• facebook
  • whatsapp
  • telegram

ఇలా చేస్తే.. పదిలమే!

విద్యార్థుల‌కు నిపుణుల‌ దిశానిర్దేశం

 

 

పదో తరగతి తర్వాత ఏ కోర్సులో చేరాలనే నిర్ణయం భవితకు చాలా కీలకం. ఎంచుకునే విధానంలో సమగ్రత కొరవడితే భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుంది. అందువల్ల విద్యార్థులందరూ పదో తరగతి తర్వాత ఉన్న అన్ని అవకాశాలపై అవగాహన పెంచుకోవడం ముఖ్యం. అలాగే తమ నైపుణ్యాలను విశ్లేషించుకుని, వాటిలో ఏది తమకు నప్పుతుందో గుర్తించడం అవసరం. ఈ విధంగా అవగాహనతో, ఆసక్తితో కోర్సులు ఎంచుకున్నవారు లక్ష్య దిశగా తొలి అడుగు వేసినట్లే!

 

పదో తరగతి వరకు విద్యార్థులందరికీ సిలబస్‌ ఉమ్మడిగా ఉండడంతో భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం పెద్దగా రాదు. మెచ్చిన కోర్సులు ఎంచుకోవడం ఆ తర్వాతే మొదలవుతుంది. అందువల్ల ఉన్న దారుల్లో ఎవరి మార్గాన్ని వాళ్లే నిర్దేశించుకోవాలి. తమ దారెటో తెలుసుకోవడానికి కసరత్తు తప్పనిసరి. ఇందుకోసం ముందుగా అన్ని మార్గాలపైనా అవగాహన పెంచుకోవాలి. అనంతరం అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని, సరిపోయే మార్గాన్ని ఎంచుకోవాలి. ఇలా స్పష్టమైన దారిని ఎంచుకున్నవారి భవిష్యత్తు బంగారమవుతుంది. 

 

పది తర్వాత కనిపించే దారుల్లో ముఖ్యమైనవి.. ఇంటర్మీడియట్, పాలిటెక్నిక్, ఐటీఐ, వొకేషనల్‌ కోర్సులు, ఉద్యోగాలు, ప్రత్యేక డిప్లొమాలు. ఇవన్నీ ప్రాధాన్యం ఉన్నవే. దేనికవే గొప్పవి. ఒకటి ఎక్కువా, మరొకటి తక్కువా కాదు. అయితే వీటిలో సరిపోయేవి గుర్తించే బాధ్యత విద్యార్థులదే. ఉన్నవాటిలో ఏదో ఒక్కటి మాత్రమే ఎంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఆచితూచి నిర్ణయం తీసుకోవడం తప్పనిసరి.   

 

ఎలా ఎంచుకోవాలి?

కోర్సును ఎంచుకునే ముందు విద్యార్థులు స్వీయ సామర్థ్యాలను మదింపు చేసుకోవాలి. తమ గురించి తాము పరిపూర్ణంగా విశ్లేషించుకోవాలి. ఇలా జరిగినప్పుడే సరైన నిర్ణయం తీసుకోవడానికి అవకాశముంటుంది. సమగ్రంగా అన్ని కోణాల్లోనూ ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి. 

‣ గణితంపై పట్టు లేదు కాబట్టి బైపీసీ, సైన్స్‌పై ఆసక్తి లేనందువల్ల సీఈసీ తీసుకోరాదు. 

బైపీసీ తీసుకోవడానికి మ్యాథ్స్‌పై నిరాసక్తత కారణం కాకూడదు. 

సైన్స్‌ అంశాల్లో పట్టు లేనికారణంగా ఆర్ట్స్‌ కోర్సుల్లో చేరకూడదు. 

 

ఏ అంశాల్లో ప్రావీణ్యం ఉందో గుర్తించి, ఆ దిశగా అడుగులేయాలి. ఒక సబ్జెక్టులో ఆసక్తి, ప్రావీణ్యం లేదనే కారణంతో ఆలోచన లేకుండా ఇంకో దాన్ని ఎంచుకోకూడదు. పూర్తిగా మనసుకి ఇష్టమైనవాటిని చదువుకుంటే భవిష్యత్తులో చేయబోయే కెరియర్‌ ప్రయాణం సాఫీగా సాగిపోతుంది. ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ అంతిమంగా ఆసక్తి, అభిరుచులకే పెద్ద పీట వేయాలి. ఎందుకంటే ప్రపంచంలో మీ గురించి అందరికంటే బాగా తెలిసిన వ్యక్తుల్లో మొదటివారు మీరే. అలాగే ఆ కోర్సులు చదవాల్సిందీ మీరేనని మర్చిపోవద్దు. అందుకే ఎవరి భవిష్యత్తుని వాళ్లే నిర్ణయించుకుని కెరియర్‌ నిర్మించుకోవాలి. ఇందుకోసం ఆసక్తులు, బలాలు, ఇష్టాలు, అభిరుచులు, నైపుణ్యాలు, ఆశయాలు అన్నీ ఒకచోట సమగ్రంగా రాసుకోవాలి. ఈ కసరత్తుకు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకోవాలి.  

 

ఇలా వద్దు

మన నిర్ణయాలను ఎక్కువగా ఇతరులు ప్రభావితం చేస్తుంటారు. అందులోనూ ముఖ్యంగా విద్యార్థుల విషయంలో ఇతరుల ప్రభావం మరీ ఎక్కువ. చదువుల్లో రాణించలేకపోయిన ఎక్కువమంది చెప్పే సమాధానం... ఫలానా వాళ్ల ఒత్తిడి కారణంగా ఆసక్తి లేకుండా ఈ కోర్సులో చేరి నష్టపోయానని చెప్పడమే. అందువల్ల చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదు. తెలిసినవాళ్లు చెప్పారనో, బంధువులు సూచించారనో, అమ్మానాన్నల ఆశయమనో, స్నేహితులతో కలిసి ఉండొచ్చనో, ఎక్కువ సంపాదనకు వీలుందనో, సులువుగా ఉత్తీర్ణత సాధించవచ్చనో, ఎక్కువ మంది చేరుతున్నారనో, అవకాశాలు ఎక్కువనో... ఇలాంటి కారణాలతో కోర్సు, గ్రూపులను ఎంచుకోవద్దు. 

 

వ్యక్తిగత అభిరుచి లేకుండా ఇతరులు చెప్పినవి అనుసరించడం వల్ల నష్టపోయేది మనమే. ఆసక్తి లేని కోర్సులో చేరితే మళ్లీ నచ్చిన దారిలోకి రావడానికి విలువైన సమయాన్ని వృథా చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్ల పై చదువుల కోసం తీసుకున్న నిర్ణయాల్లో.. పూర్తిగా వ్యక్తిగత ఇష్టానికే ప్రాధాన్యం ఇవ్వండి. అభిరుచులు, సామర్థ్యాలను పరిగణనలోకి తీసుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. ఇతరుల సలహాలపై పూర్తిగా ఆధారపడవద్దు. పరీక్షలు రాసి, పోటీ పడాల్సింది మీరే కదా? అందువల్ల ఇతరుల నుంచి మీకు అవసరమైన సమాచారాన్నే సేకరించండి. వాళ్ల అనుభవాలు, ఆలోచనలను మీ విశ్లేషణలో ఉపయోగించుకోండి. అంతిమ నిర్ణయం మాత్రం మీ ఇష్ట ప్రకారం మీరే తీసుకోండి. ఆ బాధ్యత మీదేనని గుర్తించుకోండి. 

 

ఫలానా కోర్సు ఎంచుకోవడానికి... స్పష్టమైన కారణాలు మీ వద్ద ఉన్నాయంటే మీరు సరైన మార్గంలో ప్రయాణానికి సిద్ధమవుతున్నట్లే లెక్క.  

 

ఇలాగూ చేయవచ్చు... 

పదో తరగతి సబ్జెక్టుల్లో తమకున్న ప్రతిభ ప్రకారం నిర్ణయం తీసుకోవచ్చు. నైపుణ్యం ఉన్న సబ్జెక్టుల్లో ఆసక్తి ఉంటే వాటినే ఎంచుకోవచ్చు. 

మ్యాథ్స్‌పై గట్టి పట్టున్నవారు ఎంపీసీ లేదా ఎంఈసీని పరిగణనలోకి తీసుకోవచ్చు. 

సైన్స్, ఇంజినీరింగ్‌పై ఆసక్తి ఉంటే ఎంపీసీని ఖాయం చేసుకోవచ్చు. 

సీఏ, సీడబ్ల్యుఏ చేయాలనుకుంటే ఎంఈసీవైపు మొగ్గు చూపవచ్చు. 

బయాలజీని బాగా ఇష్టపడేవాళ్లంతా బైపీసీని ఎంచుకోవడమే మంచిది. 

సమకాలీనం, సామాజికాంశాలపై ఆసక్తి ఉంటే మరో ఆలోచన లేకుండా హెచ్‌ఈసీలో చేరిపోవచ్చు. 

వర్తక రంగం, వ్యాపార గణితంపై మనసున్నవారు.. మ్యాథ్స్‌పై పట్టుంటే ఎంఈసీ/ సీఈసీ తీసుకోవచ్చు. 

సాంకేతికతను ఇష్టపడేవారు, యంత్రాలతో పనిచేయాలనే తపన మెండుగా ఉన్నవాళ్లు పాలిటెక్నిక్‌ కోర్సుల దిశగా అడుగులేయవచ్చు. 

తక్కువ వ్యవధిలో స్థిరపడాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సులు/ ఐటీఐలో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. 

పై చదువులపై పెద్దగా ఆసక్తి లేనివాళ్లు పది అర్హతతో ఉన్న ఉద్యోగాలకోసం ప్రయత్నిస్తూనే దూరవిద్యలో చేరడం మంచిది. 

కాలేజీకి వెళ్లి చదవడం వీలు కానివారు ఓపెన్‌ స్కూల్‌ లేదా ఇగ్నో నుంచి నచ్చిన కోర్సులు చదువుకునే అవకాశం ఉంది.

 

సందిగ్ధత ఉంటే..? 

కోర్సు లేదా గ్రూపు ఎంపికలో సందిగ్ధంలో ఉన్నవారు తమ గురించి బాగా తెలిసిన ఉపాధ్యాయులను సంప్రదించవచ్చు. విద్యార్థుల సామర్థ్యాలపై వీళ్లకు కొంత అవగాహన ఉంటుంది. ఆ విద్యార్థి ప్రత్యేకతలు, తెలివితేటలు ఆధారంగా సరైన మార్గనిర్దేశం చేయడం సాధ్యమవుతుంది. లేదా గుర్తింపు పొందిన కెరియర్‌ కౌన్సిలర్ల సహాయాన్నీ తీసుకోవచ్చు. సైకో మెట్రిక్‌ పరీక్షలతోనూ ఒక అంచనాకు రావచ్చు.

 

తల్లిదండ్రులిలా... 

పిల్లల గ్రూపు ఎంపికలో తల్లిదండ్రులు మార్గదర్శిగా వ్యవహరించాలి. తమ వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనబెట్టాలి. ఫలానా గ్రూపు చదివితేనే భవిష్యత్తు బాగుంటుందని భావించి, వారికి ఇష్టంలేని కోర్సుల్లో చేర్చడం మంచిది కాదు. పిల్లలపై వ్యక్తిగత ఆశయాలను రుద్దడం, వాళ్ల ద్వారా తమ కోరికలు తీర్చుకోవాలనుకోవడం సమంజసం కాదు. అమ్మానాన్నలు సూచించిన కోర్సులో విద్యార్థికి ఆసక్తి ఉంటే ఎలాంటి ఇబ్బందీ లేదు. అలా కాకుండా పూర్తిగా తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే చదవాల్సి వస్తే పిల్లల ఆశయాలకు తల్లిదండ్రులే ప్రతిబంధకమవుతున్నారని గుర్తించాలి. డబ్బులు పెడుతున్నాం కాబట్టి చెప్పింది చదవాల్సిందే అనే అభిప్రాయంలోనూ కొందరు ఉంటారు. ఈ తరహా ఆలోచనలతో విద్యార్థి భవిష్యత్తుకు నష్టం చేకూరుతుంది. అందువల్ల కెరియర్, కోర్సు ఎంపికలో పిల్లలపై ఒత్తిడి చేయకూడదు. విలువైన సూచనలు చేస్తూ, మార్గదర్శిగా నిలవాలి. 

 

విద్యార్థిగా ఉన్నప్పుడు ఇంజినీర్‌ కావాలని కలలు కన్నప్పటికీ, పరిస్థితుల ప్రభావంతో ప్రస్తుతం గుమాస్తాగా జీవితాన్ని నెట్టుకొచ్చే తండ్రులెందరో ఉంటారు. వీరిలో ఎక్కువ మంది కనీసం తమ పిల్లలనైనా ఇంజినీర్‌ చేయాలనే ఆశయంతో.. వాళ్ల ఇష్టాలతో సంబంధం లేకుండా.. ఎంపీసీలోకి దించుతారు. దీంతో లాయర్‌ కావాలనుకున్న పిల్లాడు చివరికి తండ్రిలాగే గుమాస్తాగా అసంతృప్తి జీవితం గడపాల్సి వస్తుంది. అందువల్ల తల్లిదండ్రులు విద్యార్థుల ఆశయాలకు అవరోధం కాకూడదు. పిల్లల్లోని సహజ ప్రతిభను గుర్తించి, ఆ దిశగా ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో అద్భుతంగా రాణించడానికి అవకాశాలెక్కువగా ఉంటాయి. బంధాలూ బలపడతాయి.   

 

వేదికలెన్నో... 

ఆర్థిక సమస్యల కారణంగా పది తర్వాత చదువులు ఆపేయాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేవు. 

ఇంటర్‌తోపాటు ఇంజినీరింగ్‌ విద్యను ఆరేళ్లు ఉచితంగా చదువుకోవడానికి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ట్రిపుల్‌ ఐటీలు ఉన్నాయి. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో వీటిలో ప్రవేశాలుంటాయి. 

అలాగే ఇంటర్‌ చదవడానికి రెసిడెన్షియల్‌ జూనియర్‌ కళాశాలలెన్నో ఉన్నాయి. రాత పరీక్షతో వీటిలో చేర్చుకుంటున్నారు. ఈ సంస్థల్లో జేఈఈ, నీట్‌ శిక్షణనూ అందిస్తున్నారు. 

సాంకేతిక విద్య కోసం ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. 

వివిధ ఐటీఐలు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. ఒకేషనల్‌ కోర్సులు కూడా ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోనే అందిస్తున్నారు. 

 

అందువల్ల విద్యార్థి లక్ష్యం ఏదైనప్పటికీ ఉచితంగా చదువుకోవడానికి వేదికలు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల్లో విద్యనభ్యసించి రాణిస్తోన్న విద్యార్థులు ఎంతోమంది ఉన్నారు. కార్పొరేట్‌ సంస్థల్లో చేరలేకపోయామనే దిగులు చెందాల్సిన అవసరం లేదిప్పుడు. టీవీ ఉంటే చాలు ఇంట్లోనే ఉంటూ, ఐఐటీ ప్రొఫెసర్లు రూపొందించిన జేఈఈ వీడియో పాఠాలు వీక్షించి, సన్నద్ధమైపోవచ్చు. 

 

కోర్సు లేదా కెరియర్‌ ఎంపిక సరిగా ఉంటే దాదాపు సగం విజయం ఖాయమైనట్టే. అలాకాకుండా బైపీసీలో చేరిన ఆరు నెలల తర్వాత ‘అయ్యో.. ఎంపీసీ తీసుకోవాల్సిందే’ అనుకోవడం వల్ల విలువైన ఏడాది సమయం వృథా కావడం తప్ప మరే ప్రయోజనమూ ఉండదు

 

అందుకే ఇంటర్‌లో ఉండే వివిధ గ్రూపులు, పాలిటెక్నిక్, ప్రత్యేక డిప్లొమాలు; ఒకేషనల్‌ విద్య, ఐటీఐ, ఉద్యోగాలు...ఈ సమాచారాన్నంతా వచ్చే సంచికల్లో మీ ముందు ఉంచుతాం. వీటిని చదివి, ఎవరికి వారే నేరుగా ఒక నిర్ణయం తీసుకోవచ్చు!      

Posted Date: 06-09-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌