• facebook
  • whatsapp
  • telegram

పోటీకి దీటైనవి.. భవితకు మేలైనవి!   

మన దేశంలో ఎక్కువమంది విద్యార్థులు అండర్‌ గ్రాడ్యుయేట్‌ (యూజీ) స్థాయిలో చేరుతోన్న కోర్సుల్లో సాధారణ డిగ్రీలైన బీఏ, బీఎస్సీ, బీకాంలే వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో ఉన్నాయి. సుమారు కోటిమంది బీఏలోనూ, దాదాపు అర కోటి మంది బీఎస్సీలోనూ, అటుఇటుగా 45 లక్షల మంది బీకాంలోనూ ఉన్నారు. బీఏ, బీకాం, బీఎస్సీ మూడు విభాగాల్లో కలుపుకుని దేశవ్యాప్తంగా సుమారు 400 గ్రూప్‌ కాంబినేషన్లు లభిస్తున్నాయి. తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చుతో పూర్తికావడం, కళాశాలలు అందుబాటులో ఉండడం, పోటీ పరీక్షలు, ఉన్నత విద్యకు ఉపయోగపడడం...తదితర కారణాలతో ఈ కోర్సులు విద్యార్థులను ఆకర్షిస్తున్నాయి!

గతంతో పోలిస్తే బీఏ, బీకాం, బీఎస్సీ గ్రూపు సబ్జెక్టుల్లో వైవిధ్యం పెరిగింది. ప్రైవేటు విశ్వవిద్యాలయాలెన్నో ప్రధాన ప్రాంగణాల్లో ఈ కోర్సులను అందిస్తున్నాయి. జాతీయ స్థాయిలో బీఏ కోర్సుదే పైచేయి అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువమంది విద్యార్థులు సైన్స్‌ (బీఎస్సీ) కోర్సుల్లో చేరడానికే ప్రాధాన్యమిస్తున్నారు. 

ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఏ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది. 

బీకాంలోకి ఇంటర్‌లో కామర్స్‌ మ్యాథ్స్‌ సబ్జెక్టులు చదివినవారికి అవకాశం ఉంటుంది. 

బీఎస్సీకి సైన్స్, మ్యాథ్స్‌ విద్యార్థులు అర్హులు. 

దాదాపు డిగ్రీ కళాశాలలన్నీ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులు అందిస్తున్నాయి. పాపులర్‌ కాంబినేషన్లు అన్ని చోట్లా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుత అవసరాల నేపథ్యంలో కొత్తగా ఎన్నో సబ్జెక్టులు డిగ్రీలో చేరాయి. కొన్ని కళాశాలల్లో డిగ్రీతోపాటు ఇతర సర్టిఫికేషన్లు, కోర్సుల్లో శిక్షణ అందిస్తున్నారు. కొన్ని చోట్ల సివిల్స్‌ కోచింగ్‌ సైతం లభిస్తోంది. డిగ్రీలో చేరాలనుకునే విద్యార్థులు భవిష్యత్తు లక్ష్యాలు, ఆసక్తికి అనుగుణంగా గ్రూపుతోపాటు సబ్జెక్టుల కాంబినేషన్‌ ఎంచుకోవాలి. పీజీ కోర్సులు చదవడానికి యూజీలో సంబంధిత సబ్జెక్టు చదివుండడం తప్పనిసరి. అందుకు అనుగుణంగా సబ్జెక్టును యూజీలో ఎంచుకోవాలి. 
కొన్ని సంస్థలు ఆనర్స్‌ విధానంలో బ్యాచిలర్‌ డిగ్రీలు అందిస్తున్నాయి. కోర్సు వ్యవధి మూడేళ్లే. అయితే తక్కువ సంఖ్యలో ప్రైవేటు విశ్వవిద్యాలయాలు నాలుగేళ్ల వ్యవధితో ఆనర్స్‌ కోర్సులు అందుబాటులోకి తెచ్చాయి. ఈ తరహా చదువుల్లో ఎంపిక చేసుకున్న సబ్జెక్టులో అదనపు ప్రావీణ్యం పొందడానికి వీలవుతుంది. కనీసం ఒక పేపర్‌ ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. ఏదైనా సబ్జెక్టుపై ప్రత్యేక ఆసక్తి ఉన్నవారు, ఆ సబ్జెక్టులో ఉన్నత విద్యను ఆశిస్తున్నవాళ్లు ఆనర్స్‌ చదువులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు.  ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ఇంటర్‌ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం లభిస్తాయి. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు పరీక్షలో చూపిన ప్రతిభతో తీసుకుంటున్నాయి.

బీఏ

ఈ కోర్సులో హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ కాంబినేషన్‌ అందరికీ అందుబాటులో ఉంటుంది. సివిల్స్, గ్రూప్‌-1,2 తదితర పోటీ పరీక్షల ఆశావహులకూ, భవిష్యత్తులో ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకోవాలని ఆశించేవారికీ మేటి కాంబినేషన్‌ ఇది. టూరిజం, సైకాలజీ, సోషల్‌ వర్క్, ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, ఆంత్రొపాలజీ, జాగ్రఫీ, ఫిలాసఫీ, విమెన్‌ స్టడీస్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, పాపులేషన్‌ స్టడీస్, హ్యూమన్‌ రైట్స్‌ అండ్‌ డ్యూటీస్, హాస్పిటాలిటీ...ఇలా ఎంచుకోవడానికి ఎన్నో సబ్జెక్టులు బీఏలో అందుబాటులో ఉన్నాయి. ఒక్క ఉస్మానియా పరిధిలోనే 60కి పైగా గ్రూప్‌ కాంబినేషన్లు లభిస్తున్నాయి. 

బీఎస్సీ

ఈ చదువుల్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ పాపులర్‌ కాంబినేషన్‌. ఇంటర్‌లో మ్యాథ్స్‌ చదువుకున్న విద్యార్థులకు మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌ టాప్‌ కాంబినేషన్‌గా చెప్పుకోవచ్చు. ఈ మూడు సబ్జెక్టులపై పట్టు సాధించినవాళ్లు భవిష్యత్తులో కొత్త అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. కంప్యూటర్‌ సైన్స్, ఎల్రక్టానిక్స్, ఇండస్ట్రియల్‌ కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, జియాలజీ..ఇలా ఎన్నో సబ్జెక్టులను మ్యాథ్స్‌ విద్యార్థులు ఎంచుకోవచ్చు. బైపీసీ స్ట్రీమ్‌లో బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ మొదటి నుంచీ ఆదరణ పొందుతున్నాయి. వీరు మైక్రో బయాలజీ, బయోటెక్నాలజీ, బయో కెమిస్ట్రీ, ఫారెస్ట్రీ, జెనెటిక్స్, సీడ్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ తదితర సబ్జెక్టులను ఎంచుకోవచ్చు. ఓయూలో బైపీసీ, ఎంపీసీ స్ట్రీమ్‌లవారికి వివిధ సబ్జెక్టులతో 60 గ్రూప్‌ కాంబినేషన్లు లభిస్తున్నాయి. ఇప్పుడు బీఎస్సీలోనూ డేటా సైన్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఎనలిటిక్స్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌...లాంటి వైవిధ్య కోర్సులు ప్రైవేటు విద్యా సంస్థల్లో అందుబాటుకొచ్చాయి. ఇంటర్‌ మ్యాథ్స్‌ విద్యార్థులు ఐఐటీ మద్రాస్‌ అందించే ఆన్‌లైన్‌ బీఎస్సీ కోర్సులోనూ చేరవచ్చు.   

బీకాం 

బీఏ, బీఎస్సీలతో పోలిస్తే ఇక్కడ కాంబినేషన్లు తక్కువగా ఉంటాయి. కామర్స్‌ సబ్జెక్టు ప్రధానాంశంగా ఈ కోర్సు రూపొందింది. బీకాం (రెగ్యులర్‌/ ఆనర్స్‌/ ట్యాక్సేషన్‌/ కంప్యూటర్స్‌/ ఈ-కామర్స్‌/ ఇంటర్నేషనల్‌ బిజినెస్‌/ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌/ అడ్వర్టైజింగ్‌ అండ్‌ సేల్స్‌ మేనేజ్‌మెంట్‌/ ఫారిన్‌ ట్రేడ్‌/ బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌) వీటిలో నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు బీకాం జనరల్, ఆనర్స్‌లతోపాటు అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు ఉన్న బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ, బీకాం ఆనర్స్‌ + సీఐఎంఏ కాంబినేషన్లతో కోర్సులు అందిస్తున్నాయి. అసోషియేషన్‌ ఆఫ్‌ ఛార్టర్డ్‌ సర్టిఫైడ్‌ అకౌంటెంట్స్‌ (ఏసీసీఏ)లో చేరినవారు 13 పేపర్లు పూర్తిచేయాల్సి ఉంటుంది. అయితే బీకాం ఆనర్స్‌ విద్యార్థులకు వీటిలో 6 పేపర్ల నుంచి మినహాయింపు లభిస్తుంది. బీకాం ఆనర్స్‌ + ఏసీసీఏ కోర్సు కేఎల్‌యూ, గీతం యూనివర్సిటీల్లో అందుబాటులో ఉంది. బీకాం విద్యార్థులు ఒకవైపు చదువు కొనసాగిస్తూనే  సీఎంఏ, సీఏ, సీఎస్‌ తదితర ప్రొఫెషనల్‌ కోర్సుల్లో చేరవచ్చు.  

స్వరూపం...

బీఏ, బీకాం, బీఎస్సీ ఎందులోచేరినా కోర్సు వ్యవధి మూడేళ్లే. పరీక్షలు సెమిస్టర్‌ విధానంలో ప్రతి ఆరు నెలలకు ఒకసారి నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లోని విశ్వవిద్యాలయాలన్నీ చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టమ్‌ (సీబీసీఎస్‌) అనుసరిస్తున్నాయి. ఆయా రాష్ట్రాల పరిధిలోని డిగ్రీ కళాశాలల సిలబస్, విధివిధానాలు దాదాపు ఒకేలా ఉంటాయి. సెమిస్టర్‌ మధ్యలోనూ మిడ్‌ సెమ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి సెమిస్టర్‌లోనూ సబ్జెక్టులవారీ క్రెడిట్‌లు ఉంటాయి. రెండు రాష్ట్రాల్లోనూ ప్రవేశాలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్నారు.  తెలంగాణ రాష్ట్రంలోని 6 యూనివర్సిటీల్లో సుమారు 1000 కళాశాలల్లో 200కు పైగా అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్, తెలంగాణ (దోస్త్‌) ద్వారా ప్రవేశం లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ స్టూడెంట్‌ అకడమిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఏపీ శామ్స్‌) ద్వారా డిగ్రీ కోర్సుల్లోకి చేరడానికి వీలవుతుంది. కళాశాలలు, కోర్సులు, సీట్లు, ఫీజుల వివరాలు ఈ వెబ్‌సైట్ల నుంచి పొందవచ్చు. ఇంటర్‌ మార్కుల మెరిట్, రిజర్వేషన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతుంది. 

డిగ్రీ తర్వాత

డిగ్రీ కోర్సుల్లో చేరినవారు వ్యక్తిగత ఆసక్తులను బట్టి భవిష్యత్తులో భిన్న మార్గాలను ఎంచుకోవచ్చు. సంబంధిత కోర్సులకు అనుబంధంగా ఉన్నత విద్యను కొనసాగించడం, మేనేజ్‌మెంట్‌ లేదా ప్రొఫెషనల్‌ కోర్సుల్లో (ఎంబీఏ, ఎంసీఏ, బీఎడ్, లా...) చేరడం, కేంద్రం, రాష్ట్ర స్థాయుల్లో నిర్వహించే ఉద్యోగాలకు సన్నద్ధం కావడం..వీటిలో ముఖ్యమైనవి. ఎవరికివారు తమ భవిష్యత్తు ఆశయాలకు అనుగుణంగా ప్రణాళిక రూపొందించుకోవాలి. ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చినవారు భవిష్యత్తులో కోరుకున్న స్థానాన్ని అందుకోవచ్చు. 

బైపీసీతో..

బోటనీ, జువాలజీ, కెమిస్ట్రీ

మైక్రో బయాలజీ, జెనెటిక్స్, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, బోటనీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ

బయోటెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, మైక్రోబయాలజీ

ఆక్వాకల్చర్‌ టెక్నాలజీ, కెమిస్ట్రీ, జువాలజీ

కెమిస్ట్రీ, జువాలజీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

కెమిస్ట్రీ, బోటనీ, అప్లైడ్‌ న్యూట్రిషన్‌

ఫుడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ

కాంబినేషన్లు...

ఎంపీసీతో.. 

మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ

మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, ఎల్రక్టానిక్స్‌

మ్యాథ్స్, ఎల్రక్టానిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌ 

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్‌

మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్‌ సైన్స్‌

మ్యాథ్స్, ఫిజిక్స్, జియాలజీ

ఆర్ట్స్‌

హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌.

హిస్టరీ, సోషియాలజీ, జాగ్రఫీ.

సైకాలజీ, సోషియాలజీ, ఫిలాసఫీ.

సైకాలజీ, మార్కెటింగ్, ఇంగ్లిష్‌ లిటరేచర్‌.

మాస్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ జర్నలిజం, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌.

హిస్టరీ, ఇంగ్లిష్‌ లిటరేచర్, పొలిటికల్‌ సైన్స్‌.

ఎకనామిక్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌.

హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్‌ సైన్స్‌.

ఇంగ్లిష్‌ లిటరేచర్, జర్నలిజం, పొలిటికల్‌ సైన్స్‌

సోషల్‌ వర్క్, ఎకనామిక్స్, పొలిటికల్‌ సైన్స్‌

Posted Date: 23-10-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌