ఆధునిక జీవన శైలి, అధికమవుతున్న ప్రమాదాలు, వివిధ వృత్తుల తీరు ఫిజియోథెరపీ ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. కొన్ని ప్రమాదాలు, పలు రకాల అనారోగ్యాలకు శస్త్ర చికిత్సలు తప్పనిసరి. వాటికి గురైన వాళ్లంతా త్వరగా కోలుకోవడానికి మందులతోపాటు ఫిజియో థెరపీ కీలకంగా మారింది. సమస్యను బట్టి వ్యక్తుల వారీగా ఒక్కో తరహా ఫిజియో సేవలు అవసరమవుతున్నాయి. దీంతో ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ ఎక్కువవుతోంది. ఆ అవకాశాలను అందుకోవాలంటే ఫిజియో కోర్సులు చేయాలి. ఇంటర్మీడియట్ అర్హతతో వాటిలోకి ప్రవేశించవచ్ఛు.
శరీరంలో ఏదైనా అవయవం ప్రమాదానికి గురైనా, చచ్చుబడినా దాన్ని మునుపటి స్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ (భౌతిక చికిత్స). నిర్దేశిత పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు సాంత్వన చేకూరుస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, జీవనశైలి, వృత్తి నేపథ్యాల కారణంగా వస్తున్న నొప్పులు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాలు మొదలైనవాటి తీవ్రతను తగ్గించడమే ఫిజియోథెరపీ ప్రధాన కర్తవ్యం. ప్రస్తుతం తగినంత మంది నిపుణులు మన దగ్గర లేరు. అందువల్ల ఆసక్తి ఉన్న వారు ఫిజియో కోర్సులు చేస్తే అవకాశాలను సొంతం చేసుకోవచ్ఛు ఇంటర్ బైపీసీ విద్యార్థులు, ఒకేషనల్ కోర్సులు చదువుకున్నవారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరవచ్ఛు కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధి లభిస్తుంది. ఆర్థెయిటిస్, నడుము నొప్పులు, పనిలో ఏర్పడిన గాయాలు, ఆటలాడుతున్నప్పుడు కండరాలు పట్టేయడం, స్ట్రోక్, పక్షవాతం, ప్రమాదవశాత్తు ఏర్పడిన వైకల్యాలు వీటన్నింటికీ ఫిజియోథెరపీ సేవలు అవసరమే.
కోర్సు స్వరూపం
ఫిజియోథెరపీ కోర్సు పదో తరగతి తర్వాత ఇంటర్ ఒకేషనల్ విద్యలో, డిప్లొమా స్థాయిలో అందుబాటులో ఉంది. ఈ రెండు కోర్సుల ప్రాధాన్యం, పరిధి తక్కువ. ఫిజియోథెరపిస్టుగా అవకాశాలు సొంతం చేసుకోవాలంటే బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరాలి. కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్ తప్పనిసరి. కోర్సులో భాగంగా మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్ కండిషన్లు, బయోమెకానిక్స్, కైనిసియాలజీ, డిజెబిలిటీ ప్రివెన్షన్, రిహాబిలిటేషన్ మొదలైన వాటిని బోధిస్తారు. థియరీ, ప్రాక్టికల్స్ రెండింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో అంతర్గతంగా ఉన్న ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్సైజ్ థెరపీ, ఎలక్ట్రో థెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లో భాగంగా సమస్యలు ఉన్నవారికి ఉష్ణం, విద్యుత్తు, మెకానికల్ ప్రెషర్, మెకానికల్ ఫోర్స్, కొన్ని రకాల వ్యాయామాలను ఉపయోగించి ఉపశమనం కలిగించేందుకు వీరు కృషి చేస్తారు. ఇందుకోసం పలు పరికరాలను ఉపయోగిస్తారు. ఫిజియోలకు శారీరక దృఢత్వం ఉండాలి. కొన్నిసార్లు గంటలపాటు, పలు విధాలుగా, విడతలవారీ ఎక్సర్సైజ్లు చేయించాలి. దీనికి తగిన ఓపిక, శారీరక సన్నద్ధత ఉండాలి. వైద్యులతో అనుసంధానమవుతూ, వాళ్ల సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు కావాల్సిన సేవలు అందించాలి. నొప్పి కారణంగా రోగులు ఫిజియో థెరపీకి విముఖత చూపవచ్ఛు అందువల్ల వారితో సానుకూలంగా వ్యవహరించి, థెరపీ ప్రాధాన్యాన్ని వివరించే నైపుణ్యం ఉండాలి. మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగించే విధంగా వ్యవహరించాలి.
తెలుగు రాష్ట్రాల్లో...
ఏపీ, తెలంగాణల్లో సుమారు 60కు పైగా కాలేజీల్లో బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో 37, తెలంగాణలో 21 కాలేజీలు బీపీటీ కోర్సు అందిస్తున్నాయి. ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, తెలంగాణలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌ల ద్వారా ప్రవేశాలు లభిస్తాయి.నిమ్స్, హైదరాబాద్, మరికొన్ని సంస్థలు ప్రత్యేక ప్రకటన ద్వారా పరీక్ష నిర్వహించి బీపీటీ కోర్సులో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఈ ప్రకటనలన్నీ సాధారణంగా జులైలో వెలువడతాయి. ఇంటర్ బైపీసీ లేదా ఒకేషనల్ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్ ఒకేషనల్‌తో పాటు బయాలజీ, ఫిజికల్ సైన్స్‌ల్లో బ్రిడ్జ్ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్ సైన్స్ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవరమెంట్ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ లోకోమోటార్ డిజెబిలిటీస్ - కోల్‌కతా, స్వామీ వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిహాబిలిటేషన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ - కటక్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిజెబిలిటీస్ - చెన్నై ఉమ్మడి పరీక్ష ద్వారా ఫిజియో థెరపీ కోర్సుల్లోకి ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి.
వెబ్సైట్: http://www.svnirtar.nic.in/
మన దేశంలో సుమారు 2 శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారు. వీరందరికీ సేవలందించడానికి వైద్యవిభాగాల మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది వేల మంది జనాభాకు ఒక ఫిజియోథెరపిస్టు ఉండాలి.
ఉద్యోగావకాశాలు
బీపీటీ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువగా కార్పొరేట్ హాస్పిటళ్లలో అవకాశాలు లభిస్తాయి. ఎంపీటీ విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్ఛు రిహాబిలిటేషన్ సెంటర్లు, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లు, స్పెషల్ స్కూళ్లు, ఉమెన్ వెల్నెస్ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్ హోంలు, హోం కేరింగ్, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్ హోంలు/ ప్రైవేటు కేర్ సెంటర్లు, స్పోర్ట్స్ క్లినిక్‌లు, ఫిట్నెస్ సెంటర్లలో అవకాశాలు ఉంటాయి. కొంచెం అనుభవం పొందిన తర్వాత సొంత ప్రాక్టీస్ ద్వారా ఆదాయం పెంచుకోవచ్ఛు సేవలందిస్తున్న ప్రాంతం, థెరపీ విధానం బట్టి ఒక్కో సిట్టింగ్‌కూ రూ.400 వరకు అందుతుంది. కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవల కోసమే ఆవిర్భవించాయి. నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్ఛు విషయపరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియోలకు విదేశాల్లోనూ ఆదరణ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ల్లో వీరికి డిమాండ్ ఉంది. ఈ దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుతున్నాయి.
ఉన్నత విద్య
బీపీటీ తర్వాత మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ (ఎంపీటీ)లో చేరవచ్ఛు కోర్సు వ్యవధి రెండేళ్లు. నచ్చిన విభాగంలో సేవలందించడానికి పీజీలో స్పెషలైజేషన్ ఎంచుకోవచ్ఛు మస్క్యులోస్కెలిటల్ సైన్సెస్, కార్డియో వాస్కులర్ అండ్ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, అబ్స్ట్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, జెరియాట్రిక్స్, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్ ఫిజియో థెరపీ మొదలైనవి ఉన్నాయి. ఎంపీటీ తర్వాత ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీలో చేరవచ్ఛు మేటి అవకాశాలకు పీజీ, బోధనలో రాణించడానికి పీహెచ్డీ ఉపయోగపడతాయి. ఫిజియో థెరపీ కోర్సులన్నింటికీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజియోథెరపిస్ట్ (ఐఏపీ) అపెక్స్ బాడీగా వ్యవహరిస్తోంది.
అందిస్తున్న కొన్ని సంస్థలు
‣ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, ముంబయి.
‣ పండిట్ దీన్‌దయాళ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజెబిలిటీస్, న్యూదిల్లీ
‣ పోస్టు గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, చండీగఢ్
‣ క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు
‣ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
‣ అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, హైదరాబాద్
‣ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్), హైదరాబాద్
‣ శ్రీవేంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (స్విమ్స్), తిరుపతి
‣ కృష్ణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (కిమ్స్), సికింద్రాబాద్
‣ యశోదా అకాడమీ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్, హైదరాబాద్