• facebook
  • whatsapp
  • telegram

Commerce‌ Courses: ప్రాధాన్యం పెరుగుతున్న.. కామర్స్‌ కోర్సులు

ఇంటర్‌ తర్వాత 

ఉపాధి అవకాశాల జోరు!

సామాజిక జీవితంలో కామర్స్‌ అడుగడుగునా అంతర్భాగమై ఉంటోంది. వేగవంతమవుతున్న ఆర్థిక, వైజ్ఞానిక పరిణామాల నేపథ్యంలో కామర్స్‌ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇంటర్మీడియట్‌ తర్వాత ఈ కోర్సుల్లో చేరి పూర్తిచేసిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు ఎక్కువగా లభిస్తున్నాయి. 

కామర్స్‌లో సీఏ, సీఎంఏ, సీఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులకు మాత్రమే కాకుండా బీకామ్, బీబీఏ, బీకామ్‌ (ఆనర్స్‌) లాంటి కోర్సులకు కూడా ఆదరణ పెరుగుతోంది.  

బీకామ్‌

కామర్స్‌ కోర్సుల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కోర్సు ఇది. ఇంటర్మీడియట్‌ తర్వాత చాలామంది బీకామ్‌లో చేరతారు. ఇంటర్‌లో ఏ గ్రూప్‌ చదివినా బీకామ్‌లో చేరొచ్చు. వివిధ విశ్వవిద్యాలయాలు బీకామ్‌లో వివిధ స్పెషలైజేషన్లను అందిస్తున్నాయి. ఉదాహరణకు బీకామ్‌ (కంప్యూటర్స్‌), బీకామ్‌ (ట్యాక్సేషన్‌), బీకామ్‌ (ఫారిన్‌ ట్రేడ్‌) లాంటివి. ఇది మూడు సంవత్సరాల కోర్సు. బీకామ్‌ చదివిన విద్యార్థులు ఏంబీఏ/ ఎంకామ్‌ లాంటి ఉన్నత విద్యలను అభ్యసించవచ్చు. అదేవిధంగా బీకామ్‌తోపాటు స్టాక్‌ మార్కెట్, ఇన్స్యూరెన్స్‌ రంగాలకు సంబంధించిన సర్టిఫికెట్‌ కోర్సు చేస్తే ఉపాధి అవకాశాలు అధికంగా ఉంటాయి.

భవిష్యత్తు: బీకామ్‌తోపాటు స్పోకెన్‌ ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ట్యాలీ లాంటి అకౌంట్స్‌ ప్యాకేజీలపై పట్టు సాధిస్తే ఆకర్షణీయమైన ఉద్యోగావకాశాలను పొందవచ్చు. బీకామ్‌ చదువుతూ ఆడిటర్స్‌ దగ్గర పార్ట్‌టైమ్‌ పనిచేస్తూ ప్రాక్టికల్‌ నాలెడ్జ్‌ను సంపాదిస్తే.. ట్యాక్స్‌ కన్సల్టెంట్‌గా స్థిరపడొచ్చు. బీకామ్‌ చేసినవారికి స్టాక్‌మార్కెట్, ఇన్స్యూరెన్స్, బ్యాంకింగ్‌ లాంటి రంగాల్లో వివిధ అవకాశాలు లభిస్తాయి. ఈ విద్యార్థులు బీఎడ్‌ కూడా చేయొచ్చు. బీకామ్‌ చదువుతూ లేదా పూర్తిచేసి అభిరుచి ఉన్నట్లయితే సీఏ, సీఎంఏ, సీఎస్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులూ చేయొచ్చు. కొన్ని ప్రఖ్యాత డిగ్రీ కళాశాలల్లో చదివిన విద్యార్థులు బీకామ్‌ తర్వాత క్యాంపస్‌ సెలక్షన్స్‌లో బహుళ జాతి కంపెనీల్లో మంచి వేతనాలతో ఉద్యోగాలు సాధిస్తున్నారు. అందుకే బీకామ్‌ చదవడానికి సరైన కళాశాలను ఎంపిక చేసుకుంటే ఉపయుక్తంగా ఉంటుంది.

బీబీఏ

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ఎంతో ఆదరణ ఉన్న కోర్సు బీబీఏ. మన దేశంలో వివిధ ఉపాధి అవకాశాలను అందించే కోర్సుగా దీన్ని చెప్పుకోవచ్చు. దీన్ని వివిధ విశ్వవిద్యాలయాలే కాకుండా బీస్కూల్స్‌ కూడా అందిస్తున్నాయి. బీబీఏలో మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్‌ఆర్, హాస్పిటల్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి స్పెషలైజేషన్లు ఉంటాయి. కోర్సు కాలవ్యవధి 3 సంవత్సరాలు. బీబీఏ చదివినవారికి సంస్థ నిర్వహణ నైపుణ్యాలు, అకౌంట్స్, ఎకనామిక్స్, ఫైనాన్స్‌ లాంటి అంశాలపై లోతైన అవగాహన ఉంటుంది. ఈ కోర్సులో తరగతి గదిలో జరిగే బోధనతోపాటు క్షేత్ర శిక్షణ (ఫీల్డ్‌ ట్రెయినింగ్‌) ఎంతో అవసరం. అందువల్ల బీబీఏ చదివిన విద్యార్థులు సమ్మర్‌ ఇంటర్న్‌షిప్‌ లాంటివి చేయాలి. స్పోకెన్‌ ఇంగ్లిష్, కమ్యూనికేషన్‌ స్కిల్స్, ఇంటర్‌ పర్సనల్‌ స్కిల్స్‌ లాంటి అంశాలపై బీబీఏ విద్యార్థులు దృష్టి పెడితే అద్భుత విజయాలు సాధించగలుగుతారు. 

ఉపాధి: బీస్కూల్స్‌ అందించే బీబీఏ కోర్సు చదివిన విద్యార్థులకు జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఎన్నో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్స్, సర్వీసెస్, ఇన్స్యూరెన్స్‌) రంగాల్లో అవకాశాలు అధికం. మనదేశంలో వివిధ అంకుర సంస్థలు బీబీఏ విద్యార్థులను సేల్స్, మార్కెటింగ్‌ విభాగాల్లో తీసుకుంటున్నాయి. ఈ కోర్సు చదివిన విద్యార్థులు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లోనూ ఉద్యోగావకాశాలను పొందొచ్చు. 

బీకామ్‌ (ఆనర్స్‌)

బీకామ్‌ ఆనర్స్‌ కోర్సును బీహెచ్‌యూ (బనారస్‌ హిందూ యూనివర్సిటీ) లాంటి ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లోనూ ఉంది. బీకామ్‌ చేసినవారికి లభించే ఉపాధి అవకాశాలన్నీ బీకామ్‌ (ఆనర్స్‌) చేసినవారికి లభిస్తాయి. బీకామ్‌ 3 సంవత్సరాల కోర్సు కానీ బీకామ్‌ ఆనర్స్‌ కాల వ్యవధి మాత్రం 4 ఏళ్లు.  

అవకాశాలు: బీకామ్‌ (ఆనర్స్‌) చేసిన విద్యార్థులకు ఫైనాన్స్‌ కన్సల్టెన్సీస్, విదేశీ మారక సంస్థలు, వివిధ బహుళజాతి మార్కెటింగ్‌ సంస్థల్లో చక్కని అవకాశాలు లభిస్తాయి.

బీఏ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌)

వ్యాపార రంగంలో బీఏ ఎకనామిక్స్‌ చేసినవారికి అద్బుతÄమైన అవకాశాలు ఉన్నాయి. బీఏ ఎకనామిక్స్‌ను దేశ విదేశాల్లోని ప్రఖ్యాత కళాశాలలు అందిస్తున్నాయి. బీఏ ఎకనామిక్స్‌లో ఎకనామిక్స్‌ను ప్రాథమికాంశాల (ఫండమెంటల్స్‌) వరకే బోధిస్తారు. కానీ బీఏ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌)లో ఎకనామిక్స్‌ సబ్జెక్టును లోతుగా అధ్యయనం చేసే వీలుంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఎకనామిక్స్‌కు ఎంతో ఆకర్షణ ఉంది. కాబట్టి బీఏ ఎకనామిక్స్‌ చేస్తే జాతీయ స్థాయిలోనే కాదు; అంతర్జాతీయ స్థాయిలోనూ పీజీ కోర్సులు చేయవచ్చు. 

ఏ హోదాలు: బీఏ ఎకనామిక్స్‌ చేసిన విద్యార్థులు కంపెనీల్లో ఆర్థిక సలహాదారులుగా, ఆర్థిక విధాన రూపకల్పనలో ముఖ్యలుగా పాత్రను పోషించవచ్చు. ఐఎంఎఫ్, ఓఈసీడీ, వరల్డ్‌బ్యాంక్‌ లాంటి వివిధ అంతర్జాతీయ సంస్థలలో ఆర్థిక పరిశోధన చేసేవారిగా రాణించొచ్చు. కార్పొరేట్‌ కంపెనీల్లో ఆర్థికవేత్తగా ఉపాధిని పొందొచ్చు. మ్యాథమేటిక్స్, స్టాటిస్టిక్స్‌ పరిజ్ఞానం ఉండటం వల్ల ఇన్స్యూరెన్స్, యాక్చ్యూరియల్‌ సైన్స్, ఫైనాన్స్, కన్సల్టింగ్‌ రంగాల్లోని ప్రముఖ సంస్థల్లో ఉపాధి అవకాశాలు పొందవచ్చు. ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకులు, ఆర్‌బీఐలో ఉపాధి పొందొచ్చు. సివిల్‌ సర్వీసెస్‌కి సిద్ధమవ్వాలనుకునేవారికి కూడా బీఏ ఎకనామిక్స్‌ (ఆనర్స్‌) చక్కని పునాదిగా ఉపయోగపడుతుంది.

బీకామ్‌ + ఎల్‌ఎల్‌బీ

ఇది 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు. న్యాయశాస్త్రం, వ్యాపార శాస్త్రానికి సంబంధించిన రెండు సబ్జెక్టుల్లో అవగాహన కావాలనుకునేవారికి ఇదొక పరిపూర్ణ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు అని చెప్పొచ్చు. క్లాట్‌ లాంటి ప్రవేశ పరీక్షల ద్వారా ప్రవేశం పొందొచ్చు. ఆంధ్రప్రదేశ్‌ / తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే లాసెట్‌ ద్వారా కూడా ప్రవేశం పొందొచ్చు. కానీ వాటి ద్వారా రాష్ట్రస్థాయి సంస్థల్లోనే ప్రవేశం సాధ్యం. అదే క్లాట్‌ లాంటి జాతీయస్థాయి ప్రవేశ పరీక్షలో అర్హులైతే జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందొచ్చు. ఈ ఇంటిగ్రేటెడ్‌ కోర్సు ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో అందుబాటులో ఉంది. దీనిలో మరో విశేషం ఏమిటంటే.. బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ ఇంటిగ్రేటెడ్‌గా చదవడం వల్ల ఏడాది కలిసొచ్చే అవకాశం ఉంది.

విద్యార్థులు లాలో కూడా తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ను ఎంచుకునే అవకాశాన్ని చాలా విద్యాసంస్థలు కల్పిస్తున్నాయి. ఉదాహరణకు బిజినెస్‌ లా, కార్పొరేట్‌ లా లేదా ట్యాక్సేషన్‌ లాను విద్యార్థి ఇష్టప్రకారం ఎంచుకోవచ్చు. ఈ కోర్సులోని ప్రత్యేకత ఏమిటంటే.. కేవలం 5 సంవత్సరాల్లో 2 డిగ్రీలు అంటే.. బీకామ్, ఎల్‌ఎల్‌బీ పొందవచ్చు. 

జాతీయస్థాయి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందాలనుకునేవారు క్లాట్‌ (కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌) లేదా ఎల్‌శాట్‌ (లా స్కూల్‌ ఎడ్మిషన్‌ టెస్ట్‌) రాయాల్సి ఉంటుంది. ఎలాంటి ఎడ్మిషన్‌ టెస్ట్‌ రాయాలనేది విద్యా సంస్థ నిబంధనలను బట్టి మారుతుంది. అదే రాష్ట్ర స్థాయి విద్యాసంస్థల్లో చేరాలనుకుంటే రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్‌ స్కోరు ఉపయోగపడుతుంది. కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, జాతీయస్థాయిలో పేరున్న విద్యాసంస్థలు సొంతంగా ప్రవేశపరీక్ష నిర్వహించి ప్రవేశం కల్పిస్తున్నాయి. 

విద్యార్థులు 20 వారాల పాటు ఇంటర్న్‌షిప్‌ కూడా చేయాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన నియమ నిబంధనలు అడ్మిషన్‌ తీసుకునే విద్యా సంస్థలను బట్టి మారుతుంటాయి.

ఏ రంగాల్లో: బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ చదివినవారు ప్రభుత్వ ఉద్యోగాలతోపాటుగా వివిధ న్యాయ సంబంధిత సంస్థలు, కార్పొరేట్‌ కంపెనీలు, ఫార్మా కంపెనీలు లాంటి జాతీయ, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ముఖ్యంగా బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ చదివినవారికి బ్యాంకింగ్, ఇన్స్యూరెన్స్‌ రంగాల్లో అవకాశాలు ఎక్కువ. అలాగే ఈ కోర్సు చేసినవారు ట్యాక్స్‌ కన్సల్టెంట్లుగా, అడ్వకేట్స్‌గా సొంతంగా ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు. దీనికి కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ చాలా అవసరం. 

ఇదే కాంబినేషన్‌లో బీబీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఏ+ఎల్‌ఎల్‌బీ, బీఎస్‌డబ్ల్యూ+ఎల్‌ఎల్‌బీలను కూడా కొన్ని ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాలు, కొన్ని జాతీయ, రాష్ట్రస్థాయి విద్యా సంస్థలు అందిస్తున్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో చేరవచ్చు.

బీబీఏ+ఎల్‌ఎల్‌బీ

బీకామ్‌+ఎల్‌ఎల్‌బీ లాగానే బీబీఏ+ఎల్‌ఎల్‌బీ కూడా 5 సంవత్సరాల నిడివి ఉన్న కోర్సు.  చేరాలంటే క్లాట్‌ లాంటి ప్రవేశ పరీక్షలు రాయాలి. బీకామ్‌+ఎల్‌ఎల్‌బీకి చెప్పినట్లుగానే ఈ కోర్సు ప్రవేశానికి కూడా రకరకాల ప్రవేశ పరీక్షలు ఉంటాయి. మేనేజ్‌మెంట్‌ స్టడీస్, లీగల్‌ స్టడీస్‌ రెండు రంగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఇదొక మంచి ఇంటిగ్రేటెడ్‌ కోర్సు.

బీబీఏ+ఎల్‌ఎల్‌బీలో చేరినవారిలో కమ్యూనికేషన్‌ నైపుణ్యాలపై కూడా ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకృతం కావడం వల్ల వారు నిర్వహణ, న్యాయపరమైన నైపుణ్యాలతో పాటు కమ్యూనికేషన్‌ 
సామర్థ్యాల్లోనూ పట్టు సాధిస్తారు. దీంతో ఉద్యోగావకాశాల పరంగా వీరిది పైచేయి అవుతుంది. బీబీఏ+ఎల్‌ఎల్‌బీ కోర్సు చదివిన విద్యార్థులు ఈ 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ కోర్సు పూర్తిచేశాక లాలో స్పెషలైజేషన్‌ కావాలంటే చేసుకోవచ్చు. లేదా మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌లో స్పెషలైజేషన్‌ కావాలన్నా చేసుకోవచ్చు. అంటే విద్యార్థికి రెండు రకాల అవకాశాలు ఉన్నాయన్నమాట! 

కొలువులు: బీబీఏ+ఎల్‌ఎల్‌బీ కోర్సు పూర్తిచేసిన తర్వాత విద్యార్థి సొలిసిటర్‌గా, కార్పొరేట్‌ లాయర్‌గా, ఫైనాన్స్‌ మేనేజర్‌గా, లీగల్‌ అడ్వైజర్‌గా, మేనేజ్‌మెంట్‌ కన్సలెంట్‌గా స్థిరపడొచ్చు. లేదా స్పెషలైజేషన్‌ కోసం ఉన్నత విద్యను కొనసాగించవచ్చు. 


 

Posted Date: 24-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌