• facebook
  • whatsapp
  • telegram

పదిలంగా పాఠాల బాటలో..!

ఆదర్శవంతమైన ఉపాధ్యాయ వృత్తిలోకి ప్రవేశించడానికి ఇప్పుడు ఇంటర్మీడియట్‌ తర్వాత ఎన్నో అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ డిగ్రీతోపాటు ఏకకాలంలో ఎడ్యుకేషన్‌లోనూ బ్యాచిలర్‌ పట్టా పొందడానికి ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను రూపొందించారు. ఇంజినీరింగ్‌, మెడికల్‌ తదితర సంప్రదాయ రీతులకు భిన్నంగా కెరియర్‌ ఎంచుకోవాలనుకునే వారికి ఇదో చక్కటి మార్గం.

సమాజంలో గౌరవప్రదమైన ఉద్యోగాల్లో ఉపాధ్యాయ వృత్తి ఒకటి. మంచి వేతనాలు, వృత్తిపరమైన సంతృప్తి యువతను ఈ రంగంవైపు ఆకర్షిస్తున్నాయి. బోధనను ఉపాధిగా స్వీకరించాలనుకునేవారు ఇంటర్మీడియట్‌ నుంచే తమ లక్ష్యంవైపు అడుగులు వేయవచ్చు. ఉపాధ్యాయ ఉద్యోగంలో చేరాలంటే ప్రధానంగా ఇంటర్‌ తర్వాత డీఎడ్‌ (డిప్లొమా ఇన్‌ ఎడ్యుకేషన్‌) లేదా డిగ్రీ అనంతరం బీఎడ్‌ (బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ చేయాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్‌ నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తే రెండు సంవత్సరాల కాలవ్యవధి ఉన్న డీఎడ్‌ కోర్సులో చేరాలి. బీఎడ్‌ చేయాలంటే ముందు డిగ్రీ చేసి తర్వాత చేరాల్సి ఉంటుంది. కానీ ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ ఎంచుకుంటే డిగ్రీ కూడా ఏకకాలంలో పూర్తవుతుంది.ఏడాది సమయం ఆదా అవుతుంది. ఇలాంటి అవకాశాన్ని జాతీయస్థాయిలో పేరున్న సంస్థలు కల్పిస్తున్నాయి. వాటిలో ప్రవేశాలకు తాజాగా ప్రకటనలు వెలువడ్డాయి. ఈ సంస్థల్లో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌ కోర్సు చదివితే బోధనలో మంచి నైపుణ్యాలను పెంపొందించుకోవడం సాధ్యమవుతుంది. ఎందుకంటే వీరికి తొలి సెమిస్టరు నుంచే బోధనపై ప్రత్యేక శిక్షణ అందిస్తారు. ఈ విధానంలో చదివిన వారికి క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా జాతీయ స్థాయిలో పేరున్న కార్పొరేట్‌ విద్యాసంస్థల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి.


రాష్ట్రాల వారీగా ఆర్‌ఐఈలు
సమాజానికి అత్యుత్తమ ఉపాధ్యాయులను అందించాలనే లక్ష్యంతో ప్రాంతీయ విద్యా శిక్షణ సంస్థ (ఆర్‌ఐఈ) లను దేశవ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇంటర్‌ అర్హతతో ఈ సంస్థల్లో డిగ్రీతోపాటు బీఎడ్‌ నాలుగేళ్లలోనే పూర్తిచేయవచ్చు. అలాగే ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ ఎడ్‌ (ఎమ్మెస్సీ + బీఎడ్‌) కోర్సునూ చదువుకోవచ్చు. బోధన వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నవారు ఆర్‌ఐఈల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఈ విధానంలో చదువుకున్నవారికి మెథడాలజీలో నైపుణ్యం మెరుగవుతుంది. వరుసగా నాలుగేళ్లపాటు చదవడం వల్ల సబ్జెక్టుపై పూర్తి పట్టు లభిస్తుంది. సెమిస్టర్‌ విధానంలో బోధన ఉంటుంది. ఏడాదికి రెండు చొప్పున 8 సెమిస్టర్లు ఉంటాయి. చివరి సంవత్సరం పాఠశాలల్లో గడపాల్సి ఉంటుంది.

అజ్మీర్‌, భోపాల్‌, భువనేశ్వర్‌, మైసూరుల్లో ఆర్‌ఐఈలు ఉన్నాయి. ఒక్కో సంస్థనూ రాష్ట్రాల వారీ విభజించారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలు ఆర్‌ఐఈ మైసూరు పరిధిలోకి వస్తాయి. కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలైన పుదుచ్చెరి, లక్షద్వీప్‌లు కూడా ఈ సంస్థ కిందే ఉంటాయి. ఇందులోని సీట్లను రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలవారీ విభజించారు.

మైసూరు ఆర్‌ఐఈకి సంబంధించి బీఎస్సీ బీఎడ్‌ (ఫిజికల్‌ సైన్స్‌), బీఎస్సీ బీఎడ్‌ (బయలాజికల్‌ సైన్స్‌), బీఏ బీఎడ్‌ విభాగాల్లో ఒక్కోదానిలో 40 సీట్లు ఉన్నాయి. వీటితోపాటు ఎమ్మెస్సీఎడ్‌లో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ ఒక్కో సబ్జెక్టులో 15 చొప్పున సీట్లు ఉన్నాయి. ఎమ్మెస్సీ ఎడ్‌ కోసం దేశవ్యాప్తంగా ఎవరైనా పోటీ పడవచ్చు. రాష్ట్రాల కోటా వర్తించదు. అలాగే ఆరేళ్లలోపు వైదొలగడమూ కుదరదు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సు పూర్తిచేసినవారు మైసూరులోనే పీహెచ్‌డీ చేసుకునే అవకాశం ఉంది.

ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ ఉపకార వేతనాలు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు. ఏటా క్యాంపస్‌ నియామకాలు జరుగుతాయి. బీఎ/ బీఎస్సీ ఎడ్‌ లేదా బీఎడ్‌ కోర్సులు పూర్తి చేసినవారికి నెలకు కనీసం రూ.25 వేలకు పైగా వేతనం లభిస్తుంది. ఎమ్మెస్సీఎడ్‌, ఎంఎడ్‌ కోర్సుల వారికి కనీసం రూ.35వేలు చొప్పున వేతనాలు లభిస్తున్నాయి.

ఆర్‌ఐఈల్లో చేరిన ఎస్సీ, ఎస్టీలందరికీ ఉపకార వేతనాలు లభిస్తాయి. అలాగే మిగిలిన అభ్యర్థుల్లో సగం మందికి తల్లిదండ్రుల వార్షికాదాయం ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లు అందజేస్తారు.


ఏ అర్హతలుండాలి
బీఎస్సీ బీఎడ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ / బైపీసీ విద్యార్థులు అర్హులు. ఎమ్మెస్సీ ఎడ్‌ కోర్సుకు ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. బీఏ బీఎడ్‌ కోర్సుకు సైన్స్‌ / ఆర్ట్స్‌/ కామర్స్‌ ఏదైనా స్ట్రీమ్‌తో ఇంటర్‌ చదివినఎవరైనా అర్హులే. ఏ కోర్సుకైనా ఇంటర్‌ లో కనీసం 50 శాతం మార్కులు తప్పనిసరి. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 45 శాతం).

ఎంపిక విధానం: రాత పరీక్షకు 60 శాతం, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ వర్తిస్తుంది. పరీక్షలో భాషా నైపుణ్యాలు, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ ఎబిలిటీ అంశాల నుంచి మొత్తం 80 ప్రశ్నలు వస్తాయి. వీటిలో ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ 20, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 30, రీజనింగ్‌ ఎబిలిటీ 30 ప్రశ్నలు ఉంటాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌, హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు చొప్పున 160 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. తప్పుగా గుర్తించిన ప్రతి జవాబుకీ అర మార్కు చొప్పున తగ్గిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు.

ఆర్‌ఐఈ, మైసూరులో బీఎడ్‌ రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అలాగే భోపాల్‌లో మూడేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్‌+ఎంఎడ్‌ కోర్సు ఉంది. దేశవ్యాప్తంగా ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. 
వెబ్‌సైట్‌: http://cee.ncert.gov.in/, http://www.riemysore.ac.in


సెంట్రల్‌ యూనివర్సిటీల్లోనూ..
ఇంటిగ్రేటెడ్‌ బీఏ బీఎడ్‌ కోర్సు జమ్మూ, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఇంటిగ్రేటెడ్‌ బీఎస్సీ బీఎడ్‌ (మ్యాథ్స్‌) సెంట్రల్‌ యూనివర్సిటీ తమిళనాడు, సౌత్‌ బిహార్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ప్రవేశాలు సీయూసెట్‌తో లభిస్తాయి. ప్రకటన వెలువడింది. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులోకి తీసుకుంటారు.
వెబ్‌సైట్‌: https://cucetexam.in


అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ
అజీం ప్రేమ్‌జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఎస్సీ బీఎడ్‌ డ్యుయల్‌ డిగ్రీ కోర్సు నాలుగేళ్ల వ్యవధితో అందిస్తోంది. బయలాజికల్‌ సైన్స్‌, ఫిజికల్‌ సైన్స్‌, మ్యాథమెటిక్స్‌ మూడు సైన్స్‌ విభాగాల్లోనూ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇంటర్‌ ఎంపీసీ, బైపీసీ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. స్కాలర్‌ షిప్పులు కూడా ఇస్తారు.

రాత పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ నుంచి 18, క్వాంటిటేటివ్‌ రీజనింగ్‌ 18 ప్రశ్నలు వస్తాయి. పరీక్ష వ్యవధి 2 గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు. నెగెటివ్‌ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికీ ఒక మార్కు చొప్పున తగ్గిస్తారు. ఎస్సే/ డేటా ఎనాలసిస్‌/ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ల్లో రాత పరీక్ష ఉంటుంది. పరీక్ష కాలవ్యవధి ఒక గంట.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌, విశాఖపట్నంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇక్కడ బీఏ, బీఎస్సీ, ఎంఏ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రాంగణ నియామకాలకూ ఈ సంస్థ ప్రాచుర్యం పొందింది.
వెబ్‌సైట్‌: http://azimpremjiuniversity.edu.in

గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌
గాంధీగ్రామ్‌ రూరల్‌ ఇన్‌స్టిట్యూట్‌, గాంధీగ్రామ్‌ (దిండిగల్‌) తమిళనాడు కేంద్ర మానవ వనరులశాఖ ఆధ్వర్యంలో ఏర్పడిన డీమ్డ్‌ యూనివర్సిటీ. ఈ సంస్థ ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు బీఎస్సీ బీఎడ్‌ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్‌లో సాధించిన మార్కులు/ గ్రేడ్‌తో సీట్లు భర్తీచేస్తారు.
వెబ్‌సైట్‌: http://www.ruraluniv.ac.in


ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ ఎడ్‌ అందించే మరికొన్ని సంస్థలు: తేజ్‌పూర్‌ యూనివర్సిటీ, జీడీ గొయాంకా యూనివర్సిటీ, లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ, సావిత్రీభాయ్‌ ఫూలే పుణే యూనివర్సిటీ, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ సంస్థలు ఇంటిగ్రేటెడ్‌ పద్ధతిలో ఎడ్యుకేషన్‌లో డిగ్రీని అందిస్తున్నాయి.

Posted Date: 20-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌