• facebook
  • whatsapp
  • telegram

ఉపాధి అవకాశాల ‘ఆప్టోమెట్రీ’

* కోర్సు పూర్తయిన వెంటనే ఆప్టోమెట్రిస్ట్‌గా ఉద్యోగం


మన జ్ఞానేంద్రియాల్లో అత్యంత ప్రధానమైనది కన్ను అని తెలిసిందే. కంటి చూపు సమస్యలను తెలుసుకోవడానికి పరికరాల సాయంతో నిశితంగా పరిశీలిస్తారు ఆప్టోమెట్రిస్టులు. నేత్ర వైద్యులకు అందించే సహాయ సేవల్లో వీరి పాత్రే కీలకం. ప్రస్తుతం అన్ని వయసులవారూ ఏదో ఒక నేత్ర సంబంధ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. 


ఇందుకోసమే ప్రత్యేకంగా కార్పొరేట్‌ ఆసుపత్రులూ, కళ్లద్దాల విక్రయ కేంద్రాలూ విస్తరిస్తున్నాయి. వీటిలో ఆప్టోమెట్రీ నిపుణుల అవసరం ఉంది. ఆసక్తి ఉన్నవారు ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో ఆప్టోమెట్రీ కోర్సుల్లో చేరవచ్చు. 


ఇంటర్మీడియట్‌ తర్వాత తక్కువ వ్యవధిలో స్థిరపడటానికి పారామెడికల్‌ కోర్సులు దారిచూపుతాయి. వీటిలో ఆప్టోమెట్రీ ప్రత్యేకమైనది. ఇంటర్మీడియట్‌ విద్యార్హతతో డిప్లొమా, బ్యాచిలర్స్‌ రెండు కోర్సుల్లోనూ చేరవచ్చు. ఆప్టోమెట్రీ డిప్లొమా వ్యవధి రెండేళ్లు. అదే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ అయితే నాలుగేళ్లు. డిప్లొమా పూర్తిచేసుకున్నవారిని నేరుగా రెండో ఏడాది బ్యాచిలర్‌ కోర్సులోకి తీసుకుంటారు. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ తర్వాత మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. దీని వ్యవధి రెండేళ్లు. అనంతరం పీహెచ్‌డీనీ పూర్తిచేసుకోవచ్చు. 


పలు సంస్థలు ఆప్టోమెట్రీ విద్యార్థులకు స్టైపెండ్‌ అందిస్తున్నాయి. డిప్లొమాలో అయితే మొదటి ఏడాది రూ.2000, రెండో సంవత్సరం రూ.2500 ప్రతి నెలా చెల్లిస్తారు. ఈ కోర్సుల్లో చేరినవారికి.. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, క్లినికల్‌ ఆఫ్తాల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాలు, ఆప్టిక్స్‌పై అవగాహన కల్పిస్తారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.  


డిప్లొమా.. డిగ్రీ 


ఆప్టోమెట్రీ డిప్లొమాలో తొలి ప్రాధాన్యం ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులకే. సీట్లు మిగిలితే ఎంపీసీ, ఆ తర్వాత ఇతర గ్రూపుల వారికి అవకాశం కల్పిస్తారు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరడానికి బైపీసీ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ తప్పనిసరి. జాతీయ స్థాయిలో పేరున్న సంస్థలు బైపీసీతోపాటు ఎంపీసీ వాళ్లనీ తీసుకుంటున్నాయి. ఇంటర్మీడియట్‌ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ఇందులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్‌షిప్‌ను ఏదైనా కంటి ఆసుపత్రిలో పూర్తిచేయాలి. 


దేశంలో పేరొందిన నేత్ర వైద్యశాలలు యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్‌డీ కోర్సుల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాయి. వీటిలో కొన్ని సంస్థలు బయట నుంచి వచ్చిన యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్‌షిప్‌ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్‌ బోర్డు లేదా ఓపెన్‌ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు, బయాలజీ, ఫిజిక్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్‌ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. రాష్ట్ర స్థాయి సంస్థల్లో ఇంటర్‌ మార్కుల మెరిట్‌తో అవకాశం లభిస్తుంది. జాతీయ సంస్థలు ప్రవేశ పరీక్ష లేదా నీట్‌ స్కోరుతో చేర్చుకుంటున్నాయి. 


అవకాశాలిలా...


దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. వృత్తిలో భాగంగా, వినోదం నిమిత్తం కంప్యూటర్‌/ల్యాప్‌టాప్‌/మొబైల్‌ వీక్షించడం బాగా పెరిగింది. దీంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ విభాగంలో సేవలు అందించడానికి ప్రత్యేకంగా కార్పొరేట్‌ కంటి వైద్యశాలలు విస్తరిస్తున్నాయి. అలాగే కళ్లద్దాల గొలుసుకట్టు దుకాణాలూ పెరుగుతున్నాయి. అందువల్ల ఆప్టోమెట్రీ కోర్సు పూర్తయిన వెంటనే నిశ్చింతగా ఉపాధి పొందవచ్చు. అవసరాలకు తగ్గ సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీ నిపుణులు ఉండాలి. ప్రస్తుతం అంత మంది లేరు. ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రిస్టులుగా సేవలు అందించవచ్చు. ఎక్కువ అవకాశాలు మాత్రం కార్పొరేట్‌ ఐ ఆసుపత్రులు, కార్పొరేట్‌ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు. 


ఎల్‌వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్, సెంటర్‌ ఫర్‌ సైట్, మ్యాక్సీ విజన్, వాసన్‌ ఐ కేర్, అగర్వాల్‌ ఐ హాస్పిటల్‌... తదితర కార్పొరేట్‌ కళ్ల ఆసుపత్రుల్లో సేవలు అందించవచ్చు. కంటివైద్యులు సేవలందిస్తోన్న ప్రతిచోటా ఆప్టోమెట్రీ నిపుణులు ఉంటారు. టైటాన్‌ ఐ ప్లస్, లెన్స్‌కార్ట్, లారెన్స్‌ అండ్‌ మాయో, విజన్‌ ఎక్స్‌ప్రెస్, జీకేబీ...ఇలా పలు కార్పొరేట్‌ గొలుసుకట్టు ఆప్టికల్‌ దుకాణాల్లో ఉద్యోగం పొందవచ్చు. పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసుకున్నవారికి బోధన, పరిశోధనల్లో అవకాశాలుంటాయి. 


ఆప్టోమెట్రీ కోర్సు పూర్తయినవెంటనే నిశ్చింతగా ఉపాధి పొందవచ్చు.  కంటి ఆసుపత్రుల్లో ఆప్టోమెట్రిస్టులుగా సేవలు అందించవచ్చు


ఇవీ సంస్థలు 


హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల ఎంఆప్టోమ్‌ కోర్సుకు ఇంటర్‌ ఎంపీసీ/బైపీసీ వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో కోర్సులో చేర్చుకుంటారు.  


అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్‌) న్యూదిల్లీ క్యాంపస్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తోంది. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థలో చేరిన విద్యార్థులు ప్రతి నెల రూ.500 స్టైపెండ్‌ అందుకోవచ్చు. నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌లో ప్రతి నెలా రూ.10,250 ఇస్తారు. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్‌ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు చదివిన గ్రూపు ప్రకారం బయాలజీ లేదా మ్యాథ్స్‌ ఏదో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది. 


శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తోన్న ఎలైట్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ బ్యాచిలర్, మాస్టర్, డాక్టొరేట్‌ కోర్సులు అందిస్తోంది. బ్యాచిలర్స్‌లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్‌ స్కూల్, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్‌షిప్‌ ఉంటుంది. ప్రవేశం నీట్‌ స్కోరు, ఇంటర్‌ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే పరీక్షలో ప్రతిభ చూపాలి. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.  


బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్‌షిప్‌ను ఎల్‌వీ ప్రసాద్‌ ఐ హాస్పిటల్‌ హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్‌ క్యాంపస్‌ల్లో పూర్తిచేయవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్‌ ఆప్టోమెట్రీ అండ్‌ విజన్‌ సైన్సెస్‌ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్‌ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు. 


మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఆప్టోమెట్రీలో యూజీ, పీజీ కోర్సులు అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.


 అమృత విశ్వవిద్యాపీఠం, కోచి క్యాంపస్‌లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. పరీక్షతో అవకాశం కల్పిస్తారు.


భారతీ విద్యాపీఠ్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీ కోర్సులు ఉన్నాయి.


 ఆంధ్రప్రదేశ్‌లో బీ.ఆప్టోమెట్రీ కోర్సును కర్నూల్‌ మెడికల్‌ కాలేజ్, ఆంధ్రా మెడికల్‌ కాలేజ్, సిద్ధార్థ మెడికల్‌ కాలేజ్, కోనసీమ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ అమలాపురం, బొల్లినేని మెడ్‌ స్కిల్స్‌ శ్రీకాకుళం(రాగోలు), జీఎస్‌ఎల్‌ పారామెడికల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ రాజమహేంద్రవరం, సమత స్కూల్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ, విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్‌ బైపీసీ మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి. గీతం విశ్వవిద్యాలయం విశాఖపట్నం క్యాంపస్‌లోనూ ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. 


‣ తెలంగాణలో.. యశోద, మల్లారెడ్డి హెల్త్‌ యూనివర్సిటీ తదితర సంస్థల్లో చదువుకోవచ్చు. 


నైపుణ్యాలు


ఆప్టోమెట్రిస్టులకు కళ్ల సమస్యలు లేకపోతే మంచిది. 


కచ్చితమైన అంచనా వేయగల నైపుణ్యం ఉన్నవారు రాణించగలరు. 


వృత్తిపరంగా సహనం, సమన్వయం తప్పనిసరి. 


ఆంధ్రప్రదేశ్‌ పారా మెడికల్‌ బోర్డు డిప్లొమా(ఆప్టోమెట్రీ) కోర్సుల్లో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. జులై 24 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. 


వెబ్‌సైట్‌: http://117.192.46.176:8080/appmb/


తెలంగాణ పారామెడికల్‌ బోర్డు ప్రకటన కొద్ది రోజుల్లో వెలువడుతుంది.  

మరింత సమాచారం... మీ కోసం!

‣ నర్సింగ్‌ కోర్సు.. అవకాశాలు అనేకం

‣ డేటా సైన్స్‌లో ప్రత్యేకతలివిగో!

‣ ఆర్మీలో ఎన్‌సీసీ స్పెషల్‌ ఎంట్రీ స్కీం

‣ దినసరి కూలీ.. డాక్టరేట్‌ సాధించింది

‣ సీఎస్‌ఈకి ఎందుకీ క్రేజ్‌!

‣ సహకరించుకుంటేనే ‘బృందా’వనం!

Posted Date: 20-07-2023


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌