• facebook
  • whatsapp
  • telegram

ఎన్నో దారులు.. ఎంపికే సవాలు!

ఇంటర్ పూర్తిచేసిన వారికి నిపుణులు అందిస్తున్న సూచనలు

 

 

విద్యార్థులు తమ గమ్యాన్ని నిర్ణయించుకోవడానికి పదోతరగతి తర్వాత అవకాశం వస్తుంది. అక్కడ పొరపాట్లు జరిగితే సమీక్షించుకుని సరిదిద్దుకునేందుకు ఇంటర్‌ తర్వాత మరోసారి అవకాశమొస్తుంది. ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థుల ముందు ఎంచుకోవడానికి ఎన్నో ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఆసక్తులూ, నైపుణ్యాలూ, అభిరుచులూ అన్నింటినీ విశ్లేషించుకుంటేనే భవిష్యత్తుకు బలమైన పునాదులు నిర్మించుకోవడం సాధ్యం. ఒకవైపు సాధారణ డిగ్రీలూ, మరోవైపు ప్రొఫెషనల్‌ కోర్సులూ.. అన్నీ ఇంటర్‌ తర్వాతే మొదలవుతాయి. వీటిలో ఇంజినీరింగ్, మెడిసిన్‌ మినహా మిగిలినవాటిలోకి ఇంటర్మీడియట్‌ అన్ని గ్రూపుల విద్యార్థులకూ అవకాశం ఉంటుంది. అందువల్ల అందుబాటులో ఉన్న అన్ని కోర్సులపైనా అవగాహన పెంచుకున్నప్పుడే వాటిలో ఎందులో చేరాలో నిర్ణయం తీసుకోవడం సులువవుతుంది!

 

 

 

ఎంపీసీ, బైపీసీ గ్రూపులతో ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు ఆ దారిలోనే సాగిపోవాలా, మరో మార్గంలో ముందడుగేయాలా ఇక్కడ ఓ నిర్ణయానికి రావచ్చు. ఎంపీసీ, బైపీసీల్లో భవిష్యత్తును ఆశించేవారికి మేటి కోర్సులెన్నో ఉన్నాయి. అలాగే ఈ సైన్స్‌ గ్రూపులతో మా వల్ల కాదంటూ వీడ్కోలు పలకాలనుకునేవాళ్లు రాణించడానికి అవకాశమున్న చదువుల సంఖ్యా తక్కువ కాదు. అందువల్ల అన్ని దారులూ తెలుసుకున్నప్పుడే మన గమ్యానికి ఏది సరైనదో నిర్ణయించుకోవడం వీలవుతుంది. దీంతో కెరియర్‌ అద్భుతంగా ఉంటుంది. అయితే సమీక్షించుకోవడానికి ఇదే చివరి అవకాశంగా భావించాలి.

 

ఎంచుకోండిలా..

ప్రతి విద్యార్థీ ఎవరికి వారే ప్రత్యేకం. నైపుణ్యాలు, బలాలు, బలహీనతలు ఏమిటో వారికే బాగా తెలుసు. వీటిని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తు చదువుల ప్రణాళిక రచించుకోవాలి. ఇలా చేసినప్పుడే తీసుకున్న నిర్ణయానికి న్యాయం చేకూరుతుంది. చదువుల్లో రాణించడం సులువవుతుంది.

 

ఇప్పుడు ఎంచుకోవడానికి ఆప్షన్లు పెరగడంతో ఎందులో చేరాలో నిర్ణయించుకోవడం కొంచెం కష్టమవుతోంది. అందువల్ల ఎవరికి వారు తమ ఆసక్తులను గమనించి, ప్రత్యేకతలు తెలుసుకోవాలి. బలాలను విశ్లేషించుకుని...బలహీనతలు బేరీజు వేసుకోవాలి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. చేరాలనుకున్న కోర్సు స్వరూపాన్ని గమనించాలి. అది మనకు సరిపోతుందా, లేదా చూసుకోవాలి. నచ్చిన కోర్సు ఎంచుకోవడం మంచిదే. అయితే ఆ కోర్సులో లభించే ఉన్నత విద్య, కోర్సు అనంతరం అందులో ఉండే అవకాశాలపైనా అవగాహన ఉండాలి. ముఖ్యంగా కొత్త కోర్సులు ఎంచుకున్నప్పుడు ఈ విషయాలు తెలుసుకోవడం తప్పనిసరి. గ్రూపుల వారీగా ఉన్న అవకాశాలు, ఏ గ్రూపుతో ఇంటర్మీడియట్‌ చదివినప్పటికీ అందరికీ ఉమ్మడిగా ఉండే దారుల వివరాలు తెలుసుకోవాలి. వాటిలోంచి సరైనది ఏదో ఎవరికి వారే ఎంచుకోవాలి.

 

అన్ని గ్రూపుల వారికీ..

ఎవర్‌ గ్రీన్‌... టీచింగ్‌

ఏ గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసుకున్నప్పటికీ బోధన దిశగా అడుగులేయాలనుకున్నవారు డైట్‌ సెట్‌ రాసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభ ద్వారా ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో ఎన్నో డైట్‌లు డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌ కోర్సును రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నాయి. ఈ కోర్సును విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు సెకెండరీ గ్రేడ్‌ టీచర్‌ (ఎస్‌జీటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.  

 

అదిరే ’లా’

న్యాయవిద్య లక్ష్యమైనవారు ఇంటర్‌ అర్హతతో ముందుకెళ్లవచ్చు. లా కోర్సుల్లో ప్రవేశానికి వివిధ మార్గాలున్నాయి. రాష్ట్రస్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశానికి లాసెట్, జాతీయ స్థాయిలో పేరొందిన సంస్థల్లో ప్రవేశానికి క్లాట్, ప్రైవేటు సంస్థల్లోకి ఎల్‌శాట్‌..మొదలైన పరీక్షలు ఉన్నాయి. వీటిద్వారా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ/ బీఎస్సీ/ బీకాం -ఎల్‌ఎల్‌బీ కోర్సుల్లో చేరిపోవచ్చు

 

ఆతిథ్యంలో..

ఆతిథ్య రంగంలో సేవలందించాలనుకునేవారు, పాకశాస్త్రంపై అభిరుచి ఉన్నవారు, నిర్వహణ నైపుణ్యం ఉన్నవారు, నలుగురూ మెచ్చేలా శుభ్రంగా సర్దడాన్ని ఇష్టపడేవారు...వీరంతా హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు ప్రాధాన్యం ఇవ్వవచ్చు. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో వివిధ సంస్థలు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సును అందిస్తున్నాయి. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా ఈ కోర్సులకు అర్హులే. పరీక్షలో చూపిన ప్రతిభ లేదా మార్కుల మెరిట్‌తో ప్రవేశాలుంటాయి.

 

విదేశీ భాషలు

ఇంటర్‌ అర్హతతో విదేశీ భాషలు కూడా నేర్చుకోవచ్చు. ప్రస్తుతం అన్ని రంగాలు, విభాగాల్లో విదేశీ భాషలు వచ్చినవారికి ప్రాధాన్యం పెరిగింది. జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్, ఇటాలియన్, పర్షియన్, చైనీస్‌...ఇలా ఏదో ఒక భాషలో నైపుణ్యం పెంచుకుంటే సుస్థిర కొలువును సొంతం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లోని ఇఫ్లూతోపాటు చాలా విశ్వవిద్యాలయాలు డిగ్రీలో ఒక సబ్జెక్టుగా విదేశీ భాషలను అందిస్తున్నాయి. పరీక్షతో ప్రవేశాలుంటాయి.

 

 

డిజైన్‌లోనూ..

ఇంటర్‌ అర్హతతో ఉన్న మార్గాల్లో డిజైన్‌ ఒకటి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో చాలా సంస్థలున్నాయి. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిఫ్ట్‌) దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన సంస్థ. అలాగే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) కూడా ముఖ్యమైందే. ఐఐటీ బాంబే, గువాహటితోపాటు ఎన్నో సంస్థలు డిజైన్‌ కోర్సులు అందిస్తున్నాయి. రాతపరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం కల్పిస్తారు.

 

ఫుట్‌వేర్‌ కోర్సులు

పాద రక్షల తయారీ శిక్షణకు ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్, సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో ఇంటర్‌ అర్హతతో వివిధ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.

 

ఫైన్‌ ఆర్ట్స్‌

ఇంటర్‌ తర్వాత ప్రత్యేక అభిరుచులు ఉన్నవారు ఫైన్‌ఆర్ట్స్‌ బాట పట్టవచ్చు. పెయింటింగ్, ఫొటోగ్రఫీ, యానిమేషన్, అప్లైడ్‌ ఆర్ట్స్, స్కల్‌ప్చర్‌... మొదలైన కోర్సులెన్నో ఉన్నాయి. వీటికోసమే ప్రత్యేకంగా హైదరాబాద్‌లో మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్ట్స్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటైంది. ఇక్కడ ఇంటర్‌ విద్యార్థుల కోసం అండర్‌ గ్రాడ్యుయేషన్‌లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ (బీఎఫ్‌ఏ)లో పైన పేర్కొన్న కోర్సులు అందిస్తున్నారు. ఆంధ్రా, ఉస్మానియా సహా చాలా యూనివర్సిటీల్లో యూజీ స్థాయిలో ఈ కోర్సులు ఉన్నాయి.

 

ఇంటిగ్రేటెడ్‌గానూ..

ఇంటర్‌ విద్యార్హతతో బీఎడ్, ఎంఏ, ఎంబీఏ...మొదలైన కోర్సులను ఇంటిగ్రేటెడ్‌ విధానంలో చదువుకోవచ్చు. ఐఐటీలు, ఐఐఎంలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు సహా వివిధ సంస్థలు అందించే ఇంటిగ్రేటెడ్‌ పీజీ కోర్సుల్లో ఇంటర్‌ అన్ని గ్రూపుల వారూ చేరిపోవచ్చు.

 

టాటా... ప్రేమ్‌జీ

అజీం ప్రేమ్‌ జీ యూనివర్సిటీ రెసిడెన్షియల్‌ విధానంలో బీఏ కోర్సు అందిస్తోంది. ఇంటర్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా ఈ కోర్సులో చేరవచ్చు. టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ బీఏ సోషల్‌ సైన్సెస్, బ్యాచిలర్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ కోర్సులను అందిస్తోంది. ప్రత్యేక అభిరుచి ఉన్నవారు ప్రైవేటు సంస్థలు అందించే లిబరల్‌ స్టడీస్‌ కోర్సుల్లోనూ చేరవచ్చు. ఇంటర్మీడియట్‌ ఏ గ్రూప్‌లో చేరినప్పటికీ సీఏ, సీఎంఏ, సీఎస్‌ ప్రొఫెషనల్‌ కోర్సుల కోసం నమోదు చేసుకోవచ్చు.

 

దూరవిద్యలోనూ..

కాలేజీలకు వెళ్లి డిగ్రీలు చదువుకోవడానికి వీలు లేనివారు ఇంటర్‌ తర్వాత దూరవిద్య ద్వారా డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చు. దాదాపు అన్ని యూనివర్సిటీలూ దూరవిద్యను అందిస్తున్నాయి. లాయర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు కావాలనుకున్నవారు దూరవిద్యలో కాకుండా రెగ్యులర్‌ విధానంలో డిగ్రీ కోర్సుల్లో చేరడమే శ్రేయస్కరం. డిగ్రీ అర్హతతో నిర్వహించే దాదాపు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకూ దూరవిద్యలో చదివినవారు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

ఇవీ మార్గాలు

ఎంపీసీతో: బీఈ/ బీటెక్‌/ బీఆర్క్, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌ఎంఎస్, బీఎస్సీ, డిప్లొమా (లేటరల్‌) 10+2 టెక్నికల్‌ ఎంట్రీ (ఆర్మీ/ నేవీ), పైలట్, ఎన్‌డీఏ (నేవీ, ఏర్‌ఫోర్స్‌)

 

బైపీసీతో: మెడిసిన్‌ (ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్‌ఎంఎస్, బీడీఎస్‌...), వెటర్నరీ సైన్స్‌ అండ్‌ యానిమల్‌ హజ్బెండ్రీ. బీఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ సెరికల్చర్‌/ ఫ్లోరికల్చర్‌. బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ, పారా మెడికల్‌ కోర్సులు, ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ, బీఎస్, బీఎస్‌-ఎంఎస్‌. బీఎస్సీ రెగ్యులర్, బీఎస్సీ- ఫారెస్ట్రీ/ ఫిషరీ సైన్స్‌/ న్యూట్రిషన్‌/ హోం సైన్స్‌. ఆప్టోమెట్రీ

 

ఎంపీసీ, బైపీసీ ఇద్దరికీ: బీఫార్మసీ, ఫార్మ్‌డి అన్ని గ్రూపులవారికీ (ఎంఈసీ, సీఈసీ, హెచ్‌ఈసీ, ఎంపీసీ, బైపీసీ): లా, లిబరల్‌ స్టడీస్, డీఎడ్, ఇంటిగ్రేటెడ్‌ బీఎడ్, సీఏ, సీఎంఏ, సీఎస్‌. హోటల్‌ మేనేజ్‌మెంట్, హాస్పిటాలిటీ, టూరిజం. ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ, ఎంబీఏ, బీబీఎం, బీబీఏ, బీసీఏ, బీఏ, బీఎల్‌ఐఎస్సీ, బీఎస్‌డబ్ల్యూ. ఫైన్‌ ఆర్ట్స్, విదేశీ భాషలు, ఏర్‌ హోస్టెస్‌ అండ్‌ ఫ్లయిట్‌ స్టివార్డ్, ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ కోర్సులు, డిజైన్, ఫ్యాషన్, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, డిప్లొమా/ సర్టిఫికెట్‌ కోర్సులు, వొకేషనల్‌ కోర్సులు, ఆఫ్‌ బీట్‌ కోర్సులు, ఏఎన్‌ఎం, ఎన్‌డీఏ (ఆర్మీ) 

Posted Date: 28-08-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌