• facebook
  • whatsapp
  • telegram

మార్కెట్ నిర్దేశకులు... కామర్స్ నిపుణులు

ఆర్థిక సరళీకరణ విధానాల కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాల స్థానంలోకి మల్టీ లెవెల్ మార్కెట్లు, బహుళజాతి కంపెనీలు ప్రవేశించాయి. ఫలితంగా కంపెనీల సమర్థ నిర్వహణకు వాణిజ్య నిపుణులకు డిమాండ్ పుంజుకుంది. మార్కెట్ అవసరాలకు తగిన నిపుణులను తీర్చిదిద్దడంలో అనేక యూనివర్సిటీలు విలువైన వాణిజ్య కోర్సులను అందిస్తున్నాయి. వాటి గురించిన సమాచారం తెలుసుకుందాం.
కామర్స్ సబ్జెక్టుతో ఇంటర్ పూర్తిచేసిన తర్వాత ఎలాంటి కోర్సులు అందుబాటులో ఉంటాయి? ఉన్నవాటిలో దేన్ని ఎంచుకోవాలి? ఏ కోర్సుతో ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఏ కాలేజీలో చేరాలి? అందులో సీటు ఎలా సంపాదించాలి? ఎంచుకున్న కోర్సు ఎన్నేళ్లకు పూర్తవుతుంది? మొదలైన అనేక ప్రశ్నలు విద్యార్థులకు ఎదురవుతుంటాయి. అధ్యాపకులు, స్నేహితులు, తల్లిదండ్రుల సలహాలు, సోషల్ మీడియా కొంతవరకు మాత్రమే సందేహాలను నివృత్తి చేస్తాయి. అంతిమ నిర్ణయం విద్యార్థులు ఎవరికి వారే స్వయంగా తీసుకోవాలి.

కామర్స్‌కు అనుకూలం

భారతదేశం రెండంకెల ఆర్థిక వృద్ధి సాధించాలని కోరుకుంటోంది. వచ్చే రెండు దశాబ్దాల్లో వ్యాపార అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లోనే కామర్స్, సోషల్ సైన్సెస్‌ను కెరీర్‌గా ఎంచుకున్న వారికి మరిన్ని ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 
భారతదేశ స్థూల దేశీయోత్పత్తిలో ఎక్కువ భాగం ఆర్థిక సేవలు, దాని అనుబంధ రంగాల నుంచే వస్తోం దన్నది గమనించాల్సిన విషయం. ఇలాంటి ఆర్థిక, వ్యాపార వాతావరణంలో కామర్స్, సంబంధిత కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయనడంలో సందేహం లేదు.

ఉన్నత విద్యావకాశాలు

ఇంజినీరింగ్, మెడికల్ కోర్సుల్లో క్రమేణా నాణ్యత క్షీణించడం, ఆర్థికంగా భారంగా మారుతుండటంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు ఆలోచిస్తున్నారు. మారుతోన్న ఆర్థిక పరిస్థితుల్లో కామర్స్ ఆకర్షణీయమైన కెరీర్‌ను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో, సులభంగా కామర్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేయవచ్చు.

బీకాం: ఇంటర్ కామర్స్ విద్యార్థులకు అందుబాటులో ఉన్న సాంప్రదాయ కోర్సు ఇది. వివిధ యూనివర్సిటీలు, విద్యా సంస్థలు బీకాం డిగ్రీలో కూడా అనేక రకాల స్పెషలైజేషన్‌లను ప్రవేశపెడుతున్నాయి. అవన్నీ కూడా రిశ్రామికంగా అవసరమమ్యేవి, ఉద్యోగావకాశాలు కల్పించేవే.

బీకాం (ఆనర్స్): ఇది పూర్తిగా వ్యాపార, ఆర్థిక అంశాలతో రూపొందించింది. అనువర్తనకు అధిక ప్రాధాన్యం ఉన్న కోర్సు. 

బీకాం (కంప్యూటర్స్): కామర్స్‌లో కంప్యూటరీకరణకు ఈ కోర్సు దోహదపడుతుంది. ఆర్థిక వ్యవస్థ అవసరాలకు అనుగుణంగా బీకాం డిగ్రీని ఎప్పటికప్పుడు మారుస్తూ వస్తున్నారు. కార్పొరేట్ అకౌంటింగ్, అడ్వర్టయిజ్‌మెంట్, సేల్స్ ప్రమోషన్స్, ట్యాక్స్ ప్రొసీజర్స్ అండ్ ప్రాక్టీసెస్, ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సిస్టమ్ లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. 
బీకాంతోపాటు సీఏ, సీఎస్, సీడబ్ల్యూఏ కోర్సులను అనుబంధ ప్రోగ్రామ్‌లుగా చదివే కొత్త ధోరణి పెరుగుతోంది. ఇందులో విద్యార్థులు బీకాం కోర్సును పూర్తిచేయడంతోపాటు వారి అభిరుచిని బట్టి సీఏ, సీడబ్ల్యూఏ కోర్సులకు అవసరమైన శిక్షణ లభిస్తుంది. సీఏలాంటి కోర్సుల్లో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువ ఉంటుంది. అందువల్ల ఒకవేళ వీటిలో విజయం సాధించలేకపోయినా బీకాం డిగ్రీ వస్తుంది కాబట్టి విద్యార్థి సమయం వృథా కాదు.

ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్:

బీకాం-ఎల్ఎల్‌బీ లాంటి ఇంటెగ్రేటెడ్ కోర్సులు కూడా కామర్స్ విద్యార్థులకు ఉపయుక్తమైనవే. సాధారణంగా ఇవి అయిదేళ్ల కోర్సులు. ఒకేసారి రెండు డిగ్రీలు రావడం ఈ కోర్సుల ప్రత్యేకత. అయితే ఒక కోర్సు పూర్తయ్యాక (మూడేళ్ల తర్వాత) మధ్యలో చదువు ఆపేయడం వీలుకాదు. ఆపితే ఒక్క డిగ్రీ కూడా లభించదు.
 

ప్రొఫెషనల్ కోర్సులు:

సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్, సీఎఫ్ఏ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేస్తే అద్భుతమైన ఉద్యోగావకాశాలు ఉంటాయనడంలో సందేహం లేదు. సాధారణ డిగ్రీలతో పోలిస్తే ఇవి కొంచెం కష్టమైన కోర్సులు. సాధారణ డిగ్రీల్లా ఇవి క్యాంపస్ ప్రోగ్రామ్‌లు కాదు. విద్యార్థి వ్యక్తిగతంగా ఎక్కువ శ్రద్ధ, బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది.
ప్రొఫెషనల్ కోర్సుల్లో సీఏకు మంచి అవకాశాలు ఉన్నాయి. బాగా శ్రమిస్తేనే సీఏలో ఉత్తీర్ణులు అవుతారు. దీంతో పోలిస్తే కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ కోర్సులు కొంత సులభం. చాలా తక్కువ శాతం మంది మాత్రమే సీఏ కోర్సును పూర్తి చేయగలుగుతున్నారు.
కామర్స్, సంబంధిత విభాగాల్లో ఇంటర్, ఆ తర్వాత డిగ్రీ పూర్తయ్యాక ఎన్నో రకాల ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పీజీ, ఒకేషనల్ కోర్సులు, పోటీ పరీక్షలు ఇలా చాలా మార్గాలున్నాయి. వాటిలో ముఖ్యమైనవి కొన్ని...

 

హయ్యర్ డిగ్రీ ప్రోగ్రామ్స్:

బీకాం పూర్తయిన విద్యార్థి ఎంకాంలో చేరొచ్చు. అయితే సాధారణ ఎంకాం కంటే ఎంబీఏ, ఎంఏ (ఎకనామిక్స్/ ఎకనామెట్రిక్స్), మాస్టర్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఫైనాన్షియల్ అనాలసిస్ (ఎంఐఎఫ్ఏ) మొదలైన కోర్సులతో మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ కంట్రోల్, ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ కోర్సులు చేయవచ్చు.
పరిశోధన వైపు వెళ్లాలనుకునే వారికి ఆకర్షణీయమైన అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. అకౌంట్స్, ఫైనాన్స్ విభాగంలో డాక్టరేట్ల కొరత అధికంగా ఉంది. వీరికి టీచింగ్ ఒక మంచి కెరియర్. బోధన రంగంలో కూడా ప్రస్తుతం మంచి వేతనాలు లభిస్తున్నాయి.

సర్టిఫికెట్ కోర్సులు:

ఎన్‌సీఎఫ్ఎం అండ్ సెబీ లాంటి సంస్థలు పలు సర్టిఫికెట్ కోర్సులను అందిస్తున్నాయి. ఈ కోర్సులు చేసినవారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువే. ఫైనాన్షియల్ అనాలసిస్, ఫారెన్ ట్రేడ్, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ మొదలైనవి మరికొన్ని సర్టిఫికెట్ కోర్సులు.
 

పోటీ పరీక్షలు:

డిగ్రీ తర్వాత యూపీఎస్సీ, బ్యాంకింగ్ సర్వీసెస్, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలైన నియామక, పోటీ పరీక్షలు రాయొచ్చు.
 

సొంతగా ప్రాక్టీస్

సీఏ, సీడబ్ల్యూఏ, సీఎస్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులు చేసినవారికి కెరియర్ పరంగా అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. సొంతగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ నిపుణుల కొరత చాలా ఎక్కువగా ఉంది. అందువల్ల పెద్ద కంపెనీల్లో ఉద్యోగులుగా చేరితే మొదట్లోనే ఏడాదికి నాలుగు నుంచి అయిదు లక్షల వేతనం తేలిగ్గా లభిస్తుంది.
మంచి సంస్థల్లో ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారికి ఏడాదికి కనీసం మూడు లక్షలు, బీకాం వారికి రూ.1.2 లక్షల వరకు వేతనంగా పొందే వీలుంటుంది. ఇవన్నీ సాధించాలంటే మంచి అకడమిక్ రికార్డుతోపాటు విద్యార్థి దశలో కమ్యూనికేషన్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ పెంపొందించుకోవాలి. చాలా వరకు కాలేజీలే ఇలాంటి అదనపు సామర్థ్యాల్లో శిక్షణ అందిస్తున్నాయి. లేకపోతే మంచి శిక్షణ సంస్థలో చేరి ఈ సామర్థ్యాలను పెంపొందించుకోవాలి.
కష్టపడే తత్వం, తెలివితేటలు ఉన్న విద్యార్థులకు ఇంజినీరింగ్, మెడిసిన్‌ల కంటే కామర్స్ మంచి కెరియర్‌ను ఇస్తుంది. ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేయడానికి ఇదొక ఉత్తమమైన, తక్కువ పోటీ ఉన్న విభాగం అనడంలో సందేహం లేదు.

కొన్ని ముఖ్యమైన కామర్స్ కాలేజీలు
శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్, ఢిల్లీ
సెయింట్ జేవియర్స్ కాలేజ్, కోల్‌కతా
లేడీ శ్రీరామ్ కాలేజ్ ఫర్ విమెన్, ఢిల్లీ
లయోలా కాలేజ్, చెన్నై
హన్స్‌రాజ్ కాలేజ్, ఢిల్లీ
క్రిస్ట్ యూనివర్సిటీ, బెంగళూరు
శ్రీ నార్సిమోంజీ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్, ముంబయి
మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్, చెన్నై
హిందూ కాలేజ్, న్యూఢిల్లీ
స్టెల్లా మేరీస్ కాలేజ్, చెన్నై
వీటిలో ఎక్కువ విద్యాసంస్థలు 50-70 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులైనవారికి ప్రవేశం కల్పిస్తున్నాయి. కొన్ని కాలేజీలు ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించి విద్యార్థులను కోర్సులకు ఎంపిక చేస్తాయి. ఇంకొన్ని సంస్థలు మేథ్స్‌లో మార్కుల శాతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయి.

 

కొన్ని ప్రముఖ కంపెనీలు
ఎర్నెస్ట్ అండ్ యంగ్
డెలాయిట్
కేపీీఎంజీ
బెయిన్ అండ్ కంపెనీ
కాగ్నిజంట్-బీపీఓ
హెచ్ఎస్‌బీసీ
జీఈ క్యాపిటల్
గూగుల్
క్రిసిల్
ఇన్ఫోసిస్ టెక్
హిందూస్థాన్ యూనీలీవర్
కన్సల్టింగ్ ప్రయివేట్ లిమిటెడ్
ప్రైస్ వాటర్‌హౌస్ కూపర్స్
ఉద్యోగుల ఎంపికకు చాలా సంస్థలు కొంచెం కఠినమైన నియామక ప్రక్రియలను అనుసరిస్తున్నాయి. కొన్ని క్యాంపస్ నియామకాలు చేపడుతున్నాయి. ఏదైనా కంపెనీకి ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఆ సంస్థ అనుసరిస్తున్న ఎంపిక ప్రక్రియను, అక్కడి పని వాతావరణాన్ని తెలుసుకోవడం ఎంతైనా అవసరం.

Posted Date: 07-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌