• facebook
  • whatsapp
  • telegram

ఒకే సీటుతో రెండు డిగ్రీలు

డిగ్రీతోపాటు పీజీ కూడా ఒకేచోట చేసే అవకాశం ఉంటే విద్యార్థులకు ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఉన్నత చదువులు ఆశించే విద్యార్థులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు డిగ్రీ, పీజీ ఒకేచోట చదివే వీలు ఉన్నప్పుడు ఎక్కువశాతం ఉన్నత చదువులకు ఆసక్తి చూపుతారు. ఈ ఉద్దేశంతో అందుబాటులోకి వచ్చినవే ఇంటిగ్రేటెడ్ కోర్సులు.
 

 

విద్యార్థులకు ప్రవేశపరీక్షల ఒత్తిడిని తగ్గించి విద్యా సంవత్సరాన్ని ఆదాచేయాలనే ఉద్దేశంతో దేశంలో, రాష్ట్రంలోనూ విశ్వవిద్యాలయాలు అయిదేళ్ల కాల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. వీటిని వివిధ రాష్ట్రాల్లోని యూనివర్సిటీలతోపాటు జాతీయస్థాయిలో ప్రముఖ సంస్థలుగా పేరొందిన బిట్స్ పిలానీ, ఐసర్, సెంట్రల్ వర్సిటీలు కూడా ప్రవేశపెట్టాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని యూనివర్సిటీలు ఈ కోర్సులను నిర్వహిస్తున్నాయి.
 

 

ప్రధాన ఉద్దేశం
ఇంటర్ తర్వాత పీజీ వరకు మధ్యలో ఎక్కడా ఆగకుండా విద్యార్జన వరుసగా కొనసాగేలా చూడటం. కేవలం థియరీ మాత్రమే కాకుండా ప్రాక్టికల్‌గా కూడా విద్యార్థిని ప్రతిభావంతుడిగా తీర్చిదిద్దడం.
పరిశోధనా రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాల్లో వారిని మేధావులుగా రూపొందించడం.

 

 

ప్రయోజనం
ఒకేసారి కోర్సులో సీటు సంపాదిస్తే డిగ్రీ నుంచి పీజీ వరకు అవిచ్ఛిన్నంగా చదవవచ్చు. దీనివల్ల సబ్జెక్టులపై పట్టు కుదురుతుంది. అధ్యాపకులు, తోటి విద్యార్థులతోనూ దీర్ఘకాల అనుబంధం వల్ల వారిసాయంతో కోర్సును విజయవంతంగా పూర్తిచేయవచ్చు.

 

 

విద్యార్హతలు
ఇంటర్ ఏ గ్రూప్ వారైనా ఈ కోర్సుల్లో చేరవచ్చు. కాకపోతే సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివిన అభ్యర్థులు బీటెక్/ఎంటెక్/ ఎంఎస్ లాంటి కోర్సులు చేయవచ్చు. ఆర్ట్స్, కామర్స్ సబ్జెక్టులతో ఇంటర్ చదివినవారు బీఏఎల్ఎల్‌బీ, ఇంటిగ్రేటెడ్ ఎంఏ/ ఎంబీఏ తదితర కోర్సుల్లో చేరవచ్చు.

 

 

సర్టిఫికెట్ జారీ విధానం
విద్యార్థి మొదటి మూడు సంవత్సరాలు పూర్తి చేసి వద్దనుకుంటే మూడేళ్ల కాల వ్యవధితో సాధారణ డిగ్రీ పట్టా ఇస్తారు. నాలుగేళ్లు చదివి ఆగిపోతే ఆనర్స్ డిగ్రీ (ఉదా: బి.ఎ./ బి.ఎస్‌సి. (ఆనర్స్)), పూర్తిగా 5 సంవత్సరాలు చదివితే పి.జి. (ఎంఏ, ఎంబీఏ, ఎంఎస్సీ మొదలైనవి) సర్టిఫికెట్ లభిస్తుంది.

 

 

తెలుగు రాష్ట్రాల్లో...
ఇంటిగ్రేటెడ్ కోర్సుల విధానం మన రాష్ట్రాల్లో 2006లో ప్రారంభమైంది. రాష్ట్రాల‌ ఉన్నత విద్యా మండళ్లు ఈ కోర్సులకు శ్రీకారం చుట్టాయి. 2006లో జరిగిన యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్ (వీసీ)ల సమావేశంలో ఇంటిగ్రేటెడ్ కోర్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించారు. దీన్లో భాగంగా 2006 లో ఆంధ్రా, కాకతీయ, శ్రీ వేంకటేశ్వర, ఉస్మానియా యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ డిగ్రీ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. 2007లో నిజామాబాద్, కడప, రాజమండ్రి ప్రాంతాల్లోని వర్సిటీలకు విస్తరించారు.

 

 

ఆంధ్రా యూనివర్సిటీ  
1) ఎంఎస్సీ జియాలజీ.
2) ఎంఏ ఎకనమిక్స్

ఈ రెండింటిలో ప్రవేశానికి ఏయూ సెట్ రాయాలి.
2014-15 విద్యా సంవత్సరం నుంచి కొత్తగా ఇంటిగ్రేటెడ్ డ్యుయల్ డిగ్రీ ప్రోగ్రాములను ప్రారంభించారు.
అవి.....
1) బీటెక్ + ఎంటెక్/ ఎంబీఏ. (సీఎస్ఎస్ఈ, కంప్యూటర్ సైన్స్ అండ్ నెట్‌వర్కింగ్, సివిల్, మెకానికల్, ఈఈఈ, ఈసీఈ, కెమికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ.
2) ట్విన్నింగ్ ప్రోగ్రామ్స్

(బి. ఇంజినీరింగ్, ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజినీరింగ్).
బీటెక్ ఎలక్ట్రో మెకానికల్/ కెమికల్/ ఎలక్ట్రానిక్స్).
వీటిలో ప్రవేశానికి ఏయూఈఈటీ రాయాలి.
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వెబ్‌సైట్:
www.andhrauniversity.edu.in

 

సెంట్రల్ యూనివర్సిటీ 
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (సెంట్రల్ వర్సిటీ) ఎంఏ, ఎంఎస్సీల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. కోర్సులు...
1) ఎంఎస్సీ ప్రోగ్రాములు: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమికల్‌సైన్సెస్, సిస్టమ్స్ బయాలజీ, ఆప్టొమెట్రీ అండ్ విజన్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ.
2) ఎంఏ హ్యుమానిటీస్ ( తెలుగు, హిందీ, ఉర్దూ), లాంగ్వేజ్ సైన్సెస్.
3) ఎంఏ సోషల్ సైన్సెస్ (ఎకనమిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఆంత్రొపాలజీ).
సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్లో కనీసం 60 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఉత్తీర్ణత సరిపోతుంది. ప్రవేశ పరీక్షల ద్వారా ఎంపిక చేస్తారు.
వెబ్‌సైట్:
www.uohyd.ac.in
 

 

యోగి వేమన వర్సిటీ 
కడపలోని యోగి వేమన యూనివర్సిటీ ఎంఎస్సీ (బయోటెక్నాలజీ, బయో ఇన్ఫర్మాటిక్స్, ఎర్త్ సైన్సెస్) ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది. ఇంటర్‌లో సైన్స్ సబ్జెక్టులు చదివిన వారు అర్హులు. ఎంపిక నిమిత్తం వైవీయూ సెట్ రాయాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్:
http://yogivemanauniversity.ac.in/
 

 

ఉస్మానియా యూనివర్సిటీ
ఉస్మానియా వర్సిటీ ఆర్ట్స్, సైన్స్ విభాగాల్లో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను అందిస్తోంది.
కోర్సుల్లో...
1) ఎం.ఎ. అప్లయిడ్ ఎకనమిక్స్,
2) ఎం.ఎస్‌సి. కెమిస్ట్రీ, ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ,
3) ఎం.బి.ఎ.ఉన్నాయి.

వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు.
ఈ కోర్సులను మహాత్మాగాంధీ, తెలంగాణా, పాలమూరు యూనివర్సిటీల్లో కూడా నిర్వహిస్తారు. అన్ని రకాల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది.
వెబ్‌సైట్:
www.osmania.ac.in

 

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 
గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం రెండు రకాల ఇంటిగ్రేటేడ్ కోర్సులను అందిస్తోంది. అవి..
1) ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ (ఇంటర్నేషనల్ బిజినెస్).
2) ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ నానో టెక్నాలజీ.

వీటి కాల వ్యవధి 5 సంవత్సరాలు.
1) ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థుల ఎంపిక జరుగుతుంది. కోర్సులను సమర్ధంగా నిర్వహించేందుకు అత్యాధునిక లైబ్రరీ, కంప్యూటర్లు, సెమినార్ హాలు, తరగతిగదులను ఏర్పాటు చేశారు.

విద్యార్థులకు ఉజ్వల భవిత: ఇంటర్నేషనల్ బిజినెస్ స్టడీస్ కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు మంచి అవకాశాలు ఉన్నాయి. వీరికి ఆర్‌బీఐ, సెజ్‌లు, పోర్టులు, ఫారిన్ ఎక్స్ఛేంజ్ సంస్థలు, ఎగుమతి, దిగుమతి సంస్థలు; ఫార్మాస్యూటికల్స్, సాఫ్ట్‌వేర్ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తున్నాయి
2) నానో టెక్నాలజీ: నానో టెక్నాలజీ రంగంలో నిపుణులను తీర్చిదిద్దే లక్ష్యంతో ఈ కోర్సును నాగార్జున వర్సిటీలో 2007లో ప్రవేశ పెట్టారు. ఏఎన్‌యూ సెట్ ద్వారా కూడా ప్రవేశాలు కల్పిస్తారు. మొదటి మూడు సంవత్సరాలు పూర్తయిన తర్వాత విద్యార్థులు కోర్సు నుంచి వెళ్లిపోవాలనుకుంటే వారికి బీఎస్సీ డిగ్రీ ధ్రువపత్రం అందజేస్తారు. మొత్తం అయిదేళ్లు పూర్తిచేస్తే వారికి ఎంఎస్సీ నానో టెక్నాలజీ ఇంటిగ్రేటెడ్ కోర్సు ధ్రువపత్రం ఇస్తారు. ప్రాజెక్ట్ వర్క్‌లో భాగంగా వివిధ పరిశ్రమల్లో శిక్షణ పొందేలా చూస్తారు.

 

జేఎన్‌టీయూ కాకినాడలో ఇంటర్నేషనల్ కోర్సులు 
హైదరాబాద్, కాకినాడల్లోని జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్‌టీయూకే)లో ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులను 2011లో ప్రారంభించారు. విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ కోర్సులను ప్రారంభించారు.
బీటెక్ ఈసీఈ: దీన్లో బీటెక్ ఈసీఈ సిగ్నల్ ప్రాసెసింగ్, బీటెక్ ఈసీఈ టెలికమ్యూనికేషన్ సిస్టమ్, ఈసీఈ రేడియో కమ్యూనికేషన్ కోర్సులు ఉన్నాయి.
బీటెక్ సీఎస్ఈ: దీన్లో బీటెక్ సీఎస్ఈ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సీఎస్ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ కోర్సులు ఉన్నాయి. ఈ రెండు కోర్సులను జేఎన్‌టీయూకేలో మూడున్నర సంవత్సరాలు, స్వీడన్‌లోని బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో 18 నెలలు చదవాల్సి ఉంటుంది.
ఎంటెక్, ఎంఎస్సీ ఇంజినీరింగ్: దీన్లో ఈసీఈ డిజిటల్ సిగ్నల్ ప్రాసెసింగ్ ఇంజినీరింగ్ కోర్సు ఉంది. తొలి ఆరునెలలు జేఎన్‌టీయూకేలో, ఏడాది బ్లెకింగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదవాల్సి ఉంటుంది.
బీటెక్ సివిల్, ఎంఎస్ ఇంజినీరింగ్: మూడున్నర సంవత్సరాలు జేఎన్‌టీయూకేలో, ఏడాదిన్నరపాటు బ్యాంకాక్‌లోని ఏషియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చేయాలి.
వెబ్‌సైట్:
http://www.jntuk.edu.in/

 

జాతీయ స్థాయిలో....
ఇంటిగ్రేటెడ్ కోర్సుల ప్రాధాన్యాన్ని, వాటి ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాన్ని గుర్తించిన ఎయిమ్స్, ఐసర్ బిట్స్, నైసర్ లాంటి పలు జాతీయ స్థాయి విద్యా సంస్థలు సైన్స్ సబ్జెక్టులతో విలువైన ఇంటిగ్రేటెడ్ కోర్సులను నిర్వహిస్తున్నాయి.

వీటిలో ముఖ్యమైనవి...

ఐఐఎస్ఈఆర్
బిట్స్- పిలానీ
భారతీదాసన్ యూనివర్సిటీ
ఐఐటీలు
ఎయిమ్స్
పుదుచ్చేరి యూనివర్సిటీ
నెస్ట్ (నైసర్)
వేలూర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మొదలైనవి.

 

సెంట్రల్ యూనివర్సిటీల సెట్ 
దేశంలోని 7 ప్రముఖ సెంట్రల్ యూనివర్సిటీలు కలిసి 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో విద్యార్థులను చేర్చుకోవడానికి 'సెంట్రల్ వర్సిటీస్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్' (సీయూ సెట్)ను నిర్వహిస్తున్నాయి. బీహార్, జార్ఖండ్, కర్ణాటక, కాశ్మీర్, కేరళ, రాజస్థాన్, తమిళనాడులకు చెందిన ఈ వర్సిటీలు ఎంఏ, ఎంఎస్సీ తదితర కోర్సుల్లో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాములను అందిస్తున్నాయి. సీయూ సెట్ రాసేందుకు ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి.
వెబ్‌సైట్:
www.cub.ac.in

 

 

హెచ్‌సీయూలో కోర్సులు 
ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ కోర్సులు: మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ, ఎమ్మెస్సీ ఎర్త్‌ సైన్సెస్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఆప్టోమెట్రీ (ఈ కోర్సు వ్యవధి ఆరేళ్లు).
అర్హత: కొన్ని కోర్సులకు సైన్స్‌ సబ్జెక్టుల్లో 60 శాతం మార్కులతో ఇంటర్‌ లేదా ప్లస్‌ టూ ఉత్తీర్ణత. మరికొన్నింటికి పాసై ఉంటే చాలు.
కోర్సు: ఇంటిగ్రేటెడ్‌ ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ
అర్హత: 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత (ఆర్ట్స్‌, సైన్స్‌ ఏ గ్రూప్‌ విద్యార్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు)

 

 

ఎంఏ (హ్యుమానిటీస్‌)
కోర్సులు: తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్సెస్‌.
అర్హత: ఈ మూడు కోర్సులకు ఇంటర్‌ ఏ గ్రూప్‌లోనైనా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

 

ఎంఏ (సోషల్‌ సైన్సెస్‌)
కోర్సు: ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ.
అర్హత: అన్ని సోషల్‌ సైన్సెస్‌ కోర్సులకు ఏ గ్రూప్‌తోనైనా 60 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.

 

 

పరీక్ష విధానం
అన్ని ఇంటిగ్రేటెడ్‌ (ఎంఏ, ఎమ్మెస్సీ) కోర్సులకూ రాత పరీక్ష ద్వారా ప్రవేశం కల్పిస్తారు. పరీక్ష వ్యవధి 2 గంటలు. ఆబ్జెక్టివ్‌ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. మ్యాథమెటికల్‌ సైన్సెస్‌, ఫిజిక్స్‌, కెమికల్‌ సైన్సెస్‌, సిస్టమ్స్‌ బయాలజీ అండ్‌ ఎర్త్‌ సైన్సెస్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. మొత్తం 100 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఎమ్మెస్సీ హెల్త్‌ సైకాలజీ కోర్సుకి దరఖాస్తు చేసుకున్నవారికి కూడా వంద మార్కులకే ప్రశ్నపత్రం. పరీక్షలో సైకాలజీ (ఇంటర్‌ స్థాయి), ఇంగ్లిష్‌ భాష అవగాహనపై ప్రశ్నలుంటాయి.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ హ్యుమానిటీస్‌ (తెలుగు, హిందీ, లాంగ్వేజ్‌ సైన్స్‌) కోర్సులకు ఉమ్మడి పరీక్ష నిర్వహిస్తారు. వంద మార్కుల ప్రశ్నపత్రం ఉంటుంది. మెరిట్‌ ప్రకారం అభ్యర్థి ఎంచుకున్న కోర్సులోకి ప్రవేశం లభిస్తుంది.
ఇంటిగ్రేటెడ్‌ ఎంఏ సోషల్‌ సైన్సెస్‌ (ఎకనామిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, సోషియాలజీ, ఆంత్రోపాలజీ) కోర్సులకు దరఖాస్తు చేసుకున్నవారికి ఉమ్మడి పరీక్ష ఉంటుంది. దీన్ని వంద మార్కులకు నిర్వహిస్తారు.

Posted Date: 19-10-2020


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌