• facebook
  • whatsapp
  • telegram

డిప్లొమాతో దూసుకుపోదాం!

వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌, వెట‌ర్న‌రీ, పాలిటెక్నిక్ కోర్సులు

పది తర్వాత ఉన్న దారుల్లో డిప్లొమా కోర్సులు ముఖ్యమైనవి. ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్య...అన్నింటికీ ఇవి అనువైనవి. సత్వర ఉపాధి లక్ష్యంగా వ్యవసాయం, ఉద్యానవనం, వెటర్నరీల్లో రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో కోర్సులను ప్రత్యేక పాలిటెక్నిక్‌లు అందిస్తున్నాయి. ఇవే కాకుండా జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక విభాగాల్లో డిప్లొమాలు రూపొందించాయి. వీటిని పూర్తి చేసుకుంటే  ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. 

సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి ఉండి, తక్కువ వ్యవధిలోనే స్థిరపడాలని ఆసక్తి ఉన్నవారు డిప్లొమా కోర్సుల్లో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వొచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్‌ సబ్జెక్టుల్లో కొంత పట్టు ఉన్నవారు వీటిలో చేరి రాణించవచ్చు. చదువుకున్న బ్రాంచీని బట్టి కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా స్వయం ఉపాధికి ఎక్కువ అవకాశాలున్నాయి. అలాగే ఉన్నత విద్య దిశగా అడుగులేయవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో డిప్లొమా కోర్సుల్లోకి చేరే అవకాశం పాలిటెక్నిక్‌ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (పాలీసెట్‌)తో లభిస్తుంది. పరీక్షలో పదో తరగతి సిలబస్‌లోని మ్యాథ్స్, ఫిజికల్‌ సైన్స్‌ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలలు మూడేళ్లు, ఆపై వ్యవధితో ఉన్న పలు డిప్లొమా కోర్సులు అందిస్తున్నాయి. కొన్ని ప్రైవేటు సంస్థలు పదో తరగతి తర్వాత ఆరేళ్ల వ్యవధితో డిప్లొమా + బీటెక్‌ కోర్సులను అందిస్తున్నాయి. 

బ్రాంచీలెన్నో..

విస్తృత సంఖ్యలో బ్రాంచీలుండటం డిప్లొమాల ప్రత్యేకత. అందువల్ల ప్రత్యేక ఆసక్తి ఉన్న విభాగాన్ని ఎంచుకునే అవకాశం దక్కుతుంది. సివిల్, ఆర్కిటెక్చరల్‌ అసిస్టెంట్‌షిప్, మెకానికల్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్, ఎల్రక్టానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్, కంప్యూటర్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, మైనింగ్, కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్, గార్మెంట్‌ టెక్నాలజీ, క్రాఫ్ట్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, మెటలర్జికల్, కెమికల్, సిరామిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, టెక్స్‌టైల్, రెఫ్రిజిరేషన్‌ అండ్‌ ఏర్‌ కండిషనింగ్, పెట్రోలియం టెక్నాలజీ, పెట్రో కెమికల్‌ టెక్నాలజీ, ప్యాకేజింగ్‌ టెక్నాలజీ, ప్రింటింగ్‌ టెక్నాలజీ, ఎంబడెడ్‌ సిస్టమ్స్, ఫుట్‌వేర్‌ టెక్నాలజీ, లెదర్‌ టెక్నాలజీ.. తదితర బ్రాంచీలను ఎంచుకోవచ్చు. వీటిని మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో అందిస్తున్నారు.  

అవకాశాలిలా..

డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థలతోపాటు ప్రభుత్వ అనుబంధ సంస్థలు, విభాగాల్లో ఉద్యోగాలు విరివిగా ఉంటాయి. వీరికి ఎక్కువగా మహారత్న, నవరత్న, మినీరత్న, పబ్లిక్‌ సెక్టార్‌ కంపెనీల్లో కొలువులు లభిస్తాయి. రైల్వేల్లో జూనియర్‌ ఇంజినీర్‌ (జేఈ) పోస్టులను డిప్లొమా విద్యార్హతతో భర్తీ చేస్తున్నారు. కేంద్రానికి చెందిన వివిధ విభాగాల్లో జేఈ పోస్టుల భర్తీ కోసం స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) ఏడాది లేదా రెండేళ్లకు ఒకసారి ప్రకటనలు వెలువరిస్తోంది. పరీక్షలో ప్రతిభ చూపినవారికి లెవెల్‌-6 ప్రకారం రూ.35,400 మూలవేతనం అందుతుంది. అంటే విధుల్లో చేరిన మొదటి నెల నుంచే అన్ని అలవెన్సులూ కలుపుకుని రూ.యాభై వేలకుపైగా వేతనం వీరు అందుకోవచ్చు. రాష్ట్ర స్థాయుల్లో రహదారులు, భవనాలు; పంచాయతీరాజ్, నీటిపారుదల...తదితర శాఖల్లో డిప్లొమాతో దూసుకుపోవచ్చు. 

ఈ కోర్సులు పూర్తిచేసుకున్నవారికి ప్రైవేటు రంగంలో విస్తృతంగా అవకాశాలు అందుతున్నాయి. నిర్మాణ రంగం, ఆటోమొబైల్, పవర్‌ ప్లాంట్లు, ఇంజినీరింగ్‌ ఫర్మ్‌ల్లో వీరు సులువుగానే నిలదొక్కుకోవచ్చు. పేరొందిన పాలిటెక్నిక్‌ కళాశాలల్లో కొన్నేళ్ల నుంచి ప్రాంగణ నియామకాలూ చేపడుతున్నారు. వివిధ విభాగాల్లో సేవలు అందిస్తోన్న కార్పొరేట్‌ సంస్థలు వీరిని ఆకర్షణీయ వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటున్నాయి. రైల్వేలో లోకో పైలట్‌ ఉద్యోగాలకి సంబంధిత బ్రాంచీల్లో డిప్లొమా పూర్తిచేసుకున్నవారు పోటీపడొచ్చు. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్‌ బ్రాంచీలవారికి ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధ విభాగాల్లో ఎక్కువ ఉద్యోగాలు లభిస్తున్నాయి. విద్యుదుత్పాదక, పంపిణీ సంస్థల్లో ఎలక్ట్రికల్‌ విభాగం వాళ్లు రాణించగలరు. సివిల్‌ అభ్యర్థులు నీటిపారుదల శాఖ, ప్రజారోగ్యం, రహదారులు, రైల్వే, నిర్మాణ రంగంలో సేవలు అందించవచ్చు. కొన్ని బ్రాంచీల వారికి రక్షణ రంగంలోనూ కొలువులు ఉన్నాయి. ఏర్‌ ఫోర్సులో ఎక్స్, వై ట్రేడులు; కోస్టుగార్డులో యాంత్రిక్‌ పోస్టులకు డిప్లొమా అర్హతతో పోటీ పడవచ్చు. డిప్లొమాతోనే సౌదీ, దుబాయ్, సింగపూర్, మలేషియా...తదితర చోట్ల మంచి అవకాశాలు పొందవచ్చు.

వ్యవసాయ డిప్లొమా

గ్రామీణ విద్యార్థులు వ్యవసాయం, అనుబంధ రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి డిప్లొమా కోర్సులను రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లు అందిస్తున్నాయి. వీటిని రెండేళ్లు, మూడేళ్ల వ్యవధితో రూపొందించారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్, డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (ఆర్గానిక్‌ ఫార్మింగ్‌), డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ (సీడ్‌ టెక్నాలజీ) కోర్సులను రెండేళ్ల వ్యవధితో నిర్వహిస్తున్నారు. వీటిని పూర్తిచేసుకున్నవారు ఎరువులు, క్రిమిసంహారకాల తయారీ సంస్థల్లో అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. బీఎస్సీ అగ్రికల్చర్‌ కోర్సులోనూ చేరవచ్చు. వీరికోసం 20 శాతం సీట్లు అగ్రిసెట్‌ ద్వారా సూపర్‌ న్యూమరరీ విధానంలో భర్తీ చేస్తారు. డిప్లొమా ఇన్‌ అగ్రికల్చరల్‌ ఇంజినీరింగ్‌ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. అనంతరం వీరు బీటెక్‌ అగ్రి ఇంజినీరింగ్‌ కోర్సు చదువుకోవచ్చు. వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశం పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభతో లభిస్తుంది. రెండేళ్ల కోర్సులను తెలుగు మాధ్యమంలో చదువుకోవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదువుకున్నవారికి అవకాశం కల్పిస్తారు. ఏపీలో..ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్‌ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణలో.. ప్రొఫెసర్‌ జయశంకర్‌ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ప్రభుత్వ, ప్రైవేటు ఆధ్వర్యంలో అగ్రి పాలిటెక్నిక్‌లు నడుస్తున్నాయి.

యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ

గ్రామాల్లో మూగజీవాలకు సత్వర వైద్య సేవలు అందించే దిశగా వెటర్నరీ డిప్లొమా కోర్సులు రూపొందించారు. వీటిని పూర్తిచేసుకున్నవారికి పశు వైద్యశాలలు, డెయిరీ, ఆక్వా సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. సొంతంగానూ ప్రాక్టీస్‌ చేసుకోవచ్చు లేదా సంబంధిత యూనిట్‌ నెలకొల్పి స్వయం ఉపాధి దిశగానూ అడుగులేయొచ్చు. యానిమల్‌ హజ్బెండ్రీ, డెయిరీ, ఫిషరీ ఈ మూడు విభాగాల్లోనూ రెండేళ్ల వ్యవధితో తెలుగు మాధ్యమంలో పాలిటెక్నిక్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. డిప్లొమా తర్వాత వీరు బీవీఎస్సీ అండ్‌ ఏహెచ్, బీటెక్‌ డెయిరీ టెక్నాలజీ, బీఎఫ్‌ఎస్సీల్లో చేరవచ్చు. ప్రవేశం కోరే రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు అర్హులు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం సీట్లు భర్తీ చేస్తారు. ఏపీలో.. శ్రీ వేంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం, తిరుపతి ఆధ్వర్యంలో కోర్సులు నడుపుతున్నారు. దీనికి అనుబంధంగా డెయిరీ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్, ఫిషరీ పాలిటెక్నిక్‌ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు అందిస్తున్నాయి. తెలంగాణలో పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ ఆధ్వర్యంలో పలు చోట్ల రెండేళ్ల వ్యవధితో యానిమల్‌ హజ్బెండ్రీ పాలిటెక్నిక్‌ కోర్సులు చదువుకోవచ్చు.

ఉన్నత విద్య

డిప్లొమా అనంతరం ఉన్నత విద్య దిశగా అడుగులేయాలని భావించినవారు ఈసెట్‌తో నేరుగా బీటెక్‌ రెండో సంవత్సరం కోర్సుల్లో చేరిపోవచ్చు. వీరు ఎంసెట్, ఐఐటీ-జేఈఈ పరీక్షలూ రాసుకోవచ్చు. డిప్లొమా అర్హతతో ఉద్యోగంలో చేరినవారు ఇంజినీర్స్‌ ఇన్‌స్టిట్యూషన్‌ అందించే అసోసియేట్‌ మెంబర్‌ ఆఫ్‌ ది ఇన్‌స్టిట్యూషన్‌ ఆఫ్‌ ఇంజినీర్స్‌ (ఏఎంఐఈ) పూర్తిచేసుకోవచ్చు. ఇది బీటెక్‌తో సమాన స్థాయి కోర్సు. ఆ తర్వాత ఎంటెక్‌ దిశగానూ అడుగులేయవచ్చు. లేదా డిప్లొమా అర్హతతోనే బీఎస్సీ, బీఏ...తదితర కోర్సులూ చదువుకోవచ్చు.

ఉద్యాన డిప్లొమాలు

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యానవన ఉత్పుత్తులు పెరగడంతో అవకాశాలు విస్తరిస్తున్నాయి. పదో తరగతి గ్రేడ్‌ పాయింట్లు లేదా పరీక్షలో చూపిన ప్రతిభ ప్రకారం ఉద్యాన డిప్లొమాల్లో సీట్లు కేటాయిస్తారు. ఈ కోర్సు వ్యవధి రెండేళ్లు. తెలుగు మాధ్యమంలో బోధన ఉంటుంది. వీరు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందవచ్చు. డిప్లొమా అనంతరరం బీఎస్సీ (ఆనర్స్‌) హార్టికల్చర్‌ కోర్సులో చేరవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని సీట్లు కేటాయించారు. ఆయా రాష్ట్రాల (ఏపీ/ తెలంగాణ) లోని గ్రామీణ ప్రాంతాల్లో కనీసం నాలుగేళ్లపాటు చదివినవారు ప్రవేశానికి అర్హులు. ఏపీలో డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకటరామన్నగూడెం (పశ్చిమ గోదావరి జిల్లా) ఆధ్వర్యంలో రెండేళ్ల హార్టికల్చర్‌ డిప్లొమా కోర్సులు అందిస్తున్నారు. దీనికి అనుబంధంగా ప్రభుత్వ, ప్రైవేటు హార్టికల్చర్‌ పాలిటెక్నిక్‌లు ఉన్నాయి. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయం పరిధిలో రెండేళ్ల వ్యవధితో డిప్లొమా ఇన్‌ హార్టికల్చర్‌ కోర్సు నడుస్తోంది.  

హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ..

తెలుగు రాష్ట్రాల్లో చేనేతకు సంబంధించి ప్రగడ కోటయ్య భారతీయ చేనేత శిక్షణ సంస్థ శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో ఉంది. ఈ సంస్థ ‘డిప్లొమా ఇన్‌ హ్యాండ్లూమ్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ’ కోర్సు మూడేళ్ల వ్యవధితో అందిస్తోంది. ఇందులో 60 సీట్లకు గానూ తెలుగు రాష్ట్రాల్లో చదివిన విద్యార్థులకు 47 కేటాయించారు. పదో తరగతిలో సాధించిన గ్రేడ్‌ పాయింట్ల ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. కోర్సు పూర్తయిన తర్వాత టెక్స్‌టైల్స్‌ తయారీ కంపెనీల్లో ఉద్యోగాలు లభిస్థాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు మొదటి ఏడాది     రూ.1,000, రెండో సంవత్సరం రూ. 1,100, మూడో ఏట రూ. 1,200 ఉపకార వేతనంగా అందిస్తారు. తమిళనాడులోని సేలం, కర్ణాటకలోని గడగ్‌ హ్యాండ్‌లూమ్‌ టెక్నాలజీ సంస్థల్లో తెలుగు విద్యార్థుల కోసం కొన్ని సీట్లు ఉన్నాయి. 

Posted Date: 19-08-2021


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌