• facebook
  • whatsapp
  • telegram

అందరికీ ఆతిథ్యం!

విద్యుత్తు కాంతులు విరజిమ్మే అలంకరణలు చేసి.. వచ్చిన వారిని ఆదరించకపోతే ఎవరైనా ఏదీ కొనకుండానే వెనక్కి వెళ్లిపోతారు. సంస్థ చిన్నదైనా చక్కటి చిరునవ్వుతో ఆహ్వానించి చల్లటి నీళ్లిచ్చినా ఆనందిస్తారు. అమ్మకాలు సజావుగా సాగుతాయి. సరైన స్వాగతంతో సంతృప్తిచెందిన కస్టమర్‌కీ, ఎవరూ పట్టించుకోకపోతే విసుగు చెందిన వినియోగదారుడికీ ఎంతో తేడా ఉంటుంది. వ్యాపారం లాభాలతో వర్థిల్లాలంటే వస్తువులు, సేవలకు మంచి మర్యాదనూ జతచేయాలి. ఈ లక్ష్యంతోనే హాస్పిటాలిటీ ప్రత్యేకరంగంగా ఎదుగుతోంది. అందులోని సిబ్బందికి అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు పలు సంస్థలు రకరకాల కోర్సులను నిర్వహిస్తున్నాయి.

దేశవిదేశాల్లో ఆహార పదార్థాల తయారీ, హోటళ్ల నిర్వహణలో వృత్తిపరమైన మెలకువలు నేర్పడానికి ప్రసిద్ధ సంస్థలెన్నో వెలిశాయి. కొన్ని కార్పొరేట్‌ హోటళ్లు ఉచితంగా కోర్సులు అందించి ఉద్యోగాలిస్తున్నాయి. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇంటర్‌ తర్వాత ఆతిథ్యరంగంలోని ప్రత్యేక కోర్సుల్లో చేరి, సుశిక్షితులు కావచ్చు. ఆకర్షణీయమైన ఉపాధి అవకాశాలు పొంది మంచి గుర్తింపును తెచ్చుకోవచ్చు. కేంద్ర రాష్ట్ర స్థాయుల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలెన్నో హాస్పిటాలిటీ కోర్సులను అందిస్తున్నాయి.

ఆతిథ్య రంగంలో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో చేరే అవకాశం ఇంటర్‌ తర్వాత వస్తుంది. అన్ని గ్రూపుల విద్యార్థులూ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు. ఇందులో భాగంగా తమకు నచ్చిన స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. అనంతరం ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందవచ్చు లేదా ఉన్నత విద్య దిశగా అడుగులు వేయవచ్చు. ఐటీసీ, ఒబెరాయ్‌ లాంటి కార్పొరేట్‌ సంస్థలు యూజీ, పీజీ, పీడీ డిప్లొమాలను ఉచితంగా అందించి, ఉద్యోగాలిస్తున్నాయి. ఆతిథ్యంలో యూజీ స్థాయిలో బీఎస్సీ, బీబీఎంలతోపాటు సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను వివిధ సంస్థలు అందిస్తున్నాయి. యూజీలో ఫ్రంట్‌ ఆఫీస్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌; హౌస్‌ కీపింగ్, కిచెన్‌ స్పెషలైజేషన్లు ఉంటాయి.

ఐహెచ్‌ఎంలు

హోటల్‌ మేనేజ్‌మెంట్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలు అఖిలభారత స్థాయిలో పేరుపొందాయి. వీటి నిర్వహణకు కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (ఎన్‌సీహెచ్‌ఎంసీటీ)ని ఏర్పాటు చేశారు. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే ఎన్‌సీహెచ్‌ఎం-జేఈఈ ద్వారా బీఎస్సీ, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు లభిస్తాయి. ఇందులో సాధించిన స్కోరుతో పలు రాష్ట్రస్థాయి, ప్రైవేటు సంస్థల్లో చదువుకోవచ్చు. వీటిలో శాకాహారుల కోసం ప్రత్యేకంగా కోర్సులను అందిస్తోన్న సంస్థలూ ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్‌ (విద్యానగర్‌)లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కేంద్ర సంస్థ. ఇక్కడ బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సులో చేరవచ్చు. రాష్ట్ర స్థాయిలో స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, తిరుపతి; డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌; తెలంగాణ స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, సంగారెడ్డిల్లో ప్రవేశాలు పొందవచ్చు. ప్రైవేటు ఆధ్వర్యంలో శ్రీశక్తి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్, హైదరాబాద్‌ (బేగంపేట), లియో అకాడమీ, హైదరాబాద్‌ (షామీర్‌పేట) జేఈఈ స్కోర్‌ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలన్నీ ఈ స్కోరును ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. కొన్ని ఫుడ్‌ క్రాఫ్ట్‌ ఇన్‌స్టిట్యూట్లూ ఆ పరీక్ష మెరిట్‌ ఆధారంగానే విద్యార్థులను చేర్చుకుంటున్నాయి.

కలినరీ ఇన్‌స్టిట్యూట్‌

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో తిరుపతి, నోయిడాల్లో ఇండియన్‌ కలినరీ ఇన్‌స్టిట్యూట్‌ (ఐసీఐ) నెలకొల్పారు. ఇక్కడ బీబీఏ కలినరీ ఆర్ట్స్‌తోపాటు 18 నెలల వ్యవధితో డిప్లొమా, 6 నెలల వ్యవధితో క్రాఫ్ట్‌ కోర్సులు అందిస్తున్నారు.

ఐఐటీటీఎం

కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నెలకొల్పిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐటీటీఎం) ఇంటర్‌ విద్యార్హతతో బీబీఏ కోర్సు అందిస్తోంది. ఈ సంస్థకు నెల్లూరుతోపాటు గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడాల్లో కేంద్రాలున్నాయి. పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్, ఇంటర్వ్యూల ద్వారా కోర్సులో ప్రవేశం లభిస్తుంది. వ్యవధి మూడేళ్లు.

ఐటీసీ హోటల్స్‌: వెల్‌ కం లీడ్‌

ఇంటర్‌ విద్యార్హతతో ఐటీసీ హోటల్స్‌ అందించే వెల్‌కం లీడ్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఒకవైపు చదువు, శిక్షణ పొందుతూనే ప్రతి నెలా స్ట్టైపెండ్‌ అందుకోవచ్చు. ఈ విధానంలో చేరినవారు ఇగ్నో అందించే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (టూరిజం స్టడీస్‌) పూర్తిచేసుకోవచ్చు. మూడేళ్ల అనంతరం వెల్‌కం లీడ్‌ సర్టిఫికెట్, అనుభవ పత్రాన్ని ఐటీసీ అందిస్తుంది. ఐటీసీ హోటల్స్‌లో ఫ్రంట్‌లైన్‌ ఆపరేషన్స్‌ ఉద్యోగాల్లో చేరిపోవచ్చు. పదో తరగతి, ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. కంపార్ట్‌మెంట్‌ ఉత్తీర్ణులు అనర్హులు. పదో తరగతి ఆంగ్లంలో 60 శాతం మార్కులు ఉండాలి. ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులూ అర్హులే. ఇంటర్వ్యూ, పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు. వివరాలకు వెబ్‌సైట్‌ చూడవచ్చు.వెబ్‌సైట్‌: https://www.itchotels.in/hmi/programmes/welcomlead.html

ఒబెరాయ్‌ గ్రూప్‌: స్టెప్‌

సిస్టమేటిక్‌ ట్రయినింగ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ ప్రోగ్రాం (స్టెప్‌) పేరుతో ఒబెరాయ్‌ గ్రూప్‌ ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారికి అవకాశం కల్పిస్తోంది. ఫ్రంట్‌ ఆఫీస్, హౌస్‌ కీపింగ్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ సర్వీస్, కిచెన్‌ విభాగాల్లో శిక్షణ ఇస్తారు. కోర్సులో చేరినవారికి ప్రతి నెలా స్ట్టైపెండ్‌ అందుతుంది. వసతి, భోజనం, యూనిఫారం, మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఉచితం. మూడేళ్ల కోర్సు విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి బ్యాచిలర్‌ ఆఫ్‌ టూరిజం స్టడీస్‌ డిగ్రీని ఇగ్నో ప్రదానం చేస్తుంది. ఒబెరాయ్‌ గ్రూప్‌ హోటళ్లలో ఆపరేషన్స్‌ అసిస్టెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు.  ఇంటర్‌ ఉత్తీర్ణత సాధించాలి. పదో తరగతి ఇంగ్లిష్‌లో 71 శాతం మార్కులు తప్పనిసరి.

వెబ్‌సైట్‌: https://www.oberoigroup.com/learningprogrammes/step

మరికొన్ని...

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐహెచ్‌ఎం), ఔరంగాబాద్‌ ఆనర్స్‌ విధానంలో నాలుగేళ్ల బీఏ - హోటల్‌ మేనేజ్‌మెంట్‌ / కలినరీ ఆర్ట్స్‌ కోర్సులు అందిస్తోంది. ఈ సంస్థలో తాజ్‌ గ్రూప్‌ భాగస్వామ్యం ఉంది. నాలుగో సంవత్సరం కోర్సులను భారత్‌ లేదా యూకేలో చదువుకోవచ్చు. ఇందుకోసం యూకేకు చెందిన హడర్స్‌ ఫీల్డ్‌ యూనివర్సిటీతో ఒప్పందం కుదుర్చుకుంది. అన్నీ కలిపి నాలుగేళ్ల కోర్సు భారత్‌లో చదవడానికి రూ.18 లక్షలు అవుతుంది.

ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థకు దేశవ్యాప్తంగా హైదరాబాద్‌తోపాటు 8 క్యాంపస్‌లు ఉన్నాయి. ఇంటర్‌ విద్యార్హతతో కోర్సులు అందిస్తున్నారు. ఆన్‌లైన్‌ పరీక్షతో ప్రవేశం పొందవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పలు ప్రైవేటు సంస్థలు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందిస్తున్నాయి. చాలా వాటిలో నేరుగా ప్రవేశాలు లభిస్తాయి. పేరొందిన సంస్థలు ఇంటర్‌ మార్కులు లేదా ఏదైనా పరీక్ష స్కోర్‌ లేదా ప్రవేశ పరీక్షతో కోర్సులోకి తీసుకుంటున్నాయి.

ఉద్యోగావకాశాలు

బీఎస్సీ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చదివినవారిని మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ లేదా ఎగ్జిక్యూటివ్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ ఫుడ్‌ అవుట్‌లెట్లు, రిసార్టులు, రైల్వే, డిఫెన్స్, ఎయిర్‌ లైన్స్, క్రూయిజ్‌ లైన్స్, స్టేట్‌ టూరిజం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్లు, కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలు...ఇలా ప్రతిచోటా ఉద్యోగాలు లభిస్తాయి. పేరున్న సంస్థల్లో చదివినవారు దాదాపు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా కోర్సు పూర్తికాకముందే ఫైవ్‌స్టార్‌ హోటళ్లలో అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. లీలా, లెమన్‌ ట్రీ, ట్రైడెంట్, ఒబెరాయ్, తాజ్, పార్క్, స్టార్‌వుడ్, మారియట్‌...ఇలా ప్రముఖ సంస్థల్లో ఉద్యోగావకాశాలు అందుకోవచ్చు. ఫుడ్‌ చైన్‌ సంస్థలైన కేఎఫ్‌సీ, మెక్‌ డొనాల్డ్స్, పీజా హట్, డామినోస్‌..మొదలైనవి ప్రాంగణ నియామకాల ద్వారా ఎక్కువమందిని తీసుకుంటున్నాయి. విదేశాల్లోనూ అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. అనుభవంతో సొంతంగా ఫుడ్‌ చెయిన్‌ ప్రారంభించవచ్చు. బోధనపై ఆసక్తి ఉన్నవారు పీజీ అనంతరం నేషనల్‌ హాస్పిటాలిటీ టూరిజం ఎలిజిబిలిటీ టెస్టులో అర్హత సాధించి, మేటి సంస్థల్లో టీచింగ్‌ పోస్టుల్లో స్థిరపడవచ్చు.

Posted Date: 18-08-2021


 

ఇంటర్ తర్వాత

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌