• facebook
  • whatsapp
  • telegram

భవిత మెరిసేలా!

న్యాయవిద్యలో ప్రవేశాలకు ప్రకటనలు

 

 

కెరియర్‌ పరంగా మేటి భవిష్యత్తు అందించేవాటిలో న్యాయవిద్య ఒకటి.  నల్లకోటు ధరించి బాధితులకు న్యాయం చేయగలిగే  అవకాశం దీనిలో  అదనపు ఆకర్షణ.  ప్రశ్నించే తత్వం ఉన్నవారు, వ్యవస్థలో  సానుకూల మార్పు    ఆశించేవారు, చట్టం ద్వారా ఇతరులకు సాయపడాలని కోరుకునేవారు న్యాయవిద్య కోర్సుల్లో చేరటానికి మొగ్గు చూపొచ్చు. ఇంటర్‌ తర్వాత, అలాగే డిగ్రీ పూర్తిచేసుకున్నాక... ఈ రెండు సందర్భాల్లో ఎప్పుడైనా లా కోర్సులు చదువుకోవచ్చు.  ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో విద్యాసంస్థలున్నాయి. వాటిలో ప్రవేశాలకు ప్రకటనలు వెలువడ్డాయి! 

 

పెరుగుతోన్న వివాదాలు, ఆధునిక అవసరాలు న్యాయవిద్య పరిధిని విస్తరిస్తున్నాయి. అందుకు తగ్గట్టుగానే పీజీ స్థాయిలో స్పెషలైజేషన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్‌ తర్వాత నేరుగా లా చదువుకునే అవకాశం ఉంటుంది. ఇంటిగ్రేటెడ్‌ విధానంలో డిగ్రీ, ఎల్‌ఎల్‌బీ రెండూ కలిపి ఒకేసారి చదువుకోవచ్చు. అలా వద్దనుకుంటే గ్రాడ్యుయేషన్‌ (డిగ్రీ) విడిగా చదివి, అనంతరం ఎల్‌ఎల్‌బీలో చేరవచ్చు. అయితే న్యాయవిద్యలో ఆసక్తి ఉన్న ఇంటర్‌ విద్యార్థులు డిగ్రీతో కలిపి ఎల్‌ఎల్‌బీలో చేరడమే మంచిది. దీనిద్వారా అయిదేళ్లకే కోర్సు పూర్తవుతుంది. అదే డిగ్రీ తర్వాత చేరితే మొత్తం ఆరేళ్లు (విడిగా డిగ్రీకి మూడేళ్లు, ఎల్‌ఎల్‌బీకి మరో మూడేళ్లు) అవసరం. ఇంటర్‌ తర్వాత చేరడం వల్ల ఏడాది సమయం ఆదాతోపాటు సబ్జెక్టుపై పట్టు పెంచుకోడానికి అవకాశం దక్కుతుంది. ఇప్పుడు జాతీయ, ప్రాంతీయ సంస్థలు డిగ్రీతో కలిపి ఎల్‌ఎల్‌బీ కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఇందుకోసం జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 

 

ఉన్నత విద్య 

జాతీయ, ప్రముఖ సంస్థల్లో పీజీ కోర్సు (ఎల్‌ఎల్‌ఎం) ఏడాదికే పూర్తవుతుంది. రాష్ట్రస్థాయి సంస్థల్లో మాత్రం పీజీ రెండేళ్లు చదవాల్సి ఉంటుంది. ఇందులో చాలా స్పెషలైజేషన్లు ఉన్నాయి. బిజినెస్, హ్యూమన్‌ రైట్స్, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ, కాన్‌స్టిట్యూషనల్‌ అండ్‌ అడ్మినిస్ట్రేటివ్, బిజినెస్‌ అండ్‌ క్రిమినల్, కార్పొరేట్, ఎన్విరాన్‌మెంటల్, ఫ్యామిలీ, పాలసీ అండ్‌ గుడ్‌ గవర్నెన్స్‌...మొదలైనవి ముఖ్యమైనవి.స్పెషలిస్ట్‌ సేవలు అందించాలనుకునేవారు ఎల్‌ఎల్‌ఎంలో చేరాలి. అనంతరం ఆసక్తి ఉంటే పీహెచ్‌డీలో పూర్తిచేసుకోవచ్చు. బోధన రంగంలో రాణించడానికి పరిశోధన పట్టా ఉపయోగపడుతుంది. 

 

కోరుకున్న డిగ్రీతో...

బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఎం, బీఎస్‌డబ్ల్యు...వీటిలో కోరుకున్న కాంబినేషన్‌తో ఎల్‌ఎల్‌బీ చదువుకోవచ్చు. అయితే ఎక్కువ సంస్థల్లో బీఎ ఎల్‌ఎల్‌బీ కోర్సు అందుబాటులో ఉంటోంది. డిగ్రీ కోర్సు ఏదైనప్పటికీ వీటిలో లా సిలబస్‌ ఇంచుమించు ఒకేలా ఉంటుంది. బీబీఏలో మేనేజ్‌మెంట్, బీఏలో సోషల్‌ సైన్సెస్, బీఎస్సీలో సైన్స్‌ అంశాలు, బీఎస్‌డబ్ల్యూలో సోషల్‌ వర్కుకు ప్రాధాన్యం కల్పిస్తారు. అయిదేళ్లలో పది సెమిస్టర్లతో డిగ్రీతోపాటు ఎల్‌ఎల్‌బీ పూర్తవుతుంది. అనంతరం ఉద్యోగం లేదా ఉన్నత విద్య (ఎల్‌ఎల్‌ఎం) దిశగా అడుగులేయవచ్చు. ఆరేళ్ల వ్యవధితో బీటెక్‌ తోపాటు ఎల్‌ఎల్‌బీ చదువుకునే అవకాశం ఉంది. యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌) బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌తో పాటు ఎల్‌ఎల్‌బీ కోర్సు అందిస్తోంది. సైబర్‌ లా, ఇంటలెక్చువల్‌ ప్రాపర్టీ లా ఈ రెండింటిలో ఏదో ఒకటి స్పెషలైజేషన్‌గా ఎంచుకోవచ్చు. ఈ కోర్సులో చేరడానికి ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులే అర్హులు. 

 

పేరున్న సంస్థలు

దేశంలో న్యాయవిద్యకు నేషనల్‌ లా యూనివర్సిటీలతోపాటు మరికొన్ని సంస్థలు పేరొందాయి. వాటిలో ముఖ్యమైనవి...దిల్లీ యూనివర్సిటీ, ఫ్యాకల్టీ ఆఫ్‌ లా; బెనారస్‌ యూనివర్సిటీ, వారణాసి; గవర్నమెంట్‌ లా కాలేజ్, ముంబై; ఐఎల్‌ఎస్‌ లా కాలేజ్, పుణె;  సింబయాసిస్, పుణె; ఐఐటీ ఖరగ్‌పూర్‌. వీటిలో ప్రవేశాల కోసం విడిగా దరఖాస్తు చేసుకోవాలి.  

 

 

ఇవీ పరీక్షలు...

న్యాయవిద్యలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షల్లో ముఖ్యమైంది కామన్‌ లా అడ్మిషన్‌ టెస్టు (క్లాట్‌). ఇందులో సాధించిన స్కోరుతో దేశవ్యాప్తంగా ఉన్న 22 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశం లభిస్తుంది. ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాల నుంచి నల్సార్, హైదరాబాద్‌; దామోదరం సంజీవయ్య జాతీయ లా కళాశాల, విశాఖపట్నం ఉన్నాయి. పేరొందిన ప్రైవేటు సంస్థల్లో ప్రవేశానికీ క్లాట్‌ స్కోర్‌ ఉపయోగపడుతుంది. 

భారత్‌లో కొన్ని సంస్థలతోపాటు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాల్లో న్యాయవిద్యలో ప్రవేశానికి    ఎల్‌శాట్‌ స్కోరు పనికొస్తుంది. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో లాసెట్‌ నిర్వహిస్తున్నారు. ఈ స్కోరుతో రాష్ట్ర స్థాయి ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థల్లో చేరవచ్చు. 

లా ప్రవేశ పరీక్షల్లో ఆప్టిట్యూడ్, జనరల్‌ అవేర్‌నెస్, లీగల్‌ నాలెడ్జ్, జనరల్‌ ఇంగ్లిష్‌ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థిలో గ్రహణ, తార్కిక నైపుణ్యాలు, సామర్థ్యాలను మూల్యాంకనం చేస్తారు. న్యాయవిద్య అభ్యసించడానికి అవసరమైన ఆప్టిట్యూడ్, స్కిల్స్‌ ఉన్నాయా? లేవా? అనేది ప్రవేశ పరీక్షల ద్వారా గమనిస్తారు.  

 

ఉద్యోగాలు

జాతీయ స్థాయి సంస్థల్లో న్యాయవిద్య కోర్సులు పూర్తిచేసుకున్న విద్యార్థులు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఆకర్షణీయ వేతనాలతో అవకాశాలు పొందుతున్నారు. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సంస్థలు, వస్తు తయారీ పరిశ్రమలు, సాఫ్ట్‌వేర్, బహుళజాతి కంపెనీలు, ప్రైవేటు ఈక్విటీ కంపెనీలూ, కన్సల్టింగ్‌ సంస్థలూ, అకౌంటింగ్‌ కంపెనీల్లో ఉపాధి లభిస్తుంది. లా గ్రాడ్యుయేట్లను జ్యుడీషియల్‌ క్లర్క్‌లుగానూ తీసుకుంటున్నారు. లీగల్‌ ప్రాసెస్‌ అవుట్‌ సోర్సింగ్‌లో అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్యతో బోధన రంగంలోనూ రాణించవచ్చు. 

 

ఎన్జీవోలు, చైల్డ్‌ రైట్స్, హ్యూమన్‌ రైట్స్‌ కమిషన్లు, కార్పొరేట్‌ లీగల్‌ సెల్స్‌ ..ఇవన్నీ కొలువుల వేదికలే. కంపెనీలకు సేవలు అందించడానికి కార్పొరేట్‌ లీగల్‌ ఫర్మ్‌లు సైతం ఉన్నాయి. వీటిలో పెద్ద మొత్తంలో వేతనాలు చెల్లిస్తున్నారు. 

 

దేశవ్యాప్తంగా వివిధ స్థాయుల్లో సుమారు 4 కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటి సంఖ్య ఏటా దాదాపు 10 శాతం పెరుగుతోంది. అయిదు వేల జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మరోవైపు సైబర్‌ క్రైమ్, ఆన్‌లైన్‌ మోసాలు, కాపీ రైట్‌ కేసులు పెరుగుతున్నాయి. సాంకేతిక వృద్ధి లీగల్‌ పట్టభద్రులకు అవకాశాలు కల్పిస్తోంది. సివిల్‌ జడ్జ్‌ (జూనియర్‌ డివిజన్‌), లేబర్‌ ఆఫీసర్‌ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు పోటీ పడవచ్చు. అంతర్జాతీయ స్థాయిలో ఐక్యరాజ్య సమితి, అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ కార్మిక సంస్థ, ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టుల్లో సేవలు అందించవచ్చు. ఆర్మీలో జడ్జ్‌ అడ్వొకేట్‌ జనరల్‌ పోస్టులకు లా గ్రాడ్యుయేట్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రైవేటు ప్రాక్టీస్‌ మొదలుపెట్టుకోవచ్చు. లీగల్‌ రిపోర్టర్, లీగల్‌ ఎనలిస్ట్‌గానూ అవతరించవచ్చు.

 

కావాల్సిన నైపుణ్యాలు

క్లిష్టమైన, విస్తృతసమాచారాన్ని చదివి అర్థం చేసుకునే సమర్థత 

తార్కిక పరిజ్ఞానం 

విశ్లేషణ సామర్థ్యం

రాత నైపుణ్యాలు

మంచి కమ్యూనికేషన్‌ నైపుణ్యాలు

తెలివిగా సంభాషించగలిగే నేర్పు

అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తపరచగలిగే ప్రతిభ  

 

 

దరఖాస్తులు

క్లాట్‌ ప్రకటన వెలువడింది. దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 15 లోగా ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు.

అర్హత: ఇంటర్‌ 45% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 40% మార్కులు సరిపోతాయి. ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారూ అర్హులే. 

టీఎస్‌ లాసెట్‌ దరఖాస్తులు జూన్‌ 3 వరకు స్వీకరిస్తారు. అపరాధ రుసుముతో జులై 10   వరకు అవకాశం ఉంది. పరీక్షను ఆగస్టు 23న నిర్వహిస్తారు. 

ఏపీ లాసెట్‌ ప్రకటన వెలువడాల్సి ఉంది. 

 

ఐఐఎం రోహ్‌తక్‌లోనూ...

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం), రోహ్‌తక్‌ అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ లా కోర్సు తొలిసారిగా 2021-2022 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభిస్తోంది. పదో తరగతి, ఇంటర్‌లో 60 (ఎస్సీ, ఎస్టీలు 55) శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించినవారు అర్హులు. ఆసక్తి ఉన్నవారు జూన్‌ 21లోగా వివరాలు నమోదు చేసుకోవాలి. ఈ సంస్థలో ప్రవేశం కోరేవారు క్లాట్‌కి దరఖాస్తు చేసుకోవాలి. ఈ పరీక్షలో సాధించిన స్కోరుకి 45 శాతం, ఇంటర్వ్యూకి 15, పదోతరగతి, ఇంటర్‌ మార్కులకు 40 శాతం వెయిటేజీ ఉంటుంది.  

Posted Date: 03-06-2021


 

ఇంటర్ తర్వాత