• facebook
  • whatsapp
  • telegram

జల రవాణా.. కొలువు ఖజానా!

ప్రపంచాన్ని జలమార్గంలో చుట్టే అవకాశం.. దానికితోడు ఆకర్షించే వేతనాన్ని అందించగల కెరియర్‌! ఈ రెండింటికీ అవకాశాన్ని కల్పిస్తాయి మారిటైమ్‌/ మర్చంట్‌ నేవీ కోర్సులు. సముద్రాలపై ఆసక్తి, కొంత సాహసోపేత జీవనంపై ఆకర్షణ ఉన్నవారు వీటిని ఎంచుకోవచ్ఛు డిప్లొమా, బీఎస్‌సీ, బీటెక్‌, మేనేజ్‌మెంట్‌ కోర్సులున్నాయి. వీటిలో ఎక్కువశాతం ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసినవారికే అందుబాటులో ఉన్నాయి.

చుట్టూ ఎటుచూసినా నీరు, కనుచూపు మేరలో కనిపించని భూమి! ఇలా కొన్ని రోజులు కాదు.. ఏటా కొన్ని వారాలు, నెలలపాటు అలా ప్రయాణం చేస్తుండాలి. దేశవిదేశాలు చుట్టి వస్తుండాలి. అక్కడి నుంచి మనుషులు, సరకులు రవాణా చేస్తుండాలి. ఇవన్నీ మర్చంట్‌ నేవీ కెరియర్‌లో కనిపించే అంశాలు. సముద్రాలపై ఆసక్తి ఉండి, విదేశాలను సందర్శించడం, అక్కడి సంస్కృతులను తెలుసుకోవాలనుకునేవారికి ఇది సరైన కెరియర్‌. సాధారణంగా నేవీ అన్న పదం వినగానే సముద్ర తీరప్రాంతాల్లో గస్తీ కాసేవారు, సముద్ర జలాల్లో శత్రువులపై దాడి వంటివి గుర్తుకు వస్తుంటాయి. కానీ నేవీ, మర్చంట్‌ నేవీకి మధ్య తేడా ఉంది.

నేవీ భారత ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌లో ఆర్మీ, ఏర్‌ఫోర్స్‌ల్లా ఒక విభాగం. వీరు సముద్రాల ద్వారా దేశానికి కీడు చేయాలనుకునే శత్రుమూకలతో పోరాడుతారు. వీరి ప్రధాన బాధ్యత సముద్ర సరిహద్దులను పహరా కాయడం. ఇండియన్‌ నేవీ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిస్తుంది.

వర్తక సంబంధ నౌకా వ్యాపారాన్నే మర్చంట్‌ నేవీగా పిలుస్తారు. మిలటరీ అవసరానికి ఉపయోగించని వాణిజ్య నౌకలను ఇక్కడ ఉపయోగిస్తారు. ఇక్కడ ఒక దేశం నుంచి మరో దేశానికి పెద్ద మొత్తంలో సరుకులు, ప్రజల రవాణా మర్చంట్‌ నేవీ కిందకి వస్తాయి. ఇదో స్పెషలైజ్‌డ్‌ ఇండస్ట్రీ. కార్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఆహార పదార్థాలు, ముడిసరుకులు, ఆయిల్‌, బొగ్గు, ఇనుము, చెక్క మొదలైనవాటిని ఇందులో భాగంగా రవాణా చేస్తారు. మర్చంట్‌ నేవీ కార్యకలాపాలు మర్చంట్‌ మారీటైమ్‌ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతాయి.

అంతర్జాతీయ వాణిజ్యంలో మర్చంట్‌ నేవీది ప్రధాన పాత్ర. ఎగుమతులు, దిగుమతుల్లో 90% సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఎంతోమంది ఈ రంగంలో పనిచేస్తున్నారు. దీన్ని కెరియర్‌గా ఎంచుకోవాలనుకునేవారు సంబంధిత కోర్సులను చేయాల్సి ఉంటుంది. ఎన్నో ప్రముఖ సంస్థలు ఈ కోర్సులను అందిస్తున్నాయి.

ఏమేం కోర్సులు?

బీఎస్‌సీ నాటికల్‌ సైన్స్‌: మూడేళ్ల కోర్సు. సెమిస్టర్‌ విధానం ఉంటుంది. దీనికి షిప్పింగ్‌ డైరెక్టరేట్‌ జనరల్‌ గుర్తింపు ఉంది. నౌకలను సమర్థంగా నడపడం, నిర్వహించడం నాటికల్‌ సైన్స్‌ కిందకి వస్తాయి. అర్హులైన అభ్యర్థులను డెక్‌ ఆఫీసర్లుగా తీర్చిదిద్దేలా శిక్షణ ఉంటుంది. అందులో భాగంగానే నాటికల్‌ టెక్నాలజీ, అప్లికేషన్లను నేర్పిస్తారు. థియరీతోపాటు ప్రాక్టికల్‌ పరిజ్ఞానానికీ సమప్రాధాన్యం ఉంటుంది. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు. డెక్‌ ఆఫీసర్‌ అవ్వడానికి ఏడాది సీ సర్వీస్‌ను పూర్తిచేసి, వైవా ఆధారిత పరీక్షను పూర్తిచేయాల్సి ఉంటుంది.

బీఈ/ బీటెక్‌ మెరైన్‌ ఇంజినీరింగ్‌: కాలవ్యవధి నాలుగేళ్లు. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసి ఉండాలి. నాటికల్‌ ఆర్కిటెక్చర్‌, సైన్స్‌పై ప్రధాన దృష్టి ఉంటుంది. డిజైన్‌, మెయింటెనెన్స్‌ ఆఫ్‌ ప్రపల్షన్‌ సిస్టమ్స్‌, డిజైన్‌ ఆఫ్‌ స్టీరింగ్‌ ఆఫ్‌ ట్యాంకర్స్‌, సబ్‌మెరైన్స్‌, సెయిల్‌ బోట్స్‌, ఇతర మెరైన్‌ వెసెల్స్‌ మొదలైనవి కోర్సులో భాగం. నేవిగేషన్‌, కన్సర్వేషన్‌ లాస్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, ఓషన్‌ స్ట్రక్చర్స్‌, ఎఫెక్ట్‌ ఆఫ్‌ వేవ్స్‌ మొదలైనవి ప్రధానాంశాలు.

ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసినవారు అర్హులు

బీఈ నేవల్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ ఇంజినీరింగ్‌: నాలుగేళ్ల కోర్సు. మెరైన్‌ క్రాఫ్ట్‌, స్ట్రక్చర్‌ డిజైన్‌, కన్‌స్ట్రక్షన్‌ అంశాలుంటాయి. కోర్సులో భాగంగా ఫిజిక్స్‌, హైడ్రోడైనమిక్స్‌, కెమిస్ట్రీ, షిప్‌ డిజైన్‌ అంశాలను చదువుతారు. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు కోర్సు చదవడానికి అర్హులు.
బీఈ హార్బర్‌ అండ్‌ ఓషన్‌ ఇంజినీరింగ్‌: పోర్టులు, హార్బర్‌ స్ట్రక్చర్‌ డిజైనింగ్‌, కన్‌స్ట్రక్షన్‌ దీని ఉద్దేశం. కోర్సు కాలవ్యవధి నాలుగేళ్లు. ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ డ్రిల్లింగ్‌ అంశాలనూ కోర్సులో భాగంగా నేర్చుకుంటారు. ఇంటర్‌ ఎంపీసీ పూర్తిచేసినవారు అర్హులు.

బీఎస్‌సీ మెరైన్‌ కేటరింగ్‌ అండ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌: మూడేళ్ల కోర్సు. మారీటైమ్‌ స్టడీస్‌, కలినరీ ఆర్ట్స్‌, ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ సర్వీస్‌, అకామడేషన్‌, ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌ అంశాలను కోర్సులో భాగంగా నేర్పుతారు. ఇది చాలా కొద్ది సంస్థల్లో అందుబాటులో ఉంది. మెరైన్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్‌గానూ అందిస్తున్నారు. ఇంటర్‌ ఏ బ్రాంచితో పూర్తిచేసినవారైనా దరఖాస్తు చేసుకోవచ్ఛు

బీఎస్‌సీ షిప్‌ బిల్డింగ్‌ అండ్‌ రిపేర్‌: కాలవ్యవధి మూడేళ్లు. షిప్‌ డిజైన్‌, డ్రాయింగ్‌, ప్లానింగ్‌, కన్‌స్ట్రక్షన్‌, రిపేర్‌ అంశాలు ప్రధానంగా ఉంటాయి. మెరైన్‌ ఇంజినీరింగ్‌, నేవల్‌ ఆర్కిటెక్చర్‌, మెటీరియల్‌ సైన్స్‌ అంశాలను అధ్యయనం చేస్తారు. తరగతి బోధనతోపాటు ప్రాక్టికల్‌ లాబ్‌ సెషన్లూ ఉంటాయి. ఇంటర్‌ ఎంపీసీతో పూర్తిచేసినవారు అర్హులు.

బీబీఎం షిప్పింగ్‌: మూడేళ్ల కోర్సు. బిజినెస్‌ అంశాలతోపాటు షిప్పింగ్‌, లాజిస్టిక్‌ నిపుణులకు అవసరమైన అంశాలను కోర్సులో భాగంగా చదువుతారు. ఇంటర్‌ ఏ బ్రాంచితో పూర్తిచేసినవారైనా అర్హులే.
ఇంకా.. బీఎస్‌సీ మారిటైమ్‌ ఆపరేషన్స్‌, బీఈ/ బీటెక్‌లో అప్లయిడ్‌ మెరైన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అండ్‌ కమ్యూనికేషన్స్‌, పెట్రోలియం అండ్‌ ఆఫ్‌ షోర్‌ ఇంజినీరింగ్‌, హార్బర్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఆఫ్‌షోర్‌ టెక్నాలజీతోపాటు డిప్లొమా కోర్సులూ ఉన్నాయి.

అందిస్తున్న ప్రముఖ సంస్థలు

ఇండియన్‌ మారిటైం యూనివర్సిటీ, విశాఖపట్నం, చెన్నై, కొచ్చి, కోల్‌కతా, ముంబయి

మెరైన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, ముంబయి, కోల్‌కతా

ఆంధ్రా యూనివర్సిటీ, విశాఖపట్నం

టోలానీ మారిటైమ్‌ ఇన్‌స్టిట్యూట్‌, పుణె, ముంబయి

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోర్ట్‌ మేనేజ్‌మెంట్‌, కోల్‌కతా

నేషనల్‌ మారిటైమ్‌ అకాడమీ, చెన్నై

వీఈఎల్‌ఎస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ అండ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌, చెన్నై

ఎస్‌ఎల్‌సీఎస్‌, తమిళనాడు

మధురై కామరాజ్‌ యూనివర్సిటీ, మధురై

ఏఎంఈటీ యూనివర్సిటీ, చెన్నై.

ప్రవేశం ఎలా?

ప్రవేశపరీక్షలు: మర్చంట్‌ నేవీలో టెక్నికల్‌ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు ప్రవేశపరీక్షలు రాయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు జాతీయ ప్రవేశపరీక్ష- జేఈఈ ద్వారా ప్రవేశాలు కల్పిస్తుంటే కొన్ని ప్రత్యేకంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశాలు కల్పిస్తున్నాయి.

ప్రముఖ ప్రవేశపరీక్షలు..

ఐఎంయూ సెట్‌

జేఈఈ

ఎంఈఆర్‌ఐ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌

టీఎంఐ శాట్‌లేటరల్‌ ఎంట్రీ: ఎలక్ట్రికల్‌ లేదా మెకానికల్‌ ఇంజినీరింగ్‌ మొదటి సంవత్సరం 60% మార్కులతో పూర్తిచేసినవారు లేదా ఎలక్ట్రికల్‌, మెకానికల్‌, మెరైన్‌, షిప్‌ బిల్డింగ్‌ ఇంజినీరింగ్‌ల్లో డిప్లొమాను 60% మార్కులతో పూర్తిచేసినవారు లేటరల్‌ ఎంట్రీ ద్వారా మర్చంట్‌ నేవీ కోర్సుల్లోకి ప్రవేశం పొందే వీలుంది.

మారిటైమ్‌ సంస్థలు నిర్వహించే ప్రోగ్రామ్‌లకు నేరుగా దరఖాస్తు చేసుకోవచ్ఛు షిప్పింగ్‌ సంస్థలు స్పాన్సర్‌షిప్‌ ప్రోగ్రామ్‌లను అందిస్తాయి. వాటికీ దరఖాస్తు చేసుకోవచ్ఛు

ఉద్యోగ అవకాశాలు

ఈ రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలున్నాయి. మర్చంట్‌ నేవీలో కార్గో, కంటైనర్‌, బర్జ్‌ క్యారీయింగ్‌ షిప్‌లు, ట్యాంకర్లు, బల్క్‌ క్యారియర్స్‌, ప్యాసెంజర్‌ మొదలైన షిప్‌లుంటాయి. వీటిని నిర్వహించే సంస్థలకు నిపుణులు అవసరమవుతారు. డెక్‌, ఇంజిన్‌, సర్వీస్‌ విభాగాల్లో వీరు ప్రధానంగా అవసరమవుతారు. కోర్సులు చేసినవారిని డెక్‌ ఆఫీసర్‌/ నేవిగేషన్‌ ఆఫీసర్‌, ఎలక్ట్రో టెక్నికల్‌ ఆఫీసర్‌, ఇంజినీర్‌, సీ ఫేరర్‌, కేటరింగ్‌ అండ్‌ హాస్పిటల్‌ ఆఫీసర్‌ మొదలైన హోదాలకు తీసుకుంటారు. దేశీయ సంస్థలతోపాటు విదేశీ సంస్థలు వీరిని నియమించుకుంటున్నాయి.

హోదా, ఎంపికైన సంస్థ, విభాగాన్ని బట్టి జీతభత్యాల్లో మార్పులుంటాయి. ప్రారంభ వేతనం 15,000 నుంచి రూ.30,000 వరకు ఉంటుంది. హోదా, అనుభవం పెరిగేకొద్దీ జీతభత్యాల్లో మెరుగుదల ఉంటుంది

Posted Date: 30-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌