్టాటిస్టిక్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌
మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జియాలజీ

బైపీసీతో..
బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ
మైక్రో బయాలజీ, జెనెటిక్స్‌, కెమిస్ట్రీ
బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ
బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ
బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ
బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్‌, క్రోబయాలజీ
ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ
కెమిస్ట్రీ, జువాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌
కెమిస్ట్రీ, బోటనీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌
ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ

ఆర్ట్స్‌ గ్రూప్‌లు
హిస్టరీ, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌
హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ
సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ
సైకాలజీ, మార్కెటింగ్‌, ఇంగ్లిష్‌ లిటరేచర్‌ః హిస్టరీ, ఇంగ్లిష్‌ లిటరేచర్‌, పొలిటికల్‌ సైన్స్‌
ఎకనామిక్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌
హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, పొలిటికల్‌ సైన్స్‌
ఇంగ్లిష్‌ లిటరేచర్‌, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌
సోషల్‌ వర్క్‌, ఎకనామిక్స్‌, పొలిటికల్‌ సైన్స్‌

Posted Date: 14-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌