• facebook
  • whatsapp
  • telegram

వైద్య రంగంలో విలువైన కెరియర్‌

సంపూర్ణ స్వస్థతనిచ్చే ఫిజియోథెరపీ

ఇటీవల కాలంలో ప్రాచుర్యం పొందుతోన్న కోర్సుల్లో ఫిజియోథెరపీ ఒకటి. వివిధ రుగ్మతలు, ప్రమాదాల కారణంగా ఎక్కువ మందికి మందులతోపాటు థెరపీ అవసరమవుతోంది. మరోవైపు ఆధునిక జీవన శైలి, వివిధ వృత్తుల పనివిధానం దీని ప్రాధాన్యాన్ని పెంచుతున్నాయి. రకరకాల నొప్పులు, శస్త్రచికిత్సల నుంచి త్వరగా కోలుకోవడానికి వైద్యులు ఫిజియోథెరపీని సిఫారసు చేస్తున్నారు. ఆయా సమస్యను బట్టి వ్యక్తులవారీ ఒక్కో తరహా సేవలు అవసరమవుతాయి. ప్రస్తుతం నైపుణ్యం ఉన్న ఫిజియోథెరపిస్టులకు డిమాండ్‌ ఉంది. ఇంటర్మీడియట్‌ పూర్తిచేసుకున్నవారు ఈ కోర్సులో చేరవచ్చు!

శరీర అవయవాలను పూర్వస్థితికి తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఫిజియోథెరపీ. శాస్త్రీయ పద్ధతులు, వ్యాయామాలు, ఉపకరణాల ద్వారా ఫిజియోథెరపిస్టులు సాంత్వన చేకూరుస్తారు. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, జీవనశైలి, వృత్తి నేపథ్యాల కారణంగా వస్తోన్న నొప్పులు, ఆటలు, ప్రమాదాల వల్ల ఏర్పడిన గాయాల తీవ్రతను తగ్గించడమే వీరి కర్తవ్యం. 

మనదేశంలో 2 శాతం మంది ఏదో ఒక వైకల్యంతో బాధ పడుతున్నారని అంచనా. వైద్య మార్గదర్శకాల ప్రకారం పదివేల మంది జనాభాకు ఒక పిజియోథెరపిస్టు ఉండాలి. ఆ లెక్కన చూసుకుంటే మనదేశంలో అంతమంది సుశిక్షితులు లేరు. అందువల్ల ఆసక్తి ఉన్నవారు ఈ కోర్సులో చేరి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

ఇంటర్మీడియట్‌ బైపీసీ విద్యార్థులూ, ఒకేషనల్‌ కోర్సుల అనంతరం బయాలజీలో బ్రిడ్జి కోర్సు పూర్తిచేసుకున్నవారూ బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ)లో చేరవచ్చు. కోర్సు పూర్తయినవెంటనే ఉద్యోగం/స్వయం ఉపాధి దిశగా అడుగులేయవచ్చు లేదా ఉన్నత విద్యలో చేరవచ్చు.  

కోర్సు స్వరూపం..

ఫిజియో థెరపీ కోర్సు పది తర్వాత ఇంటర్‌ ఒకేషనల్‌ విద్యలో భాగంగా పూర్తిచేసుకోవచ్చు. డిప్లొమా ఇన్‌ ఫిజియోథెరపీ (డీపీటీ) కూడా కొన్ని సంస్థల్లో అందుబాటులో ఉంది. అయితే ఈ రెండు కోర్సుల ప్రాధాన్యం, పరిధి తక్కువ. ఫిజియోథెరపిస్టుగా సేవలు అందించాలని ఆశించేవారు బీపీటీ పూర్తిచేసి, లక్ష్యాన్ని చేరుకోవచ్చు. ఈ కోర్సు వ్యవధి నాలుగేళ్లు. మరో ఆరు నెలలు ఇంటర్న్‌షిప్‌ తప్పనిసరి. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. 

మానవ శరీర నిర్మాణం, వివిధ అవయవాల పనితీరు తెలుసుకుంటారు. అనాటమీ, ఫిజియాలజీ, పాథాలజీ, ఫార్మకాలజీ, సైకాలజీ, మెడికల్, సర్జికల్‌ కండిషన్లు, బయోమెకానిక్స్, కైనిసియాలజీ, డిజెబిలిటీ ప్రివెన్షన్, రిహాబిలిటేషన్‌.. గురించి నేర్చుకుంటారు. ఈ కోర్సులో థియరీ, ప్రాక్టికల్స్‌ రెండింటికీ ప్రాధాన్యం ఉంటుంది. ముఖ్యంగా శరీరంలో ఎముకలు, కండరాలు, నాడీ వ్యవస్థపై అవగాహన పెంచుకోవాలి. కోర్సు చదువుతున్నప్పుడే ఫిజియాలజీ, అనాటమీ, ఎక్సర్‌సైజ్‌ థెరపీ, ఎలక్ట్రోథెరపీ విభాగాలపై పట్టు సాధించాలి. కోర్సు పూర్తయిన తర్వాత విధుల్లో భాగంగా సమస్యలు ఉన్నవారికి ఉష్ణం, విద్యుత్తు, యాంత్రిక ఒత్తిడి, యాంత్రిక శక్తి, కొన్ని రకాల వ్యాయామాలు ఉపయోగించి, ఉపశమనం దిశగా కృషి చేస్తారు. ఇందుకోసం వివిధ పరికరాలను ఉపయోగిస్తారు. 

ఎవరు అర్హులు?

ఇంటర్‌ బైపీసీ లేదా వొకేషనల్‌ (ఫిజియోథెరపీ) లేదా ఇంటర్‌ వొకేషనల్‌తో పాటు బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ల్లో బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఏపీ/ తెలంగాణ ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ద్వారా బయాలజీ, ఫిజికల్‌ సైన్స్‌ కోర్సులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు డిసెంబరు 31, 2021 నాటికి 17 ఏళ్లు నిండాలి.

ఏ సామర్థ్యాలు అవసరం?.

సహనం, సేవాభావం ఉన్నప్పుడే ఫిజియోథెరపిస్టుగా రాణించడానికి వీలవుతుంది. గుర్తింపునకు కొన్నేళ్లు పట్టవచ్చు అప్పటి వరకు ఓపిక తప్పనిసరి.  

శారీరక దృఢత్వం ఉండాలి. కొన్ని సార్లు గంటలపాటు, పలు విధాలగా, విడతలవారీ వ్యాయామాలు చేయించాలి. దీనికి తగ్గ ఓపిక, శారీరక సన్నద్ధత ఉండాలి. 

వైద్యులతో అనుసంధానమవుతూ, వారి సూచనలు పరిగణనలోకి తీసుకుని, అవసరాలకు తగ్గ సేవలు అందించాలి. 

నొప్పి కారణంగా రోగులు ఫిజియోథెరపీకి విముఖత చూపవచ్చు. అందువల్ల వారితో సానుకూలంగా వ్యవహరించి, థెరపీ ప్రాధాన్యాన్ని వివరించే నైపుణ్యం ఉండాలి. 

మాటలతోనూ కొంత మానసిక సాంత్వన కలిగించేలా వ్యవహరించాలి. 

ఉన్నత విద్య

బీపీటీ తర్వాత మాస్టర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (ఎంపీటీ)లో చేరవచ్చు. కోర్సు వ్యవధి రెండేళ్లు. నచ్చిన విభాగంలో సేవలందించడానికి పీజీలో స్పెషలైజేషన్‌ ఎంచుకోవచ్చు. మస్కులోస్కెలిటల్‌ సైన్సెస్, కార్డియో వాస్కులర్‌ అండ్‌ పల్మనరీ సైన్సెస్, న్యూరో సైన్సెస్, ఆర్థోపెడిక్, పీడియాట్రిక్స్, ఆబ్సెస్ట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, జెరియాట్రిక్స్, కమ్యూనిటీ ఫిజియోథెరపీ, స్పోర్ట్స్‌ ఫిజియో థెరపీ...మొదలైనవి ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారు సంబంధిత విభాగాల్లో స్పెషలిస్టు సేవలు అందించవచ్చు. 

న్యూరో సైన్సెస్‌లో ఎంపీటీ పూర్తిచేసుకున్నవారు న్యూరో ఫిజీషియన్, న్యూరో సర్జన్‌లకు అనుబంధంగా పనిచేయవచ్చు. ఎంపీటీ అనంతరం ఆసక్తి ఉన్నవారు పీహెచ్‌డీలో చేరవచ్చు. మేటి అవకాశాలకు పీజీ, బోధనలో రాణించడానికి పీహెచ్‌డీ ఉపయోగపడతాయి. ఫిజియోథెరపీ కోర్సులన్నింటికీ ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఫిజియోథెరపిస్ట్స్‌ (ఐఏపీ) అపెక్స్‌ బాడీగా వ్యవహరిస్తోంది.   

అవకాశాలు..

బీపీటీ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువగా కార్పొరేట్‌ హాస్పిటళ్లలో అవకాశాలు లభిస్తాయి. పీజీ (ఎంపీటీ) విద్యార్హతతో స్పెషాలిటీ విభాగాల్లో ఉద్యోగాలు సొంతం చేసుకోవచ్చు. రిహాబిలిటేషన్‌ సెంటర్లు, పెయిన్‌ మేనేజ్‌మెంట్‌ సెంటర్లు, స్పెషల్‌ స్కూళ్లు, ఉమెన్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, పాలీ క్లినిక్‌లు, ఓల్డేజ్‌ హోంలు, హోం కేరింగ్, దివ్యాంగులకు సేవలందించే కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు, పరిశ్రమలు, ప్రభుత్వ ఆసుపత్రులు, మానసిక చికిత్స కేంద్రాలు, నర్సింగ్‌ హోంలు/ ప్రైవేటు కేర్‌ సెంటర్లు, కార్పొరేట్‌ సంస్థలు, స్పోర్ట్స్‌ అకాడెమీలు, ఫిట్‌నెస్‌ సెంటర్లలో అవకాశాలు లభిస్తాయి. 

కెరియర్‌ ప్రారంభంలో కొంత తక్కువ వేతనమే అందుతుంది. అనుభవం పొందిన తర్వాత సొంత ప్రాక్టీస్‌ ద్వారా ఆదాయం పెంచుకోవచ్చు. సేవలందిస్తోన్న ప్రాంతం, థెరపీ విధానం బట్టి ఒక్కో సిట్టింగ్‌కూ రూ.400 వరకు పొందవచ్చు. 

కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ఫిజియోథెరపీ సేవలకోసమే ఆవిర్భవించాయి. నగరాలు, పట్టణాల్లో వీటిద్వారా ఉపాధి పొందవచ్చు. విషయపరిజ్ఞానం, ఆంగ్లంలో నైపుణ్యం ఉన్న ఫిజియో థెరపిస్టులు విదేశీ అవకాశాల కోసం ప్రయత్నించవచ్చు. యూఎస్, యూకే, ఆస్ట్రేలియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ల్లో వీరికి గిరాకీ ఉంది. ఈ దేశాల్లో పెద్ద మొత్తంలో వేతనాలు అందుతున్నాయి.

కొన్ని మేటి సంస్థలు

ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ మెడిసిన్‌ అండ్‌ రిహాబిలిటేషన్, ముంబై

పండిట్‌ దీన్‌దయాళ్‌ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజెబిలిటీస్, న్యూదిల్లీ

పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, చండీగఢ్‌

క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్, వెల్లూరు

మణిపాల్‌ అకాడెమీ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్, మణిపాల్‌

అపోలో కాలేజ్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ, హైదరాబాద్‌

నిజాం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (నిమ్స్‌), హైదరాబాద్‌

శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (స్విమ్స్‌) తిరుపతి  

కృష్ణా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (కిమ్స్‌), సికింద్రాబాద్‌ 

యశోదా..అకాడెమీ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్, హైదరాబాద్‌

గీతం యూనివర్సిటీ, విశాఖపట్నం

తెలుగు రాష్ట్రాల్లో... 

ఏపీ, తెలంగాణల్లో సుమారు 50కిపైగా కాలేజీల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ (బీపీటీ) కోర్సు అందుబాటులో ఉంది. ఏపీలో ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీల పరిధిలో చాలా సంస్థలు ఈ కోర్సు అందిస్తున్నాయి. ఏపీలో ఎన్‌టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ, తెలంగాణకు కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్‌ హెల్త్‌ సైన్సెస్‌ల ఆధ్వర్యంలో ఈ కోర్సులు నడుపుతున్నారు. 

జాతీయ స్థాయిలో...

కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ సోషల్‌ జస్టిస్‌ అండ్‌ ఎంపవర్‌మెంట్‌ ఆధ్వర్యంలో నడుస్తోన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటివ్‌ డిజెబిలిటీస్‌ - కోల్‌కతా, స్వామీ వివేకానంద ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రిసెర్చ్‌ - కటక్, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌ - చెన్నై ఉమ్మడి పరీక్ష ద్వారా ఫిజియోథెరపీ కోర్సులో ప్రవేశాలు నిర్వహిస్తున్నాయి. ఈ మూడూ జాతీయ స్థాయిలో ప్రాధాన్యమున్న సంస్థలుగా గుర్తింపు పొందాయి.
 

Posted Date: 16-09-2021


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌