• facebook
  • whatsapp
  • telegram

త‌క్షణ ఉపాధికి పారిశ్రామిక శిక్ష‌ణ‌

కుదిరితే ఉద్యోగం లేదంటే స్వయం ఉపాధిని కోరుకునేవాళ్లు పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు అందించే కోర్సుల దిశగా అడుగులు వేయవచ్చు. ఆసక్తి మేరకు ఎంచుకోవడానికి 130కి పైగా ట్రేడ్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసుకున్నవారికి కేంద్ర, రాష్ట్ర స్థాయుల్లో ఎన్నో ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రైవేటు రంగంలో పలు అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. విదేశాల్లోనూ కాలుమోపొచ్చు. సొంతంగానూ మెరిసిపోవచ్చు. ఉన్నత విద్య దిశగానూ అడుగులు వేయొచ్చు. మేక్‌ ఇన్‌ ఇండియా నినాదం, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ ఏర్పాటుతో ఐటీఐ కోర్సుల్లో చేరిన విద్యార్థులు చక్కని అవకాశాలు సొంతం చేసుకుంటున్నారు. ఆ వివరాలు చూద్దాం.

కేంద్రంలోని డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ అంతర్‌ప్రెన్యూర్‌షిప్‌ ఆధ్వర్యంలో ఐటీఐలు నడుపుతున్నారు. వీటిలో పదోతరగతి అర్హతతో ఏడాది, రెండేళ్ల వ్యవధితో పలు ఇంజినీరింగ్, నాన్‌ ఇంజినీరింగ్‌ ట్రేడుల్లో కోర్సులు అందిస్తున్నారు. ఐటీఐల్లో దేశవ్యాప్తంగా 130కి పైగా స్పెషలైజేషన్లు లభిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 50 వరకు స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సుమారు 500, తెలంగాణలో ఇంచుమించు 300 ఐటీఐలు ఉన్నాయి. వీటిలో చేరడానికి ఎలాంటి పరీక్షా రాయనవసరం లేదు. పదిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లతో తీసుకుంటారు. విజయవంతంగా కోర్సు పూర్తిచేసుకున్నవారు ఉద్యోగం, స్వయం ఉపాధి, ఉన్నత చదువుల దిశగా అడుగులు వేయవచ్చు. చిన్న వయసులోనే చక్కని కెరీర్‌ జీవితానికి బాటలు వేసుకోవచ్చు.

ఇవీ ట్రేడులు... ట్రేడ్‌లు..

రెండేళ్ల వ్యవధితో: అటెండెంట్‌ ఆపరేటర్‌ (కెమికల్‌ ప్లాంట్‌), డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌/ మెకానికల్‌), ఎల్రక్టీషియన్, ఎల్రక్టానిక్స్‌ మెకానిక్, ఫిట్టర్, ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీ సిస్టమ్‌ మెయింటెనన్స్, ఇనిస్టుమెంట్‌ మెకానిక్, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌ (కెమికల్‌ ప్లాంట్‌), మేషినిస్ట్, మేషినిస్ట్‌ (గ్రైండర్‌), మెరైన్‌ ఫిట్టర్, మెకానిక్‌ (మోటార్‌ వెహికల్‌/ రెఫ్రిజరేషన్‌ అండ్‌ ఎయిర్‌ కండీషనింగ్‌), మెకానిక్‌ మెషీన్‌ టూల్‌ మెయింటెనన్స్, పెయింటర్‌ జనరల్, టర్నర్, వెసెల్‌ నేవిగేటర్, వైర్‌మెన్‌.

ఏడాది వ్యవధితో: కార్పెంటర్, కంప్యూటర్‌ ఆపరేటర్‌ అండ్‌ ప్రొగ్రామింగ్‌ అసిస్టెంట్, డ్రెస్‌ మేకింగ్, ఫౌండ్రీమెన్, మాసన్‌ (బిల్డింగ్‌ కన్‌స్ట్రక్టర్‌), ప్లాస్టిక్‌ ప్రాసెసింగ్‌ ఆపరేటర్, ప్లంబర్, వెల్డర్, సెక్రటేరియల్‌ ప్రాక్టీస్‌ (ఇంగ్లిష్‌), సూయింగ్‌ టెక్నాలజీ, షీట్‌ మెటల్‌ వర్కర్, స్టెనోగ్రాఫర్‌ అండ్‌ సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లిష్‌), మెకానిక్‌ (డీజిల్‌/ఆటో బాడీ పెయింటింగ్‌/ ఆటో బాడీ రిపేర్‌)

అప్రెంటీస్‌...

ఉద్యోగ నియామకాల్లో అప్రెంటీస్‌ ఉన్నవారికి ప్రాధాన్యం లభిస్తోంది. భారతీయ రైల్వే వేల సంఖ్యలో అప్రెంటీస్‌లను తీసుకుంటోంది. మహారత్న, నవరత్న, మినీరత్న కంపెనీలు సైతం అప్రెంటీస్‌ అవకాశాలు పెంచాయి. ఈ విధానంలో చేరినవారికి ప్రతినెలా కొంత మొత్తంలో స్టైపెండ్‌ అందుతోంది. అంతేకాకుండా నియామకాల్లో కొన్ని పోస్టులను అప్రెంటీస్‌ పూర్తిచేసుకున్నవారికి కేటాయిస్తున్నారు. కొన్ని సంస్థల్లో ఉద్యోగం పొందడానికి అప్రెంటీస్‌ పూర్తిచేసుకోవడం తప్పనిసరి. ప్రభుత్వం 2015లో ప్రారంభించిన స్కిల్‌ ఇండియా కార్యక్రమం ఐటీఐ చదివినవారు మేటి అవకాశాలు సొంతం చేసుకోవడానికి దోహదపడుతోంది. మినిస్ట్రీ ఆఫ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ అంతర్‌ప్రెన్యూర్‌షిప్‌ ద్వారా స్కిల్స్‌ మెరుగుపరుచుకోవడం, అప్రెంటీస్‌ చేసుకునే అవకాశం ఉంది. పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అప్రెంటీస్‌ అవకాశం కల్పిస్తున్నాయి. ఆసక్తి ఉన్నవారు కోర్సు పూర్తయిన తర్వాత https://apprenticeshipindia.org లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.

అవకాశాలిలా

ఐటీఐ పూర్తిచేసుకున్నవారికి ఎక్కువ అవకాశాలు రైల్వేలు, కేంద్ర స్థాయి సంస్థలు, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీలు, పరిశ్రమలు, ఉత్పాదక, తయారీ సంస్థల్లో ఉంటాయి. అన్ని రకాల కంపెనీల్లోనూ వీరి సేవలు తప్పనిసరి. సాంకేతిక (టెక్నికల్‌) పోస్టుల్లో సింహభాగం సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ చదువుకున్నవారితోనే భర్తీ చేస్తున్నారు. ఆర్మీ, ఆర్మ్‌డ్‌ ఫోర్సుల్లోనూ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

రైల్వేల్లో: వేల సంఖ్యలో ఉండే అసిస్టెంట్‌ లోకో పైలట్, టెక్నీషియన్‌ పోస్టులకు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు అర్హులు. ఎల్రక్టీషియన్‌/ మెకానిక్‌/ ఫిట్టర్‌/ టర్నర్‌/ వైర్‌మెన్‌...తదితర విభాగాలవారు అసిస్టెంట్‌ లోకో పైలట్‌ పోస్టులకు పోటీ పడవచ్చు. సంబంధిత లేదా అనుబంధ విభాగాల్లో ఐటీఐ ఉంటే టెక్నీషియన్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇలా ఎంపికైనవారు రైల్వే వర్కుషాపులు, లోకో షెడ్, రైల్వే క్యాబిన్లలో విధులు నిర్వర్తిస్తారు.

రాష్ట్ర స్థాయిలో: సర్వేయర్, జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు వీరు పోటీపడవచ్చు. ఎల్రక్టికల్‌ లేదా వైర్‌మెన్‌ ట్రేడుల్లో ఐటీఐ పూర్తిచేసుకున్నవారు జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. తెలంగాణ/ఆంధ్రప్రదేశ్‌లోని విద్యుత్తు పంపిణీ, నిర్వహణ కేంద్రాలు రెండు / మూడేళ్లకు ఒకసారి ప్రకటనలు విడుదలచేస్తున్నాయి. సర్వేయింగ్‌ ఒక సబ్జెక్టుగా డ్రాఫ్ట్స్‌మెన్‌ (సివిల్‌) ట్రేడ్‌ రెండేళ్ల కోర్సు పూర్తిచేసుకున్నవారు డెప్యూటీ సర్వేయర్‌ పోస్టులకు సిద్ధం కావచ్చు.

ఆర్మీలో: సోల్జర్‌ ట్రేడ్స్‌మెన్‌ విభాగానికి ఐటీఐ ఉత్తీర్ణత తప్పనిసరి. ఈ ప్రకటనలు ఏటా వెలువడుతున్నాయి. బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌), సశస్త్ర సీమబల్‌ (ఎస్‌ఎస్‌బీ), ఇండో టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ (ఐటీబీపీ), సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ (సీఆర్‌పీఎఫ్‌), సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ (సీఐఎస్‌ఎఫ్‌)...తదితర సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ విభాగాల్లో ఐటీఐ చదివినవారికి అవకాశాలు లభిస్తున్నాయి.

స్టీల్‌ప్లాంట్లు, నేవల్‌ డాక్‌ యార్డులు, నౌకాయాన సంస్థలు, పోర్టులు, షిప్పులు, ప్రజా రవాణా సంస్థలు, యంత్రాలతో నడిచే అన్ని రకాల పరిశ్రమల్లోనూ ఐటీఐ చదివినవారికి ఉద్యోగాలున్నాయి. మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి. పాతకాలంనాటి ప్రభుత్వ ఐటీఐల్లో క్యాంపస్‌ నియామకాలు సైతం నిర్వహిస్తున్నారు. నిర్మాణ రంగ సంస్థలు, ఉత్పత్తి, తయారీ పరిశ్రమలు వీరిని నియమించుకుంటున్నాయి. సుశిక్షితులైన ప్లంబర్, కార్పెంటర్, ఎల్రక్టీషియన్, ఏసీ, రెఫ్రిజిరేటర్‌ మెకానిక్‌లకు నగరాలు, పట్ణణాలతోపాటు పల్లెల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది. అందువల్ల స్వయం ఉపాధికి ఢోకా లేదు. సొంతంగా మెకానిక్‌ షెడ్‌ పెట్టుకుని భవిష్యత్తులో మరికొంతమందికి దారి చూపవచ్చు.

విదేశాల్లోనూ...

ఫిట్టర్‌ ట్రేడ్‌ పూర్తిచేసుకున్నవారికి చమురు ఉత్పత్తిచేస్తోన్న దేశాల్లో ఎక్కువ అవకాశాలు లభిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ లిమిటెడ్‌ (టామ్‌కామ్‌), ఓవర్‌సీస్‌ మ్యాన్‌ పవర్‌ కంపెనీ ఆంధ్రప్రదేశ్‌ లిమిటెడ్‌ (ఓమ్‌క్యాప్‌) విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఇవి శిక్షణ అందించి, సర్టిఫికెట్లు ప్రధానం చేస్తున్నాయి. వీటిని పొందినవారు కేంద్రంలోని మినిస్ట్రీ ఆఫ్‌ ఎక్స్‌టర్నల్‌ అఫైర్స్‌ ద్వారా విదేశీ ఉద్యోగాలకు ప్రయత్నించవచ్చు.

ఉన్నత చదువులు...

ఐటీఐ అనంతరం ఉన్నత చదువులు దిశగా అడుగులేయాలనుకున్నవారు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. కొన్ని బ్రాంచీల్లో లేటరల్‌ ఎంట్రీతో నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. డిప్లొమా పూర్తిచేసుకుని, ఆసక్తి ఉంటే ఈసెట్‌ ద్వారా నేరుగా రెండో సంవత్సరం బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశం పొందవచ్చు. నాన్‌ ఇంజినీరింగ్‌ బ్రాంచీల్లో ఐటీఐ ట్రేడ్‌లు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ (బీఏ) ఆ తర్వాత పీజీ (ఎంఏ) కోర్సులు చదువుకోవచ్చు.

ఇన్‌స్ట్రక్టర్‌గానూ...

ఐటీఐల్లో కోర్సు విజయవంతంగా పూర్తిచేసుకున్నవారు నేషనల్‌ స్కిల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఎన్‌ఎస్‌టీఐ)ల్లో శిక్షణ పొందవచ్చు. విద్యానగర్‌ (హైదరాబాద్‌)లో ఎల్రక్టీషియన్, వైర్‌మెన్, ఫిట్టర్, టర్నర్, మ్యాషినిస్ట్, ఎల్రక్టానిక్‌ మెకానిక్, మోటార్‌ వెహికల్‌ మెకానిక్, వెల్డర్‌ ట్రేడుల్లో ఏడాది వ్యవధితో ఇన్‌స్ట్రక్టర్ కోర్సు అందిస్తున్నారు. ఆయా ట్రేడుల్లో మరింత ప్రావీణ్యం పొందాలనుకునేవారి కోసం షార్ట్‌ టర్మ్‌ విధానంలో అడ్వాన్స్‌డ్‌ వొకేషనల్‌ ట్రైనింగ్‌ కోర్సులూ ఉన్నాయి.

Posted Date: 17-03-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌