• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి రహదారి ఐటీఐ! 

కోర్సు పూర్తవగానే స్వయం ఉపాధి, కేంద్ర సంస్థల్లో కొలువులూ, వాణిజ్య, ఉత్పత్తి సంస్థల్లో అవకాశాలూ ఆశించేవారికి ఐటీఐలు చక్కని ఎంపిక. వీరు ఎంచుకోవడానికి  దేశవ్యాప్తంగా 130కి పైగా ట్రేడ్‌లు ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి పూర్తిచేసుకుంటే కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఉద్యోగాలు పొందే వీలుంది. ప్రైవేటు సంస్థల్లో సేవలు అందించవచ్చు. ట్రేడులపై గట్టి పట్టున్నవారు విదేశాల్లోనూ మెరిసిపోవచ్చు. మరింత నైపుణ్యం ఆశించేవారు ఉన్నత విద్యలో చేరొచ్చు.   మేకిన్‌ ఇండియా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ల మూలంగా ఐటీఐ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి అవకాశాలు  విస్తృతమయ్యాయి. 

పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లను కేంద్రంలోని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రెయినింగ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఆధ్వర్యంలో నడుపుతున్నారు. ఇక్కడ పదోతరగతి అర్హతతో ఏడాది, రెండేళ్ల వ్యవధితో  ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు. వీటిలో దేశవ్యాప్తంగా 130కి పైగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 50 వరకు స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. ఏపీలో సుమారు 500, తెలంగాణలో దాదాపు 300 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో ప్రవేశానికి ఎలాంటి పరీక్షా రాయనవసరం లేదు. పదిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లతో సీట్లు కేటాయిస్తారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు ఉద్యోగం, స్వయం ఉపాధి, ఉన్నత చదువుల దిశగా అడుగులు వేయవచ్చు. చిన్న వయసులోనే చక్కని ఉపాధికి పారిశ్రామిక శిక్షణ కోర్సులు దారిచూపుతున్నాయి. 

ఇవీ ట్రేడ్‌లు..

విద్యార్థులు తమ ఆసక్తి ప్రకారం ఏడాది, రెండేళ్ల వ్యవధితో ఉన్న కోర్సులు (ట్రేడులు) ఎంచుకోవచ్చు. 

రెండేళ్ల వ్యవధితో: అటెండెంట్‌ ఆపరేటర్‌ (కెమికల్‌ ప్లాంట్‌), డ్రాఫ్ట్స్‌మన్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనన్స్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్, ఇన్‌స్ట్ర్టుమెంట్‌ మెకానిక్‌ (కెమికల్‌ ప్లాంట్‌), మ్యాషినిస్ట్, మ్యాషినిస్ట్‌ (గ్రైండర్‌), మెరైన్‌ ఫిట్టర్, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌/ రెఫ్రిజరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్‌), మెకానిక్‌ మెషీన్‌ టూల్‌ మెయింటెనన్స్, పెయింటర్‌ జనరల్, టర్నర్, వెసెల్‌ నేవిగేటర్, వైర్‌మెన్‌. 

ఏడాది వ్యవధితో: కార్పెంటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రోగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రెస్‌ మేకింగ్, ఫౌండ్రీమెన్, మాసన్‌ (బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌), ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ (ఇంగ్లిష్‌), సూయింగ్‌ టెక్నాలజీ, షీట్‌ మెటల్‌ వర్కర్, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌), మెకానిక్‌ (డీజిల్‌/ఆటో బాడీ పెయింటింగ్‌/ ఆటో బాడీ రిపేర్‌)

ఉన్నత చదువులు...

ఐటీఐ అనంతరం ఉన్నత చదువుల దిశగా అడుగులేయాలనుకున్నవారు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కొన్ని బ్రాంచీల్లో లేటరల్‌ ఎంట్రీతో నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. డిప్లొమా తర్వాత, ఆసక్తి ఉంటే ఈసెట్‌ ద్వారా నేరుగా రెండో సంవత్సరం బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. నాన్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్‌లు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ (బీఏ) ఆ తర్వాత పీజీ (ఎంఏ) కోర్సులు చదువుకోవచ్చు.

ఇన్‌స్ట్రక్టర్‌గా...

ఐటీఐల్లో కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు నేషనల్‌ స్కిల్‌ ట్రెయినింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌టీఐ)ల్లో శిక్షణ పొందవచ్చు. విద్యానగర్‌ (హైదరాబాద్‌)లో ఎలక్ట్రీషియన్, వైర్‌మెన్, ఫిట్టర్, టర్నర్, మెషినిస్ట్, ఎలక్ట్రానిక్‌ మెకానిక్, మోటార్‌ వెహికల్‌ మెకానిక్, వెల్డర్‌ ట్రేడ్‌ల్లో ఏడాది వ్యవధితో ఇన్‌స్ట్రక్టర్‌ కోర్సు అందిస్తున్నారు. ఆయా ట్రేడుల్లో మరింత ప్రావీణ్యం పొందాలనుకునేవారికోసం షార్ట్‌ టర్మ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ ఒకేషనల్‌ ట్రైనింగ్‌ కోర్సులూ ఉన్నాయి.  

అప్రెంటిస్‌...

ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్‌ ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తోంది. భారతీయ రైల్వే వేల సంఖ్యలో అప్రెంటిస్‌లను తీసుకుంటోంది. మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు సైతంఅప్రెంటిస్‌Ã అవకాశాలు పెంచాయి. ఈ ప్రకటనలు తరచూ వెలువడుతున్నాయి. ఈ విధానంలో చేరినవారికి ప్రతి నెలా కొంత మొత్తంలో స్టైపెండ్‌ అందుతోంది. అంతేకాకుండా నియామకాల్లో కొన్ని పోస్టులను అప్రెంటిస్‌ పూర్తిచేసుకున్నవారితో భర్తీ చేస్తున్నారు. కొన్ని సంస్థలు అప్రెంటిస్‌ పూర్తిచేసుకున్నవారినే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. 

ప్రభుత్వం 2015లో ప్రారంభించిన ‘స్కిల్‌ ఇండియా’ కార్యక్రమం ఐటీఐ చదివినవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవడానికి దోహదపడుతోంది. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ద్వారా నైపుణ్యాలు మెరుగుపరచుకోవడం, అప్రెంటిస్‌షిప్‌ చేసుకునే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అప్రెంటిస్‌ అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు కోర్సు పూర్తయిన తర్వాత  https://apprenticeshipindia.org లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.  

అవకాశాలిలా 

ఐటీఐ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువ అవకాశాలు పరిశ్రమలు, ఉత్పాదక, తయారీ సంస్థల్లో ఉంటాయి. రైల్వేలు, కేంద్ర స్థాయి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో పెద్ద మొత్తంలో వీరి సేవలు అనివార్యం. దాదాపు అన్ని రకాల సంస్థల్లోనూ అవకాశాలుంటాయి. సాంకేతిక పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్నవారితోనే భర్తీ చేస్తున్నారు. ఆర్మీ, ఆర్మ్‌డ్‌ ఫోర్సుల్లోనూ ప్రత్యేకంగా కొన్ని ఉద్యోగాలు వీరికోసమే ఉన్నాయి. 

రైల్వే: వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ (అసిస్టెంట్‌ డ్రైవర్‌), టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఎలక్ట్రీషియన్‌/ మెకానిక్‌/ ఫిట్టర్‌/ టర్నర్‌/ వైర్‌మెన్‌...తదితర విభాగాలవారు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఐటీఐ ఉంటే టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఎంపికైనవారు రైల్వే వర్కుషాపులు, లోకో షెడ్, రైల్వే క్యాబిన్లలో విధులు నిర్వర్తిస్తారు. వీరిని ఎక్కువగా లెవెల్‌-2 పోస్టుల్లోకి తీసుకుంటారు.  

విద్యుత్‌ రంగం: రాష్ట్ర స్థాయిలో సర్వేయర్, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు వీరు అర్హులు. ఎల్రక్టికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు పంపిణీ, నిర్వహణ కేంద్రాలు రెండు మూడేళ్లకు ఒకసారి ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. సర్వేయింగ్‌ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్‌మన్‌ (సివిల్‌) ట్రేడ్‌ రెండేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారు డెప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు సిద్ధం కావచ్చు.  

ఆర్మీ: సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ విభాగంలోని కొన్ని పోస్టులకు ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), సీఆర్‌పీఎఫ్, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ తదితర సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ విభాగాల్లో ఐటీఐ చదివినవారికి అవకాశాలు లభిస్తున్నాయి. 

పరిశ్రమలు: స్టీల్‌ ప్లాంట్లు, నేవల్‌ డాక్‌యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివినవారికి ఉద్యోగాలున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, ప్రభుత్వ రంగ కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలుంటాయి. కొన్ని ప్రభుత్వ ఐటీఐల్లో ప్రాంగణ నియామకాలూ జరుగుతున్నాయి. స్థానికంగా ఉన్న సంస్థలు వీరికి అవకాశాలు కల్పిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు, ఉత్పత్తి, తయారీ పరిశ్రమలు వీరిని ఎక్కువగా నియమించుకుంటున్నాయి. 

స్వయం ఉపాధి: నైపుణ్యం ఉన్న ప్లంబర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఏసీ, రెఫ్రిజిరేటర్‌ మెకానిక్‌లకు పట్టణాలు, నగరాలతోపాటు పల్లెల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది. అందువల్ల చేతినిండా పనికి ఢోకా లేదు. వీరు సొంతంగా మెకానిక్‌ షెడ్‌ పెట్టుకుని భవిష్యత్తులో మరికొంతమందికి దారిచూపవచ్చు కూడా. బిగింపు, మరమ్మతు సేవల నిమిత్తం ఆన్‌లైన్‌ సంస్థలూ ఉన్నాయి. అలాంటివాటిలో పేరు నమోదు చేసుకుని పనికి తగ్గ ప్రతిఫలం అందుకోవచ్చు.

విదేశాల్లోనూ...

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌), ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఓమ్‌క్యాప్‌) విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఇవి శిక్షణ అందించి, సర్టిఫికెట్లు ప్రదానం చేస్తున్నాయి. వీటిని పొందినవారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ ద్వారా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు. ఫిట్టర్‌ ట్రేడ్‌ పూర్తిచేసుకున్నవారికి చమురు ఉత్పత్తిచేస్తోన్న దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు సింగపూర్, మలేషియాలతోపాటు చాలా దేశాల్లో ఉద్యోగాలు పొందవచ్చు. నైపుణ్యం, కమ్యూనికేషన్‌ నేర్పు ఉన్నవారు విదేశాల్లో  నిలదొక్కుకోవచ్చు.
 

Posted Date: 15-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌