• facebook
  • whatsapp
  • telegram

ఈ డిప్లొమాలు ప్రత్యేకం

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులు

ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య మూడింటికీ అనువైన పాలిటెక్నిక్‌ కోర్సుల్లో ప్రత్యేక డిప్లొమాలున్నాయి. వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో ప్రత్యేక డిప్లొమాలను కొన్ని సంస్థలు అందిస్తున్నాయి. వీటితోపాటు జాతీయ స్థాయిలో ప్రత్యేక విభాగాల్లో డిప్లొమాలు పూర్తిచేసుకోవచ్చు!

వ్యవసాయ డిప్లొమా కోర్సులు

గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి వ్యవసాయ డిప్లొమా కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లు అందిస్తున్నాయి. వ్యవసాయరంగంపై ఆసక్తి ఉన్నవారు వీటిలో చేరి నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చు. వీటిని రెండేళ్లు/మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (సీడ్‌ టెక్నాలజీ) కోర్సులను రెండేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎరువులు, క్రిమిసంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ఆధునిక పద్ధతిలో సాగు చేపట్టి రాణించవచ్చు. ఉన్నత చదువులపై ఆసక్తి ఉంటే బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులో చేరిపోవచ్చు. వీరికోసం 20 శాతం సీట్లు అగ్రిసెట్‌ ద్వారా సూపర్‌ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం వీరు బీటెక్‌ అగ్రి ఇంజినీరింగ్‌ కోర్సు చదువుకోవచ్చు. 

వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో లభిస్తుంది. రెండేళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదువుకున్నవారికి అవకాశం కల్పిస్తారు. ఏపీలో..ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. అలాగే తెలంగాణలో.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్‌లు నడుస్తున్నాయి.  

యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ

గ్రామాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. సొంతంగానూ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్‌ నెలకొల్పి స్వయం ఉపాధి దిశగానూ అడుగులేయొచ్చు. యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్సీల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు అర్హులు. 

పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో.. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్‌ కోర్సులను పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు చోట్ల రెండేళ్ల వ్యవధితో యానిమల్‌ హజ్బెండ్రీ పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుకోవచ్చు.

ఉద్యాన డిప్లొమాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పత్తులు పెరగడంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం రెండేళ్ల ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. వీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. డిప్లొమా అనంతరం బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఏపీ/ తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌లున్నాయి. శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సు నడుస్తోంది.  

హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ..

ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ (వెంకటగిరి) ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్‌లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు సుమారు 50 సీట్లు కేటాయిస్తారు. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. కోర్సు పూర్తయ్యాక టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్తాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు కోర్సు మొత్తం ప్రతి నెలా ఉపకారవేతనం అందిస్తారు. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు కేటాయించారు.

ప్లాస్టిక్‌ డిప్లొమా..

సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ (సిపెట్‌) హైదరాబాద్, విజయవాడ క్యాంపస్‌ల్లో మూడేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ మౌల్డ్‌ టెక్నాలజీ (డీపీఎంటీ), డిప్లొమా ఇన్‌ ప్లాస్టిక్స్‌ టెక్నాలజీ (డీపీటీ) కోర్సులు అందిస్తున్నారు. ఈ సంస్థ నిర్వహించే పరీక్షతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. సీట్లు మిగిలితే నేరుగా పదో తరగతి విద్యార్హతతోనే తీసుకుంటున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ప్లాస్టిక్, అనుబంధ పరిశ్రమలు, ప్లాస్టిక్‌ వినియోగ సంస్థల్లో మేటి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు లేదా ప్లాస్టిక్‌ స్పెషలైజేషన్‌తో బీటెక్‌ చదువుకోవచ్చు.   
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ నవోదయలో ఉపాధ్యాయ ఉద్యోగాలు

‣ బీటెక్‌లకు సైంటిస్టు కొలువులు

‣ ఉపాధికి డిప్లొమా మార్గాలు

‣ గురిపెట్టండి క్లర్కు కొలువుకు!

Posted Date: 08-07-2022


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌